4, నవంబర్ 2014, మంగళవారం

మోదీ మీద మీకు నమ్మకం లేదా?

ఇన్నాళ్లకు నా నోములు ఫలించాయి. మీమ్ములను ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అని శ్రీమతి ఏదేదో అంటుంటే శ్రీపతి అయోమయంగా చూస్తున్నాడు. ఇదే నండి నేను అన్ని దేవతలను కోరుకున్నది.. మీలో ఈ మార్పు కోసమే నేను ఉప వాసాలు ఉన్నాను. ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అన్ని గుళ్లు, చర్చిలు, దర్గాలు తిరిగాను. సీమలోని తిరుపతికి వెళ్లాను, తెలంగాణలోని యాదగిరి గుట్టకెళ్లాను. ఉత్తరాంధ్రలోని సింహాచలం కోస్తాలో అన్నవరం వెళ్లాను. ఆ దేవుళ్లు నన్ను కరుణించారు. అంటూ శ్రీమతి చెప్పుకుంటూ పోతూనే ఉంటే శ్రీవారు అడ్డుకున్నారు. ఈరోజు మీరు ఎన్నయినా అనండి. నా దృష్టిలో ఈ రోజు మీరు మారిన మనిషి.. మనుషుల్లో దేవుడు అంటూ తనకు గుర్తున్న  దేవుడి సినిమా పేర్లన్నీ శ్రీమతి చదివేసింది.

ఏంటి ఈ రోజు ఇంకా మందు ముట్టుకోలేదని దేవుడంటున్నావా? ఏంటి? అలాంటి భ్రమలేమీ పెట్టుకోకు. మా లాంటి వాళ్లు మందు మానేస్తే ఆదాయాలు లేక ప్రభుత్వాలు పడిపోతాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. అన్న కాలంలో మద్యనిషేధ ఉద్యమం జరిపి, అన్న అధికారంలోకి రాగానే నిషేధం విధించి, అన్నను తప్పించి నిషేధం ఎత్తివేయించారు అల్లుడు గారు. అధికారం పోగానే దశలవారీగా మద్యనిషేధం అంటూ ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మద్యం ఉత్పత్తిని పెంచాలని మందు చూపుతో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి నీకు ఏమర్ధం అయింది? అన్న, అల్లుడు, తమ్ముడు, మామ ఎవరు అధికారంలో ఉన్నా మందు ఆదాయం లేనిదే అలా ముందుకు వెళ్లలేరు. మందు లేనిదే ప్రభుత్వాలే నడవనప్పుడు నేను నడుస్తానని ఎలా అనుకున్నావు డియర్’’ అని శ్రీవారు మందంగా చెప్పుకొచ్చాడు.

అది కాదు ఇన్నాళ్లకు మీరు పిల్లల చదువుపై దృష్టి పెట్టారు నాకదే చాలు అని శ్రీమతి కళ్లు తుడుచుకుంది. ఇవి కన్నీళ్లు కాదండి ఆనంద భాష్పాలు అని రోటీన్ డైలాగు చెప్పకు నాకు చిరాకు అంటూ చిరాగ్గా పలికి పిచ్చి దానా నోట్ బుక్‌లో లెక్కలతో కుస్తీ పడుతుంటే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు.

కాగితాల్లో లెక్కలు, కంప్యూటర్‌లో అకౌంట్స్, పక్కన క్యాలుక్యులేటర్ ఇవన్నీ పిల్లల చదువు గురించి కాకుంటే మరెందుకండి... రాత్రంతా నిద్ర లేకుండా ఆ లెక్కలతో గడుపుతున్నారు. మీలో మీరే ఏదో లెక్కిస్తున్నారు. పిల్లల కోసం మీరింతగా మారిపోతారని కలలో కూడా అనుకోలేదు. ఇంజనీరింగ్ చదివే మన పెద్దది కూడా సరిగ్గా ఇలానే కూర్చుంటుంది. నాకు తెలియదనుకోకండి నేను మరీ అంత అమాయకురాలినేమీ కాదు అని శ్రీమతి చెప్పింది.
దాచెపల్లి బుక్ డిపోవారి లెక్కల పుస్తకాలన్నీ అక్కడ కుప్పగా పోసినట్టుగా ఉందా వాతావరణం. నోట్‌బుక్‌లో ఏవో అంకెలు కొట్టివేతలు, తీసివేతలు, భాగ హారాలు. శ్రీమతి ఎంత చెప్పినా వినేట్టు లేదని శ్రీవారు తన పనిలో తాను పడ్డాడు. కొట్టివేతలు, తీసివేతలతో బుర్ర వేడెక్కుతోంది.
లెక్క చిక్కిందనే ఉత్సాహంతో శ్రీవారు ఉందో లేదో స్వర్గం నా వాటా నాకిచ్చేసేయ్ అంటూ కూనిరాగం తీయసాగాడు. కథకు సంబంధం లేకుండానే తెలుగు సినిమాలో హాస్యనటులు ప్రత్యక్షం అయినట్టు శ్రీమతి వెంటనే అక్కడికి వాలిపోయింది. ఆ పాటను అలా పాడొద్దండి. అది నాకు చాలా ఇష్టమైన పాట. అలా ఖూనీ చేస్తే భరించలేను. నా వాటా నాకిచ్చేసేయ్ కాదు. నా బాల్యం నాకిచ్చేసేయ్ అనాలి. ఆ గాయకుడు గజల్ శ్రీనివాస్ నా చిన్నప్పటి నుంచి ఆ బాల్యం పాట మీదే బండి లాక్కొస్త్తున్నాడు. మీరేంటి ఇలా పాడుతున్నారు’’ అని శ్రీమతి కోపగించుకుంది.

ఇదిగో ఇందుకే నాకు చిరాకేస్తుంది. అసలు విషయం తెలియకుండా మధ్యలో మాట్లాడేస్తావు అని శ్రీవారు కోపగించుకున్నారు.
అది సర్లే కానీ నీకో శుభవార్తోయ్.. ఇంత కాలం ఏమీ సంపాదించలేదు. పిల్లల భవిష్యత్తు ఏమిటి? అంటూ ఓ తెగ ఇదయ్యావు కదా! ఇప్పుడే లెక్క తేలింది. చెబుతున్నాను విను అంటూ శ్రీవారు చెప్పబోతుంటే శ్రీమతి సెల్‌ఫోన్ రింగైంది. శ్రీమతి మాట్లాడుతూ అలాగా అంటూ ఎగిరి గంతేసింది. ఏమండోయ్ శుభవార్త. మా పిన్ని మూడవ మనవరాలికి పిల్లలు లేరంటే సంతాన లక్ష్మి వ్రతం చేయమని నేను చెప్పాను కదా? పూజలు ఫలించాయి లక్ష్మీదేవి లాంటి బిడ్డను కందట ఇప్పుడే ఫోన్ చేసింది అని శ్రీమతి సంతోషంగా చెప్పింది.
కలిసొచ్చే కాలానికి ఎవరో ఒకరు ఇలా అడ్డుతగులుతుంటారు అని చిరాకు పడ్డాడు.
అదేంటండి వారెవరికో అమ్మాయి పుడితే మనకు వచ్చిన నష్టం ఏమిటి? అని శ్రీమతి ఆశ్చర్యపోయింది.

‘‘ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆస్తి చేతిలో పడే సమయానికి ఇలా కొత్త వారసులు పుట్టుకొస్తుంటే కోపం రాకుండా ఉంటుందా?’’ అని శ్రీవారు చిరాకుగా అన్నాడు.
శ్రీవారు చిరాకుగా ముఖం పెట్టి కాస్సేపు ఆగు అంటూ మళ్లీ లెక్కలు చేస్తూ ఆ ఇప్పుడు లెక్క తేలింది. మీ పిన్ని మనవరాలి సంతానానికి కూడా వాటా వేశాక తేలిన లెక్క ప్రకారం మనకు త్వరలోనే 20లక్షల 16వేల 222 రూపాయల 54 పైసల వాటా దక్కుతుంది. అని శ్రీవారు లెక్క తేల్చారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకో, వడ్డాణం చేయించుకుంటావో, అపార్ట్‌మెంట్ కొంటావో, యాత్రలకు వెళ్లొస్తావో, పిల్లల పేర్లమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటావో నీ ఇష్టం..’’ శ్రీవారు ఉదారంగా వరం ఇచ్చేశాడు.
వారసులు లేని బంధువులు ఎవరైనా పోయారా? ఆస్తి కలిసొచ్చిందా? అని శ్రీమతి ఆసక్తిగా అడిగింది.
సరే నా మాటల మీద నీకు నమ్మకం ఎప్పుడుంది కానీ నీకు నామీద నమ్మకం లేకపోయినా మోదీ మీద నమ్మకం ఉంది కదా?
‘‘మొన్న జన్‌ధన్ యోజన పేరుతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించాడు గుర్తుందా? విదేశాల్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ప్రధానమంత్రిని కాగానే అది తెప్పిస్తాను ఒక్కొక్కరికి ఎంతొస్తుందో లెక్కలు చెప్పాడు గుర్తుందా? ఆ డబ్బుకు వడ్డీ, ఆ తరువాత పుట్టిన పిల్లలు ఇవన్నీ లెక్కిస్తే మన వాటా తేలింది. రోజుకోసారి బ్యాంకుకు వెళ్లిరా ఏ రోజైనా మన అకౌంట్‌లో డబ్బు జమ అవుతుంది,’’అని శ్రీవారు శ్రీమతికి భరోసా ఇచ్చారు.
మీరు కూడా ఓ సారి బ్యాంకుకు వెళ్లి రండి...
ఏం మోదీ మీద  మీకు నమ్మకం లేదా?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం