25, అక్టోబర్ 2024, శుక్రవారం
వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ...
మీ అందరికీ ఓ సరదా సవాల్ ఓ వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ... ఇదేం సవాల్ నెలకు లక్షల్లో సంపాదించే వారు ఉన్నారు . స్టాక్స్ లో ఒకే రోజుల్లో స్టాక్స్ లో లక్షలు వస్తాయి , పోతాయి . వంద ఓ లెక్కనా ? అంటే .. ఔను లెక్కనే ...ఈ వంద రూపాయల ఛాలెంజ్ ను విజయ వంతంగా పూర్తి చేయడానికి నాకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది .. మీరూ ప్రయత్నించి చూడండి ... ఈ సవాల్ ఐడియా నాది కాదు .. యండమూరి వీరేంద్ర నాథ్ గారిది ... ఈ సవాల్ గురించి మొదటి సారి విన్న తరువాత దాదాపు రెండు దశాబ్దాల తరువాత సక్సెస్ అయ్యాను ... నిజానికి ఈ సవాల్ గురించి తెలియని రోజుల్లో చదువుకొనేప్పుడే సక్సెస్ అయ్యాను . కానీ ఉద్యోగంలో చేరాక వంద రూపాయల ఛాలెంజ్ లో విజయం సాధించడం కష్టం అయింది . ఉద్యోగం , వృత్తి , వ్యాపారం లో లక్షలు సంపాదిస్తూ ఉండ వచ్చు .. మనం చేసే ఉద్యోగం వృత్తి నుంచి కాకుండా ఇంకో పని నుంచి కనీసం వంద రూపాయలు సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది అని యండమూరి వీరేంద్రనాథ్ ఓ చోట రాశారు . అది చదివినప్పటి నుంచి ప్రయత్నించాను .. జర్నలిస్ట్ గా ఆంధ్రభూమిలో జీతం తో పాటు వ్యాసాలు రాసినందుకు పారితోషకం ఇచ్చే వారు . అది అదనపు సంపాదనే అయినా రాయడం అనే వృత్తిలో ఉన్నాను . అదే పని చేస్తున్నప్పుడు వేరే పని ద్వారా సంపాదన కాదు ... మన వల్ల కాదు అని వదిలేశా ... ఉద్యోగం తరువాత స్టాక్ మార్కెట్ ... ఇది కూడా వృత్తే ... ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆదాయం రావచ్చు .. ఇది వేరే వృత్తి ద్వారా సంపాదించాలి అనే ఛాలెంజ్ కు సరిపోదు అనుకున్నాను ... ఆంధ్రభూమిలో పని చేస్తూ వ్యాసాలు రాయడం వృత్తిలో భాగం కానీ పుస్తకం ప్రచురించడం , అమ్మడం వృత్తి కాదు ... ఓ నెల క్రితం పోస్ట్ ఆఫీస్ లో లక్ష్మీ కటాక్షం బుక్ ను పోస్ట్ చేస్తున్నాను ... సెల్ ఫోన్ లో ఆ రోజు స్టాక్ మార్కెట్ చూస్తే నా ఇన్వెస్ట్ మెంట్ దూసుకెళుతుంది ... అది మాములే కానీ ఒక్క సారిగా సంతోషం వేసింది ... నేను రాసిన లక్ష్మీ కటాక్షం బుక్ అమ్ముడు పోతుంది . డబ్బులు వచ్చాయి అంటే మరో వృత్తి ద్వారా వంద రూపాయ లైనా సంపాదించాలి అనే టార్గెట్ పూర్తి అయినట్టే కదా ? అని సంతోషం వేసింది .. యండమూరి రాసిన ఛాలెంజ్ సినిమాలో హీరో చిరంజీవి 50 లక్షలు సంపాదిస్తా అని రావుగోపాల రావు తో ఛాలెంజ్ చేసి ... స్కూటర్ డిపాజిట్లు 50 లక్షలు వసూలు చేసి విజయం సాధిస్తాడు .. ఆ 50 లక్షలు డిపాజిట్లు అవుతాయి కానీ చిరంజీవి సంపాదించినట్టు కాదు కదా ? ఆ 50 లక్షలతో స్కూటర్ లు తయారు చేసి అమ్మితే ఖర్చులు పోగా మిగిలింది ఆదాయం అవుతుంది తప్ప 50 లక్షలు ఆదాయం కావు అని నా అభిప్రాయం ... మీ అభిప్రాయం ఇది . హీరో చిరంజీవి అభిప్రాయం అది అని యండమూరి సమాధానం ... ఆ సమాధానానికి అప్పుడు సంతృప్తి చెందలేదు కానీ ఇప్పుడు నేనూ అదే దారిలో .. పుస్తకం వ్యయం తీసేసిన తరువాత మిగిలేది లాభం అవుతుంది .. అప్పుడే వేరే వృత్తి నుంచి వంద రూపాయలు అయినా సంపాదించాలి అనే ఛాలెంజ్ లో సక్సెస్ అయినట్టు అవుతుంది కానీ బుక్ అమ్మగానే సక్సెస్ అయినట్టు కాదు అనేది ప్రాక్టికల్ వాదన ... ఐతే ఈ వాదనతో సంతోషం ఉండదు . అందుకే ఛాలెంజ్ హీరో వాదనకే ఓటు ... సంతోషం ముఖ్యం కానీ ప్రాక్టికల్ వదనాదేముంది .... ఇదీ విషయం లక్ష్మీ కటాక్షం పుస్తకానికి ఊహించని స్పందన వస్తోంది . సరదాగా మీరూ ప్రయత్నించి చూడండి ... మీ వృత్తి ఉద్యోగం నుంచి కాకుండా మరో పని ద్వారా వంద రూపాయలు సంపాదించండి .. అలా సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది .. అప్పుడప్పుడు ఓలా బైక్ వాళ్ళతో మాట్లాడుతా ... వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం , చదువులో ఉంటూ పార్ట్ టైం సంపాదన కోసం ఓలా ... వీరికి డబ్బు విలువ తెలుసు ... కచ్చితంగా జీవితంలో ఎదుగుతారు అనిపిస్తుంది . అక్కినేని నాగేశ్వర రావు మీద phd చేస్తూ జర్నలిస్ట్ మిత్రుడు నామాల విశ్వేశ్వర రావు అక్కినేనిని తరుచుగా కలిసే వారు . తోటి నటులు కొందరు పేదరికంలో ఉండడాన్ని ప్రస్తావిస్తే .... కీలు గుర్రం సినిమా లో నటించినందుకు నెలకు ఐదు వందలు ఇచ్చారు .. చెక్క గుర్రం మీద రోజంతా కూర్చోవాలి .. మరో వైపు భారీ ఖాయం హీరోయిన్ ... చెక్క గుర్రం ఒరుసుకు పోయేది ... ఐదు వందల రూపాయలకు అంత కష్టపడాల్సి వచ్చేది ... కడుపు కట్టుకొని కూడబెట్టుకున్నాను ... ఐదు వందలు వృధా ఖర్చు చేయాలి అన్నా కీలు గుర్రంలో నెలంతా కష్టపడితే వచ్చిన జీతం అని మనసు అంగీకరించేది కాదు అని అక్కినేని చెప్పుకొచ్చారట ... మనం చెసే పని కాకుండా మరో పనితో వంద సంపాదించినా డబ్బు విలువ తెలుస్తుంది ... వృధా ఖర్చు తగ్గుతుంది .ట్రై చేసి చూడండి . - బుద్దా మురళి
22, అక్టోబర్ 2024, మంగళవారం
మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది జర్నలిస్ట్ జ్ఞాపకాలు 116^
మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది జర్నలిస్ట్ జ్ఞాపకాలు 116^ మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైంది .. బాగుంటుంది . ^ సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మామిత్రుడికి సీరియస్ గా చెప్పిన మాట . బహుశా ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్ లో చాలా కొద్ది నెలలు అద్దెకు ఉండాల్సి వచ్చింది . రాత్రి తొమ్మిది అయితే చాలు లైట్ బంద్ చేసేవారు . ఓ రోజు తింటుండగా లైట్ బంద్ చేయగానే ఒక్కడినే ఉన్నాను . దుఃఖం వచ్చినట్టు అయింది . ఏదో ఒక రోజు సొంత ఇల్లు ఉండాలి అని అప్పుడు అనుకున్నంత బలంగా ఎప్పుడూ అనుకోలేదు . ఆ తరువాత అంతకు ముందు అనేక చోట్ల ఉన్నా ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు . మూసీ పేరుతో హైడ్రా నిర్ధాక్షిణ్యంగా ఇల్లు కూల్చివేస్తోంది . ఒక మధ్యతరగతి నడివయస్కుడు గృహ ప్రవేశం చేసిన ఆరు రోజులకే హైడ్రా ఇంటిని కూల్చేసింది . అన్ని అనుమతి పత్రాలను మీడియాకు చూపిస్తూ అనుమతులు ఉన్నాయి , బ్యాంకు లోన్ ఇచ్చింది ఇంకేం చూస్తాం అంటూ అతను ఏడవ లేక కుమిలిపోతున్నారు . ఇల్లు కూల్చినా రోజూ కూలిన ఇంటి వద్దకు వెళ్లి దీనంగా చూస్తున్నాడు . అతను ఏడిచే వీడియో చూశాక బాగా ఇబ్బంది అనిపించింది . నాకే అలా అయినట్టు అనిపించింది . అతను ఎవరో నాకు తెలియదు కానీ ఒక మధ్యతరగతి తండ్రి సొంత ఇంటి ద్వారా తన కుటుంబానికి భరోసా ఇవ్వాలి అని ఎలా కలలు కంటాడో నాకు తెలుసు . అన్ని కోరికలు చంపుకొని పిల్లలకు ఇంటి ద్వారా భరోసా ఇవ్వాలి అనుకుంటాడు . కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి , రాజకీయ వ్యాపారం చేసేవారికి ఇల్లు అంటే పెద్దగా సెంటి మెంట్ ఉండక పోవచ్చు . ఉండాలని లేదు . కానీ సామాన్యులకు , కుటుంబమే ప్రపంచంగా బతికేవారికి ఇల్లు కూలిస్తే తమ ప్రపంచం కూలి పోయినట్టు , తమను ముక్కలు చేసినట్టు, బతికి ఉండగానే సమాధి చేసినట్టు అనిపిస్తుంది . అతని గురించి పదే పదే ఆలోచిస్తుండడంతో జర్నలిస్ట్ గా నా ఇంటి కథ గుర్తుకు వచ్చింది . ****
2004-5 ప్రాంతంలో భూదేవి నగర్ లో ప్లాట్ కొన్నాను . దాదాపు అదే సమయంలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రిగా వై యస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు . ఒక వైపు ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటే మీరు ఇదే సమయంలో అంత ఇబ్బంది పడి ప్లాట్ కొనడం ఎందుకు అని తోటి జర్నలిస్ట్ విజయప్రసాద్ లాంటి మిత్రులు చెప్పేవారు . మన చేతులో ఉన్న అంశం పై మనం నిర్ణయం వెంటనే తీసుకోగలం , ప్రభుత్వం , వందల మంది జర్నలిస్ట్ లు , వ్యవస్థలు ఎన్నో ఉంటాయి . ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అసలే మేధావులతో వ్యవహారం . వచ్చేది వస్తుంది నేను కొనేది కొంటాను అని చెప్పాను . కొన్నాను అప్పుడు ఊరవతల దిగువ మధ్య తరగతి నివసించే ప్రాంతం . రోజూ వార్తల కోసం తిరిగేది బంజారాహిల్స్ లో అయినా దానికి అన్ని కోణాల్లో భిన్న మార్గంలో ఉన్న భూదేవి నగర్ ను ఎంపిక చేసుకున్నాను . చదువుకునే రోజుల్లో క్లాస్ మెట్ తిరుమలగిరిలో ఉండేవాడు . సికింద్రాబాద్ నుంచి తిరుమల గిరి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం . వాళ్ళ ఇంటికి వచ్చాక , ఇంత దూరం నుంచి వస్తావా అని అతని మీద జాలి చూపించాను . తిరుమల గిరి నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూదేవి నగర్ లో ప్లాట్ కొని క్లాస్ మెట్ పై జాలి చూపిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను . ***ఇంటి నిర్మాణం పనులు జరుగుతుంటే వెళుతుంటే ఒకప్పటి నక్సలైట్ , తరువాత జర్నలిస్ట్ కవి అయిన మిత్రుడు చారి ఫోన్ చేసి వచ్చేయ్ అన్నాడు . ఇంటి పని చూసేందుకు వెళుతున్నాను రాలేను అంటే . దారిలోనే కదా ? అదేమన్నా తాజ్ మహల్ నా ? రోజంతా చూసేందుకు చూసి వచ్చేయ్ జూబ్లీ బస్సు డిపో దగ్గరే ఇల్లు వచ్చేయ్ ఎదురు చూస్తుంటా అంటే నేను సీరియస్ గా మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందంగా ఉంటుంది . వందో 50 రూపాయలో ఇస్తే తాజ్ మహల్ ను ఇలా చూసి అలా వచ్చేయ వచ్చు . మా ఇంటిని అలా చూసి రాలేను చాలా అందమైనది . వంద , 50 రూపాయలది కాదు అంటూ సీరియస్ గా సమాధానం చెప్పాను . ***సరే మీ ఇంటిని తాజ్ మహల్ తో పోల్చడం అతి కదా ? అది సరే ఇల్లు ఎలా ఉంటుంది ? అంటారా ? వంశీ సినిమాలో కనిపించే సెట్టింగ్ లా ఉంటుంది . పై నుంచి చూస్తే రైలు పట్టాలు , పచ్చని చెట్లు , రైల్ వే స్టేషన్ వంశీ చూస్తే ..... ఇది పై నుంచి చూస్తే కనిపించే దృశ్యం . కింద నుంచి చూస్తే మృణాల్ సేన్ సినిమాలో పేదల ఇండ్ల సెట్టింగ్ కు జీవం పోస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది . ఇంటి నిర్మాణ పనులు చేసే కూలీలు రైల్ వే గోడను ఆనుకొని బొమ్మరిల్లు లాంటి ఇండ్లను నిర్మించుకొని ఉన్నారు . వారికి హైడ్రా భయం లేదు . అదేమీ చెరువు కాదు రోడ్డు కాబట్టి భయం లేదు . నా ఒక్కనికే కాదు మధ్యతరగతి వారికే కాదు సంపన్నులకు ... ప్రతి మనిషికి తమ ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది , గొప్పది . తాజ్ మహల్ మరణించిన ప్రేమకు చిహ్నం . ఇల్లు తమ కుటుంబానికి రక్షణ . ఇల్లు ఇచ్చే భరోసాతోనే మధ్యతరగతి కుటుంబ రావు పిల్లలకు విదేశాల్లో ఖరీదైన చదువు చెప్పిస్తాడు . రైటర్ మెంట్ జీవితానికి ఇల్లు భరోసా ఇస్తుంది . ****ఆంధ్రభూమిలో పని చేసేప్పుడు రాంలాల్ అని సీనియర్ ఉండేవారు . ఓ రోజు క్యాంటిన్ లో చర్చ . జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీలోని ప్లాట్ అమ్మి నేరేడు మెట్ లో ఇల్లు , ప్లాట్ కొన్నాడు . అప్పుడు జూబ్లీ హిల్స్ లో లక్ష రూపాయలకు గజం . అమ్మిన ప్లాట్ విలువ మూడు కోట్లు , ఇప్పటి మీ ఆస్తి లెక్క పెడితే 2. 4 కోట్లే అవుతుంది . అంటే మీ నిర్ణయం 60 లక్షల నష్టం అంటే అతను ఇచ్చిన సమాధానం . మురళి నేను జీవిత కాలం అంతా అద్దె ఇంట్లో ఉన్నాను . అద్దె ఇల్లు , ఆంధ్రభూమిలో ఉద్యోగం ఏమవుతుందో అనే భయం తోనే జీవితం గడిచిపోయింది . మా పిల్లలు చిన్నప్పటి నుంచి సొంత ఇంటిలో పెరిగారు . వారిలో బోలెడు ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది . మంచి చదువులు , డిఫెన్స్ లో మంచి స్థాయిలో ఉన్నారు . దీనికి ఎంత లెక్క కడతావు అని బదులిచ్చాడు . సొంత ఇల్లు ఇచ్చే భరోసాకు కరెన్సీ లో లెక్కలు ఉండవు . ముఖేష్ అంబానీ తన భార్యకు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని పుట్టిన రోజు బహుమతి ఇచ్చాడు . స్టాక్ మార్కెట్ అమితాబ్ రాకేష్ జున్ జున్ వాలా మార్కెట్ లో తాను ఎన్నివేల కోట్లు సంపాదించాడో చెబుతుంటే వాళ్ళ అమ్మ అవేవీ పట్టించుకోకుండా ఇల్లు కొంటావా ? లేదా అని పోరు పెట్టింది . క్రిసిల్ రేటింట్ స్టాక్ అమ్మి ఇల్లు కొన్నాడు . ఇప్పడు ఇంటి విలువ 200 కోట్లు అయితే ఆ స్టాక్స్ అమ్మకుండా అలానే పెట్టుకొంటే వాటి విలువ ఇప్పుడు రెండు వేల కోట్లు అయి ఉండేదని చెప్పుకొచ్చాడు . ఓ ఇంటర్వ్యూ చూస్తే ఒకతను నెలకు మూడు లక్షల అద్దె చెల్లిస్తున్నాడు . నా పెట్టుబడి కి మార్కెట్ 18 శాతం ఆదాయం ఇస్తుంటే నేను ఇంటి విలువకు నాలుగు శాతం వడ్డీ మాత్రమే అద్దెగా చెల్లిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అంకెల పరంగా అద్దె ఇల్లు లాభసాటి కానీ .. సొంత ఇల్లు ఇచ్చే భరోసా , సంతోషం , ఆనందాన్ని లెక్కించే అంకెలు లేవు . నేను ప్లాట్ కొన్న సమయంలోనే కొందరు జర్నలిస్ట్ మిత్రులు మన్నెవారి తుర్కపల్లి గ్రామంలో పొలం చూద్దామని వెళ్లారు .వారికి అప్పుడు చెప్పలేదు కానీ అది మా సొంతూరు . పుట్టగానే హైదరాబాద్ రావడం వల్ల హైదరాబాద్ నే సొంతూరు . తుర్కపల్లి మెయిన్ రోడ్ లో అప్పుడు 80 వేలకు ఎకరం . నేను ఇల్లు కట్టకుండా పొలం కొంటే కనీసం 10 ఎకరాలు వచ్చేది . ఆ పొలం దాదాపు రెండు కోట్ల వరకు పెరిగింది . కానీ నా నిర్ణయం తప్పుఅని ఎప్పుడూ అనిపించలేదు . జీవితం అంటే కేవలం అంకెలే కాదు అంతకు మించి... . ... ఇంటికన్నా మించిన ఆదాయం ఇచ్చే ఇన్వెస్ట్ మెంట్ గురించి నాకు బాగా తెలుసు . అయితే ఇల్లు , ఇన్వెస్ట్ మెంట్ రెండింటిలో ఒకటి అంటే నా ఓటు ఇంటికే .. ***ప్లాట్ కొన్నాక లంచం కోసం బిల్డర్ ను వేధిస్తూ మున్సిపల్ కమిషనర్ వేధించాడు . మధ్యలో నేను ఇరికి పోయాను , ఉన్న డబ్బు అంతా ఇన్వెస్ట్ చేసి అని నా ఆందోళన . దిగులుగా ఆలోచనలో పడిపోయినప్పుడు ఎడిటర్ పిలిచి ఆంధ్రప్రభకు వెళ్లి రమ్మని సొంత పని చెప్పాడు . దిగులుతో అది మరిచిపోయా .. కోపం వచ్చి పొలిటికల్ రిపోర్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ రిపోర్టింగ్ కు మార్పు . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ రిపోర్టింగ్ అంటే తినే సమయం , అర్ధరాత్రి తప్ప అంతా బిజీ . హమ్మయ్య అని ఇంటి నిర్మాణం మీద ఎక్కువ సమయం కేటాయించా . ఓ రోజు ఎడిటర్ పిలిచి మాట్లాడితే టీడీపీ రిపోర్టింగ్ అయితే అస్సలు సమయం దొరికేది కాదు ఎడ్యుకేషన్ బీట్ వల్ల హాయిగా దగ్గరుండి ఇంటి నిర్మాణం చూసుకున్నాను అని బదులిచ్చాను . అలా చెబితే ఏమవుతుందో నాకు తెలుసు . మరుసటి రోజు ఎడిటర్ పిలిచి రేపటి నుంచి పొలిటికల్ బీట్ చూడు అంటూ ఆదేశం . ****ఔను మీరు ప్లాట్ కొనే సమయంలోనే వై యస్ రాజశేఖర్ రెడ్డి జర్నలిస్ట్ లకు ల్యాండ్ కేటాయించారు అన్నారు ఏమైంది ? అంటే ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్ కు కేసు మారుతూ ఉంది . అసలే మేధావుల సమస్య అంత త్వరగా తేలదు . 2005 నుంచి. ఇప్పటి వరకు నాది ఒకటే మాట ఏదో ఒక రోజు తేలుతుంది . ఎప్పుడూ అనేది తెలియదు . తొలుత కోర్ట్ గడప తొక్కింది సభ్యత్వం రాని జర్నలిస్ట్ లు . ఒక్క సారి వ్యవహారం మన చేయి నుంచి పోయి కోర్ట్ బోనులో పడ్డాక ఎప్పుడు ముగింపు నో ఎవరికీ తెలియదు . - బుద్దా మురళి
3, అక్టోబర్ 2024, గురువారం
మహనీయుల జీవితాలను దుర్భరంగా మార్చిన నిర్లక్ష్యం : మనకు జీవిత పాఠాలు
లక్ష్మీ కటాక్షం
జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంది అని మీరు భావిస్తే చదవాల్సిన పుస్తకం .
తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుంచి భూగర్భంలో శాశ్వత నిద్రలోకి జారుకునేంత వరకు మనిషి జీవితంలో ప్రతి దశలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంటుంది .. అది గ్రహించక పోతే మహా మహుల జీవితాలు కూడా అంతిమ దశలో దయనీయంగా గడిచాయి . సువిశాల భారత దేశాన్ని పాలించిన మొఘల్ వంశీయులు కలకత్తాలో చిన్న టీ కొట్టు పెట్టుకొని బతుకు తున్నారు . ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు నెల జీతంతో నటించిన రోజుల్లో సినిమాకు లక్ష రూపాయల పారితోషకం తీసుకున్న తొలి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య చివరి దశలో కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న పాత్రలు వేశారు ... హీరోలను మించి సంపాదించిన రాజనాల చివరి దశలో తిండికే ఇబ్బంది పడ్డారు . రజనీ కాంత్ ను సూపర్ స్టార్ ను చేసిన నిర్మాత వృద్ధాప్యంలో తనకో ఇల్లు దానం చేయండి అని వేడుకున్నాడు .. ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో జీవితం శాశ్వతంగా అలానే ఉంటుంది అని భావించి చివరి దశలో దుర్భర జీవితం గడిపిన ఎందరో మహానుభావుల జీవితాలను కళ్లముందుంచిన లక్ష్మీ కటాక్షం - డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది -పుస్తకం జీవితం మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతుంది . మన భవిష్యత్తు , పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే డబ్బును ఎలా గౌరవించాలో చెబుతుంది . తొలి తరం సినిమా నటుల దుర్భర జీవితం ఆ తరువాత తరం వారికి డబ్బు గురించి ఎన్నో పాఠాలు నేర్పింది .. ఆ పాఠాలు మనమూ నేర్చుకోవడానికి లక్ష్మీ కటాక్షం మానసికంగా మనల్ని సిద్ధం చేస్తుంది .
నవోదయ , న్యూ విశాలాంధ్ర , అమెజాన్ లలో పుస్తకాలు లభ్యం . 168 పేజీలు .. ధర 200 వివరాలకు వాట్సాప్ నంబర్ 9849998087
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)