25, డిసెంబర్ 2013, బుధవారం

కేజ్రీవాల్‌కు దేవుడే దిక్కు

పూచిక పుల్లను చేతిలోకి తీసుకుని మంత్రిస్తే అది మహాశక్తివంతమైన ఆయుధం అవుతుంది. సీతమ్మ రావణుడితో నేరుగా మాట్లాడడం ఇష్టం లేక గడ్డిపోచతో మాట్లాడుతుంది. చీపురు పుల్లలు, గడ్డిపోచలు ఇప్పుడే కాదు మన పురాణాల్లో సైతం మహత్తరమైన పాత్ర పోషించాయి. మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌లో పాతుకుపోయిన కమ్యూనిస్టులను మమతక్క గడ్డిపోచతోనే మట్టికరిపించింది. అది గడ్డిపోచ గొప్పతనమా? దానిలో మహత్తర శక్తులను నింపిన మమత గొప్పతనమా? లేక మూడు దశాబ్దాల పాలనతో గడ్డిపోచకు కూడా చులకైనయ్యే విధంగా పాలించిన ఎర్రన్నలది తప్పా? కాల మహిమనా? అంటే సమాధానం ఎవరికి తోచినట్టు వారు చెబుతారు.

 ఆయుధాన్ని చేపట్టకుండా ఒంటి చేత్తో మహాభారత యుద్ధాన్ని నడిపించిన శ్రీకృష్ణుడంతటి వాడు చివరకు పూచిక పుల్లలాంటి బాణానికి ప్రాణాలు విడిచాడు. మహామహావీరులు సైతం కాలం కలిసి రానప్పుడు పూచిక పుల్లల చేతిలో మట్టికరిచిపోతారు. సీతను కాకాసురుడు ముక్కుతో పొడుస్తుంటే శ్రీరాముడికి ఆగ్రహం వచ్చి గడ్డిపోచను అభిమంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తాడు. ఇందిరాగాంధీ రాజ్‌నారాయణ్ చేతిలోఓడిపోవడం, ఎన్టీఆర్ చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయి, బాబు చేతిలో హరీమనడం ఇలాంటిదే.
ఢిల్లీ ప్రజలకు రాజకీయ కాకాసురులపై ఆగ్రహం కలిగి గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చి చరిత్ర సృష్టించారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో జనం తయారు చేసిన బ్రహ్మాస్త్రం కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో సంచలనం సృష్టించిన ఫలితాలు మొదటిది బెంగాల్‌లో కమ్యూనిస్టు కంచుకోట కూలిపోడవం అయితే ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా చీపురుకట్ట పార్టీని జనం ఆందలమెక్కించడం. 


రాజ్యం వీర భోజ్యం అన్నారు. నిజమే ఇంత కాలం రాజ్యం సంపన్నులకు భోజ్యంగా మారింది. పార్టీల పేర్లు ఏమైనా సంపన్నుల చేతిలోనే అధికారం ఉంటూ వచ్చింది. ఇంట్లో ఒక మూల ఎవరికీ కనిపించకుండా బతుకీడుస్తుంది చీపురు కట్ట. అలాంటి చీపురు కట్టకు కేజ్రీవాల్ మహర్దశ పట్టించాడు. కాదేది కవిత్వాని కనర్హం అని శ్రీశ్రీ అంటే కాదెవరు అధికారానికి అనర్హులు అని కేజ్రీవాల్ చీపురు కట్టకు అధికార హోదా కల్పించారు. సింహాసనం పై కూర్చోబెట్టారు.


నిర్భయ సంఘటన తరువాత చివరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి షీలాదీక్షిత్ సైతం నిజమే మా అమ్మాయి కూడా ఢిల్లీలో ఆడవారికి భద్రత లేదంటోంది అని చెప్పుకొచ్చారు. షీలాదీక్షిత్ కుటుంబ అభిప్రాయమే ఇదైతే, ఇక మా గతేం కాను అనుకున్న ఢిల్లీ వాసులు తొలుత నిర్భయ కోసం ఉద్యమించి తరువాత తమ కోసం ఆమ్ ఆద్మీ పార్టీని నమ్ముకున్నారు. అధికారానికి ఒక అడుగు దూరంలోనే కేజ్రీవాల్‌ను నిలిపివేశారు. చెత్తను ఊడ్చడానికైనా చీపురుకు చెయ్యి ఆసరా తప్పదు అని నచ్చజెప్పి కాంగ్రెస్ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించింది. కేజ్రీవాల్ మనసులో ఏ ముందో కానీ ఈ నిర్ణయంతో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఊపరి పీల్చుకున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కేజ్రీవాల్ ఇక కాంగ్రెస్ అవినీతిపై ఏం విచారణ జరిపిస్తాడని బిజెపి నాయకులంటున్నారు. ఎక్కడికి వెళ్లినా భారత్‌మాతాకీ జై అంటూ ఆమ్ ఆద్మీయులు నినాదాలు చేస్తున్నారు. భారత్ మాతా పార్టీ బిజెపికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. ఆమ్ ఆద్మీ దేశ వ్యాప్తంగా పోటీ చేస్తే ఆంతో ఇంటో బిజెపి ఓట్లకే తూట్లు పడతాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ చేరువ కావడంతో బిజెపి ఊపిరి పీల్చుకుంటోంది.


అయ్యా మీరు ముఖ్యమంత్రి.. మీకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తాం అంటే కేజ్రీవాల్ అచ్చం తెలుగు నేతల డైలాగులే చెబుతున్నారు. నాకు దేవుడే దిక్కు, మీ భద్రత అవసరం లేదని చెప్పారు. చాలా మంది తెలుగువారు ఎన్టీఆర్‌ను శ్రీరాముడికి శ్రీకృష్ణుడిగా కొలిచేవారు. తాను దేవుడినని ఎన్టీఆర్‌కు గట్టినమ్మకం ఉండేది. దేవుడిననుకున్న ఎన్టీఆర్‌కే వెన్నుపోటు తప్పనప్పుడు, దేవుడిపై భారం వేసిన కేజ్రీవాల్‌కు తప్పుతుందా? దేవుడిపై భారం వేసిన కేజ్రీవాల్‌కు రాజకీయ గండం ఏ రూపంలో రానుందో వేచి చూడాలి. అయినా కేజ్రీవాల్ మనం అనుకున్నంత ఆమాయకుడేం కాదనిపిస్తోంది.


నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్టు, బిజెపి కాంగ్రెస్‌లు ఒకందుకు మద్దతు ప్రకటిస్తే, కేజ్రీవాల్ మరొకందుకు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాడు. తాను చేయాలనుకున్న మార్పులు చేస్తాడు, ఎక్కడైనా తేడా వచ్చి ప్రభుత్వం పడిపోతే అది తనకు మద్దతు ఇచ్చిన వారి తప్పుకానీ తనది కాదని చెప్పుకునే రాజకీయ వ్యూహం కేజ్రీవాల్‌కు ఉన్నట్టుగానే ఉంది. అందుకే అన్నీ బహిరంగమే అంటున్నాడు. సర్వేలో మీ అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేయమంటేనే చేస్తున్నానని చెప్పుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నాడు.


ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఆచితూచే ఆడుగులు వేశాడు. చివరకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయాలనే నిర్ణయం సైతం. రామాయణంలోని చిత్రవిచిత్రాలను కళాకారులు ప్రదర్శించే మైదానం అది. అంతే కాదు దేశ రాజకీయాల్లో అనేక మలుపులకు ఆ మైదానం సాక్షిగా నిలిచింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్‌నారాయణ్ తొలి సభ, అరెస్టుకు ముందు చివరి సభ జరిపింది ఇక్కడే. ఎమర్జన్సీ ఎత్తేశాక మహామహులు జనతా పార్టీగా ఆవిర్భవించింది ఇక్కడే. అన్నా హజారే ఉద్యమం సాగింది ఇక్కడే. ఇప్పుడు ఇక్కడే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ మద్దతుపై ఏడు భాషల్లో కేజ్రీవాల్ వివరణ ఇస్తూ యూ ట్యూబ్‌లో చేర్చారు.
రామ్‌లీలా మైదానం ఒకప్పుడు మంచినీటితో కళకళలాడిన పెద్ద చెరువు. ఇప్పుడది రాజకీయ నెలవు. కేజ్రీవాల్ చెరువులో బురదగా మారిపోతాడా? బురద గుంటలో పూవుగా వికసిస్తారా? వేచి చూద్దాం. జనం ప్రభుత్వాల పై భరోసా వదిలేసి దేవుడే దిక్కు అనుకుంటున్నారు . కేజ్రివాల్ కూడా  దేవుడి పైనే భరోసా వేస్తే ఇక ఎలా ? 

18, డిసెంబర్ 2013, బుధవారం

రాజకీయ నాటకం!

భీముడు బీడీ కాలుస్తూ ద్రౌపది వైపు చిలిపి గా చూస్తుంటే పోరా పోకిరీ అని ద్రౌపది భీముడ్ని ఒక్క తన్ను తన్ని తెరవెనుక నుం చి స్టేజిపైకి వచ్చింది. స్టేజీని, జీవితాన్ని వేరు చేసేది చిన్న తెరమాత్రమే. అప్పటి వరకు తెర వెనుక నిర్లక్ష్యంగా కనిపించిన ద్రౌపది తెరపైకి రాగానే తన ను తాను పవిత్రంగా మార్చుకుని మహాపతివ్రత గా నటించేస్తుంది. చిల్లర వేషాల భీముడు బీడిని నాలుగు దమ్ములు లాగించి పారేసి తెరపైకి రాగా నే మహాబలసంపన్నుడిగా మారిపోయాడు. మ హాసాధ్వి సీతమ్మ తన కష్టాలతో జనాన్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. నేను వదిన పాదాలు మాత్రమే చూశా ను ముఖాన్ని చూడలేదు అని డైలాగు చెప్పి తెర వెనక్కి వెళ్లిన లక్ష్మణుడు సీత పాత్రధారితో చిలిపి వేషాలు వేయవచ్చు.


తొలిసారి చంద్రమండలంపై కాలు పెట్టినవాడు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాడు ఎలా ఆశ్చర్యపోయాడో తెర ముందు పాత్రలను తెర వెనుక వేషాలు  తొలిసారి చూసినప్పుడు అలానే ఆశ్చర్యపోతాడు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో సైతం ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.


తెర ముందు నటన, తెర వెనుక జీవితం. బాత్రూమ్‌లో స్నానం చేసేప్పుడు తప్ప మనిషి మెలుకువ ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటాడంటాడు రజనీష్. ఎంత డబుల్ రోల్ సినిమా అయినా నటుడు ఒక పాత్రలో ఒకేసారి నటిస్తాడు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలో ముప్పావు డజను పాత్రల్లో నటించినా, కమల్‌హాసన్ దశావతారాల్లో కనిపించినా ఆ మహానటులు సైతం ఒకసారి ఒక పాత్రలోనే నటించారు. కానీ రాజకీయ నటులు మాత్రం ఒకేసారి ఒకే సమయంలో అనేక బహు పాత్రల్లో బహుముఖ ప్రతిభను చూపాల్సి ఉంటుంది. ఇలాంటి అరుదైన నటన అసెంబ్లీ సమావేశాల్లో చూసే భాగ్యం లభించింది.


***
తెలుగు నటుడు అప్పుడే భీకర కరుణ రసాత్మకంగా నటించి మీరు వెళ్లి బిల్లును అడ్డుకోండి అని సగం సైన్యాన్ని పంపించాడు. మిగిలిన సైన్యం అప్పటి వరకు చేతులు కట్టుకుని మీ ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్నాం మహారాజా అని వినయంగా అడిగారు.
ముందు వెళ్లిన ఆంధ్ర సైన్యం బిల్లును అడ్డుకుంటుంది. మీరు వెళ్లి వారిన అడ్డుకోని కింద పడేయండి అని తెలంగాణ సైన్యాన్ని తెలుగు రాజు ఆజ్ఞాపించాడు. సైన్యాధ్యక్షుడు చెప్పినట్టుగానే వారి సైన్యం తమ తమ బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చింది. తెర ముందు మాత్రమే చూసిన వారికి అయ్యో పాపం నిన్న మొన్నటి వరకు అన్నాదమ్ముల్లా భుజం భుజం కలిపి నడిచిన ఈ సోదరులు కత్తులు దూసుకుంటున్నారు ఎంతటి దౌర్భాగ్యస్థితి అని బాధతో కన్నీళ్లు వస్తాయి. షూటింగ్ ముగిశాక ముచ్చటించుకునే వీరిని చూస్తే మళ్లీ కన్నీళ్లు వస్తాయి నవ్వును ఆపుకోలేక.


***
సాలార్‌జంగ్ మ్యూజియంలో ఒకే బొమ్మను ఒకవైపు నుంచి చూస్తే యోధునిగా మరోవైపు నుంచి చూస్తే మహిళగా కనిపిస్తుంది. ఒక ప్రతిమ రెండు రూపాల్లో కనిపించడం వింతే. యువనేత పార్టీ సైతం అంతే వారి పార్టీ పేరులోనే రెండు రూపాలు దాగున్నాయి. వై యస్ ఆర్ అంటే అందరికి తెలిసింది మాజీ ముఖ్యమంత్రి అని,  కాని వాళ్ళు మాత్రం యువత నవత అంటూ ఏదో చెబుతారు. పార్టీ పేరులోనే కాంగ్రెస్ పెట్టుకొని తమది  కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతం అన్నట్టుగా చెబుతారు . చనిపోయిన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అలా అని పైకి ఆ మాట చెప్పరు. జైలో ఒకటిన్నర ఏళ్లు బయట రెండేళ్లు మూడున్నర ఏళ్లు అనుభవం మాత్రమే ఉండడం వల్ల థర్టీ ఇయర్ ఇండ్రస్ట్రీ నటునితో నటనలో పోటీ పడలేక ఎక్కువ రోజులు తన వల్ల డబుల్ యాక్షన్ సాధ్యం కాదని గ్రహించి ఏకపాత్రాభినయానికి సిద్ధమయ్యారు. 


దాంతో ఆయనకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. యుద్ధ ఫలితం ముందే తెలిసినా గాలిలో యుద్ధం చేయక తప్పదని ఒకే సైన్యం ఒకే సైన్యాధ్యక్షునిగా యుద్ధం చేసేస్తున్నాడు. దాంతో మిగిలిన వారి యుద్ధాల్లా వీరి యుద్ధంలో పెద్దగా ట్విస్ట్‌లు కనిపించడం లేదు.
***
 అంతకు కొద్ది  సేపటి క్రితమే సీమాంధ్ర తెలంగాణ తెలుగు ఎమ్మెల్యేలు దాదాపుగా బాహాబాహికి దిగారు. తప్పేవరిదో ఎవరు ముందు ఎవరిని తోశారో ప్రత్యక్ష సాక్షులు తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా సాక్షం చెప్పారు .  ఆ దృశ్యం అయిపోయిన కొద్ది సేపటికే రెండు ప్రాంతాల తెలుగు ఎమ్మెల్యేల చర్చ మాత్రం విన్నవారికి వీనుల విందు చేసింది.
‘‘లింగారెడ్డన్నా 50 ఏళ్లపాటు తెలంగాణ వాళ్లే ముఖ్యమంత్రులు అని ముందే తీర్మానం చేసి ఉంటే ఈ సమస్యనే వచ్చి ఉండేది కాదు. కోలా కృష్ణమోహన్, గాలి జనార్దన్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, వందల కోట్ల నుంచి వేల కోట్ల వరకు ఎన్ని కుంభకోణాల పేర్లు తీసుకున్నా, ఎందరి పేర్లు వినిపించినా అంతా మీ వాళ్లే. మేం సగర్వంగా చెప్పుకోవడానికి కనీసం వంద కోట్ల కుంభకోణం చేసిన వాడైనా మా తెలంగాణ వాడు ఒక్కడన్నా ఉన్నా డా? ఈ విషయంలో మేం తలెత్తుకుని తిరగలేక పోతున్నాం అని తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అంటే మా వాళ్లు మాంసం తిన్నామని మెడలో బొక్కలు వేసుకొని తిరిగే వాళ్లు అంటు లింగారెడ్డి బదులిచ్చాడు. ఇద్దరిది ఒకే పార్టీ ప్రాంతాలు వేరు.


***
‘‘సిఎం ఇప్పుడే చెప్పాడు విభజన సాధ్యం కాదని, ’’
‘‘తల క్రిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగదు’’ మరో గొంతు సమాధానం.
‘‘ సమైక్యాంధ్రకు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు’’ ఒక గొంతులోని ఆశావాదం.
‘‘విభజన తరువాత జగన్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను ఏకం చేయాలని ఉద్యమిస్తాడు.’’
ఔనా? ఒకరి ఆశ్చర్యం
‘‘ఆర్టికల్ 3తో రాష్ట్రాలను విభజించినప్పుడు కలపడం కూడా సాధ్యమే’’ ఒకరి ఆశ
‘‘ మెమో తెలంగాణా కోసం 60 ఏళ్ళు ఉద్యమించం కదా ..  విడిపోయాక , విడిపోయిన రెండు రాష్ట్రాలను కలపాలని  మీరు 60ఏళ్లు ఉద్యమించండి’’మరొకరి అసహనం.
స్ర్తిపాత్ర లేని నాటకంగా ప్రదర్శించడాన్ని మేం ఒప్పుకోం అని ఒక మహిళా ఎమ్మెల్సీ మరణించినట్టు నటిస్తే, తోటి ఎమ్మెల్సీ అప్పుడే పోయావా అక్కా అంటూ ఏడుస్తూ మండలీ  నాటకాలాడగలదని చూపించారు.
పార్లమెంటు ఆవరణలో మరో నటుడు వేసిన వేషం వేయకుండా గంటకో వేషం మారుస్తూ బుడుబుక్కల వేషం, నారదుని వేషంతో తన నటనా దాహాన్ని తీర్చుకుంటున్నాడు. సినిమాల్లో అవకాశాలు లేని హిరోయిన్ లు బుల్లి తెరను నమ్ముకున్నప్పుడు , అవకాశాలు లేని క్యారక్టర్ ఆర్టిస్ట్ కమ్ యంపి రాజకీయాల్లో వేషాలు వేస్తే తప్పేముంది ..  

11, డిసెంబర్ 2013, బుధవారం

జ్ఞానం!@11-12-13

డోర్ బెల్ మ్రోగగానే వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న మిత్రున్ని చూసి సురేష్ బోలెడు సంతోషంగా ‘‘ హాయ్ నితీష్ ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇంత కాలం ఎక్కడికెళ్లావు, ఏమై పోయావు. ఎన్నికలు వచ్చినప్పుడే కనిపించే నాయకుడిగా ఐదేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడా రాక ’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే... సినిమాల్లో పోలీసు అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లా అన్నీ ప్రశ్నలేనా నన్ను సమాధానం చెప్పనిచ్చేదేమైనా ఉందా?’’అని నితీష్ ప్రశ్నల వర్షానికి అడ్డుకట్టవేశాడు.
‘‘ ఈ ఐదేళ్లు దేశమంతా తిరిగాను, బోలెడు సంపాదించాను. డబ్బును, జ్ఞానాన్ని, నా అదృష్టంలో మన మిత్రులందరినీ భాగస్వామ్యం చేయాలనే వచ్చాను. ముందుగా నీకే గోల్డెన్ చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని నితీష్ చెబుతుంటే ఏమిటో ఆ గోల్డెన్ చాన్స్ అన్నట్టుగా సురేష్ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘ ఈరోజు తేదీ ఎంతో తెలుసా?’’
‘‘ఎందుకు ?. గుర్తుపెట్టుకోవడానికి పెద్ద ఇదేమన్నా జీతం వచ్చే మొదటి రోజు కాదు కదా! జేబులు ఖాళీ అయిన రెండవ వారం.’’
‘‘ఇదేం లెక్కరా?’’
‘‘మొదటి తేదీ జీతం వస్తుంది. పాలవాడికి,పేపర్‌వాడికి, వాడికీ వీడికి ఇవ్వడానికి వారం పడుతుంది. రెండవ వారం ఖాళీ జేబులే కదా? అందుకని రెండో వారంపై పెద్దగా ఆసక్తి ఉండదు. గుర్తుండదు. మూడవ వారం దాటాక మాత్రం మళ్లీ మొదటి తేదీ కోసం గుర్తుంటుంది.’’
‘‘ఓహో మరీ మిడిల్‌క్లాస్ మైండ్‌రా నీది నీ జీతం, నీ జీవితమే కాదు కాస్త ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి’’
‘‘ఆధార్ కార్డ్ తెచ్చుకోవడానికి ఓ రోజు సెలవు దొరకడమే కష్టం దాంతో కార్డు గురించే ఆలోచించడం లేదు ఇక ప్రపంచం గురించి ఆలోచించడమా? నన్నొదిలేయ్.’’
‘‘సర్లే కానీ నీ జీవితం ఇలానే ఉండిపోవడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నాను నిన్ను జీవితంలో ఎలాగైనా పైకి తేవాలని అనుకుంటున్నాను. ఇంతకు మించిన మంచి ముహూర్తం మరో వందేళ్లయినా లేదు అందుకే ఈరోజు అందరినీ వదిలేసి ముందు నీ ఇంటికే వచ్చాను’’
‘‘ఏమిటో ఈ రోజు ప్రత్యేకత?’’
‘‘11వ తారీఖు, 12వ నెల, రెండువేల 13వ సంవత్సరం. అంటే వరుసగా, 11,12,13 నంబర్ వచ్చింది. ఈ రోజు నువ్వే కార్యక్రమం మొదలుపెట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది.
పిఎఫ్‌లో నీకు వచ్చే వడ్డీ ఏ మూలకు సరిపోదు. అందులో ఉన్న డబ్బంతా నేను చెప్పినట్టు జింగ్‌జాంగ్ మల్టీనేషనల్ కంపెనీలో ఈరోజు డిపాజిట్ చేశావంటే తొందర్లోనే మీ ఇంటిని జూబ్లీహిల్స్‌కు మార్చుకోక తప్పదు. ఈ ఫారం మీద సంతకం పెట్టు మిగిలిన వన్నీ నేను చూసుకుంటాను. లక్షా ఇంటు ఐదు, డివైడెడ్‌బై 14 ప్లస్ పదమూడు’’
‘‘అబ్బా చాల్లేరా! వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం మొత్తం చదివి వినిపిస్తావా?’’
‘‘అందుకేరా నీ జీవితం ఇలా అడవి కాచిన వెనె్నల అయిపోయింది. చూడూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. డబ్బు సంపాదించడానికి నాలెడ్జ్ అనే పవర్ నా వద్ద బోలెడు ఉంది నీక్కొంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకు’’
‘‘నీకో విషయం చెప్పనా చదువుకునే రోజుల్లో అంటే మార్కుల కోసం అందరితో పోటీ పడీ పడీ అలిసిపోయాను. అందుకే ఉద్యోగంలో చేరాక ఈ అంకెల జోలిక వెళ్లలేదు. ఉన్నదాంతో సంతృప్తి పడ్డాను’’ అంటూ సురేష్ వేదాంత దోరణిలో చెప్పడం నితీష్‌కు అస్సలు నచ్చలేదు.
చూడరా సురేష్ జ్ఞానం అనేది పదే పదే నీ ఇంటి తలుపు తట్టదు. అలా తట్టినప్పుడు తలుపు మూసేవాడు అజ్ఞాని తలుపులు బార్లా తెరిచి లోనికి ఆహ్వానించే వాడు జ్ఞాని.. నాకున్న జ్ఞానంతో చెబుతున్నాను నా మాట విను. ఈ జీతం రాళ్లతో ఎంత కాలం ఇలా బతుకుతావు ప్రపంచం మారిపోయింది నెలకు ఒక రూపాయి జీతంతో వందల కోట్లు సంపాదించే వాళ్లు, సచివాలయం ముఖం చూడకుండా వేల కోట్లు కూడబెట్టుకునే వాళ్లు ఏలుతున్న కాలమది’’ అని నితీష్ బతిమిలాడుతున్నట్టుగా చెప్పాడు.
వీరు మాట్లాడుతుండగానే పోలీసు జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి పోలీసులు బిల బిల మంటూ దిగారు. ఒక అధికారి వచ్చి మీలో నితీష్ ఎవరూ ? అని అడిగాడు.
ఏమో అనుకున్నాను వీడికి పలుకుబడి బాగానే ఉంది సురేష్ మనసులోనే అనుకుని నితీష్‌ను చూపించాడు.
పదరా! అంటూ పోలీసులు అతని కాలర్ పట్టుకున్నారు.
***
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
‘‘11-12-13 పేరుతో సినిమా తీస్తున్నాను, అందులో నువ్వే హీరోయిన్‌వు అంటూ నమ్మించాడండీ.. మనం ఈరోజు కలిస్తే 11-12-13 తేదీన పండంటి బిడ్డ పుడతాడని నమ్మించాడు. అతని మాటల చాతుర్యానికి పడిపోయాను. ఐతే నిజంగా అతను చెప్పినట్టు 11-12-13 తేదీనే పండంటి బిడ్డ పుట్టాడు. కానీ నితీషే కనిపించకుండా మాయమయ్యాడు’’అంటూ హీరోయిన్ పాత్రలో నటిద్దామని వచ్చి తల్లిపాత్రకు చేరుకున్న ఆవిడ భోరుమంది. అంతా కలిసి ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
***
ఇదీ విషయం అని చెప్పి పోలీసులు నితీష్‌ను జీపులో వేసుకొని వెళ్లారు. అప్పుడు సురేష్ యాదృచ్ఛికంగా వాచీ చూసుకుంటే సమయం 11 గంటల, 12 నిమిషాల 13 సెకండ్లు అవుతోంది.
ఈవారం మాట: చీపురు కట్ట చెత్తనే కాదు మహామహులను కూడా ఊడ్చి పారేస్తుంది.

10, డిసెంబర్ 2013, మంగళవారం

భలే.. ‘క్రేజీ’వాల్!

‘నీ ఇంటికొస్తాను. నట్టింటి కొస్తాను. డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్  చేయమన్నా సరే.. ప్లేస్ నువ్వు చెప్పినా
సరే, నన్ను చెప్పమన్నా సరే. ఫేస్‌టూ ఫేస్.. తేల్చుకుందాం’ అంటూ ఆరడుగుల విలన్‌ను నాలుగడుగుల హీరో
ఛాలెంజ్ చేసేస్తుంటాడు  -తెలుగు సినిమాల్లో. పరమ రొటీన్  డైలాగులైనా సరే, వీటితో -స్క్రీన్ మీద చప్పట్లు కొట్టించుకున్న స్టా  ర్లు -రాజకీయాల్లోకి అడుగు పెట్టి చతికిలపడ్డారు.

 ‘రాజకీయాలకు వస్తా.మీ సెగ్మెంట్‌లో  అడుగు పెడతా. అక్కడి నుంచే పోటీ
చేస్తా. డేటు, టైమూ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసింది కనుక -ఫేస్ టు ఫేస్. మిమ్మల్ని ఓడిస్తా’ అంటూ రాజకీయాలకు కొత్త అయిన  కుర్రాడు -మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీని శాశించిన షీలాతో సవాల్ చేశాడు. సవాల్ వరకూ అయితే, ఒకరోజు వార్తే.
పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ, సవాల్‌ని ఆచరణలో పెట్టాడు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సెగ్మెంట్ నుంచే పోటీ చేశాడు. ఆమె డీలాపడేలా చేశాడు. కొద్దిగా రాజీపడితే ముఖ్యమంత్రి పదవి చేపట్టేంత ఘనతే సాధించాడు. అయినా, పూర్తి బలాన్ని
ప్రజలు ఇవ్వలేదు కనుక -విపక్షంలోనే కూర్చుంటానని ప్రకటించాడు. ఈ సీజన్ పొలిటికల్ హీరో సామాన్య కుర్రాడే కావచ్చు. కానీ, అతనొక ‘క్రేజీ’వాల్. అతనే అరవింద్ కేజ్రీవాల్. 
 **
ప్రస్తుతం దేశ రాజకీయాలకు  ఆశాదీపంగా కనిపిస్తున్నాడు కేజ్రీవాల్. సరిగ్గా 13 నెలల క్రితం ఆమ్
ఆద్మీ పేరిట పార్టీ పెట్టాడు. అవినీతికి వ్యతిరేకంగా  జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే
పోరాడుతున్నప్పుడే, కెజ్రీవాల్ గురించి దేశానికి తెలిసింది. రాజకీయాలను అసహ్యించుకోవడం, రాజకీయ నేతలను
తిట్టడం కాదు. రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడున్న బురదను కడిగేయాలనే ధ్యేయాన్ని మనసునిండా నింపుకున్న నాలుగు
పదుల వయసు కుర్రాడతను. ఒకప్పుడు -లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ రాజకీయ అడుగులేసినపుడూ-యువత ఇదేవిధంగా ఆశలు పెట్టుకుంది. మీవెనుక మేం ఉంటామంటూ అడుగులేసింది. ఆయన మాత్రం సురక్షిత నియోజక
వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆయనొక్కరే గెలిచారు. దాంతో కొత్త సమాజ ఆవిష్కరణపై ఆశలు పెంచుకుని వెనుక నడిచిన
యువత మాత్రం -ఆ దెబ్బతో ఒడిపోయింది. కానీ, చాలాకాలానికి -కెజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని నవతరం యువతకు
ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో పూర్తి మెజారిటీ ఏ పార్టీకి దక్కని సమయంలో 28 సీట్లను
గెలుచుకున్న ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిస్తానని ఆఫరిచ్చింది. సరే అని ఒక్క మాట అంటే కెజ్రీవాల్ అనే కుర్రాడు
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి ఉండేవాడు. కానీ, అతను పీఠాన్ని కోరుకోలేదు. ప్రతిపక్షానికే పరిమితమవుతామ
ని ప్రకటించాడు. కాంగ్రెస్, బిజెపి రెండూ అవినీతి పార్టీలేనంటూ విమర్శించి, రాజకీయాల్లోకి వచ్చి ప్రచారంలో అదేమాట
చెప్పిన కెజ్రీవాల్ తాము తలపండిన పదవీ కాంక్షాపరులైన నేతలం కాదని, ఈ దేశానికి ఏమైనా చేయాలని తపించే యువకులమనినిరూపించాడు. - ‘ప్రజలు మమ్ముల్ని ప్రతిపక్షంలో ఉండమని తీర్పు చెప్పారు. సమర్థంగా ఆ బాధ్యత
నిర్వహిస్తాం’ అని చెప్పుకున్నాడు. 18నుంచి 25ఏళ్ల లోపున్న యువ ఓటర్లు దేశంలో సగటున 35శాతం. వీళ్లు ఎటు మొగ్గితే
వారిదే అధికారం. రాజకీయాలను, నాయకులను తిడుతూ ఇంట్లో కూర్చోవడం కాదు, క్యూలో నిలబడి ఓటు వేస్తే ఫలితం ఎలా
ఉంటుందో ఢిల్లీ యువత చూపించింది. ఆమ్ఆద్మీ అధ్యక్షుడు కెజ్రీవాల్ మొదలుకొని ఆ పార్టీ అభ్యర్థులు, ప్రచార
బాధ్యత భుజాన వేసుకున్న వారు, చివరకు ఓటు వేసిన వారూ యువతే. అంతే తమ కోసం తామే ఒక పార్టీ
ఏర్పాటు చేసుకుని తామే ఓటు వేసుకుని తామే గెలిపించుకున్నారన్న మాట! నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఆదివారం ప్రకటిస్తే, నాలుగు చోట్ల బిజెపినే అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో బిజెపి మొదటి స్థానంలో నిలిస్తే
అధికారంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. అయితే మీడియాకానీ, ప్రజల్లో చర్చలుకానీ ఈ
ఫలితాలకన్నా ఢిల్లీలో 28 స్థానాలతో రెండో స్థానంలో నిలిచినా  కెజ్రీవాల్ గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించే ఎక్కువగా
మాట్లాడుకుంటోంది. కచ్చితంగా ఈ ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుంది. ఢిల్లీ అనేది దేశ రాజధాని. రాజధాని నగరంలో
ఉండే రాజకీయ వాతావరణం, గ్రామీణ ప్రాంతాల్లోని వాతావరణం వేరు. కానీ ప్రజల ఆకాంక్షలు మాత్రం ఒకటే. మంచి
రాజకీయాలు ఉండాలని, పాలన బాగుండాలని, తమను పాలించే నాయకుడు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు.
గ్రామీణ భారత దేశంలో సైతంఇప్పటికిప్పుడు గెలవక పోవచ్చు . కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
ఎన్నికలకు ముందే ఆ పార్టీ ప్రభావం చూపింది. ఆమ్ ఆద్మీ రంగంలోకి వచ్చిన తరువాతే బిజెపి తన ముఖ్యమంత్రి
అభ్యర్థిని మార్చింది. అధికారంలోకి వస్తేనే మార్పు తీసుకొస్తారని కాదు. ఎన్నికల్లో పోటీ చేయకముందే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పక్షం ముఖ్యమంత్రిని అభ్యర్థిని మార్చగలగడం అంటే మార్పు వచ్చినట్టే కదా! పాతతరం రాజకీయాలను,
విమర్శలు, తిట్లు, అధికారపక్షం ఏంచేసినా విమర్శించడమే ప్రతిపక్షం బాధ్యతని, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు
చేస్తాం అనుకునే అధికార పక్షం అహంకారానికి ఆమ్ ఆద్మీ ఒక గుణపాఠం లాంటిది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ఎనిమిది
నెలలకే అధికారంలోకి వచ్చారు. ఒక నటునిగా తనకున్న గ్లామర్ ద్వారా ఆయనిది సాధించగలిగారు. అస్సాంలో
విద్యార్థులు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. అస్సాంలో జరిగిన ఉద్యమం ద్వారా వారిలా
చేయగలిగారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అవినీతిరహిత రాజకీయాల కోసం ఉద్యమించి, ఆ ఉద్యమం ద్వారానే
రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమ నేత అన్నాహజారే వ్యతిరేకించినా జనాన్ని మెప్పించి 28 స్థానాలు గెలిచాడు. కెజ్రీవాల్ విఫలమైతే దేశ యువత కథ మరోలా ఉంటుంది. వారి ఆశలు బలవుతాయి. ప్రతిపక్ష నేతగా ఆయన విజయం సాధిస్తే ఆ ప్రభావం దేశ రాజకీయాల్లో ఏదోక మేరకు తప్పకుండా ప్రభావం చూపుతుంది. గెలవడం కన్నాగెలుపును
నిలబెట్టుకోవడం కెజ్రీవాల్‌కు కత్తిమీద సాములాంటిది. ఈ పరీక్షలో విజయం సాధిస్తాడని
అనుకుందాం. సాధించాలని  కోరుకుందాం.
================

7, డిసెంబర్ 2013, శనివారం

ఎవరి వల్ల తెలంగాణ?

తెలంగాణ ఏర్పాటుకు గురువారం కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక దశ పూర్తయింది.
పది జిల్లాల తెలంగాణకు అధికారంలో ఉన్న యుపిఏ, ప్రధాన ప్రతిపక్షం అయిన బిజెపి మద్దతు ప్రకటించిన తరువాత ఇక మిగిలిన తతంగం నామ మాత్రమే. ఏదో ఒక చోట విభజన నిలిచిపోతుందని భావించడం అత్యాశే అవుతుంది. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించుకున్నప్పుడు సింపుల్ మెజారిటీతో పాస్ అయ్యే బిల్లు కోసం ఏమవుతుందో అనే సందేహమే ఉండాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఏ మాత్రం లేదు, అయితే అసెంబ్లీ కేవలం అభిప్రాయం చెప్పడానికే పరిమితం కానీ నిర్ణయంపై ప్రభావం చూపలేదు. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటుకు గండాలన్నీ గడిచిపోయినట్టే!


మా వల్లే తెలంగాణ ఇప్పుడీ మాట ప్రతి పార్టీ నుంచి వినిపిస్తోంది. నిజమే అన్ని పార్టీలకు ఆ మాట చెప్పుకునే అవకాశం అంతో ఇంతో ఉంది. బిజెపి వల్లనే పది జిల్లాల తెలంగాణ ఏర్పడుతోందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బాబు లేఖ ఇవ్వడం వల్లనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని టిడిపి నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది నిలుపుకొంది, మా వల్లే తెలంగాణ అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇక తెలంగాణకు పర్యాయ పదంగా మారిన టిఆర్‌ఎస్ ఎలాగూ తమ వల్లే తెలంగాణ అని చెప్పుకుంటుంది. వీళ్లే కాదు మా వల్లే తెలంగాణ అని ఇప్పుడు పైకి చెప్పుకోలేని వైకాపాకు సైతం ఈ మాట చెప్పుకునే అవకాశం అంతో ఇంతో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని వైకాపా ఇచ్చిన లేఖ సైతం అంతో ఇంతో ప్రభావం చూపింది. మా వల్లే తెలంగాణ అని ఇంత మంది క్లైమ్ చేసుకుంటున్నారు సరే మరి నిజంగా ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది?


తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు కెసిఆర్ వల్లే తెలంగాణ అని గట్టిగా వాదిస్తారు. ఈ వాదనలో వాస్తవం కూడా ఉంది. ఒక్కరి వల్ల కాదు నిజానికి అందరి వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొంటూ గత కొంత కాలంగా సీమాంధ్ర నాయకులు, మీడియా తీసుకు వస్తున్న ఒత్తిడిని చూసి తెలంగాణ వాదులు సైతం తెలంగాణ రాదేమో అనే అనుమానంలో పడిపోయారు. ఇంతటి వత్తిడిని సైతం తట్టుకుని తెలంగాణ ఏర్పాటుకు ముందడుగు వేశారంటే కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు చేయాలని ధృడమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వల్లనే ఇది సాధ్యం అయింది. 2014 ఎన్నికల తరువాత బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చేదేమో అది వేరే విషయం కానీ 2014 ఎన్నికలకు  ముందు తెలంగాణ ఏర్పడుతోందంటే సోనియాగాంధీ ధృడంగా తీసుకున్న నిర్ణయమే దానికి కారణం.


టిఆర్‌ఎస్ ఒంటి చేత్తో తెలంగాణ కోసం ఉద్యమించి అలసిపోతున్న సమయంలో బిజెపి ఆ ఉద్యమానికి ఆక్సిజన్‌లా నిలిచింది. 1997లో చేసిన ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం నుంచి పక్కకు పోయినా, ఎనిమిదేళ్ల తరువాత బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణ యం తీసుకుని ఉద్యమానికి ఊపిరి పోసిం ది. 2004లో కెసిఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో చేరారు. అయతే బిజెపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత టిఆర్‌ఎస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఆ సమయంలో అండగా నిలిచింది బిజెపినే, చివరకు ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిందీ బిజెపినే. బిజెపి మద్దతు లేకపోతే ఇంత సంక్లిష్టమైన అంశానికి పరిష్కారం లభించడం అంత సులభం కాదు.


కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ అన్ని పార్టీలు తెలంగాణ నినాదం అందుకోవడం, వైకాపా సైతం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం నిజమే. తెలంగాణలో ఉనికిలో ఉన్న అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నాయి. ఇది కాదనలేని నిజం. అయితే ఈ అన్ని పార్టీలు ఈ మాట అనక తప్పని పరిస్థితి తీసుకు వచ్చింది మాత్రం కెసిఆర్! అందుకే తెలంగాణ ఏర్పాటులో మీడియా, రాజకీయ పక్షాలు ఎవరికి క్రెడిట్ ఇచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం ముమ్మాటికీ కెసిఆర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని నమ్ముతారు. ఇది నిజం కూడా.


కెసిఆర్‌కు మంత్రిపదవి రాకపోవడం వల్ల తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించాడని టిడిపి విమర్శిస్తోంది. దక్షిణాఫ్రికాలో గాంధీ మహాత్ముడిని రైలు నుంచి బయటకు గెంటివేయకపోతే అసలు స్వాతంత్య్ర ఉద్యమమే జరగకపోయేదని చెప్పడం ఎలా ఉంటుందో ఇదీ అలానే ఉంటుందని ఈ విమర్శకు ఫేస్‌బుక్ జనమే సమాధానం చెబుతున్నారు. 2001లో కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే, 97లోనే బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసింది. 99 ప్రాం తంలో వైఎస్‌ఆర్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 42 మంది తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు కోరుతూ సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. 95 ప్రాంతంలోనే తెలంగాణ జనసభ వరంగల్‌లో లక్షలాది మందితో తెలంగాణ కోసం సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ పాటలు పాడిన బెల్లి లలితను ఆ కాలంలోనే హత్య చేశారు. అంత కన్నా చాలా ముందుగానే ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం నినదించే లక్షలాది గొంతులు సిద్ధంగా ఉన్న వాతావరణం అది. ఆ గొంతులకు సరైన నాయకత్వం లేదు. ఆ సమయంలో తెలంగాణ గొంతులకు కెసిఆర్  నాయకుడిగా మారారు కానీ కేవలం కెసిఆర్‌కు మంత్రిపదవి దక్కలేదని తెలంగాణ అడుగుతున్నారు అనేది అవగాహన లోపమే అవుతుంది.


69లో జరిగిన ఉద్యమాన్ని దానికి వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకత్వం పన్నిన వ్యూహాలను నిశితంగా అధ్యయనం చేసిన కెసిఆర్ తొలి దశ ఉద్యమం ఎక్కడ విఫలమైందో వాటినే గుణపాఠంగా తీసుకుని రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అని నమ్మారు. అదే కోణంలో పార్టీని నడిపించి విజయం సాధించారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో దాదాపు ఆరునెలల పాటు కెసిఆర్ మేధోమథనం జరిపారు. తెలంగాణ కాంక్షతో రగిలిపోయే వారంతా ఆయనతో గంటల పాటు ముచ్చట్లు పెట్టారు. వారి చర్చల్లో వినిపించే మొదటి మాట ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు, కానీ తెలంగాణ సాధ్యం కాదు అనేది మొదటి మాట! ‘‘మా చిన్నప్పటి స్నేహితులు తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం కానీ అట్లెట్లొస్తది తెలంగాణ అనేవాళ్లు, అట్లెట్ల తెలంగాణ రాదు అని నేను సమాధానం చెప్పేవాడ్ని’’ అంటూ డిసెంబర్ 9 ప్రకటన తరువాత ఒక సభలో కెసిఆర్ చెప్పుకొచ్చారు. సామాన్యులకే కాదు చివరకు ఉద్యమ కారులకు సైతం తెలంగాణ రాదుఅనే భావన బలంగా ఉండేది. రాజకీయాలతో తెలంగాణ రాదు పోరాటాలతోనే తెలంగాణ అంటూ గద్దర్ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే మీడియా ఆయనకు భారీ ప్రచారం కల్పించింది. తెలంగాణ ఏర్పడేంత వరకు ఇంట్లో అడుగుపెట్టను అని ప్రకటించి ఇంటి నుంచి బయటకు వచ్చిన గద్దర్ కనీసం ఏడాది కూడా ఉద్యమాన్ని నడపలేకపోయారు. ఎన్నో ఉద్యమాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్న గద్దర్ సైతం కొద్ది కాలంలోనే వెనక్కి వెళ్లారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సంకీర్ణ రాజకీయాల శకం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైనదని, వంద అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లుగెలుచుకుంటే తెలంగాణ మన వద్దకే వస్తుందని కెసిఆర్ నమ్మారు. ఆ దిశగా పార్టీ పరిస్థితి సైతం 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత క్రమంగా మెరుగవుతూ వచ్చింది. చివరకు ప్రధానపక్షాలైన కాంగ్రెస్,టిడిపిలకు తెలంగాణలో డిపాజిట్లుదక్కని పరిస్థితి ఏర్పడింది.


తెలంగాణ వాదానికి లభిస్తున్న మద్దతు చూసి అనేక తెలంగాణ పార్టీలు పుట్టుకొచ్చాయి, టిఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లి పార్టీలు పెట్టిన వారూ ఉన్నారు. కానీ వీరిని సీమాంధ్ర నాయకులు, మీడియా పట్టించుకుంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. టిఆర్‌ఎస్ జలదృశ్యంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించిన కొద్దిరోజులకే అది ప్రభుత్వ స్థలం అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో రాత్రికి రాత్రి టిఆర్‌ఎస్ కార్యాలయాన్ని బయట పడేశారు. కొందరు ఆగ్రహంతో ఊగిపోతే జిల్లాలో ఉన్నకెసిఆర్ ఎవరూ ఏమీఅనవద్దని, పార్టీ సామగ్రి మొత్తం అద్దె భవనంలోకి మార్చమని ఆదేశించారు. ఉద్యమంలో హింస ప్రవేశిస్తే ఎక్కువ రోజులు ఉండదని మొదటి నుంచి చెబుతూ వచ్చిన కెసిఆర్ అదే దిశగా 13 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమానికి ఒక మచ్చ లాంటిది ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంసం. ఆనాడు జరిగిన మిలియన్ మార్చ్ ఇతర ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. హింసకు అవకాశం లేకుండా ఉద్యమం సాగించడమే కెసిఆర్ సాధించిన తొలి విజయం. ఈ వ్యూహమే తెలంగాణ సాధనకు దోహదం చేసింది. ఇక టిడిపిలాంటి ప్రత్యర్థులు, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చూసిన వారు కెసిఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దాని వల్ల కెసిఆర్ పట్ల సీమాంధ్రుల్లో వ్యతిరేకత ఏర్పడిందేమో కానీ తెలంగాణ వారిలో తెలంగాణ కాంక్ష మరింతగా పెరిగేందుకు ఉపయోగపడింది. కనీసం నన్ను లక్ష తిట్లు తిట్టారు. నేనేమీ పట్టించుకోలేదు, పట్టు విడవకుండా ముందుకెళ్లాను అని ఒక సభలో కెసిఆర్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తిపై ఇంత తీవ్ర స్థాయిలో దూషణలకు దిగడం బహుశా కెసిఆర్ విషయంలోనే జరిగిందేమో! గత 12 ఏళ్ళ  నుంచి తెలంగాణ ఉనికిని పక్కన పెట్టలేని పరిస్థితి కెసిఆర్ కల్పించారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదం వాడేందుకు వీలులేదని చెప్పిన పరిస్థితి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటు సాకారం కావడానికి పునాది రాయిగా నిలిచింది కచ్చితంగా కెసిఆరే. పరిస్థితులు,మిగిలిన పార్టీలు తమ తమ పాత్రలను పోషించాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు కెసిఆర్.

4, డిసెంబర్ 2013, బుధవారం

ఆకలి రాజ్యం

జీవితంలో మరిచిపోలేని రుచికరమైన విందు గురించి ప్రశ్నిస్తే, బుర్ర గోక్కుంటారేమో కానీ సమాధానం ఠక్కున చెప్పలేరు. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు పాండిబజార్‌లోనో మద్రాస్ పార్కుల్లో కడుపు నకనకలాడుతుంటే కుళాయి నీళ్లు తాగి ఆకలితో పడుకున్న రోజుల గురించి చెబుతారేమో కానీ తిన్న ఫుడ్ గురించి చెప్పమంటే ముఖం తేలేస్తారు. ఎంత పసందైన విందైనా నాలుక మీద ఆ రుచి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆకలి రుచి జీవితమంతా ఉంటుంది. అష్టైశ్వర్యాలతో తులతూగే సంపద వచ్చి పడినా ఆకలి అనుభవం మాత్రం మనుషులను వదలదు. అది ఎలాంటి ఆకలైనా కావచ్చు మనిషిని కుదురుగా ఉండనివ్వదు. ఆ ఆకలిని తీర్చుకోవడానికి దైనికైనా తెగించేట్టు చేస్తుంది.


మూడు దశాబ్దాల క్రితం మహానగరంలో సైతం మాదా కబళం అంటూ జోలే పట్టుకుని ఆడుక్కుని ఆకలి తీర్చుకునే వారుండేవారు. ఇప్పుడు వాళ్లు కనిపించడం లేదు కానీ అమ్మా, బాబూ ఒక్క సారి చాన్సివ్వండి.. పదవి లేక నకనకలాడిపోతున్నాను అని పదవీ ఆకలితో అలమటించే వాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నారు. వాళ్ళెంత ఆకలితో ఉన్నారో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రచారం చేసుకుంటారు. గల్లీ లీడర్ బ్యానర్లతో లోకల్ పదవి ఆకలిని ప్రదర్శిస్తే భారీ నాయకులు ఏకంగా సొంత మీడియాలు, మద్దతు మీడియాలను తయారు చేసుకుని ఆకలిని తీర్చుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తారు.


ఆకలికి భయంకరమైన ప్రతీకార లక్షణం ఉంది. మహాభారత కథకు మూలం ఆకలి. ఇది నిజంగా మహాభారతంలో ఉన్న నిజం. శకుని కుటుంబీకులందరినీ కారాగారంలో బంధించి ఒక్కో వ్యక్తికి ఒక్క అన్నం మెతుకు మాత్రమే ఇస్తారు. ఒక్క మెతుకు ఎవరి ఆకలి తీర్చదని గ్రహించిన అందరూ ఆకలితోనే మరణించాలని, అందరి ఒక్కో మెతుకును శకునికి పెట్టి అతని ఆకలి తీర్చి కురు వంశంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. శకుని ఒక్కడే అందరి మెతుకులు తిని ప్రాణాలను రక్షించుకుని బంధువుగా కౌరవుల పంచన చేరుతాడు. తిన్నింటి వాసాలు లెక్కించవద్దని అంటారు. తింటేనే అంత కృతజ్ఞత చూపాలని అన్నప్పుడు తిండి పెట్టకుండా ఆకలితో మాడ్చివేస్తే మరెంత ప్రతీకార జ్వాలలో రగిలిపోవాలి. శకుని చేసింది అదే. శత్రువుగా వారిని తానొక్కడినీ ఏమీ చేయలేనని గ్రహించి ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ దుర్యోధనుడికి చేరువయి మహాభారత యుద్ధానికి, తద్వారా కౌరవుల నిర్మూలనలో విజయం సాధిస్తాడు. ఆకలి ఎంతటి ప్రతీకారానికి ప్రేరేపిస్తుందో ప్ర పంచానికి చాటి చెప్పిన వాడు శకుని. దుర్యోధనుడిని పాండవులపై విజయం సాధించాలనే ఆకలి నిరంతరం దహించి వేసేది.


పాండవులది ఆయుధాల సమీకరణ ఆకలి. ప్రతి పాత్రకు ఒక్కో రకమైన ఆకలి ఉంటుంది. ఎవడి ఆకలి వాడికి ముఖ్యం. కొందరు భోజన ప్రియులైతే, మరి కొందరు తాము తినడం కన్నా తినిపించడంలో ఎక్కువ ఆకలిగా ఉంటారు. మన్మథుడి ఆకలి ఇలాంటిదే. తన కోరికేదో తాను తీర్చుకోకుండా ప్రతి ఒక్కరికి శృంగార ఆకలిలోలో ముంచెత్తడానికి చెరుకు బాణాలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అదే అతని కొం ప ముంచింది. అల్లా టప్పా వాళ్ల మీద ప్రతాపం చూపితే సరే.. చివరకు శివుడిపై కూడా ప్రభావం చూపడంతో కాల్చిపారేశాడాయన. శక్తికి మిం చిన ఆకలి శరీరానికి మంచిది కాదన్న మాట! ఇంద్రుడి శృంగార ఆకలి అతన్ని నిండా ముంచింది.


హిట్లర్‌కు కూడా ఇలానే తనకు మాలిన ఆకలి ఉండేది. మొత్తం ప్రపంచాన్ని మింగేద్దామనే ఆకలితో ప్రపంచం మీద పడ్డాడు. సాగినన్నిరోజులు సాగుతుంది. తన కన్నా పెద్ద బకాసురుడిని మింగాలనుకుంటే ఏమవుతుంది. అదే జరిగింది. అమెరికా జోలికెళ్లడంతో అదే జరిగింది. చివరకు తన తూటాతో తానే పేల్చుకుని చావాల్సి వచ్చింది.
కడుపు నిండిన వాడికి హైదరాబాద్ బిర్యానీ కూడా చేదనిపించవచ్చు, కానీ కడుపు కాలే వాడికి ఇరానీ హోటల్‌లో పప్పన్నం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. 1980 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో కూడా ఆకలి చావులుండేవి. గంజికేంద్రాలను నడిపేవారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పేదల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది కానీ అదృష్ట వశాత్తు తిండికి సంబంధించిన ఆకలి చావుల సమస్యలేదు.


మాదా కబళం అనే వారి కన్నా దీనంగా బాబూ ఒక పదవి ధర్మం చేయండి బాబూ అనే గోల ఎక్కువైంది. తొమ్మిదేళ్ల పాటు తిండికి అలవాటు పడ్డాను, పదేళ్ల నుంచి తిండి లేక అలమటిస్తున్నాను, బాబూ ఒక్క పదవి ధర్మం చేయండి బాబూ అని ఆయన ఎంత మొత్తుకున్నా కనికరించే వారు కనిపించడం లేదు. తొమ్మిదేళ్లు బాగా తిన్నవారికి ఆకలేంటి, ఎప్పు డూ వాళ్లే తినాలో మరొకరు తినవద్దా అని జనం అనుకొంటారనే విషయం బాగా తెలుసు కాబట్టే మరొకాయన బాబూ ఆకలిమీదున్నాను ఒక్క చాన్సివ్వండి అంటున్నాడు.


అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు వచ్చింది సరిపోలేదా? అంటే మొత్తం ప్రపంచాన్ని నిర్మించే కాంట్రాక్టు నాకు దక్కినా ఈ కాంట్రాక్టుల ఆకలి తీరదని ఓ కాంట్రాక్టర్ చమత్కరించారు.
అమ్మా ఒక్క ముద్ద అంటే ఏ తల్లయినా కరిగిపోతుంది. అందుకే మహామహానాయకులే ఈ మంత్రాన్ని నమ్ముకున్నారు. బిజెపికి ఒక్క చాన్సివ్వండి అని వేడుకుంటే కరుణించారు. మళ్లీ పదేళ్ల తరువాత ఇప్పుడు అదే బిజెపి అదే నినాదాన్ని కాస్త మార్చి బిసి ప్రధానమంత్రికి ఒక్క చాన్సివ్వండి అంటున్నారు.


తిండి, ధనం, అధికారం, శృంగారం ఏ ఆకలైనా కావచ్చు అతి సర్వత్రా వర్జయత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అధికారం సంపాదిద్దాం, డబ్బు కూడబెట్టుకుందాం, వారసులకు అధికారం అప్పగిద్దాం, వంశ పారంపర్యంగా మనమే పాలిద్దాం అనుకునే అధికార ఆకలి కన్నా ప్రజలకు మంచి చేద్దామనే మంచి ఆకలితో నాయకులు దహించుకు పోయే రోజులు ఎప్పుడొస్తాయో!అసలీ విశ్వమే ఆకలితో దహించుకుపోతోంది. ఒక్కోక్కరిది ఒక్కో రకమైన ఆకలి.

29, నవంబర్ 2013, శుక్రవారం

ఆశలు రేకెత్తిస్తున్న ఆమ్ ఆద్మీ కేజ్రివాల్.. విఫలమైన లోక్ సత్తా జెపి


ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల ఫలితాల పట్ల అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుండడమే దీనికి ప్రధాన కారణం. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన సమయంలో కెజ్రీవాల్ తెరపైకి వచ్చారు. అంతకు ముందు వివిధ ఉద్యమాల్లో ఆయన ఉన్నా జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలోనే ఎక్కువగా యువత దృష్టిని అకట్టుకున్నారు.
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఐతే కాంగ్రెస్ లేదంటే బిజెపి, ఒకసారి నువ్వు మరోసారి నేను అన్నట్టుగా ఎన్నికలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఢిల్లీ ఎన్నికలను మూడు ముక్కలాటగా మార్చేసింది. వివిధ సర్వేల్లో దాదాపుగా ఈ మూడు పార్టీలకు సమానంగా సీట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ అయితే కింగ్ మేకర్ లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది వయసు పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న కెజ్రీవాల్ యువకుడే. ఒక ఉద్యోగి. ఢిల్లీ ప్రయోగం విజయవంతం అయితే ఆ ప్రభావం కచ్చితంగా దేశ వ్యాప్తంగా కనీసం మహానగరాల్లోనైనా కనిపిస్తుంది. ముఖ్యంగా మహానగరాల్లో కొత్త తరం రాజకీయాల్లోకి రావచ్చు.
ఒకప్పుడు మన రాష్ట్రంలో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై యువతలో ఇలాంటి అభిప్రాయమే ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎఎస్ అధికారిగా కీలక స్థానంలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ బాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే లోక్‌సత్తా పేరుతో తొలుత ఒక సంస్థను స్థాపించి పాలనా సంస్కరణలపై పలు సదస్సులు నిర్వహించి తరువాత 2006లో రాజకీయ పార్టీగా మార్చారు. విద్యావంతులైన యువత, మధ్యతరగతి ముఖ్యంగా భాగ్యనగరంలో జయప్రకాశ్‌పై ఇలాంటి ఆశలే అప్పుడు కనిపించాయి. 
చంద్రబాబుకు ఏ మీడియా, ఏ సామాజిక వర్గం మద్దతు ఇచ్చిందో, జెపికి అదే వర్గం మద్దతు పలికింది. చంద్రబాబు రాజకీయాల్లో విఫలం అయితే బాబుకు ప్రత్యామ్నాయంగా జెపిని ఆ వర్గం మీడియా ప్రోత్సహిస్తోంది అనే ప్రచారం లోక్‌సత్తా పార్టీ ఏర్పడినప్పుడు బలంగా జరిగింది. ఈ ప్రచారంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోక్‌సత్తాకు మాత్రం ఆ వర్గం నుంచి బ్రహ్మాండమైన ప్రచారం, మద్దతు  లభించింది. అదే ఢిల్లీలో చూస్తే ఆమ్ ఆద్మీకి ఏదో ఒక వర్గం మీడియా కాకుండా మొత్తం మీడియా నుంచి మద్దతు లభిస్తోంది. లోక్‌సత్తాకు ఆ వర్గం ప్రచారం చివరకు వారికే నష్టం కలిగించింది. ఐటి ఉద్యోగులు, విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల మద్దతు సాధారణంగా టిడిపికి ఉంటుంది. టిడిపికి చెందిన వీరిలో కొంత మంది 2009లో హైదరాబాద్‌లో లోక్‌సత్తావైపు మొగ్గు చూపారు. దాంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగింది. స్వల్ప మెజారిటీతో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి హైదరాబాద్‌లోని సీట్లు దోహదం చేశాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత లోక్ సత్తా కలిగించిన నష్టానికి  టిడిపి కంగుతిని, లోక్‌సత్తాపై దాడి మొదలు పెట్టింది. జెపి సోనియా ఏజెంట్ అని అందుకే ఆమె జెపికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారని టిడిపి ఆరోపించింది .. బాబు, యనమలతో పాటు పలువురు టిడిపి నేతలు  జెపికి వచ్చే నిధుల గురంచి అనేక ఆరోపణలు చేశారు .. అదే విధంగా బు పాలన గురించి జెపి ఆరోపణలు చేశారు ... మరి జెపి తాను  చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఒప్పుకున్నారో, లేక జెపి పై తాము చేసిన ఆరోపణలు నిజం కాదని టిడిపి ఒప్పుకుందో? అంతర్గతంగా ఏం జరిగిందో కాని ఇప్పుడు ఆ రెండు పార్టీల వాయిస్ ఒకటే అయింది . దత్తపుత్రుడు , అద్దె పుత్రుడు , తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ , తెలుగు జాతిని చిల్చడం వంటి డైలాగులు రెండు పార్టీలు కామన్ గా  వాడేస్తున్నాయి 

చంద్రబాబుతో పాటు కింద స్థాయి నాయకుల వరకు తనపై విమర్శల దాడి మొదలు పెట్టడంతో జెపి ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు  ఇప్పుడు విభజన అంశం తో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్  టిడిపికి చేరువయ్యారు.

తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం ప్రకటించగానే స్వాగతం పలుకుతూ తన అభిప్రాయం వెల్లడించిన జయప్రకాష్ నారాయణ్ ఆ తరువాత ప్లేటు ఫిరాయించారు. సమన్యాయం జరిగేంత వరకు విభజనపై ముందడుగు వేయవద్దని బాబు చెప్పినట్టుగానే జెపి చెబుతున్నారు. విభజన, సమైక్యంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు అని ఇంత కాలం ఇతర పార్టీలను విమర్శిస్తూ వచ్చిన జెపి ఇప్పుడు వాటిమార్గం లోనే నడవడం  విశేషం.
లోక్‌సత్తా ఆవిర్భవించి ఏడేళ్లయిన సందర్భంగా జెపి మాట్లాడుతూ కూకట్‌పల్లిలో ప్రజలు లోక్‌సత్తాకు ఎందుకు ఓట్లు వేశారు, మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. గెలిచిన చోట తమ చరిష్మా పని చేసిందని, ఓడిన చోట అభ్యర్థుల లోపం అని ఏ పార్టీ నాయకుడైనా చెప్పే మాటనే జెపి చెప్పారు.
కుకట్ పల్లి నియోజక వర్గాన్ని జెపి ఎంపిక చేసుకోవడం లోనే సాంప్రదాయ రాజకీయాలు ముడిపడి ఉన్నయి.  కూకట్‌పల్లిలో  ఆయన గెలుపులో సైతం సాంప్రదాయ రాజకీయాలు పని చేశాయి. 2009లో టిఆర్‌ఎస్, టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూకట్‌పల్లి నియోజక వర్గంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి స్థిరపడిన వారే ఎక్కువ. వీరిలో టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. అయితే ఈ నియోజక వర్గంలో టిడిపి పోటీ చేయకుండా టిఆర్‌ఎస్‌కు కేటాయించారు. సాంప్రదాయంగా టిడిపికి ఓటు వేసే ఈ వర్గం మొత్తం జెపికి అండగా నిలిచింది.
ఆ తరువాత మున్సిపల్ కార్పోరేషన్  వార్డులు సైతం లోక్‌సత్తా గెలుచుకోలేక పోయింది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడు  రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. లోక్‌సత్తా వల్ల ఒకటి రెండు శాతం ఓట్లు కోల్పోవడం కన్నా ఒక సీటు ఇవ్వడం లాభసాటి బేరం అని టిడిపికి తెలుసు.
ఐఎఎస్ అధికారిగా ఎంతో పాలనానుభవం సైతం ఉన్న జెపి లోక్‌సత్తా ప్రయోగం రాష్ట్రంలో విఫలం అయినట్టే. అదే ఢిల్లీలో కెజ్రీవాల్ మాత్రం మధ్యతరగతిలో, యువతలో ఆశలు రేకెత్తిస్తున్నారు. కెజ్రీవాల్ అధికారంలోకి రాకపోవచ్చు కానీ కచ్చితంగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రభావం చూపిస్తారు. ఏడేళ్ల ప్రస్థానంలో జెపి రాజకీయ నాయకునిగా సామాన్యులకు చేరువ కాలేకపోయారు. ఒక వర్గం మద్దతు పొందిన జెపి చివరకు ఏడేళ్ల ప్రస్థానంలో ఆ వర్గం మద్దతు సైతం కోల్పోయారు.

27, నవంబర్ 2013, బుధవారం

తేజ్‌పాల్.. కెజ్రీవాల్.. సత్య హరిశ్చంద్రుడు ..చిలుకల సిద్ధాంతం

ఏ గుంపులోని చిలకలు ఆ గుంపు పలుకులే పలకాలి, నా రూటు సపరేటు అంటూ ఆ గుంపులోని పక్షి వేరుగా మాట్లాడితే తోటి చిలకలు ముక్కుతో పొడిచిపొడిచి చంపేస్తాయి. గతంలో జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మంత్రులు, పోలీసు అధికారులు రోజూ పిలు పు ఇచ్చేవారు. రెండు చేతులా సంపాదిస్తూ పి ల్లా పాపలతో హాయిగా ఉండకుండా కొంత మంది సమ సమాజం, తొక్క తోలు అంటూ ఏవేవో మాటలకు, పాటలకు ఆకర్షితులై అడవుల బాట పట్టేవాళ్లు. అలాంటి వేరు చిలకులు తమ గుంపులో కలిసిపోవాలని చెప్పడానికి జన జీవన స్రవంతిలో కలవాలని, అంటే మాలా సంపాదనలో మునిగిపోవాలని కోరుతూ పెద్ద లు పిలుపు ఇచ్చేవారు. కొత్త చిలుక సొంతంగా బియ్యపు గింజలు సంపాదించుకోవడం కష్టం కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసిన చిలుకలకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్లు. ప్రతి చిలుకా తమలానే ఉండాలని చిలుకలు కోరుకోవడం లోక సహజం. సత్య హరిశ్చంద్రుడి కథ తెలుసు కదా! సురులు, అసురులు, శత్రువులు మిత్రులు అందరూ ఆయన్ను కష్టాలు పాలు చేశారు. రాజ్యపాలన చేయాల్సిన ఆయన స్మశాన వాటికలో ‘ఇచ్చోటనే..’ అంటూ పాటలు పాడుతూ కాపలా కాయాల్సి వచ్చింది. ఎందుకలా అని ప్రశ్నిస్తే, ఇంకెందుకు దేవతలంతా హరిశ్చంద్రుని సత్యసంధతను లోకానికి చాటేందుకు అలా పరీక్షలు పెట్టారు. అని చెబుతారు. ఇది నిజంగా నిజమా? అనుమానమే?

ఇప్పట్లా అప్పుడు మీడియా ఉండి ఉంటే హరిశ్చంద్రుడితో ఆఫ్‌ది రికార్డ్‌గా మాట్లాడిస్తే ఏం తేలేది? అందరూ అబద్ధాలతో జీవిస్తుంటే, నిజం చెప్పడం తప్పని నా జీవితం ద్వారా నేను గ్రహించాను అని చెప్పేవాడేమో! లోహితాస్యుడిని అడిగితే చచ్చాక నిజం చెప్పవద్దనే సత్యాన్ని గ్రహించానని చెప్పేవాడేమో! మహారాణిలా అధికారం చలాయించాల్సిన నేను అష్టకష్టాలు పడాల్సి వచ్చిందంటే మా ఆయన అబద్ధం చెప్పక పోవడం వల్లే కదా కాబట్టి సత్యం చెప్పకండి అని హరిశ్చంద్రుడి భార్య హితబోధ చేసేవారేమో! ఇంతకూ హరిశ్చంద్రునికి ఆ పరీక్షలన్నీ ఎందుకు పెట్టారు అంటే చిలక సిద్ధాంతం గుర్తొస్తోంది. మేమంతా అబద్ధాలపై జీవించే చిలుకలం, అస్సలు అబద్ధం చెప్పని చిలకగా నువ్వు ఉండాలనుకోవడం సహించరాని నేరం అనే ఆగ్రహంతోనే అందరూ హరిశ్చంద్రునికి అలా పరీక్షలు పెట్టారేమో! చిలకల్లో చిలకలా చేరిపోయి చిలక పలుకులు పలికితే హాయిగా గడిచిపోతుంది. దారి తప్పారా?అంటే దారి లేకుండా చేస్తారు.


అరవింద్ కెజ్రీవాల్ అనే యువకుడొకరు తన ఉద్యోగమేదో తాను చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో వచ్చాడు సరే అందరి మాదిరిగా తెల్లని బట్టలు, నల్లని ఆలోచనలతో రాజకీయ వ్యాపారం సాగించవచ్చు కదా? ఎన్నికల సమయంలో నేతలు చీపురు పట్టుకుని ఊడు స్తూ మీడియాకు ఫోజులిస్తుంటారు. కెజ్రీవాల్ కూడా అలా చీపురు పట్టుకుంటే సర్లే మన గూటి పక్షే అనుకున్నారు. ఆయన మాత్రం మా గూడు వేరు, మా రెక్కలు వేరు, మేం ఎగిరే తీరే వేరు అంటూ అప్పటి వరకు గుంపులు గుంపులుగా ఉన్న చిలకలన్నింటిపై దాడి మొదలు పెట్టాడు. కొత్త పక్షులను తీసుకు వచ్చి తమపై దాడిగి దిగడంతో కొమ్ములు తిరిగిన పాత పక్షులు కొద్ది సేపు వౌనంగానే ఉన్నాయి. అంతలోనే చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్. ఊరూపేరులేని సందట్లో సడేమియా అనే మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కెజ్రీవాల్ పార్టీ నాయకులు సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బులు గడిస్తున్నాడని వీడియోను మీడియాకు విడుదల చేసింది.

 ఈ లోపుగానే అసలు మీ చీపురు పార్టీ కార్యకర్తలు రోజూ రెండు పూటలా తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి అంటూ విచారణ కమిషన్ వేశారు. కోట్లు కొల్లగొట్టేవాడ్ని వదిలి చీపురు కట్టలతో ఉన్నవారిని పట్టుకున్నారేమిటంటే , ‘‘మరి వీడొక్కడే మాలో కలువ కుండా తానేదో సత్యహరిశ్చంద్రుడిని అని చెబుతున్నాడు అలాంటప్పుడు హరిశ్చంద్రుని కష్టాలు వీడికి చూపాల్సిందే లేకపోతే మా వ్యాపారాలు మూసుకోవలసి వస్తుంది..’’ అనేది పాత చిలుకల గుంపు వాదన. వేల కోట్ల పెట్టుబడులతో సాగే రాజకీయ వ్యాపారంలో చీపుర్లతో ప్రవేశిస్తే ఈ రోజు ఢిల్లీ మాదే అంటాడు, రేపు దేశం మాదే అంటాడు చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటున్నారు.

 మన రాష్ట్రం జెపి అని ఒకాయన అచ్చం మేధావిలానే కనిపిస్తారు. 2009 ఎన్నికల ఫలితాలు రాగానే టిడిపి వాళ్లు జెపి చిలకను పొడిచిన చోటు పొడవ కుండా పొడిచారు. జెపి సోనియా ఏజెంట్. సోనియా జెపికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చింది. జెపికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు. మీది పెద్ద పార్టీ. ఏక్ నిరంజన్ పై ఎందుకంత కక్ష అని తెలుగు ఎమ్మెల్యేను అడిగితే. ఆయన కూడా ఈ గూటి పక్షే కానీ తానేదో ప్రత్యేక జాతి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ గూటి పక్షే అని తేల్చేస్తే చాలు లేకపోతే ఏకు మేకవుతుంది అని చెప్పుకొచ్చారు.అందరినీ  మార్చేయాలని బయలు దేరిన జెపి చిలుక ప్రయాణం లో వాస్తవాలు గ్రహించి   చివరకు తానే మారిపోయి చిలుకల గుంపులో కలిసిపోయింది ఉన్న ఒక్క సీటు నిలుపుకోవడానికి  ఐదేళ్లలో జెపి చిలుక భాష బాగానే నేర్చుకున్నారు.  జెపి నేను మీ గూటి పక్షినే అంటూ అచ్చం బాబు పలుకులే పలుకుతున్నారు.

తరుణ్ తేజ్‌పాల్ అత్యాచార యత్నం వ్యహారం కోర్టు తేలుస్తుంది. జాతీయ చానల్స్‌లో అతని గురించి హడావుడి చూస్తుంటే, వాడూ మా వాడే అని తృప్తి పడుతున్నట్టుగా ఉంది. బిజెపిపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసినందుకు ఆయనపై చాలా కాలం నుంచి చాలా మందికి కోపంగా ఉంది. ఇప్పుడు మా గూటి పక్షే అని నిరూపించేందుకు అవకాశం లభించింది అందు కే అంత ఉత్సాహం. ఐఎంఎఫ్ అధ్యక్షుడు అ లాంటి తప్పు చేస్తాడా? తరుణ్ తప్పు చేశాడా? అంటూ ప్రశ్నలు వినిపించినప్పుడు రజనీష్‌ను గుర్తు చేసుకుంటే.. హోదా తరువాత.. ముందు మనిషి. వాళ్ళను  దేవుళ్లు అనుకోవడం నీ తప్పు. మనిషికుండే అవలక్షణాలన్నీ ఆ మనిషికీ  ఉంటాయి అనే జీవిత సత్యం కళ్ల ముందు మెదులుతుంది.

20, నవంబర్ 2013, బుధవారం

పురుష దినం

‘‘ఈ రోజు ఏమిటి?’’
‘‘అది కూడా తెలియదా? పేపర్ చూడవా? ఈరోజు నవంబర్ 19’’
‘‘అంటే ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అని’’
‘‘ఏడవ తరగతి చదివేప్పుడు సరిగ్గా ఈరోజే నేను మా క్లాస్ మెట్ విజయలక్ష్మికి లవ్ లెటర్ రాశాను. కాస్త గంభీరంగా ఉంటుందని గంగాభాగీరథీ సమానురాలైన విజయలక్ష్మికి ప్రేమతో అని రాశాను. ఎక్కడో ఈ పదం విన్నప్పుడు ఇదేదో బాగుందని, ఉపయోగించుకున్నాను.


తెలుగులో ఇన్ని తప్పులు రాస్తావా? నీకు భాష రాదు, భావం తెలియదు అంటూ మా టీచర్ కొట్టిన చోటు కొట్టకుండా కొట్టారు. ఈ లేఖ ఎవరైనా చదివితే నీకు పాఠాలు చెప్పిన గాడిద ఎవడురా! అని నన్ను తిడతారురా! అడ్డగాడిద అంటూ చితక బాదేశారు. ఈ సంగతి మా నాన్న వరకు వెళ్లి, ఆయనో నాలుగు ఇచ్చుకున్నాడు. ఈ సంగతి సత్తిగాడికి తెలిసి తప్పులు లేకుండా ప్రేమ లేఖ రాయలేని వాడితో నీకేం ప్రేమ. తెలుగులో ఎప్పుడూ నేనే క్లాస్‌లో ఫస్ట్ పద మనం ప్రేమించుకుందాం అని విషయమంతా చెప్పి విజయలక్ష్మిని నా నుంచి దూరం చేసి, తాను దగ్గరయ్యాడు’’ అంటూ భారంగా చెప్పుకొచ్చాడు వీరేశం. 

ఆ రోజు వాడు నాకు వెన్నుపోటు పొడిచినందుకు కాలమే వాడిని శిక్షించింది... విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని గాడిద చాకిరి చేస్తున్నాడు వెదవ. మొన్న దీనంగా ఉన్న వాడిని చూసి చిన్ననాటి మిత్రుడని కూడా చూడకుండా బాగైందిరా నీకు అని అ నకుండా ఉండలేక పోయాను’’ అని వీరేశం చెప్పుకొచ్చాడు.


‘‘చాల్లేరా నీ చచ్చు ప్రేమ. రిటైర్‌మెంట్‌కు దగ్గరకొచ్చాక ఏడవ తరగతిలో ప్రేమ కథ నువ్వు చెప్పడం నేను వినడం’’ అని కామేశం చిరాకుపడ్డాడు.
‘‘ నా కవిత్వం నీకు గోలగా అనిపించొచ్చు నాకు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఎవడి కవిత్వం వాడికి నచ్చినట్టే... ఎవడి దురద వాడు గోక్కుంటే సంతోషం కలిగినట్టే, లేత వయసు ప్రేమైనా లేటు వయసు ప్రేమైనా ఎవరి ప్రేమ వాడికి అద్భుతం, ఎవడికి వాడు షాజహానే, ఎవరి ప్రేయసి వారికి ముంతాజే’’ అని వీరేశం కాస్త గట్టిగానే చెప్పాడు.
‘‘సర్లే నీ ప్రేమ దురద సంగతి నాకెందుకు కానీ...ఈరోజు ఏమిటో నిజంగా తెలియదా?’’ అని కామేశం అడిగాడు.


‘‘ తెలుగు పార్టీ వాళ్ల వెబ్‌సైట్‌లో ఈ రోజు ప్రత్యేకత ఏమిటో చూసి చెబుతాను.
‘‘వాళ్లకు ప్రపంచం అంటే వాళ్ల పార్టీ, విశ్వం అంటే వాళ్ల విశ్వవిఖ్యాత నటుని కుటుంబమే. ఈరోజు మామ సినిమా విడుదలైందనో, అల్లుడు ఈరోజే హైదరాబాద్‌ను కనుగొన్నాడనో, ఇంకుడు గుంతలు తవ్వాడ నో ఏదో ఉంటుందని కానీ. నేనడిగింది దాని గురించి కాదు’’ అని కామేశం చెప్పాడు.
‘‘ఆడియెన్స్ పోల్ తీసుకోవచ్చా?’’అని వీరేశం అంటే...
‘‘ఇక్కడ ఆడియన్స్ ఎవరున్నారురా! నువ్వూ నేనే కదా? నేను అడుగుతున్నాను. ‘‘నువ్వు చెప్పు’’ అని కామేశం బదులిచ్చాడు.
ఒక్క నిమిషం ఉండూ అని సెల్‌ఫోన్‌లో ఏదో వెతికి ...‘‘ఆ తెలిసింది ఈ రోజు వరల్డ్ టాయ్‌లెట్ డే ’’అని గట్టిగా అరిచాడు వీరేశం.
‘‘ఈ దినాలు పెట్టేవాళ్లకు అస్సలు బుద్ధి ఉండదేమో! వరల్డ్ టాయ్‌లెట్ డే కూడా ఈరోజునే నిర్ణయించాలా? మగాళ్లంటే మరీ చులకనైపోతోంది’’ అని కామేశం అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తెలిసింది.. దేశంలో తొలి మహిళా బ్యాంకు ఈరోజే ప్రారంభించారు. ఐనా మహిళా బ్యాంకు ప్రారంభిస్తే, మగాళ్లను చులకన చేసినట్లు ఎలా అవుతుంది’’ అని వీరేశం సందేహించాడు.
‘‘నీ వల్ల కాదు కానీ నేనే చెబుతాను.. ఈ రోజు పురుషుల దినోత్సవం ’’ అని కామేశం చెప్పుకొచ్చాడు.


ఆ మాట వినగానే వీరేశం ఉలిక్కి పడి.. ఇదిగో దీంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ మాట నువ్వే అన్నావు కానీ నేనలేదు. అసలే ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా ఆవిడకు తెలిస్తే...అంటూ వీరేశం వణికిపోయాడు.
అబ్బా నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సవంరా బాబు ఈరోజును నిర్ణయించింది నువ్వు కాదు నేను కాదు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో దీన్ని జరుపుకుంటా రు.’’ అని కామేశం చెప్పాడు.


ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ మొన్న ఇందిరాపార్క్ వద్ద భార్యాబాధితుల సంఘం వాళ్లు ధర్నా చేసి నవంబర్ 19న పురుష దినోత్సవం అని గుర్తు చేశారు కదా? అంటే పురుష దినోత్సవం జరుపుకుంటున్నది భార్యా భాధితులే కదా? ఈ దినం పట్ల నేనూ ఆసక్తి చూపిస్తున్నాననే విషయం మా ఆవిడకు తెలిసిందంటే.. నేనూ ఇందిరాపార్క్ వద్ద పర్మనెంట్ శిబిరం వేసుకుని కూర్చోవలసిందే. ఎందుకొచ్చిన దినాలురా బాబూ!’’ అని వీరేశం వాపోయాడు. సర్లే నా గొడవ సంగతి పక్కన పెట్టు.. ఈరోజును పురుషుల దినోత్సవంగా ఎందుకు నిర్ణయించారంటావు? అని వీరేశం ఆసక్తిగా అడిగాడు.
‘‘నాకూ తెలియదురా! కానీ తెలిసి చేశా
రో తెలియక చేశారో కానీ ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజే  ఝాన్సీ లక్ష్మీబాయ జయంతి.  ఇందిరాగాంధీ పుట్టిన రోజు కూడా.’’ అని కామేశం తెలిపాడు.
‘‘తలా తోకా లేకుండా చెబుతున్నావు. ఇందిరాగాంధీ జన్మదినం అంటావు, పురుషుల దినోత్సవం అంటావు. దానికీ దీనికీ, ఏమైనా సంబంధం ఉందా? ’’ అని వీరేశం అడిగాడు.
‘‘లేకేం ఉంది. భారత రాజకీయాల్లో ఏకైక మగాడు ఇందిరాగాంధీ!’’
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమని మహాత్ముడు చెప్పాడు, మరి రెండో చెంపపై కొడితే, ఏం చేయాలి అనే ప్రశ్నకు ఇందిరాగాంధీ మూడో కన్ను తెరిచి పాక్‌ను రెండు ముక్కలు చేయడం ద్వారా 71లో సమాధానం చెప్పారు. పాక్‌కు ఇలా సమాధానం చెప్పిన మరో  పురుష ప్రధాని దేశ చరిత్రలో ఉన్నారా? ఇందిరాగాంధీ  ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ, భారత రత్న పురస్కారం పొందిన తొలి మహిళ. పురుష దినోత్సవంగా ప్రకటించడానికి ఆమె జన్మదినం కన్నా గొప్ప రోజు ఇంకోటి ఉంటుందంటావా? ఇంత కన్నా గొప్ప పురుష నేత దేశ రాజకీయాల్లో ఇంకొకరు ఉన్నారంటావా?’’ అని కామేశం అడిగిన దానికి వీరేశం తలాడించడం ద్వారా తన ఆమోదం తెలిపాడు.

17, నవంబర్ 2013, ఆదివారం

ఇచ్చట చరిత్ర సృష్టించబడును

పార్వతమ్మ గారు ఇంకా రాకపోవడంతో ఈ రోజు బిజీగా ఉన్నారేమో అనుకున్నాను.
లేదండి సావిత్రి గారు! కోడలు పిల్ల నాతో పనేమీ చేయించదు. మనవడితోనే ఆలస్యమైంది అని చెప్పుకొచ్చింది.


 ఇద్దరూ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు. పెన్షన్ పుణ్యమా అని ఇంట్లోనో, వంట్లోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. పైకి చెప్పుకోరు కానీ ఇంట్లో తమ మాట అంతో ఇంతో చెల్లుబాటు కావడానికి పెన్షనే కారణమని వారికీ తెలుసు. అత్తలేని కోడలుత్తమురాలు.. ఓయమ్మో కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది పాత పాట. పెన్షనున్న అత్త ఉత్తమురాలు.. ఉద్యోగం ఉన్న కోడలు గుణవంతురాలు అనుకునే కాలం వీరిది. సాయంత్రం కాలనీ పార్కులో బాతాఖానీ వారి దిన చర్య. రాజకీయ పార్టీల్లో గ్రూపులున్నట్టుగానే కాలనీలో అన్ని గ్రూపులు తమ తమ వర్గం వారితో పార్కులో సెటిల్ అయ్యారు. ఒకే అభిప్రాయాలు ఉన్నవారు ఫేస్‌బుక్‌లో ఒకే గ్రూపులో తచ్చాడినట్టుగా పార్వతమ్మ, సావిత్రి ఒకే చోటుకు చేరుతారు. రాష్ట్ర విభజన అంశం మొదలుకుని కాంగ్రెస్, టిడిపిలపై అభిప్రాయాల వరకు వారికి భావ సారూప్యత ఉండడం వల్ల వారి స్నేహం దిన దిన ప్రవర్థమానం అవుతోంది. భద్రాచలంపై కూడా వారిద్దరిదీ ఒకే అభిప్రాయం. అనేక అంశాలు చర్చించుకున్నా ఇద్దరి మధ్య ఎప్పుడూ బేదాభిప్రాయాలు పొడసూపలేదు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుల్లా కలిసిపోయారు మీరిద్దరూ అని పక్కింట్లో కొత్తగా దిగిన పంకజమ్మ వీరి స్నేహాన్ని చూసి చమత్కరించారు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎవరి సినిమా బాగున్నా ఇద్దరు కలిసి వెళతారు కాబట్టి ఇక వారిరువురిని ఏ సమస్య విడదీయలేదని కాలనీ వాసులు నిర్ధారించుకున్నారు.


ఆ రోజు వారిద్దరి మధ్య ఎప్పుడూ లేని విధంగా కొత్త కొత్త అంశాలపై చర్చ సాగింది. కొత్త అంశాలంటే మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఫ్యాషన్‌లు, కొత్త సినిమాలు, కాలనీలో ప్రకాశ్ వాళ్ల అబ్బాయి తమ కాలేజీలో చదివే అమ్మాయితో ఎక్కడికో పోయిన విషయాలు అని కాదు. చాలా పాత విషయాల్లోని కొత్త కోణాలన్నమాట!


వారిద్దరి మధ్య సంభాషణల సారాంశం ఇలా ఉంది.
‘‘ఈ విషయం తెలుసా? గుర్రంపై కత్తిపట్టుకుని నిలుచున్న వీరనారి ఝాన్సీరాణి కాదట! మరో మహిళ అలా వీరోచితంగా పోరాడితే కొంత మంది ఝాన్సీరాణి అంటూ ప్రచారం చేశారట! మాయావతి పుణ్యమా అని ఈ విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.’’


నిజమే నేను కూడా ఇంత కాలం ఝాన్సీ రాణి అనుకున్నాను..
సర్దార్ పటేల్ తొలి ప్రధానమంత్రి కావలసిన వారు, తృటిలో తప్పి పోయింది. పటేల్ ప్రధాని అయి ఉంటే మనం అమెరికాను మించి పోయేవాళ్లం. ఈ ప్రమాదాన్ని బ్రిటీష్‌వాడు ముందే కనిపెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యేట్టుగా రహస్యంగా కుట్ర పన్నాడు. కావాలంటే మా అబ్బాయి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫోటో చూపిస్తా చూడు. నెహ్రూ సిగరెట్టు తాగుతున్నట్టుగా ఉంది చూశావా ఈ ఫోటోనే దానికి సాక్షం.
దానికి దీనికి సంబంధం ఏమిటే?
అక్కడే ఉంది అసలు రహస్యం. ఈ సిగరేట్టులో ఒక రకమైన మత్తుమందు పెట్టారు. ఈ మందు ఎవరు పెడితే వారు చెప్పినట్టు వింటారన్నమాట! పటేల్ ప్రధానమంత్రి కావద్దు నెహ్రూనే ప్రధానమంత్రి కావాలి అని సంకల్పం చెప్పి ఈ సిగరెట్టును నెహ్రూతో తాగించారు. దాంతో అప్పటి వరకు అందరూ పటేల్ ప్రధాని కావాలని అనుకున్నవారు కూడా నెహ్రూనే ఎంపిక చేశారు’’
ఇందులో మహాత్మాగాంధీ కుట్ర కూడా ఉందనిపిస్తోంది. దీనిపై పరిశోధించమని మా మనవడి ఫేస్‌బుక్‌లో కామెంట్ రాస్తాను. నాకెందుకో మొదటి నుంచి మహాత్మునిపై అనుమానం. మహాత్మాగాంధీ పోరాడింది బ్రిటీష్‌వాడిపై చివరకు మహాత్మునిపై సినిమా తీసింది, మహాత్మునిగా నటించింది ఆ బ్రిటీష్‌వాడే ఇందులో కుట్ర ఉందనడానికి ఇంత కన్నా సాక్షం ఏం కావాలి...జాతిపిత బిరుదు విషయంలో భగత్‌సింగ్ తనకు పోటీ వస్తాడని మహాత్ముడే ఏదో కుట్ర పన్నాడని మొన్న మా మనవడి క్లాస్ మెట్ చెప్పిందట!


ఔను ఇంతకూ నీ మనవడు ఏ క్లాస్ చెప్పనే లేదు.
అదేంటి నీకు తెలియదా? ఇప్పుడు వాడు యూ కేజి దాటి ఒకటో తరగతికి వచ్చాడు. వాడికి చరిత్ర అంటే ఎంతిష్టమో!
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రానికి, బిజెపి అధికారంలోకి వచ్చాక దేశానికి స్వాతంత్య్రం వచ్చిందట కదా?
నిజమే అయితే వాళ్లిద్దరు ఓడిపోగానే మళ్లీ వచ్చిన స్వాతంత్య్రం వెనక్కి వెళ్లింది. అంతే కాదు బ్రిటీష్‌వాడిపై పోరాడేందుకు అన్నగారు సిద్ధమవుతుండగా, ఈ విషయం ఉత్తరాది వారికి తెలిసి లాల్‌బాల్‌పాల్‌ల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం నడిపించారు. అమ్మో ఉత్తరాదివారు ఎంతైనా తెలివైన వారు. దేన్నయినా ముందే గ్రహించేస్తారు. అదే మన నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరిగి ఉంటే ఇప్పటికీ మన వాళ్లే ప్రధానమంత్రులుగా ఉండేవారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా మన వాళ్లకే సాధ్యం.


అసలు చైనా వాడు అన్ని రంగాల్లో అలా ముందుకు దూసుకెళ్లడానికి కారణం తెలుసా?
మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంధాలు కొన్ని జర్మనీ వాడు ఎత్తుకెళ్లి ఎంతో అభివృద్ధి చెందితే, మరిన్ని చైనా వాడికి దొరికాయి వాటితోనే వాడీ రోజు అమెరికానే సవాల్ చేసేట్టుగా తయారయ్యాడు.
మన జ్ఞానాన్ని ఎత్తుకెళ్లిన వాడే అంత అభివృద్ధి చెందితే మరి మనం అని వెనక నుంచి ఎవరో ప్రశ్నించినట్టుగా అనిపించింది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు.

‘అమెరికాను కనుగొన్నది మన తెలుగువాడే? 
మనవాడు పడవలో వెళుతుంటే కొలంబస్ అనేవాడు లిఫ్ట్ అడిగాడు. మన వాళ్లు అసలే దయార్ధ్ర హృదయులు కదా సర్లేఅని పడవలో ఎక్కించుకుంటే మన వాడి కన్నా ముందు వాడే పడవ నుంచి దూకేసి అమెరికాను కనుగొన్నది నేనే నేనే అని అరిచాడు’’ అని అప్పటి వరకు వీరి మాటలు వింటున్న పంకజమ్మ టీవిల ద్వారా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని పంచుకుంది.

13, నవంబర్ 2013, బుధవారం

ఆ ఒక్కటీ అడక్కు...!

‘‘రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నట్టుగా అనిపించడం లేదూ’’!
‘‘దేశంలోని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజనే అంటూ జూలైలో ప్రకటించినా, ఇప్పటి వరకు విభజన జరగలేదు రోజులు భారంగానే గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి.’’
‘‘అబ్బా నీకు లోక జ్ఞానం అస్సలే లేదురా! రాష్ట్ర విభజన వద్దంటూ కెసిఆర్ ఆమర దీక్షకు కూర్చున్నా విభజన ఆగదు. ఆ సంగతి వదిలేయ్ ..’’
‘‘మరి నీ బాధ దేని గురించి ?’’
‘‘నిన్న మొన్ననే అన్నగారు సినిమా రంగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. అలాంటిది అల్లుడు గారు అధికారం చేపట్టడం చివరకు ఆయన కూడా తన కుమారుడిని ప్రజలకు త్యాగం చేయడానికి సిద్ధం చేయడం చూస్తుంటే రోజులు చాలా వేగంగా గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదూ!’’
‘‘ఎదుటి వాళ్లతో త్యాగాలు చేయిస్తారు కానీ బాబు త్యాగం చేయడం ఏమిటి?’’
‘‘ఆయనే కాదు ఈ నేలపై పుట్టిన ప్రతి నేత ఏదో ఒక రోజు ఇలా త్యాగం చేయాల్సిందే!’’
‘‘ఏమా త్యాగం ఏమా కథ!’’
‘‘త్యాగాల నేలపై నిలబడి నేతల త్యాగం గురించి తెలియకపోవడం నిజంగా బాధాకరమే. అయితే నీకు మొదటి నుంచి చెప్పాలి. ః’’


***
వెనకటికో ధర్మాత్ముడి వద్దకు కొందరు సంఘ సేవకులు వచ్చి వృద్ధాశ్రమం నిర్మిస్తున్నాం మీ వంతు సహాయం అని కోరితే మీ ఆలోచన అభినందనీయం నా వంతుగా వృద్ధులైన మా అత్తా మామలను మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని ఎంతో దయార్ధ్ర హృదయంతో ప్రకటించాడు. ఆయన మాటలు విన్న శ్రీమతి మా ఆయన అంత ఉదారత్వం చూపిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ మా అత్తా మామలను కూడా మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని భార్యా భర్తలు తమ అత్తా మామలను త్యాగం చేసేందుకు పోటీలు పడ్డారు.


త్యాగం ఈనేల సహజ లక్షణం. ఎరువులు వేయకున్నా, వర్షాలు లేకున్నా త్యాగాల పంట దేశంలో రోజు రోజుకూ విరగ పండుతోంది!
వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం చందాలు ఇవ్వండి అని భాగ్యనగరంలో అడిగినట్టు, యజ్ఞం చేస్తున్నాం విరాళం ఇవ్వండి అని భక్తులను అడిగినంత ఈజీగా విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తూ రాక్షసుల నుంచి రక్షణ కోసం దశరథుడిని అడిగితే మీలాంటి వారు అంత దూరం నుంచి వచ్చి అడగాలా! కాకితో కబురంపితే నేనే మా వాళ్లను పంపేవాడిని కదా అన్నట్టుగా చూసి తన కుమారులు రామలక్షణులను పంపించేశాడు. ఇది త్యాగం కాకపోతే మరేమిటి? విశ్వామిత్రుడు ముక్కుపచ్చలారని రామలక్ష్మణులను తీసుకెళ్లింది వన విహారానికి కాదు... రాక్షసులను సంహరించేందుకు! ఏదైనా తేడా వస్తే అంతే కథ. సింహాసనం అధిష్టించాల్సిన వారిని ఇలా త్యాగం చేసే ఆచారం కొత్తదేమీ కాదు. త్రేతాయుగం నుంచి కూడా కొనసాగుతున్నదే. అలానే రాహుల్‌గాంధీని దేశానికి త్యాగం చేయాల్సి రాగానే సోనియాగాంధీ తల్లడిల్లారట! ఇటలీ అయినా ఇండియన్ అయినా తల్లి తల్లే కదా! ముళ్లకిరీటం ధరించేందుకు కొడుకును త్యాగం చేసేందుకు ఏ తల్లయినా తల్లడిల్లిపోతుంది. సింహాసనం అనేది ముళ్లకిరీటం బాబూ! అయినా దేశం కోసం ఈ త్యాగానికి సై అనక తప్పడం లేదని బాధపడ్డారట!


ఈ త్యాగాల చరిత్రలో తెలుగునేత బాబుది విలక్షణ శైలి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అన్నగారు. 72 ఏళ్ల వయసులోనూ ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకుని సింహాసనాన్ని వారసునికి త్యాగం చేసే సూచనలు ఏమీ కనిపించక పోవడంతో అల్లుడు గారే మామను త్యాగం చేసి ముళ్లకిరీటం లాంటి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. సహజంగా వారసుడిని ప్రకటించి దేశ ప్రజల కోసం వారసుడిని త్యాగం చేయడం సంప్రదాయం. వారంతట వారే త్యాగానికి సిద్ధం కాకపోతే ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితే. వైఎస్‌ఆర్ కూడా బతికి ఉంటే ఇప్పటికే తన కుమారుడిని రాష్ట్రానికి త్యాగం చేసి ఉండేవారు. దాని కోసమే ఎంపిగా ఉన్న తమ్ముడితో సీటు త్యాగం చేయించి అబ్బాయిని పోటీ చేయించారు.


రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయాక బాబుగారు కూడా తప్పని సరి పరిస్థితిలో త్యాగాల బాట పట్టారు. అబ్బాయి లోకేశ్ తెలుగు ప్రజలకు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. పూవు పుట్టగానే పరమళిస్తోంది, అచట పుట్టిన చివరి కొమ్మయినా చేవ అనే మాటలన్నీ ఆ చినబాబు కోసమే పుట్టాయేమో అనిపిస్తోంది. అన్నప్రాసన నాడే ఆవకాయ తింటేనే గొప్ప అనుకుంటున్నాం మనం. అలాంటిది చినబాబు పార్టీలోకి వచ్చిన మొదటి రోజే తెల్ల జుట్టుతో నేడో రేపో అన్నట్టుగా ఉన్న హేమా హేమీలకు ఎన్నికల్లో విజయం సాధించడం ఎలా? విజయానికి ఏడు మెట్లు అంటూ రాజకీయాలను బోధిస్తున్నారు. రాహుల్‌లా చినబాబు తన త్యాగాన్ని చెప్పుకోవడం లేదు. చినబాబు అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తుంటే లైవ్‌లో చూసిన పెద బాబు హృదయం ఆనందంతో పొంగిపోయిందట! పెదబాబు ఇలా పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ చేసీ చేసి పార్టీని పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా కుటుంబానికి దగ్గరగా తీసుకు వచ్చారు. ఇప్పుడు చినబాబు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తున్నాడంటే మేం ఇక అధికారానికి వచ్చినట్టే అని రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయిన నిత్య అసంతృప్తి నేత వాపోయారట!


నాయకులు తమ కుమారులను ప్రజల కోసం త్యాగం చేస్తుంటే ఓటర్లుగా మనం మనశ్శాంతిని కూడా నేతలకు త్యాగం చేయాలి తప్పదు.

 నేతలు తమ వారసులను కాకుండా తాము సంపాదించింది సొమ్మును ప్రజలకు త్యాగం చేస్తే ?
ఆ ఒక్కటీ అడక్కు.

6, నవంబర్ 2013, బుధవారం

విక్రమార్కుడితో బేతాళుడి కుమ్మక్కు

విక్రమార్కుడు బేతాళుడిని భుజాన మోస్తూ వెళుతున్నాడు. ‘‘రాజా! నీకు ఇప్పటి వరకు ఎన్నో కథలు చెప్పాను. ఇప్పుడు తెలుగురాజకీయ కథ చెబుతాను’’ అని భేతాళుడు అనగానే విక్రమార్కుడు వణికిపోయాడు. పొరపాటున ఉదయం టీవిలో తెలుగురాజకీయాల చర్చను చూస్తేనే జీవితంపై విరక్తి కలుగుతోంది. పాపం తెలుగు ప్రజలు దాన్ని ఎలా భరిస్తున్నారురా భగవంతుడా! అనుకుంటున్నాను. ఇక నువ్వు రాజకీయ కథ చెబుతాను అంటే విని బతికి ఉంటా నా? ఇక నీకు సమాధానం చెప్పడానికి’’ అని విక్రమార్కుడు బేరుమన్నాడు!

 ఎన్నో కథలు విని సంక్లిష్టమైన ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పిన మీరే ఇలా బెంబేలెత్తిపోతే ఎలా రాజా! ముందు కథ వినండి .. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతే నిజాయితీగా ఒప్పుకోండి అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు.
***
బ్లాక్‌మెయిల్ చేశాడనే ఫిర్యాదు వస్తే తీసేసిన స్ట్రింగర్ కోపంతో పత్రిక పెట్టుకుని ఏకంగా ఎడిటర్ అయినట్టు...తెలుగునాట ఏ నేతకు ఎవరి మీద కోపం వచ్చినా కొత్త పార్టీ పెట్టుకుంటారు. అలానే యువనేత కొత్త పార్టీ పెట్టుకుని విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 16 నెలల పాటు జైలులో ఉన్న యువనేత ఎన్నికల సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. లక్ష కోట్లు సంపాదించాడని విపక్ష పార్టీ ఆయనపై ఆరోపణలు చేస్తే సిబిఐ మాత్రం అంత కాదు కానీ ఎంతో కొంత సంపాదించాడని చెబుతున్నది. యువనేత సోనియాగాంధీతో కుమ్మక్క య్యారని అందుకే బెయిల్ లభించింది అనేది విపక్ష నేత ఆరోపణ. యువనేత పార్టీ, రాజమాత పార్టీలోవిలీనం అవుతుందని ఆ షరతుతోనే బెయిల్ లభించిందని, యువనేత రాజమాత దత్తపుత్రుడని విపక్ష బాబు ఆరోపణ. నిజమేమిటో కానీ ఈ ప్రచారం మాత్రం బలంగా సాగుతోంది. నిజమే అని నమ్ముదామంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి.


రాజమాత పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి విపక్ష బాబు మద్దతే కారణం అనేది అంత కన్నా బలంగా సాగుతున్న ప్రచారం. రాజమాత పార్టీ నాయకుడు కిరణుడికి సొంత జిల్లాలోనూ ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదు. కొన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదని అప్పటి వరకు హుంకరించిన విపక్ష బాబు అవిశ్వాసమప్పుడు ఓటింగ్‌కు దూరంగా ఉండి ప్రభుత్వాన్ని కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వానే్న కాకుండా ఎఫ్‌డిఐల అంశంలో రాజ్యసభలో కేంద్రంలో అధికార పక్షాన్ని సైతం కాపాడారు. ఆపద తలెత్తిన ఓటింగ్ సమయంలో విపక్ష బాబు పార్టీ ఎంపిలే తలనొప్పితో ఒకరు, దాహం వేయడం వల్ల మరొకరు బయటకు వెళ్లి అధికాపక్షాన్ని కాపాడారు. కేసులకు భయపడి విపక్ష బాబు అధికారపక్షానికి అండగా నిలిచారని ఆయనే రాజమాత పెంపుడు కొడుకుగా మారాడనేది యువనేత పార్టీ ఆరోపణ.


ఇక గులాబీ పార్టీ వారు అటు జగన్‌తో ఇటు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనేది అదే విపక్ష బాబు ఆరోపణ. తల్లిపుట్టింటి గురించి మేనమామకు తెలియందేముంటుంది. బాబుకు కాంగ్రెస్ పుట్టి ల్లు. మూడు దశాబ్దాల నుంచి ఆయన మెట్టినింట ఉన్నా పుట్టింటి గురించి ఆయన తెలియని విషయం ఉంటుందా? బాబు మా పార్టీ మేనమామే అని అధికారపక్షం మాజీ మంత్రి కూడా స్వయంగా చెప్పారాయె! 

సందట్లో సడేమియా అన్నట్టు యువనేతతో మా రాజమాత కుమ్మక్కు నిజమే అని అధికార పక్షం నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కు అయిందా? వైకాపాతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందా? టిఆర్‌ఎస్‌తో వైకాపా కుమ్మక్కా? కాంగ్రెస్ కుమ్మక్కా? లేక వీరంతా కుమ్మక్కు అయి ప్రజలను ఆయోమయంలో పడేస్తున్నారా? ప్రతి కుమ్మక్కు ఆరోపణ నిజమే అనిపిస్తోంది. ఇందులో అసలు నిజం ఏది రాజా!


అప్పుడెప్పుడో తూర్పు పడమర అని ఒక సినిమా వచ్చింది. అందులో తూర్పు పడమర ఎదురెదురూ నింగినేల ఎదురెదురు కలియని దిక్కులు కలవవని తెలిసీ ఆరాటం దేని కని అంటూ ఓ పాట ఉంది. ఈ సినిమాలో ఎవరికెవరు ఏమవుతారో కథ రాసిన రచయిత, దర్శకుడు సైతం తేల్చలేకపోయాడు. తెలుగు రాజకీయం కథ కూడా తూర్పు పడమర కథలానే ఉంది. ఇప్పుడు చెప్పు రాజా! ఎవరికెవరు దత్తపుత్రుడు, ఎవరికెవరు పెంపుడు కొడుకు? ఎవరితో ఎవరు కుమ్మక్కు అయ్యారు? అని బేతాళుడు ప్రశ్నించాడు.


విక్రమార్కుడు చిరునవ్వు నవ్వి ఇందులో తల బద్ధలు కొట్టుకోవలసింది ఏమీ లేదు. ఎవరితో ఎవరూ కుమ్మక్కు కాలేదు అన్నాడు.
ఈ సమాధానంతో బేతాళుడు సంతృప్తి చెందలేదు. అదేంటి రాజా! ఆధారాలు అంత స్పష్టంగా కనిపిస్తుంటే కుమ్మక్కు కాలేదంటావు. కాస్త వివరంగా చెప్పు అని బేతాళుడు అడిగాడు.


యాచకో యాచక శత్రుః అన్నారు. యాచకునికి యాచకుడు ఎలా శుత్రువో రాజకీయ పార్టీలకూ, వాటి నేతలకూ అంతే.
ఎవరు ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. ఎవరితో ఎవరైనా కుమ్మక్కు అవుతారు. కట్టుకున్న పార్టీకే కట్టుబడి ఉండని వారు తెర వెనుక ఒప్పందాలకు కట్టుబడి ఉంటారని అనుకోవడం నీ అమాయకత్వం బేతాళా! స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టేన్సీ అన్నట్టు ఎవరి బతుకు తెరువు కోసం వారు తంటాలు పడతారు. తన కాళ్లు నరికేసుకుని తన ప్రత్యర్థి పార్టీని బతికించాలని ఏ నాయకుడికీ ఉండదు. అలాంటి త్యాగశీలి ఏ పార్టీలోనూ ఉండడు. ఎవరి అవసరం వారిది. ఒకరికి బెయిల్ కావాలి, మరొకరికి ప్రభుత్వం పడిపోతే తక్షణం ఎన్నికలను ఎదుర్కోనే సత్తాలేక కాస్త గడువు కావాలి. అంతే ...


ఎన్నికల ముందు ఎవరితోనూ ఎవరూ కుమ్మక్కు కారు. వరద తగ్గాక నగ్నంగా ఉన్నదెవరో బయటపడుతుందని ఒక నానుడి. ఎన్నికల తరువాత ఎవరి అవసరం మేరకు వారు జతకడతారు’’ అని విక్రమార్కుడు చెప్పాడు.
‘‘రాజా! నా అనుమానం మనకు తెలియకుండానే మన మిద్దరం కుమ్మక్కు అయ్యామనిపిస్తోంది’’అని బేతాళుడు అనుమానం వ్యక్తం చేశాడు.