21, డిసెంబర్ 2014, ఆదివారం

గ్రామానికో గాడ్సే విగ్రహం!

అంతరించి పోయిన రాక్షస బల్లులను తిరిగి పుట్టించేందుకు చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయట! జురాసిక్ పార్క్ సినిమా పుణ్యమా అని రాక్షస బల్లులపై జనంలో ప్రేమ బాగానే పెరిగింది. తిరిగి పుడితే బాగానే ఉండనుకునేవారికి కొదవ లేదు. అంతరించి పోయిన జాతులను తిరిగి పుట్టించేంతగా శాస్తవ్రిజ్ఞానం అభివృద్ధి చెందితే పోయినోళ్లను తిరిగి పుట్టించడం కూడా సాధ్యం కావచ్చు. ఇప్పటికే అధిక జనాభాతో ప్రపంచం సతమతమవుతోంది. అప్పుడు చచ్చిన వాళ్లు తిరిగి పుడితే ఇంత జనాభాలో సమస్యలతో బతకలేక ఆ చచ్చిపుట్టినోళ్లు మళ్లీ చచ్చి ఊరుకుంటారు. 

నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని చిన్నప్పుడు స్కూల్స్‌లో పిల్లలను అడగడం ఉపాధ్యాయులకు ఓ అలవాటు. ఏదో పెద్ద అనుకున్నదే అయినట్టు. అలా ప్రశ్నించిన ఉపాధ్యాయులేమైనా పెద్దయ్యాక తాము ఉపాధ్యాయులు కావాలని చదువుకునేప్పుడు ఏమైనా అనుకున్నారా? ఏమిటి? ప్రధానమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను సేవ చేసేస్తాను అని పిల్లలు ముచ్చటగా చెబుతుంటారు. ఎంసెట్‌లో ర్యాంకర్లు టీవిల ముందు ఎంత చక్కగా చెబుతారో డాక్టర్‌నై పేదలకు సేవ చేస్తాను అని ఎంసెట్ ప్రారంభం అయినప్పటి నుంచి ర్యాంకర్లు చెబుతూనే ఉన్నారు. అలా సేవ చేసేవారు ఎక్కడున్నారా? అంటే ఎంత వెతికినా కనిపించరు. పాకిస్తాన్‌లో కాస్త ఎవరినన్న అడిగితే దావూద్ ఇబ్రహీం ఇల్లు చూపిస్తారేమో కానీ పేదలకు ఉచితంగా సేవ చేసే డాక్టర్లు కనిపించడం కష్టం. కోటి రూపాయల డబ్బుతో సీటు కొనుక్కోని ఐదేళ్లపాటు ఆహోరాత్రులు కష్టపడి చదివే వారి నుంచి పేదలకు సేవ ఆశించడం కూడా ఆత్యాశే.
ఎంసెట్ ర్యాంకర్లు చదువు పూర్తయ్యాక కార్పొరేట్ ఆస్పత్రులు, సొంత ఆస్పత్రిలోనూ కనిపిస్తారు.


ఆ సంగతి వదిలేద్దాం. కాలం మారింది డైనోసార్స్‌ను, చచ్చిన వారిని బతికించే రోజులు వచ్చాక..... నువ్వు ఎవరిని తిరిగి బతికించాలనుకుంటున్నావు? అని టీచర్ ప్రశ్నిస్తే, పిల్లలు చెప్పే సమాధానాలు ఎలా ఉంటా యో?
రావణుడిని తిరిగి బతికించాలని చాలా మంది కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రావణుడిని తిరిగి బతికించినా ఈ లోకంలో పాపం ఆ అమాయకుడు బతకలేక చచ్చి ఊరుకుంటాడు. రావణాసురుడు అత్యాచార యత్నం చేశాడు కానీ అత్యాచారం చేయలేదు. అలాంటిది అడుగడుగునా రావణుడి తాతలు విజృంభిస్తుంటే అమాయక రావణుడు వీళ్ల మధ్య బతుకగలడా? బాబోయ్ నేనీ లోకంలో బతకలేను మళ్లీ వచ్చి మళ్లీ చంపేయమని రాముడ్ని వేడుకోకుండా ఉంటాడా?


ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున ఆయన కుమారులు మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా అంటూ ప్రకటనలు ఇచ్చేవాళ్లు. పాపం అల్లుడి చేతిలో మోసపోయిన కుమారులు తండ్రి మళ్లీ పుడితే కానీ తమకు గుర్తింపు లేదని తొందరలోనే గుర్తించారు. ఒకవేళ వాళ్లు అలా కోరినా అల్లుడు వీటోతో వాళ్ల కోరిక అడ్డుకోగలరు.
ఇండియానే ఇందిరా అని బారువా ఎంత మొత్తుకున్నా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇండియా అంటే గాంధీజీ పుట్టిన దేశం. ఇండియాను ఇప్పటికే గాంధీజీ దేశంగానే చూసేవాళ్లకు కొదవ లేదు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ప్రపంచానికి అహింస అనే బలమైన ఆయుధాన్ని పరిచయం చేశారు. తమ మీద పోరాడిన నాయకుడు అయినా ఆయన్ని బ్రీటిష్ వారు సైతం గౌరవించారు. ఇప్పటికీ ఆ దేశంలో గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. ఆఫ్రీకా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి అనేక దేశాల్లో గాంధీజీ విగ్రహాలున్నాయి. ప్రపంచాన్ని తెరవెనుక నుంచి పాలించే అమెరికా వంటి శక్తివంతమైన దేశ పాలకులు తమ ఉపన్యాసాల్లో గాంధీజీ బోధనలను సగర్వంగా ప్రస్తావిస్తుంటారు. అలాంటి గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు చాలా బలంగా వాదిస్తున్నారు. గ్రామ గ్రామాన గాడ్సే విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలట! గాంధీజీ సిద్ధాంతాలను మనం మరిచిపోయినా గ్రామ గ్రామాన గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. కొత్తగా విగ్రహాలను ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ విగ్రహాలనే రీ మోడల్ చేసి గాడ్సే విగ్రహాలుగా మార్చే ప్రతిపాదన వస్తుందేమో చూడాలి. చనిపోయిన వారిని తిరిగి పుట్టించే రోజులు వచ్చినప్పుడు ఈ భక్తులు తమ మొదటి డిమాండ్‌గా గాడ్సేను తిరిగి పుట్టించాలని కచ్చితంగా అడిగి తీరుతారు. 


అమెరికాలో వాడెవడో బీర్లమీద గాంధీజీ బొమ్మను ముద్రించాడు ఇదేం పోయే కాలం అని ఆ దేశంలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. పాపం అమాయకులు దేశం వీడినా వారిలో ఇంకా గాంధీజీపై అభిమానం వీడలేదు. గాంధీజీ అంటే భారతీయతకు ప్రతీక అని భావిస్తూ తమ దేశానికి అవమానం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. పోనీలే అని అమెరికా వాడు ఊరుకుంటున్నట్టుగా ఉంటున్నాడు కానీ దీనిపై న్యాయపోరాటం చేస్తే మన వాళ్లు గాంధీజీ బోధనలతో బలంగా వాదన వినిపిస్తే, ఆ దేశం అడ్వకేట్ ఒక్క ముక్కలో తేల్చి పారేయవచ్చు. పోవయ్యా పో గాంధీజీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆ గాంధీని చంపిన గాడ్సేనే నిజమైన దేశభక్తుడు అని గౌరవనీయులైన ఎంపి, గాడ్సేకు గ్రామ గ్రామాన విగ్రహాలు విగ్రహాలు కట్టించాలని మీ దేశం వారే డిమాండ్ చేస్తున్నారు అని ఒక్క మాట చెబితే సరిపోతుంది.


ఇది ప్రజాస్వామ్య ప్రపంచం. గొంతున్నవాడు గొంతుతో గొంతు లేని వాడు రాతతో ఏమైనా మాట్లాడవచ్చు. భగవద్గీత హింసను ప్రేరేపిస్తోంది నిషేధించి తీరాల్సిందే అని ఆ మధ్య రష్యాలో కొందరు కోర్టుకు వెళ్లారు. కింది కోర్టు ఔను నిజమే హింసను ప్రేరేపిస్తోంది అని తేల్చి చెప్పింది. పై కోర్టు అంగీకరించక పోవడం వల్ల వారి కోరిక తీరలేదు కానీ లేకపోతే ప్రపంచంలో టెర్రరిజానికి, తాలిబాన్లహింసకు భగవద్గీతే కారణం అని కోర్టు తీర్పు ను సాక్షంగా చూపించి వాదించే వారూ ఉండేవారు. రష్యా కోర్టుకు భగవద్గీతలో హింస కనిపిస్తే అనేక మంది ప్రపంచ మేధావులకు భగవద్గీతలో శాంతి సందేశం కనిపించింది. ఎవరిష్టం వారిది. కానీ ఓ చిన్న కోరిక.

 చనిపోయిన వారు తిరిగి పుట్టే చాన్స్ ఉన్నా ఓ మహనీయులారా! మీరు మాత్రం మళ్లీ పుట్టకండి .

3 కామెంట్‌లు:

  1. > రావణాసురుడు అత్యాచార యత్నం చేశాడు కానీ అత్యాచారం చేయలేదు.
    అలాంటి ధుష్కృత్యాలకు మితిలేకపోబట్టే వాడికి శాపం కలిగింది. మీ మాట పొరపాటు.

    >గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని....
    మనకు గాంధీగురించైనా గాడ్సే గురించైనా స్వయంగా అధ్యయనం చేసి తెలుసుకున్నది తక్కువా, అరకొరగా చదివీ ప్రచారాలు వినీ గ్రహించినది ఎక్కువా అని మరచిపోకండి. గాడ్సే మంచివాడా చెడ్డవాడా అన్నది వివాదాస్పదమైన విషయం కావటానికి ఆయన గాంధీని చంపటం ఒక్కటే కారణం కాదు, ఆ గాడ్సే తానెందుకలా ప్రవర్తించిందీ కూడా స్వయంగా వివరించాడనీ (కోర్టులో?) విన్నాను. ఆ వివరాలు మనకు ఒక పధ్ధతిప్రకారం అందుబాటులోనికి రానీయలేదు ప్రభుత్వాలు. ఆ సమాచారం చూడకుండా తొందరపడి మనం ఒక నిర్ణయం తీసుకోవద్దు.

    >ఓ మహనీయులారా! మీరు మాత్రం మళ్లీ పుట్టకండి .
    ఈ మాట బాగుంది. వివేకానందుడు కనక మళ్ళి పుట్టి అలాగే మాట్లాడితే అతగాణ్ణి మన సెక్యులరిష్టులంతా ఒక టెర్రరిష్టుగా ముద్రవేసే వారు. ప్రభుత్వాలు ఖైదు చేసేవి. అందుచేత పెద్దలు పుస్తకాల్లో ఉంటేనే బ్రతికిపోతారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గాడ్సే తాను గాంధీ గారిని ఎందుకు హత్య చేసానో అంటూ రాసిన పుస్తకం (మరాఠీ మాతృకకు ఆంగ్ల సేత) అమాజాన్లో 250/- కు దొరకుతుంది.

      మహాత్మా గాంధీ హత్యలో పాలు పంచుకున్న నాథూరాం గాడ్సే తమ్ముడు గోపాల్ గొడ్సె దీన్ని ముందు ఒక మరాఠీ మాసపత్రికలో నెలకొక అధ్యాయం చప్పున ధారావాహికంగా ముద్రించాడు.

      కోర్టులో హంతకుడు & అతని వైపు మాట్లాడిన సాక్ష్యుల వాజ్మూలాలు అన్నీAIR లో ఉన్నాయి. గొడ్సె తన హత్యను సమర్తించుకుంటూ చేసిన "సంజాయిషీ" యూట్యూబులో కూడా దొరుకుతుంది.

      ఆసక్తి & ఓపిక ఉన్నవారు ఎటువంటి ఆటంకం లేకుండా ఇవి చదవొచ్చు/వినొచ్చు.

      తొలగించండి
  2. I gave some links & info to answer Shyamaleeyam sir's question. Can you check why it is not published, thanks.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం