5, జూన్ 2024, బుధవారం
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది . డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది .
డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది .
జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే
జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్ లో సత్యం షేర్లు లక్ష కొన్నాను -అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ భయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది . ఆ సమయంలో ముందు చూపు ఉండి ధైర్యం చేసిన వారి పంట పండింది . పది లక్షలతో లక్ష షేర్లు కొన్న ఆ యువకుడికి ఇప్పటి ధర ప్రకారం పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి . సత్యం ను టెక్ మహేంద్ర విలీనం చేసుకున్న తరువాత ఆ స్టాక్ దశ తిరిగింది . పార్ల మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోవడం, ఆంధ్రాలో టీడీపీ జనసేన విజయంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
అసెంబ్లీ సమావేశాల అజెండాలో సభా కార్యక్రమాలను బిజినెస్ అని రాస్తారు . ఆ మాట నాకు బాగా నచ్చుతుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే . పగలు , రాత్రి ఉన్నట్టే బిజినెస్ అన్నాక బాగా నడిచే రోజులు ఉంటాయి . దెబ్బ తినే రోజులు ఉంటాయి . మన జీవితం లో ఎగుడు దిగుడులు ఉన్నట్టే స్టాక్ మార్కెట్ , రాజకీయాల్లో ఎగుడు దిగుడు ఉంటాయి .
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికల్లో ఆంధ్ర , తెలంగాణల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది . అలాంటి టీడీపీ 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది . ఉద్యమ కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని తెరాస హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి 99 సీట్లు గెలిచింది . ఐదేళ్ల పాలన తరువాత ఆంధ్రాలో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ , ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ను 11 సీట్లకు మరిమితం చేసింది . రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 21 చోట్ల గెలిచింది . వంద శాతం విజయం ఇదో రికార్డ్ .
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు ఏం చేద్దాం అని అభిప్రాయాలు సేకరిస్తూ టీడీపీలో ఉన్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఎ యం . రాధాకృష్ణ ఫోన్ చేసి చిరంజీవి అడుగుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు . రాజకీయం వేరు , సినిమాల్లో హీరోలు వేరు . అన్నీ సమకూర్చాక హీరో వచ్చి నటిస్తాడు . రాజకీయం అలా కాదు చాలా ఓపిక ఉండాలి . వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని నిలబెట్టి ఉద్యమాలు చేయగలరు అనుకొంటే ఒకే . అంత ఓపిక లేదు అనుకొంటే కాంగ్రెస్ లో విలీనం అయితే రాజ్యసభ , మంత్రి పదవి తో కాలక్షేపం చేయవచ్చు అని న అభిప్రాయం చెప్పాను . ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసన సభ్యులు చిరంజీవిని కలిసి కాంగ్రెస్ లో కలిసి పోతున్నాం మీరు వస్తే మీ నాయకత్వంలో కలుస్తాం , లేదంటే మేమే కలిసి పోతాం అని చెప్పడంతో చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు . ఎన్టీఆర్ ను దించేసే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్గం శాసన సభ్యులు సైతం సరిగ్గా ఇదే డైలాగు వినిపించారు . సినిమా నటులు రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు . పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు వచ్చినా నా అభిప్రాయం అదే . చంద్రబాబు వంద శాతం రాజకీయ నాయకుడు . పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు . యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో మాత్రమే . ఈ విషయం కాలమే చెబుతుంది . చంద్రబాబు రాజకీయం ముందు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే నిలువ లేక పోయారు .
పడిపోయిన స్టాక్ మళ్ళీ లేస్తుంది . పాతాళంలోకి వెళ్లిన సత్యం ఆకాశంలోకి దూసుకువెళ్లింది . ఆకాశంలోకి వెళ్లిన స్టాక్ పడిపోనూ పోవచ్చు . ఈ పోస్ట్ రాసేప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే నా ఫోర్ట్ పోలియో ఈ రోజు మూడు శాతం మైనస్ లో ఉంది . కొంత పోస్ట్ రాసి ఇప్పుడు మళ్ళీ చూస్తే మూడు శాతం మైనస్ కవర్ కావడంతో పాటు అరశాతం ప్లస్ లోకి వచ్చింది . 1990 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ గురించి తెగ చదివే అలవాటు ఉండేది . ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆదివారం స్టాక్స్ రికమండేషన్స్ వచ్చేవి . యునిటెక్ అనే ఓ స్టాక్ 40 రూపాయలు ఉండేది . ఎందుకో అది బాగా గుర్తుండి పోయింది . ఈ మధ్య మిత్రులతో చర్చిస్తూ ఆ స్టాక్ ప్రస్తావన వచ్చింది . మూడున్నర దశాబ్దాల తరువాత ఆ స్టాక్ ఎక్కడుందో చూద్దాం అని గూగుల్ లో సెర్చ్ చేస్తే తొమ్మిది రూపాయల వద్ద కనిపించింది . 500 కూడా ఆ స్టాక్ కాలం కాటేయడంతో మూడున్నర దశాబ్దాల తరువాత 9 రూపాయల వద్ద తచ్చాడుతోంది .. ఆంధ్రాలో కాంగ్రెస్ లా ..
ఆంధ్ర పప్పు అని గెలిచేసిన లోకేష్ ఘన విజయం సాధించారు . జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా దశాబ్దన్నర కాలం నుంచి జాతీయ స్థాయిలో పప్పు అని రాహుల్ గాంధీని గేలి చేసింది . అదే పప్పు తనను తాను దేవుడిని అని ప్రచారం చేసుకున్న మోడీకి చుక్కలు చూపించారు . వచ్చే ఎన్నికలకు దేవుడికి విశ్రాంతి ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు కూడా . తాను చీదరించుకున్న చంద్రబాబు , నితీష్ కుమార్ ల మధ్దతుతో ఇప్పుడు దేవుడు ప్రజలను పాలించబోతున్నారు . తెరాస లో ఒక సాధారణ చోటా నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి . ఒకప్పుడు మూడు రూపాయలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలను దాటి పది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది . నిన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ దాదాపు 20 శాతం వరకు పడిపోతే , చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ 5 శాతం పెరిగింది . కాలం కలిసి వస్తే అంతే .
రాజకీయాల్లో అయినా , స్టాక్ మార్కెట్లో అయినా ఓపిక ఉన్నవారికే ఫలాలు అందుతాయి . కరోనా సమయంలో నాగార్జున కంస్ట్రక్షన్ స్టాక్ 17 రూపాయలు , ఇప్పుడు 280 . 17 రూపాయలప్పుడు ఓపిక వహిస్తే 280 అవుతుంది . 23 సీట్లు వచ్చినప్పుడు ఓపిక వహించిన నాయుడుకి 135 వచ్చాయి . జూదగాళ్ళకు నిమిషంలో ఫలితం తేలవచ్చు . లాంగ్ టైం ఇన్వెస్టర్లు లాభాల పంట చూడాలి అంటే దీర్ఘకాలిక ఓపిక , సహనం అవసరం . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ వ్యాపారాలే . ఏ వ్యాపారం కైనా ఓపిక అవసరం . సబర్ కా ఫల్ మీటా హోతా హై అంటారు . గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు . ఫలితం అదే వస్తుంది . స్టాక్ మార్కెట్ లో నైనా రాజకీయ మార్కెట్ లో నైనా .. - - - బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం