23, అక్టోబర్ 2013, బుధవారం

బంగారు దొంగ కల

పూర్వం ఒక గ్రామంలో ఒక చిల్లర దొంగ ఉండేవాడు. సన్నాసులు, సన్యాసులు, నాయకులు, నాయక దొంగలు కలలు కంటున్నప్పుడు పాపం ఆ చిల్లర దొంగ మాత్రం కలలు కంటే తప్పేమిటి? ఆ దొంగ కూడా కలలు కన్నాడు. తమ వ్యవసాయ భూమికి కావలిసినంత నీరు లభించి చక్కని పంట పండినట్టు కలలు కన్నాడు. చెప్పడం మరిచాను అతను కల కన్నది పట్టుపరుపుల మీద పడుకుని కాదు, జైలు గోడల మధ్య!
దొంతనానికి పాల్పడడం వల్ల రాజభటులు చిల్లర దొంగను అరెస్టు చేసి కారాగారంలో బంధించారు. దొంగతనం చేస్తే సన్మానించేందుకు, అభిమాన సంఘాలను ఏర్పాటు చేసేందుకు అదేమీ ఆధునిక కాలం కాదు. రాజుల కాలం కాబట్టి దొంగతనం చేసి పట్టుపడితే జైలే గతి.


 పార్లమెంటుపైనే దాడి చేసిన కసబ్‌లాంటి వాడికి కోట్ల రూపాయల ఖర్చుతో రాజభోగాలు కల్పించే మన కాలం కాదు. చిన్నచిన్న రాజ్యా లున్న కాలమది. దొంగ దొరకడం, భటులు పట్టుకు వెళ్లడం, శిక్ష విధించడం అన్నీ అప్పటికప్పుడే జరిగిపోయేవి.


జైలుపాలైన చిల్లర దొంగ ఆలోచనల్లో పడ్డాడు. వీరోచితంగా జనం సొమ్ము దోచుకున్నాడని ఆభిమానించే అభిమానులు లేరు. ముసలి తల్లిదండ్రులు, వారికి ఆధారంగా వ్యవసాయ పొలం తప్ప ఏమీలేవు. తాను జైలులో ఉన్నందున పొలానికి నీళ్లు తోడే అవకాశం లేకుండా పోయింది. ఎలారా భగవంతుడా!అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. బంగారం లాంటి కల కన్నాడు!


ఉదయం లేచాక తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. భటుణ్ణి పిలిచి ఈ ఉత్తరం తన తల్లిదండ్రులకు చేర్చమని కోరాడు. సరేనని భటుడు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి తన పై వాడికి ఇచ్చాడు. అసలే దొంగ.. వాడు కారాగారంలో ఉన్నాడు. లేఖ రాశాడు అంటే ఏదో ఉండే ఉంటుంది అనుకుని లేఖ చదివాడు.


అమ్మానాన్నా ...!
నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. నేను రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ విషయం ఎవరికీ చెప్పకండి.. నేను ఇంత కాలం దొంగతనాల్లో సంపాదించిన బంగారం అంతా మన పొలంలోని వ్యవసాయ బావిలో పాతిపెట్టాను. నేను బయటకు వచ్చాక ఆ బంగారంతో హాయిగా జీవిద్దాం... అంత వరకు సెలవు అని ముగించాడు. ఉత్తరం చదవగానే భటునితోపాటు సైనికాధికారి ఎగిరి గంతేశారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఉన్న చిరునామాకు భటులను వెంటబెట్టుకెళ్లాడు. బావిలోని నీళ్లన్నీ తోడి పోశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము వరకు అదే పని. పంటపొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. బావిలోనీరు అయిపోయంది కానీ బంగారం జాడలేదు. ఉదయం జన సంచారం మొదలుకావడంతో భటులు కిమ్మనకుండా వెనక్కి వెళ్లిపోయారు. 


కొడుకు జైలులో ఉన్నా దేవుడి దయవల్లనే పొలానికి నీళ్లు అందాయని వృద్ధ దంపతులు సంతోషించారు. భటులు తేలుకుట్టిన దొంగల్లా వౌనంగా ఉండిపోతే దొంగ మాత్రం తన తెలివితేటలకు మురిసిపోయాడు.
చిన్నప్పటి ఈ కథ తెగ నచ్చినా అది కథ కాబట్టి సాధ్యమైంది కానీ బావిలో బంగారం ఉందటే నమ్మి నీటిని తోడేందుకు భటులు మరీ అంత అమాయకులా అని పెద్దయ్యాక అనిపించింది..... మరింత పెద్దయ్యాక చిన్నప్పటి కథే నిజమని ఇప్పుడు అనిపిస్తోంది.


ఉత్తర ప్రదేశ్‌లోని దౌడియాకలా గ్రామంలో రాజా ఃరావు రాంబక్షసింగ్ కోట ఆలయంలో కోట శిధిలాల కింద వెయ్యి టన్నుల బంగారం ఖజానా ఉందని శోభన్ సర్కార్ అనే సాధువుకు కల వచ్చింది. వయసులో ఉన్న కుర్రాడికి అందమైన అమ్మాయిని ప్రేమించినట్టు కలలు వస్తుంటాయి. నిరుద్యోగికి మంచి ఉద్యోగం వచ్చినట్టు, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో గెలిచినట్టు కలలు వస్తుంటాయి. వారి వారి కోరికలను బట్టి అలాంటి కలలు వస్తుంటాయి. అన్ని కోరికలను త్యజించి సన్యసించే సన్యాసులకు కోరికలే ఉండవు కాబట్టి వారికెలాంటి కలలు వస్తాయి? ఎమో ఇప్పటి వరకు ఎవరూ అటు దృష్టిపెట్టలేదు. కానీ ఎందుకో కానీ శోభన్ సర్కార్‌కు మాత్రం వెయ్యి టన్నుల బంగారం కలొచ్చింది. ఆయన సన్యాసే అయినా అల్లాటప్పా సన్యాసి కాదు ఆయనకు లక్షల మంది భక్తులున్నారు. యుపిఏ సర్కార్ ను వణికిస్తున్న నరేంద్ర మోడీ సైతం శోభన్ సర్కార్ దెబ్బకు సరెండర్ కాక తప్పలేదు. ఈ తవ్వకాలపై మోడీ విమర్శలు చేస్తే శోభన్ సర్కార్ మండిపడ్డారు. దాంతో మోడీ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించక తప్పడం లేదు. ఆయన కలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మేశాయి. తవ్వకాలు మొదలు పెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా తవ్వకాలను ప్రపంచానికి లైవ్‌గా అందిస్తోంది. చిన్నప్పటి కథలో బంగారం కోసం భటులు బావిలోని నీటిని తవ్వడాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంది.


ఆ మధ్య టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమ లోటస్‌పాండ్ నేలమాళిగల్లో కోట్ల రూపాయలు దాచిపెట్టారు. పునాదులు తవ్వండి అని డిమాండ్ చేశారు. మేం టిడిపి పునాదులు కూల్చేస్తున్నామనే అక్కసుతో వాళ్లు లోటస్‌పాండ్ పునాదులు కూల్చమంటున్నారని వైకాపా వాళ్లు సమాధానం చెప్పారు. ఇప్పుడు దేశ ఆర్థిక సమస్య సన్యాసి కలతోనే పరిష్కారం అవుతుందని ఆశించే వాళ్లు దేశంలో చాలా మందే ఉన్నారు. ఆ సన్యాసి కల ఫలిస్తే బాగుండు? ఎందుకంటారా...


అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేత తన ఆస్తి 40లక్షలే అని చెబుతాడు. ఆ ఇంట్లో ఒక గోడకు ఉపయోగించిన ఇటుకల ఖరీదు కాదా మొత్తం అని ఆయనకూ తెలుసు.మనకూ తెలుసు.( ఆ నేత తన ఇంటి ఇటుకల విలువ చెప్పాడు కానీ , ఇటుకల లోపల దాచిన సంపద విలువ చెప్పలేదని కొదరి వాదన) .   రాజకీయ నాయకుల ఇళ్ల పునాదుల్లో బంగారు గని ఉందని  ఎవరైనా ఉత్తరాది సన్యాసికి కలొస్తే( దక్షిణాది సన్యాసి కలలను సన్నాసులు కూడా  పట్టించుకోరు మరి.) దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి.   ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుం డా ఒక్కో నాయకుడి ఇల్లు ఒక్కో స్విస్ బ్యాంక్ కదా? ఆ బ్యాంకుల్లోని నల్లధనం బయటపడడానికి కలల కన్నా మంచి స్కీమ్ లేదు.

7 వ్యాఖ్యలు:

 1. చిన్నప్పటి కథలో బంగారం కోసం భటులు బావిలోని నీటిని తవ్వడాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంది.<<<

  ఎవరైనా ఉత్తరాది సన్యాసికి కలొస్తే(దక్షిణాది సన్యాసి కలలను సన్నాసులు కూడా పట్టించుకోరు మరి)<<<

  :)))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. nice post..

  బాధపడాల్సిన విషయమేంటంటే నిజాలు నవ్వుకునేలా ఉంటున్నాయి.. భ్రమలు (కలలు) నిజాలంటూ నమ్మేలా భ్రమ పెడుతున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ade sarkar sami ki south lo ap ane state lo unna anni party la adhinetala indla kinda block money unnattu kala vaste bagundu..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సతీష్ గారు మన నేతల పేర్లు , అడ్రస్ లో సర్కార్ స్వామికి పంపి చూడాలి .. సర్కార్ ( ప్రభుత్వం )కు పడని వారిపైనే సిబిఐ దాడులు జరిగినట్టు సర్కార్ ( సాధువు ) విపక్షం వారిపైనే కల లు కంటారో అందరి గురించి కంటారో చూడాలి

   తొలగించు
 4. చక్కగా రాసారు మురళి గారు. Wonderful post.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం