19, అక్టోబర్ 2013, శనివారం

భాజపాకు తెదేపా గండం

అదేం శాపమో రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి అవకాశం లభించినప్పుడల్లా ఆ పార్టీని టిడిపి గండం వెంటాడుతోంది. మేం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని కల్పిస్తే 82లో ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసి మా ఆశలు అడియాశలు చేశారని బిజెపి నాయకులు ఆనాటి రాజకీయాలపై ఆవేదన చెందుతారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే గండం బిజెపిని వెంటాడుతోంది. మోడీ, తెలంగాణ రూపంలో మరోసారి బిజెపి ఎదగడానికి అవకాశాలు కనిపిస్తుండగా, టిడిపి రూపంలో మళ్లీ గండం పొంచి చూస్తోంది.
టిడిపి తిరిగి ఎన్‌డిఏకు చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు ఢిల్లీ పర్యటనను జాతీయ మీడియా మొత్తం ఈ కోణంలోనే చూసింది. బాబు ఎన్‌డిఏతో జత కడితే అటు మోడీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది, ఇటు చంద్రబాబు తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 1998 సమయంలో రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. చివరకు రాయలసీమ జిల్లాల్లోని ఫ్యాక్షన్ నాయకులు సైతం బిజెపి పట్ల ఆకర్షితులయ్యారు. 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా బిజెపి సొంతంగా పోటీ చేసి నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓట్లు, తెలంగాణలో 25 శాతం ఓట్లు సాధించింది. 60 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు మసీదులను కూల్చే పార్టీ అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు 98లో బిజెపికి చేరువ అయ్యారు.
ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత 1999, 2004, 2009లలో మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బాబు నాయకత్వంలో ఒక్క 1999 ఎన్నికల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం పడిపోవడం, కార్గిల్ యుద్ధం, వాజ్‌పాయిపై ఉన్న సానుభూతి రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి దోహదం చేశాయి. 98 ఎన్నికల్లో ఓటింగ్ సరళి, ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతున్న తీరు గమనించిన చంద్రబాబు బిజెపి వైపు వచ్చారు. అప్పటి వరకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న బాబు, ఏదో కుంటి సాకు చెప్పి బిజెపి వైపు వచ్చేశారు. ఫ్రంట్ కన్వీనరే జెండా ఎత్తేయడంతో ఫ్రంట్‌లోని పార్టీల నాయకులు విస్తుపోయారు.
బాబు చాణక్య నీతి గురించి, పాలానా సామర్ధ్యం గురించి మీడియా ఎంతగా ప్రచారం చేసినా ఒక్కసారి కూడా ఆయన స్వయం శక్తితో విజయం సాధించలేదు. ఆయన నాయకత్వంలో గెలిచింది ఒకే ఒకసారి అదీ బిజెపి కున్న సానుభూతి పవనాలతో....! 1999లో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. బిజెపి ఎనిమిది పార్లమెంటు నియోజక వర్గాల్లో పోటీ చేస్తే ఏడు స్థానాల్లో గెలిచింది. వాజ్‌పాయి హవా టిడిపి సైతం అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఆ తరువాత అటు టిడిపి, ఇటు బిజెపి క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. 2004 ఎన్నికల్లో బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినా బాబు అధికారం దక్కలేదు సరికదా కేవలం 47 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యారు. ఆ తరువాత జరిగిన పార్టీ సమీక్షా సమావేశాల్లో మత తత్వ బిజెపితో పొత్తు వల్లనే ఎన్నికల్లో ఓడిపోయామని చంద్రబాబు ప్రకటించారు. బిజెపితో పొత్తు వల్ల మైనారిటీలు టిడిపికి ఓటు వేయలేదని తమ ఓటమి పాపం తమది కాదని బిజెపిదే అంటూ చెప్పుకొచ్చారు. బాబు వల్లే మేం ఓడిపోయామనేది బిజెపి సమాధానం. అలిపిరి దాడిలో బయటపడి సానుభూతిపై ఆశలు పెట్టుకున్న బాబు 2004లో ముందస్తు ఎన్నికలకు తాను వెళ్లడమే కాకుండా బిజెపిని సైతం తీసుకు వెళ్లారు. బిజెపి, టిడిపిల పొత్తు 1998 నుంచి 2004 వరకు ఆరేళ్లపాటు సాగినా, రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. రాష్ట్రానికి చెందిన వారిలో వెంకయ్యనాయుడును మినహా మిగిలిన వారిని చంద్రబాబు పెద్దగా పట్టించుకునే వారు కాదు.
2004 ఎన్నికల్లో బిజెపి వల్ల ఓడిపోయామని చెప్పి, ఆ పార్టీతో స్నేహాన్ని వదులుకున్నాక 2009 సాధారణ ఎన్నికల్లో సైతం మైనారిటీలు టిడిపిని నమ్మలేదు. బిజెపితో కలిసిన తరువాత బాబు ఎన్ని మాటలు చెబుతున్నా, రూమీ టోపీ ధరించి ప్రచారం చేసినా ముస్లింలు నమ్మడం లేదు. ముస్లిం లు, క్రైస్తవ ఓటర్లలో మెజారీటీ తమవైపు లేరనే అభిప్రాయం టిడిపిలో బలంగా ఉంది. 

రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ టిడిపి పరిస్థితి ఇబ్బంది కరమే. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి మరో ఐదేళ్లపాటు అధికారం లేకుండా పార్టీని కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నా 2019లో అధికారంలోకి వస్తామనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో కల్పించడం అంత ఈజీ కాదు. అధికారంలోకి వచ్చే విషయం ఎలా ఉన్నా పార్టీని కాపాడుకోవడం బాబు తక్షణ కర్తవ్యం. దాని కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తారు, ఏమైనా చేస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే టిడిపి నాయకులు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారు. దేశంలోని ఓటర్లలో దాదాపు 47 శాతం యువతే. మోడీ పట్ల యువతలో మంచి క్రేజ్ ఉంది. ఉత్తరాది స్థాయిలో కాకపోయినా రాష్ట్రంలో సైతం మోడీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఒకవైపు యువత మరోవైపు ప్రధానమంత్రిగా బిసికి తొలిసారిగా వస్తున్న అవకాశం అనే నినాదం ఎన్నికల్లో బాగానే పని చేసే అవకాశం ఉంది.
గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదేళ్ల తరువాత ఇప్పుడు అదే మోడీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని టిడిపి నాయకత్వం బిజెపి పట్ల ఆసక్తి చూపిస్తోంది.
 డిల్లీలో జరిగిన సమావేశం లో మోడీ, బాబు ఒకే వేదిక పై కూర్చున్నారు . అనంతరం బాబు మోడితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు . మోడీ , మహాత్మా గాంధీ గుజరాత్ లోనే  జన్మించారు అంటూ  మోడిని ఆకాశానికెత్తుతూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి డిల్లీ సమావేశం లో  బాబు తంటాలు పడ్డారు

 రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పరస్పర అవసరాలే ముఖ్యం. ఇక్కడ టిడిపిని బతికించుకోవడం బాబుకు అవసరం, అధికారంలోకి రావడం అక్కడ మోడీకి అవసరం. ఈ అవసరాలే రెండు పార్టీలను కలిపే అవకాశాలు కల్పిస్తోంది.

విభజన తరువాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండేది తెలంగాణ ప్రాంతంలోనే. తెలంగాణలో అధికారంలోకి వచ్చే సూచనలే లేనప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ముస్లింల ఓట్లను వదులుకోవడానికి బాబుకు అభ్యంతరం ఏముంటుంది. కమ్యూనిజానికి కాలం చెల్లిందని పదే పదే చెప్పి అధికారం పోయాక వారితో కలిసిన బాబుకు బిజెపితో కలవడానికి ఒక కారణం చెప్పడం పెద్దకష్టమేమీ కాదు.విభజన తరువాత కొత్త రాజధానిని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలని అలా చేయాలంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో ఉండాలి అంటూ కొత్త సిద్ధాంతం చెప్పగలరు.
రెండు పార్టీల కలయిక వల్ల బాబుకు, మోడీకి ఇద్దరికీ ప్రయోజనమే. కానీ రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి అవకాశాలు పోతాయి. విభజన జరిగితే ఒక ఎన్నిక వరకు టిడిపి విపక్ష స్థానంలో ఉంటుంది. ఆ తరువాత ఆ స్థానాన్ని క్రమంగా బిజెపి కైవసం చేసుకుంటుంది. శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం సైతం ఇదే విషయం చెప్పింది. విభజన జరిగితే తెలంగాణలో టిడిపి ఉండదని, ఆ స్థానాన్ని బిజెపి భర్తీ చేస్తుందని, అదే తమకు సమస్య అని ఎంఐఎం తెలిపింది. ఎప్పుడో రాష్ట్రంలో బిజెపి ఎదగడం కన్నా తక్షణం మోడీ ప్రధానమంత్రి కావడం బిజెపి జాతీయ నాయకత్వానికి ముఖ్యం. మోడీ రాష్ట్ర పర్యటనలో ఎన్టీఆర్ పేరును గుర్తు చేశారు. బాలకృష్ణతో పాటు టిడిపి ముఖ్యులు మోడీని కలిశారు. బాబు ఢిల్లీ పర్యటనలో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో అంతరంగిక సమావేశం జరిపారు. ఎన్‌డిఏతో కలుస్తారా? అంటే నేనిప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు అంటూ బాబు చిత్రంగా చింతామణి సూక్తులు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకు వామపక్షాలతో కలిసే బాబు ఉద్యమాలు చేశారు. రైతుల కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు వామపక్షాల నాయకులనే పిలిపించుకున్నారు. 2009లో వామపక్షాలతో కలిసే పోటీ చేశారు. బిజెపితో కలుస్తారా? అనే ప్రశ్న వచ్చినప్పుడు తక్షణం ఖండించాలి కానీ ఇప్పుడేమీ చెప్పను అంటున్నారు. 

కాంగ్రెస్‌తో బాబు కలిసిపోయారు అనే విమర్శ వచ్చినప్పుడు 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటూ ఖండిస్తున్నప్పుడు అదే స్థాయిలో బిజెపితో చెలిమిపై కూడా ఖండించాలి కదా? కానీ వరుసగా బిజెపి నాయకులను కలుస్తున్న బాబు ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు. హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం కన్నా పార్టీ శ్రేణులను, ప్రజలను మానసికంగా సిద్ధం చేసి చివరలో నిర్ణయం తీసుకోవడం బాబుకు అలవాటు బిజెపితో చేయబోయే కొత్త కాపురం విషయంలో సైతం అదే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల టిడిపికి   అండగా నిలిచే ఒక సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిజెపితో చెలిమికి ఇదే వర్గం అసక్తి చూపుతోంది. ఈ వర్గం బాబును వదిలి ప్రత్యామ్నాయం చూసుకుంటే బాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. ఈ ప్రమాదాన్ని గ్రహించే ఈ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు, ఈ వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు బాబు బిజెపి పట్ల ఆసక్తి చూపక తప్పని పరిస్థితి.

 1998లో బిజెపితో, 2009లో కమ్యూనిస్టులతో స్నేహం విషయంలో బాబు ఆయా పార్టీల రాష్ట్ర నాయకులను ఏ మాత్రం పట్టించుకోలేదు. జాతీయ నాయకత్వంతోనే నేరుగా సంప్రదింపులు జరిపారు. బాబు ఢిల్లీలో బిజెపి నేతలను కలిశాక రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈసారి మేం 294 నియోజక వర్గాల్లో పోటీ చేస్తాం అని ప్రకటించారు. 2009కు ముందు రాష్ట్రానికి చెందిన వామపక్షాల నాయకులు సైతం ఇలాంటి ప్రకటనలే చేసేవారు, కానీ బాబు మాత్రం రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఢిల్లీ నుంచి నరుక్కు వచ్చారు.
ఇప్పుడూ అంతే రాష్ట్ర బిజెపి నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండానే అటు నుంచి వ్యవహారం నడుపుతున్నారు. ఈ చెలిమి తమ పాలిట గండం అని తెలిసినా బిజెపికి ఆహ్వానించక తప్పని పరిస్థితి.


4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం