23, నవంబర్ 2014, ఆదివారం

మొనగాళ్లకు మొనగాడు!!

‘‘జీవితం బుద్భుద ప్రాయం.. ఖరీదైన ఐస్‌క్రీమ్ అయినా ఎండ తగిలితే కరిగిపోవాల్సిందే... హెరిటేజ్ పాలకైనా సబ్బు నురగ ఉండాల్సిందే ఈ జీవితం కూడా అంతే నాయనా! ఉప్పు తిన్న విశ్వాసం కన్నా నురగ తాగిన అభిమానం ఎక్కువ. ట్రింగో ట్రింగాయహః మేల్కొండి... ’’ అంటూ స్వామి భీమ్‌పాల్ తన ప్రవచనాన్ని ముగించడంతో భక్తులు వరుసగా పాదాభివందనం చేసి వెళుతున్నారు. అంతా ముగియడంతో అంతరంగిక మందిరంలోకి భీమ్‌పాల్ అడుగు పెట్టాడు... అంతరంగిక మందిరంలో అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి. అక్కడుంటే వాళ్లంతా ఒకరి కన్నా ఒకరు మొనగాళ్లు.


‘‘ఔను స్వామి ట్రింగో ట్రింగాయహః ’’అంటే అర్ధమేంటి అని పాత్రికేయ పాపారావు అడిగాడు. భీమ్‌పాల్ పక పకా నవ్వి.‘‘ పిచ్చోడా ఆ పదానికి నాకు అర్ధం తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఎవరికీ అర్ధం కానీ ఏవో కొన్ని పదాలు చెబితే తప్ప భక్తులకు విశ్వాసం కలగదు... చూశావా నీ లాంటి దేశ ముదురు కూడా ఆ పదాన్ని గుర్తుంచుకుని అడిగావంటే నా టెక్నిక్ ఫలించినట్టే కదా?’’ అన్నాడు. ‘‘ అది సరే మనం కలిసి చాలా రోజులైంది. ఏంటి మీ మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి?’’ అని అభిమానంతో స్వామి అడిగాడు.


‘‘ఈ మధ్య పెద్దగా గిట్టుబాటు కావడం లేదు’’ అని రాజకీయ నానాజీ
దీనంగా చెప్పాడు. ‘‘ ఇదిగో నానాజీ చింతామణికైనా ఆదాయం కొంత కాలమే ఉంటుంది. కానీ కాలాతీతంగా ఆదాయాలు గల వాళ్లం మనం.’’.. అంతరంగిక మందిరంలోనూ నటిస్తే ఎలాగోయ్’’ అని అభిమానంతో చీవాట్లు పెట్టాడు. మూడో పెగ్గు తరువాత చర్చ వారి వారి వృత్తులపై సాగింది.
‘‘ఎంత హీరోనైనా ఏ సినిమా నడుస్తుందో ఏది నడవదో తెలియదు. రోజుకో కొత్త హీరో మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. తాత పేరు చెప్పుకుని బతికేద్దామన్నా వంశ వృక్షం పెద్దది కావడంతో ఒక్కో తాత ఇంట్లోంచి డజన్ల మంది రంగంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ తప్ప ఎక్కడ బతకలేం ఈ కష్టాలు పగోడికి కూడా వద్దని ’’హీరో గద్గద స్వరంతో పలికాడు.
అతని బాధ విన్నాక ఔను నిజమే అని అంతా తలలు ఊపారు. కొందరు ఊరడించారు.


‘‘నీకు రాసుకోవడానికి పెన్ను కాగితం కూడా ఎవడో ఒకడు ఇవ్వాల్సిందే కదా? కోట్లు గడించావ్ ..నీ పనే బాగుందోయ్’’ అని పాత్రికేయ పాపారావు వైపు చూశారు.


‘‘ఎక్కడ స్వామి ఆ రోజులే పోయాయి. ఆ కాలంలో అంటే ఐదారుగురే ఉండేవారు. ఒక్కొక్కడు ఒక్కో నాయకుడ్ని పట్టేసేవాడు. ఆ నాయకుడి దశ తిరిగితే వాడ్ని పట్టుకున్నవాడి దశ కూడా తిరిగేది. మీరు ఆ కాలాన్ని చూసి ఈ కాలం వాళ్లను అంచనా వేస్తే ఎలా? ఈ రోజుల్లో పార్టీకో అరడజను చానల్స్, పావు డజను పత్రికలుంటున్నాయి. రెండు రాష్ట్రాలకు నాలుగు డజన్ల చానల్స్... ఐటి దాడి జరిగితే సేఠ్ చంపక్‌లాల్ గోడ దూకి పారిపోయినట్టు, ఎసిబి వాళ్లు రైడ్ చేస్తే మండలాఫీసులో గుమస్తాలు పరుగులు తీసినట్టు మీడియా కంటికి కనిపించకుండా నాయకులు పరుగులు తీస్తున్నారు. వాళ్లు మాకు చిక్కితే కదా! వాళ్లే చిక్కనప్పుడు మాకేం లాభం. ఒకవేళ చిక్కినా 16వేల మంది గోపికల మధ్య చిన్నికృష్ణుడు అన్నట్టుగా ఉంటోంది... వ్యవహారాలు జరపడం తరువాత కనీసం వాటి గురించి మాట్లాడేంత ఏకాంత సేవ దక్కడం లేదు. అప్పటి రోజులు మళ్లీరమ్మన్నా రావు’’ అని పాత్రికేయ పాపారావు దీనంగా చెప్పిన దానికి మిగిలిన వారు నిజమే అన్నారు.


‘‘ఎంత ఉన్నతాధికారుల మైతేనేం ఆదాయం బాగా తగ్గింది మా వైపు చూడకండి’’అని ఉన్నతాధికారి మరో పెగ్గు కోసం చేయి చాచాడు. ‘‘మీకేంటి సార్ మీ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ కూడా పార్ట్‌టైం వృత్తిలో లక్షలు సంపాదిస్తున్నారు ’’ అంటూ ఓబులేషు వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ అంతా ఆయన వైపు చూసి నవ్వారు. వౌనమే తన సమాధానం అన్నట్టు ఆయన తన పనిలో తానుండిపోయారు.


‘‘నా వైపు చూడాల్సిన అవసరం లేదు. నేను నేలరాలిన ‘తార’ను’’ అని అమె వయ్యారంగా పలికింది. ‘‘ఒక్కోసారి డెన్ నిర్వాహణ ఖర్చులు కూడారావడం లేదు, ఎక్కడ చూసినా సిసి కెమెరాలే ఇక కిడ్నాప్‌లు ఎక్కడ చేస్తాం’’ అని దావూద్ అబ్రహం తనను అడగక ముందే తన పరిస్థితి చెప్పారు. ఏదో మంచి కాలంలో దోచుకున్న సొమ్ముతో కాలం గడుపుతున్నాం కానీ ఇప్పుడు మా బిజినెస్ ఏ మాత్రం లాభసాటిగా లేదని అందరి మాటల సారాంశం.
స్వామి భీమ్‌పాల్ నవ్వి ‘‘మంచి వ్యాపారి ఎప్పుడూ తన లాభాన్ని చెప్పడు బేరాలు లేవని ఏడుస్తూనే ఉంటాడు.. జుమేరాత్ బజార్‌లో దొంగ సొమ్ము అమ్మే సులేమాన్, రైతు బజార్‌లో వంకాయలమ్మే కిష్టయ్య నుంచి స్విస్ బ్యాంకులో దొంగ ఖాతాలున్న మీ వరకూ అంతా బేరాలు లేవనే అంటారు. అలా అనడం వ్యాపార ధర్మం అదంతే’’ అని నవ్వాడు.


రాజకీయ నానాజీ మైకు కోసం చేయి పైకెత్తినట్టు చేయి చూపగానే అంతా అతని మాటల వినేందుకు ఆసక్తి చూపారు. ‘‘ప్రతి వృత్తిలోనూ రిస్క్ ఉంటుంది. ఒక్కో నియోజక వర్గంలో కనీసం నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు ఉంటాయి. ఒక్కో పార్టీ నుంచి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించే వాళ్లు కనీసం ముగ్గురుంటారు. అంటే ఒక నియోజక వర్గంలో 12 మంది గట్టిగా ఐదేళ్లపాటు ఖర్చు చేస్తే, అందులో ముగ్గురికి టికెట్ వస్తుంది. ఒక్కరు గెలుస్తారు. టికెట్ వస్తుందో రాదో తెలియదు, వస్తే గెలుస్తామో లేదో తెలియదు, గెలిస్తే మేం గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. మా రాజకీయ వ్యాపారంలో ఉన్నంత రిస్క్ మరే వ్యాపారంలో లేదు’’ అని చెప్పగానే వెనక నుంచి ఎవరో ఔను రిస్క్ ఎక్కువే ఆదాయం ఎక్కువే అని గోణిగారు.


‘‘ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే మా అందరి కన్నా ఆదాయంలో స్వామి భీమ్‌పాలే మొనగాడు. తనకు కూడా అర్ధం కాని నాలుగు మాటలు చెప్పి మహామహులతో కాళ్లు మొక్కించుని సామాజ్య్రాలను సృష్టించుకుంటారు. మర్డర్ చేసినా అరెస్టు చేసేందుకు పోలీసులు జంకుతారు. ఎవరో ఒకరు సాహసం చేసి అరెస్టు చేసేందుకు వస్తే వేలాది మానవ కవచాలు రక్షణగా నిలుస్తాయి.. కానుకలిస్తారు, కాళ్లు మొక్కుతారు. ఇంతకు మించిన లాభసాటి వ్యాపారం ఏముంటుంది అని రాజకీయ నానాజీ చెప్పిన మాటలకు అంతా చప్పట్లు కొట్టారు.


‘‘మేమంతా మొనగాళ్లం కావచ్చు కానీ మీరు మొనగాళ్లకే మొనగాడు’’ అంటూ అంతా అనడంతో స్వామి భీమ్‌పాల్ ముసిముసిగా నవ్వుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం