8, జనవరి 2014, బుధవారం

పాత కోణం- కొత్త పార్టీ

’’సార్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగం.. జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయో గం విజయవంతం అయింది కదా? దీనిపై మీ అభిప్రాయం చెబుతారా?’’ అని విలేఖరులు ప్రశ్నించగానే, తెలుగు బాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోంది, దానిలో భాగంగానే ఈ ప్రయోగం చేశారు. తెలుగుజాతిని చీల్చడానికి చివరకు అంతరిక్ష ప్రయోగాలను సైతం వాడుకుంటున్నారు. మనుషులనైనా, యంత్రాలనైనా కలపాలి కానీ విడిదీయడం కాదు. రాకెట్, ఉపగ్రహం రెండు వేరు కావడం అంటేనే ఎంత బాధగా ఉంటుంది. మీరెన్ని పార్టీలు పెట్టినా, ఎక్కడికి ఉపగ్రహాలు పంపినా రెండు గ్రహాల్లోనూ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది’’ అంటూ తెలుగు బాబు ఊగిపోతుండగా, ఒక నేత వచ్చి మెల్లగా చెవిలో సార్ కిరణ్ కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు చేయాల్సిన కామెంట్స్, క్రయోజనిక్ ప్రయోగం విజయవంతం అయినప్పడు చేయాల్సిన ప్రకటన రెండు కలిపి చెబుతున్నారు అని మెల్లగా చెవిలో చెప్పాడు. వెంటనే తెలుగు బాబు సర్దుకుని ...
పాదయాత్ర సమయంలో మీడియాలో నాకు లభించిన అపూర్వ స్పందన చూసి ఓర్వలేక దెబ్బతీయడానికి సోనియాగాంధీ, కిరణ్, జగన్, కెసిఆర్, నారాయణ, రాఘవులు, ఆర్ కృష్ణయ్య, చల్లయ్య నాయక్, భీంసింగ్ , వెంకట వీరయ్య అందరూ కలిసి కుట్ర పన్ని కిరణ్‌తో పార్టీ పెట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని ఓడించాలని కుట్ర పన్నినట్టుగా ఉందని వెనకి నుంచి కుర్ర జర్నలిస్టు జోకేశాడు.


***
కిరణ్, తెలుగు బాబు, సోనియాగాంధీ కుమ్మక్కు అయ్యారనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి అని జగన్ మీడియాను ప్రశ్నించారు. ఇలానే ఎన్నికలు జరిగితే ఎలాగైనా జగన్ ముఖ్యమంత్రి అవుతారు, 30 సీట్లు గెలిచి ప్రధానమంత్రి ఎవరుండాలో నిర్ణయిస్తారనే భయంతో సోనియాగాంధీ సలహా మేరకు, తెలుగు బాబు సూచనల మేరకు కిరణ్ కొత్త పార్టీ పెడుతున్నాడు. ప్రజల గుండెల్లో మా చానల్ ఉంది, నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మేమే విజయం సాధిస్తాం. 30 సీట్లు గెలిచి రెండు రాష్ట్రాలను ఒకటి చేస్తాను. తరువాత ఇం డియా పాకిస్తాన్‌లను ఏకం చేస్తాను. అమెరికా విధానాలను మారుస్తాను అని జగన్ బాబు సూటిగా స్పష్టంగా తన అస్పష్ట విధానాలను వివరించారు.


***
కిరణ్ పార్టీ అత్యంత ప్రమాదకరమైన నిర్ణ యం ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో మీకు తెలుసా? మన రాష్ట్రంలో అంటూ జయప్రకాశ్ నారాయణ్ అంకెలు చదువుతుంటే సార్ ఇవన్నీ గూగుల్‌లో మేం కూడా చూశాం. నెట్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ కూడా అందుబాటులో ఉంటుంది అది కాదు కానీ కొత్త పార్టీ గురించి మీరేమంటారు.?
మీకు అస్సలు ఓపిక లేదు, నేను ఎంతో కష్టపడి ప్రపంచంలో తొలి పార్టీ ఏది, మన దేశంలో ఏ పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఏ పార్టీ కార్యాలయం ఎక్కడుంది అనేది ఫోటోలతో సహా సేకరించి ఐదు గంటల పాటు సభలో మాట్లాడేందుకు సమాచారం అంతా సేకరించాను. అని జేపీ కొంత నిట్టూర్చి, ‘‘తెలుగుబాబును ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే కుట్ర ఇది. సమాజంలో మార్పు కోసమే మేం వచ్చాం నేను పోటీ చేసే చోటు సరే నేను లేని చోట తెలుగుబాబును గెలిపించి తెలుగు జాతి గౌరవాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.’’అని చెప్పాడు.
***
కొత్త పార్టీ ఏర్పాటు వెనుక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందేమో చూడాలి. ఎన్ని పార్టీలు పుట్టినా వామపక్షాలపై ఏ ప్రభావం ఉండదు అని నారాయణ, రాఘవులు ఉమ్మడిగా పలికారు. ఔను అసలు మీ పార్టీ ఉంటే కదా ప్రభావం పడేందుకు అని వెనక నుంచి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తి ఎవరో పలికారు.


***
బిజెపి కిషన్‌రెడ్డి సుదీర్ఘంగా వివరించేందుకు సిద్ధం కాగా, ప్రమాదాన్ని గ్రహించి సార్ ఒక్క ముక్కలో చెప్పండి టైమ్ లేదు అని విలేఖరులు ముందే చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పుట్టిన పార్టీలతో పాటు కొత్తగా పుట్టబోతున్న కిరణ్ పార్టీ సైతం బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది అయితే మేం ఎవరితో పొత్తు పెట్టుకోం, 294 నియోజక వర్గాల్లో పోటీ చేస్తాం, అభ్యర్థులు దొరక్కపోతే పక్క పార్టీ నుంచి చేబదులు తీసుకుంటాం కానీ పొత్తు మాత్రం పెట్టుకోం.


***
ఏమండీ మీరు పార్టీ పెడుతున్నారా? అని శ్రీమతి కొంత సీరియస్‌గా ముఖం పెట్టి అడిగింది.
ఆ విషయం నాకేం తెలుసు.. నేనూ ఇప్పుడే టీవిల్లో చూస్తున్నాను. ఇంత స్పందన చూస్తుంటే పెడితే బాగానే ఉంటుందేమో అనిపిస్తోంది. ఏమంటావు? కిరణ్ అన్నాడు.
మీమీద మీకే నమ్మకం లేకపోయినా మీరు పెట్టే పార్టీపై ఇంత మంది నాయకులు అంత నమ్మకం పెట్టుకోవడం విచిత్రమే కదండి అని శ్రీమతి అడిగింది.
‘‘సర్లే ముందు ఇంకా మిగిలిన వాళ్లేమనుకుంటున్నారో చూద్దాం’’ అంటూ కిరణ్ టీవి చానల్ మార్చాడు.
విలేఖరులు కెసిఆర్ వద్దకు వచ్చి సార్ కిరణ్ కొత్త పార్టీ పై మీ అభిప్రాయం అని అడిగితే..
పక్క స్టేట్ వాళ్లతో మాకేంటి? ఒక్కటి కాకపోతే పది పార్టీలు పెట్టుకోమను. వాళ్ల పార్టీ కార్యాలయం మా స్టేట్‌లో ఉంటే మాకే పన్ను లు వస్తా యి మాకేం పోయింది’’ ముగించాడు.


***
‘‘కిరణ్, జగన్, బాబు, కెసిఆర్‌లందరిదీ కాంగ్రెస్ డిఎన్‌ఏనే. మా డిఎన్‌ఏ వాళ్లు అధికారంలోకి వస్తే మేం వచ్చినట్టే కదా అని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ ఎదురు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీల డిఎన్‌ఏ మాదే, కొత్త పార్టీ డిఎన్‌ఏ మాదే. మేం డిఎన్‌ఏ హోల్‌సేల్ సప్లయర్స్‌మి అని దిగ్విజయ్‌సింగ్ ఇంగ్లీష్‌లో చెప్పి హిందీలో నవ్వారు.
నీతి: మనుషులంతా ఒకటే అనేది ఎంత అబద్ధమో! నాయకులందరి డిఎన్‌ఏ ఒకటే అనేది అంత నిజం.

1 కామెంట్‌:

  1. కిరణ్ కుమార్ రెడ్డి: ఆఖరి బంతి వేసేంతవరకు మాచి అయిపోదు. సాటిలైటును నా బాటుతో సిక్సు కొట్టి నా తడాఖా చూపిస్తా. పైలిన్ తూఫాను ఆపలేకపోయినా సాటిలైటును మాత్రం ఆపితీరుతా.

    చంద్రబాబు: ఇస్రో రాధాకృష్ణన్ గారికి ఎంతమంది పిల్లలు? ఆ సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగికి ఎంతమంది పిల్లలో చెబితే తప్ప ప్రక్రియ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. శ్రీహరికోట ప్రజలు ఎవరూ లేకుండా తమిళులు మాత్రమె నిర్ణయం తీసుకోవడం తెలుగు వారి ఆత్మగౌరవం పై దాడి.

    జగన్ మోహన్ రెడ్డి: సాటిలైటు ప్రయోగించాలని దివంగత వైఎస్ 41 మంది శాసనసభ్యులతో లేఖ రాసారనే ప్రచారం అబద్దం. సమైక్య తీర్మానం చేసాకే సాటిలైటు వ్యవహారంపై చర్చ

    డా. జయప్రకాశ్ (లోక్సత్తా): ఇస్రో సాటిలిటు ఐమ్సు & ఆబ్జెక్టులు కానీ ఆర్ధిక వివరాలు కానీ ప్రకటించక పోవడం సమాఖ్య వ్యవస్తకు చెంపపెట్టు. వెంటనే అన్ని దేశాలను సంప్రదించి ప్రపంచంలో ఉన్న 600 కోట్ల జనాభా అందరి సమ్మతి తీసుకోవాలి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం