31, ఆగస్టు 2013, శనివారం

సంక్షోభ సుడిగుండంలో తెలుగుదేశం!

‘‘టిడిపికి సంక్షోభాలు కొత్త కాదు, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం, బయటపడ్డాం ’’ ఇది చంద్రబాబు నాయుడు తరుచుగా అనే మాట... కానీ చివరకు ఆయన ఈ మాట కూడా చెప్పలేక పోతున్నారు. దీన్ని బట్టి టిడిపి ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్ధమవుతోంది. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు అందె వేసిన చేయి. కానీ రాష్ట్ర విభజన సంక్షోభంలో చిక్కుకున్న చంద్రబాబు, పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే మాట అటుంచి ఈ సంక్షోభం నుంచి ఎలా భయపడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.


1994లో టిడిపి అధికారంలోకి వచ్చిన ఎనినిమిది నెలలకే ఎన్టీఆర్‌ను దించేసి వ్యూహాత్మకంగా చంద్రబాబు అధికారం చేపట్టగలిగారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగునెలలకే ఎన్టీరామారావు మరణించారు. ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం అని ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో బాబుపై ఆగ్రహం వ్యక్తం చేయాలి.  ఇలాంటి క్లిష్టపరిస్థితిలోనే నాయకుడి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఎన్టీఆర్ మరణించారని తెలియగానే బంజారాహిల్స్‌లోని రామారావు నివాసానికి జయప్రదతో పాటు కొందరు నాయకులు వస్తే అభిమానులు రాళ్లతో దాడి చేశారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు అక్కడికి వస్తే దాడులు జరుగుతాయని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రావద్దని కొందరు నాయకులు సూచించారు. కానీ చంద్రబాబు ధైర్యంగా ఎన్టీఆర్ నివాసానికి వచ్చి పరిస్థితిని తన అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ మరణంలో లక్ష్మీపార్వతిపై అనుమానాలు రేకెత్తించే విధంగా చేయడంలో సఫలం అయ్యారు.
 ఆ సమయంలో చంద్రబాబు అలా వెళ్లి ఉండక పోతే ఎన్టీఆర్ మరణానికి బాబే కారణం అనే ప్రచారం బలంగా సాగేది. సరే అప్పుడు చేతిలో అధికారం ఉంది కాబట్టి అవసరమైన చర్యలు తీసుకుని ముందడుగు వేశారు.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సంక్లిష్టపరిస్థితిలోనే చంద్రబాబు చిక్కుకున్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సీమాంధ్రలో ఆత్మగౌరవం పేరుతో యాత్ర జరపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తొలుత ఆగస్టు 25 నుంచి యాత్ర అనుకున్నారు. ఇప్పుడు చేతిలో అధికారం లేదు. అధికారం చేతినుంచి జారిపోయి తొమ్మిదేళ్లు అవుతోంది. అందుకే అడుగులు తడబడుతున్నాయి. కొంత మంది వారించడంతో 25న యాత్ర ప్రారంభించలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 1న గుంటూరు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు.


రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒక మాట అటూ ఇటుగా తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయాలను ప్రకటించాయి. 2009లో వచ్చిన తెలంగాణాను అడ్డుకున్నాడని తెలంగాణ ప్రజలతో విమర్శలను ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు బాబే కారణం అంటూ సీమాంధ్రలో ప్రత్యర్థుల నుంచి బలమైన విమర్శ ఎదుర్కొంటున్నారు.
వైఎస్‌ఆర్ మరణించిన ఇడుపుల పాయలో జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా వైకాపా నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల్లో, పాదయాత్ర సందర్భంగా అనేక సార్లు విజయమ్మ, షర్మిల తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేశారు.
తెలంగాణపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో రాజకీయ పక్షాలన్నీంటికీ ముందే అవగాహన ఉంది. సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడక ముందే వైకాపా హఠాత్తుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఏం జరుగుతుందో ప్రత్యర్థులు అర్ధం చేసుకునే లోపే ఎదుటివారిపై దాడి చేయాలి ఇది యుద్ధ నీతి! వైకాపా చేసింది అదే!! తెలంగాణలో వైకాపాకు పెద్దగా ఉనికి లేదు. అలాంటప్పుడు తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కన్నా తెలంగాణలో జెండా పీకేసి సీమాంధ్రకే పరిమితం కావడం లాభసాటి నిర్ణయం అనుకున్నారు. టిడిపి పరిస్థితి అలా కాదు. ఆ పార్టీ సీమాంధ్రలో బలంగా ఉంది, అదే విధంగా తెలంగాణలోనూ బలంగా ఉంది. దాంతో వైకాపా అంత స్పీడ్‌గా సమైక్యాంధ్ర ఉద్యమంలో టిడిపి పాలు పంచుకోలేకపోయింది. నిజానికి రాజకీయాల్లో ఏది లాభసాటిగా ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడంలో చంద్రబాబు.. జగన్‌కే కాదు వైఎస్‌ఆర్‌కు సైతం పాఠాలు చెప్పగలరు.


 బిజెపి పవనాలు వీస్తున్నాయన్నప్పుడు 99లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతకు ముందే మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిన విషయం మరిచిపోయి అప్పటి లాభం అప్పుడు చూసుకొని 99లో అధికారంలోకి రాగలిగారు. 2009లో టిఆర్‌ఎస్‌తో అదే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఒక మాట అన్నాం దానికి కట్టుబడి ఉండాలి అనే ఉదాత్తత ఏమీ కాదు. ఇక్కడ వైకాపాకు, టిడిపికి మధ్య తేడా.. టిడిపి రెండు ప్రాంతాల్లో బలంగానే ఉంది. వైకాపా ఒక ప్రాంతానికే పరిమితం అయింది. అంతే తప్ప బాబుకు తెలియని రాజకీయ వ్యూహాలేవో జైలులో ఉన్న జగన్‌కు తెలుసని కాదు.


వచ్చిన తెలంగాణాను అడ్డుకున్నాడనే బలమైన విమర్శ బాబుపై తెలంగాణలో ఉంది. ఇక తీరా ఇప్పుడు తెలంగాణ సాకారం అవుతున్న వేళ సీమాంధ్రలో టిడిపి ప్రజాప్రతినిధులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బాబు రాసిన లేఖ వల్లనే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపా బలంగా ప్రచారం చేస్తున్నాయ. పోనీ బాబువల్లనే తెలంగాణ వస్తోందనే అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో ఉందా? అంటే అలాంటిదేమీ లేదు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటే బాబు ఎందుకు చర్య తీసుకోవడం లేదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. సీమాంధ్రలో ఆందోళనలు ప్రారం భం అయ్యాక బాబు స్వరం మారుస్తున్నారని తెలంగాణలో విమర్శలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు అటు సీమాంద్రలో, ఇటు తెలంగాణలో విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. రెండు ప్రాంతాల్లోనూ ప్రత్యర్థులు టిడిపినే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనే విషయం వైకాపా నాయకత్వాని స్పష్టంగా తెలుసు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఎలాగూ నామ మాత్రంగా మారింది. ఇక ప్రధాన ప్రత్యర్థి టిడిపి... అందుకే ఆ పార్టీని దెబ్బతీయడానికి బాబు లేఖ వల్లనే విభజన జరుగుతోందని వైకాపా ప్రచారం చేస్తోంది. లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. లేఖలు,అభిప్రాయ సేకరణల పర్వం ముగిసిందని కాంగ్రెస్ హై కమాండ్ ఎప్పుడో ప్రకటించింది. లేఖ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడానికి వైకాపాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ లేదు. కానీ టిడిపి పరిస్థితి అలా కాదు.
మాట తప్పని వంశం అని చెప్పుకునే జగన్‌కు ఇడుపుల పాయలో తీసుకున్న నిర్ణ యం నుంచి వెనక్కి మళ్లడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. ఆ పార్టీ ఉనికి సీమాంధ్రలోనే ఉంది. తెలంగాణపై ఇచ్చిన మాట తప్పిన అంశాన్ని తెలంగాణ వాళ్లు గుర్తుపెట్టుకుంటారేమో కానీ సీమాంధ్రలో ఇదసలు సమస్యనే కాదు.


ఇలాంటి వాతావరణంలో సీమాంధ్రలో పర్యటించి వాస్తవాలు వివరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు కొందరు పరిస్థితులు బాగాలేవు, యాత్రలు వద్దని వారించారు. విభజనపై బాబు వౌనంగా ఉండడం, అదే సమయంలో విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తం వైకాపా ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ప్రచారం సాగింది. టిడిపి సర్దుకునే లోపుగానే వైకాపా దూసుకెళ్లింది.
సీమాంధ్రలో టిడిపి పని ఐపోయిందనే ప్రచారం సాగిస్తున్నారు. ఒక పార్టీకి నిజంగా బలం ఉందా? ఒక పార్టీ పని అయిపోయిందా? అనేది తేల్చేది మీడియాలో కథనాలు కాదు, పత్రికల్లో వార్తలు కాదు. ఎన్నికల ఫలితాలే వీటిని తేలుస్తాయి. అన్నా హజారే అవినీతిపై ఉద్యమించినప్పుడు ఢిల్లీ వీధులన్నీ జనంతో కిక్కిరిసాయి. కొద్ది రోజుల తరువాత ఆయన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మీడియా, పోలీసులు, ప్రజలు కలిసి వెయ్యి మంది కూడా లేరు. చానల్స్‌లో వార్తల హడావుడి చూసి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ప్రచారం విషయంలో చంద్రబాబు శక్తిని తక్కువ అంచనా వేయలేం.
లేఖ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు మేమే కారణం అని తెలంగాణలో, హైదరాబాద్ లాంటి అభివృద్ధి సీమాంధ్రలో సాకారం కావాలంటే మా వల్లనే అని సీమాంధ్రలో ప్రచారం చేయగల గడసరితనం టిడిపికి ఉంది. కానీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులను బాబు ఏవిధంగా సముదాయస్తూ తన వాదనకు అనుగుణంగా మలచుకుంటారనేది ప్రధాన ప్రశ్న. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించి తీర్పు చెబితే అన్ని పార్టీలను శిక్షించాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు తెలంగాణపై అనుకూలత వ్యక్తం చేశాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి చంద్రబాబునాయుడు సీమాంధ్రలో పర్యటించనున్నారు.


ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న వరంగల్ జిల్లాలోనే బాబు లేఖ ఇవ్వక ముందే విజయవంతంగా పర్యటించారు. పర్యటన వద్దని ఎంత మంది సూచించినా ఆయన పర్యటించారు. అలానే ఇప్పుడు సీమాంధ్రలో పర్యటన పెద్ద కష్టమేమీ కాదు. కానీ జనం బాబు మాటలను ఎంత వరకు స్వీకరిస్తారు అనేదే ముఖ్యం. ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన టిడిపికి ఈ ఎన్నికలు చావుబతుకుల సమస్య. ఈ ఎన్నికల్లో ఏదో ఒక ప్రాంతంలో అధికారంలోకి వస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. టిడిపి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది మామూలు సంక్షోభం కాదు. ఈ సంక్షోభం నుంచి బయటపడితే కానీ బాబుకు, టిడిపికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.

1 కామెంట్‌:

  1. సమీక్ష బాగుంది. ఇంతకు మించి రాయాలని ఉందికాని వద్దు...జరగబోయేది ఎలాగూ జరిగితీరుతుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం