3, జులై 2013, బుధవారం

ఇచ్చట సహాయం చేయబడును

ఫోన్ రింగ్ కాగానే ‘‘ సీనియర్ కరస్పాండెంట్ సింహం స్పీకింగ్ ’’అన్నాడు. ‘‘ఏడిచారు కానీ నేనండి మాట్లాడేది .ఈ రోజు ఇంట్లో పనిమనిషి రాలేదు’’ అంది భార్య.
 చూడు పారూ చానల్‌లో నాకెంత పలుకుబడి ఉన్నా మనింట్లో పని మనిషి రాలేదనే వార్త బ్రేకింగ్ న్యూస్‌గా వేయడం కుదరదు అని చెప్పాడు.

 ‘‘రాత్రి తొందరగా వచ్చేయండి ప్లేట్లు కడగాలి అని చెప్పడానికి ఫోన్ చేశాను ’’అంటూ భార్య విసురుగా ఫోన్ పెట్టేసింది.

 ‘‘ఏంటి బాస్ అలా దిగులుగా ఉన్నావు? ’’ అని తెలిసిన పొలిటీషియన్ ప్రశ్నించాడు. ఇం ట్లో పని మనిషి రాలేదని చెప్పడం పూర్తి కాక ముందు అతను ఎవరికో ఫోన్ చేసి అర్జంట్‌గా ఇద్దరు పని మనుషులను పంపండి అని అడ్రస్ చెప్పాడు. ఇంతటి స్పందన సింహం ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యం నుంచి తేరుకొని ఆఫీసు మెట్లు దిగి బయట అడుగుపెట్టగానే ఒక వ్యక్తి వచ్చి గొడుగు పట్టుకున్నాడు. 

సార్ వర్షం వచ్చేట్టుగా ఉంది. ఒక్క చుక్క కూడా మీ ఒంటిపై పడకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అంటే అతన్ని చిత్రంగా చూసి సింహం ముందుకు వెళ్లాడు. పనికి మాలిన వాడు వాడి గొడుగు కింద మీరు ఉండడం ఏమిటి సార్ రండి నా గొడుగు పడతాను అని మరో వ్యక్తి వచ్చాడు. సింహంకు అంతా విచిత్రంగా అనిపించింది. మే ఐ హెల్ఫ్ యూ అంటూ టీ షర్ట్‌లు ధరించిన వారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏంటబ్బా ఒక్కసారిగా ప్రపంచం ఇలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు.

 ***
 సింహం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలోకి రాగా, ఒక చోట ఆజాను బాహువు ఒకరు ఒక వ్యక్తిని అమాంతం ఎత్తుకెళ్లి కారులో పడేశాడు. అక్కడేదో గ్యాంగ్ వార్ జరుగుతుందని గ్రహించాడు. వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి కెమెరామెన్‌ను పంపించమని ఆర్డరేశాడు. ముంబై గ్యాంగ్ వార్ వీధిపోరాటం హైదరాబాద్‌లో కూడా మొదలైంది. రక్తాలు కారుతున్నాయి, తూటాలు పేలుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఏర్పడింది. సింహం ఫోన్ చేయడంతో లైవ్ కోసం చానల్ ఓబి వ్యాన్ బయలు దేరింది. అంబులెన్స్ అడ్డం రావడంతో చానల్ ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది.
 ఏరా హారన్ కొడుతుంటే సైడ్ ఇచ్చేది లేదా? ఓబి వ్యాన్ కనిపించడం లేదా? అంటూ అంబులెన్స్ డ్రైవర్‌పై మండిపడ్డాడు. రెండు మూడు స్కూటర్లను, ఆటోను, రెండు బైక్‌లను బోల్తా కొట్టించి ఓబి వ్యాన్ విజయవంతంగా సంఘటన స్థలానికి చేరుకుంది. 
***
 పచ్చ చొక్కా , తెల్ల చొక్కా వేసుకున్న ఇద్దరు వ్యక్తులు బాహాబాహి యుద్ధానికి దిగారు. మల్లయుద్ధంలో ఎవరిది పై చేయి అంటే యుద్ధం జరిగేప్పుడే చెప్పడం సాధ్యం కాదు. యుద్ధం ముగిశాక ఎవరు పైకి లేస్తే వాడే విజయం సాధించినట్టు. ‘‘పద్మా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎల్లో గ్యాంగ్, వైట్ గ్యాంగ్‌ల మధ్య ఇక్కడ స్ట్రీట్‌ఫైట్ జరుగుతోంది. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గ్యాంగ్‌లు రాష్ట్రంలో సైతం తమ బ్రాంచీలు ఏర్పాటు చేసినట్టు ఈ వార్‌తో తేట తెల్లం అయింది.’’ అంటూ సింహం చెప్పు కు పోతున్నాడు.

 కింద పడి పైకి లేచిన ఒక గ్రామీణుడు పిచ్చి నా... అంటూ చేతికి మోకాలికి అంటిన దుమ్ము దులుపుకుని సింహం వైపు రాసాగాడు. గ్రామీణుడిని సింహం ఆక్రమించేసుకుని ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఎన్నో రోజుల నుంచి టీవి వార్తలకు అలవాటు పడ్డ గ్రామీణుడు టీవి చానల్ లోగో చేతిలోకి తీసుకొని, ‘‘అదో భయానక విషాదకర, హృద య విదారకమైన సంఘటన. అసలు నేను మళ్లీ బతుకుతానా? ఆ గ్యాంగ్ చేతి నుంచి ప్రాణాలతో బయటకు వస్తానా?అని భయపడ్డాను. ఆ భగవంతుని దయ,మా ఆవిడ పూజలు, మా పిల్లల ఎంసెట్ ర్యాంకులే నన్ను బతికించాయి.’’ అని చెప్పాడు.

 భలే మాట్లాడావు అని సింహం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. ఒకటా రెండా పదిహేనేళ్ల నుంచి రోజూ కొన్ని గంటల పాటు టీవిల్లో వార్తలు చూస్తున్నాను. వినీ వినీ ఎప్పుడు ఏం మాట్లాడాలి. ఏ చానల్‌లో ఏం మాట్లాడాలో బాగా వచ్చేసింది. అంటూ గ్రామీణుడు వెళ్లిపోయాడు. ఇంతలో కారు డోర్ తెరుచుకుని ఒక యువకుడు పరిగెత్తుకొస్తుంటే సింహం అతన్ని ఆపి మీ అనుభవాలు చెప్పండి అంటూ  వరుసగా ఐదారు ప్రశ్నలు వేశాడు.
 ‘‘మేం ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు టైర్ పంక్చర్ అయి చిన్న జర్క్ ఇచ్చింది. ఎటు నుంచి వచ్చారో కానీ మీ అందరినీ మీ ఇళ్లకు చేర్చే బాధ్యత మాదంటే మాది అంటూ ఎల్లో గ్యాంగ్, వైట్ గ్యాంగ్ హోరా హోరీగా కొట్టుకుంది. బలవంతంగా కార్లలో బంధించారు. మా ఇల్లు పక్కనే ఉందని చెప్పినా వినకుండా అవసరం అయితే ప్రత్యేక విమానంలో పంపిస్తామని పోటీ పడుతున్నారు’’ అని చెప్పి యువకుడు పరిగెత్తాడు. 

విశ్వంలో తెలుగు వారికి ఎక్కడేం జరిగినా సహాయం చేసే హక్కు మాదే అని నేత ఒకరు సవాల్ చేశారు. దీన్ని ఖండిస్తున్నానని మరొకాయన కత్తిపట్టుకుని వచ్చాడు. మెడపై కత్తి పెట్టి బెదిరించి రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ మెడపై కత్తిపెట్టి సహాయం చేసే వాళ్లుంటారా? అనుకున్నాడు.

 మే ఐ హెల్ప్ యూ స్కీమ్ బాగా వర్కవుట్ అవుతోందని, మన అభిమాన నాయకుడు అధికారంలోకి రావడం ఖాయం అని చానల్స్ తేల్చేశాయి. 

ఇదేం జబ్బో సింహానికి అర్ధం కాలేదు. 2014 వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

 ముక్తాయింపు: సీజనల్ ఫీవర్స్ లానే ఎన్నికల సీజన్ జబ్బులుంటాయి

5 కామెంట్‌లు:

  1. నాకు అర్జెంటు గ 40000 రూపాయలు కావాలి ఎల్లో గ్యాంగ్ హెల్ప్ లైన్ నెంబర్ చెప్పండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. hema garu ధన్యవాదాలు ఫోన్ నెంబర్ రోజు పేపర్ లో వస్తోంది కదండీ

      తొలగించండి
  2. ప్రజలకి సహాయం చెయ్యడానికి కొట్టుకుచచ్చే నాయకులని చూస్తున్నాం, ఎంత అదృష్టం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. bonagiri garu ధన్యవాదాలు ఇంత గొప్ప నాయకులు ఉన్న కాలం లో మనం ఉండడం మన అదృష్టం

      తొలగించండి
  3. నిర్బంధ వినోద కార్యక్రమాలు ఎన్నో చూసాం కానీ బలవంతపు సహాయచర్యలు ఇదే మొదటి సారి. ఎన్టీవోడు రోడ్డు మీద పొర్లిన తరువాత అంతటి చిల్లర వేషాలు మళ్ళీ చూడలేమేమో అనుకున్నాం. రమేష్ వీహెచ్ గార్ల పుణ్యమా అని మళ్ళీ అంత అదృష్టం దక్కింది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం