29, డిసెంబర్ 2014, సోమవారం

పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.

‘‘బాబాయ్ ఆ ఒక్క కాంట్రాక్టు మనకు దక్కిందంటే మన దశ తిరిగి పోతుంది ’’
‘‘ఏరో నువ్వు కాంట్రాక్టులు కూడా చేస్తావా? ’’
‘‘ఇప్పటి వరకు లేదు బాబాయ్ నీ ఆశీర్వాదం ఉంటే మొదలు పెడతాను ’’
‘‘నీ దుంప తెగ మళ్లీ ననే్న ఇరికించావు. కాంట్రాక్టుల సంగతి నాకు తెలిస్తే టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ ఎందుకుంటానురా? ఆ కాంట్రాక్టులేవో నేనే చేసుకుంటూ ఉండేవాడిని కదా? విభజన అనివార్యం అని, కొత్త రాజధాని గుంటూరు- విజయవాడల మధ్య ఉంటుందని అడిగినోడికీ అడగనోడికీ మూడేళ్ల నుంచి చెబుతూ వచ్చాను కానీ ముందస్తుగా అక్కడ ఓ ప్లాట్ కూడా కొనలేదు. ఇప్పుడు కొనాలన్నా జీవిత కాలంలో సంపాదించింది అంతా కలిపినా కొనలేను. అలాంటి నన్నొచ్చి అడుగుతావేంటిరా అబ్బాయ్’’
‘‘జ్ఞానం ఉన్నోడి దగ్గర డబ్బుండదు. డబ్బున్నోడి దగ్గర జ్ఞానం ఉండాలనేమీ లేదు. రోజూ అరడజను పత్రికలు చదివి విభజన ఖాయం, ఎవరు గెలిస్తే కొత్త రాజధాని ఎక్కడో నువ్వు ఊహించావు కానీ కనీసం ఒక్క పేపర్ కూడా చదివే అలవాటు లేని ఎంతో మంది అక్కడ ఎకరాలకు ఎకరాలు కొనేశారు బాబాయ్. భూములు కొనాలంటే కావలసింది జ్ఞానం కాదు డబ్బు. అయినా నేను నీ దగ్గరకొచ్చింది పెట్టుబడి కోసం కాదు బాబాయ్ జ్ఞానం కోసం. రాజకీయాల గురించి తెగ ఉపన్యసిస్తుంటారు కదా? పెద్దలకు చెప్పి నాకో కాంట్రాక్టు ఇప్పించొచ్చు కదా? ’’
‘‘అది సరేరా? చెక్కబల్లలు చేసుకునే నువ్వేం కాంట్రాక్టులు చేస్తావు, నీకెవరిస్తారు? ’’


‘‘ఇప్పుడు పాయింట్‌కొచ్చావు బాబాయ్. ఇంత కాలం ఐడియా లేక ఇలా ఉండిపోయాను కానీ నిన్న ఇంటికి మిర్చి బజ్జీల పొట్లం తీసుకొస్తుంటే అందులో పోయిన నెల వార్త ఒకటి చదివాక నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది... ఇదిగో నిన్న తెచ్చిన మిర్చీ బజ్జీల పొట్లం పేపర్. ’’
‘‘నూనె మరకలు తప్ప ఏముందిందులో అంత బ్రహ్మాండమైన ఐడియా వచ్చేందుకు? ’’
‘‘అదే బాబాయ్ బిజినెస్ ఆలోచనలున్న నాకు మీకు తేడా. కార్యకర్తలకు పెద్ద పీట..ఈ వార్త ఓసారి చదువు’’
‘‘అబ్బా నా చిన్నప్పటి నుం చి వింటున్నాను ఈ మాట ఇం దులో పెద్ద విశేషం ఏముంది?’’
‘‘అక్కడికే వస్తున్నా... ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆ పార్టీకి 50లక్షల మంది కార్యకర్తలున్నారు. ఉభయ రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రెండు కోట్ల మంది సభ్యులైనా ఉంటారు కదా? బాబాయ్’’
‘‘ఏమో ఆ సంగతి నాకు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్యను మించి పార్టీలకు కార్యకర్తలు ఉంటారంటే నమ్మబుద్ధి కావడం లేదురా? సంఖ్య సంగతి ఎందుకు కానీ ఎంత మంది కార్యకర్తలుంటే నీకేంటి? ’’
‘‘నీకు అన్నీ అనుమానాలే. కావాలంటే ఆన్‌లైన్‌లో అడ్రస్‌లు కూడా చూసుకోవచ్చు. ఇక అక్కడికే వస్తున్నా? నిజమైన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని ఈసారి పాలకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ గతంలో చెప్పిన వాటికి సంబంధం లేదు.కనీసం ఒక్క పార్టీ వారిని మంచి చేసుకున్నా 50లక్షల పీటలు తయారీ కాంట్రాక్టు దక్కుతుంది. ఇక మీలాంటి వారు సహకరిస్తే అన్ని పార్టీలకు మనమే పీటలు పంపించగలిగామంటే రెండు కోట్ల పీటలంటే ఆలోచించుకో బాబాయ్ .. మన పంట పండుతుంది. ఈ దెబ్బతో తరతరాలుగా కూర్చోని తినొచ్చు. ’’
‘‘నిజంగా కార్యకర్తల కోసం పెద్ద పీటలు వేయాల్సి వస్తే ఏ సింగపూర్ కంపెనీకో, జపాన్ కంపెనీకో కాంట్రాక్టు ఇస్తారు కానీ తొట్టెంపూడిలో కర్ర బెంచీలు చేసుకొని బతికే నీకెందుకిస్తారు.? నీకు విషయం అర్ధం కావడం లేదు. పెద్ద పీట అనేది నాయకుల ఊతపదం దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నావ్. ఎన్నికల ముందు దళితులకు పెద్ద పీట అన్న విషయం గుర్తుం దా? ఒకాయన పెద్ద దళితుడను అవుతాను అంటే మరొకాయన పెద్ద పీట కాదు పెద్ద కుర్చీనే దళితులకు ఇస్తాను అన్నారు. అంతకు ముందు ఒక్కో కుల సమావేశాన్ని నిర్వహించి మీ కులానికే పెద్ద పీట అని మాట ఇచ్చారా? లేదా? ’’
‘‘నేనూ అదే చెబుతున్నాను కదా బాబాయ్. క్యాడర్‌కు, ఇన్ని కులాలకు పెద్ద పీటలు తయారు చేసే కాంట్రాక్టు మనం దక్కించుకుంటే మన దశ తిరిగిపోతుంది. ఇప్పుడంటే మన ఊళ్లో ఎవరూ పీటలు చేయించుకోవడం లేదు కానీ పీటలు తయారీలో మాకున్న అనుభవం మీకు తెలియంది కాదు. పీటలు తయారు చేసేవాళ్లు దొరక్క ఇంత కాలం పెద్దపీటలు వేయలేదేమో? ’’


‘‘నీ దారి నీదే కానీ నీకస్సలు లోకజ్ఞానం లేదురా అబ్బాయ్. ఏదో మాట వరుసకు మీకే పెద్ద పీట అని ఎన్నికల ముందు అలా అంటారు కానీ నిజంగా పెద్ద పీట వేయరు.. ఇదిగో మన టీకొట్టు సాయేబు చాయ్‌పే చర్చ అని మోదీ అనగానే మోదీ ప్రధాని అయితే టీకొట్టు వాళ్లకు పెద్దపీట వేసేస్తారని తెగ సంబరపడ్డాడు. ఏమైంది ఎప్పటిలానే ఈ పాకలో బెంచీల మీద కుర్చున్న వారికి టీ అందిస్తూ వాడి జీవితం ఎప్పటిలానే గడిచిపోతోంది కానీ ఈ బెంచీల నుంచి విముక్తి కలగలేదు, వాడాశించినట్టు పెద్ద పీట దక్కలేదు. ఈరోజుల్లో పీటలెవరు ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్లలో రెండు రెండు మూడు గంటల కోసం పీటలు తప్ప నిజంగా పెద్ద పీటలు ఉండవు.’’
‘‘అంతే నంటావా బాబాయ్’’


‘‘నువ్వంటే ఆమాయకుడివి కాబట్టి పెద్ద పీట అనగానే పీటలు తయారు చేసే కాంట్రాక్టు కోసం ఆలోచించావు. ఇంకో విషయం తెలుసా? నాయకులు ఎన్నికల్లో పెద్ద పీట వేస్తాం అనగానే చదువుకున్న వారు కూడా నిజంగానే పెద్దపీట వేస్తారని కలలు కంటారు. నాయకులు కుర్చీమీద కూర్చోవడానికే పెద్దపీటలనే హామీలు ఉపయోగపడతాయి కానీ నిజానికి ఎవరూ ఎవరికీ పెద్దపీట వేయరు. అంతెందుకురా? కనీసం ఈ టీకొట్టు సాయేబు కూడా మనకు బెంచీనే వేస్తాడు కానీ పెద్ద పీట వేయడు. రాజకీయ నాయకుల కలల్లో కుర్చీ ఉంటుంది కానీ పెద్ద పీట నిజంగా ఉండనే ఉండదు. పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం