14, జూన్ 2015, ఆదివారం

జై సెక్షన్ 8 ... సెక్షన్ 8 వర్థిల్లాలి



‘‘చెప్పంగ వినని వారిని చెడంగా చూడాలని అందుకే అన్నారు ’’
‘‘ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. మీరెవరికి ఏం చెప్పారు, ఇప్పుడు ఎవరు చెడిపోయారు.?’’
‘‘ ఓసారి టీవి చూడు నీకే తెలుస్తుంది. ’’
‘‘ అత్తా - కోడలు సీరియల్‌లో పంకజాక్షి గురించా? సరిగ్గా నేను కూడా మీలానే అనుకున్నాను. ఎప్పుడు చూసినా చుట్టుపక్కల వారిని ఆడిపోసుకోవడమే ఆమె. సొంతింటి పని తప్ప అందరి ఇళ్లపని అమెకు అవసరం. ఇలాంటి క్యారక్టర్‌లను పుట్టించిన ఆ దర్శడిని అనాలి.’’
‘‘ టీవి సీరియల్‌లో క్యారక్టర్ ఆర్టిస్ట్‌లా అర్ధం పర్థం లేకుండా మాట్లాడకు. నేను చెప్పింది వార్తల గురించి’’
‘‘ హైదరాబాద్‌లో భారీ వర్షాం... నీటిలో తేలియాడుతున్న కార్లు... ఈ వార్తల గురించేనా? ’’
‘‘ వద్దురా బాబూ అంటే విన్నారా? భారీ వర్షాలతో హైదరాబాద్‌లో విధ్వంసం. సెక్షన్ 8ని ముందు నుంచే అమలు చేస్తే ఇలా ఉండేదా? గవర్నర్ చేతిలో అధికారాలు ఉంటే ఒక పద్ధతి ప్రకారం అవసరం ఉన్నప్పుడు వర్షాలు పడేవి. అంతా ఒక పద్ధతిగా ఉండేది. అనుభవించండి’’
‘‘ సెక్షన్ 8కు వర్షాలకు సంబంధం ఏమిటండి’’
‘‘ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 24 గంటల న్యూస్ చానల్స్ చూసే నా కన్నా 24 గంటల సీరియల్స్ చూసే నీకే ఎక్కువ తెలుసా? మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి. పెళ్లిలో ఒప్పుకున్నదే బోడి 30వేల రూపాయల కట్నం. ఐదు వేల రూపాయలు తరువాత ఇస్తామన్నారు. పెళ్లయి పాతికేళ్లయినా బాకీ తీర్చే తెలివి లేదు కానీ ఓ తెగ మాట్లాడేస్తారు. ’’
‘‘ అప్పుడు ఉద్యోగం కూడా లేని నీకు పిల్లనివ్వడమే గొప్ప ’’
‘‘ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఇలా మాట్లాడుకుండా ఉండాలనే సెక్షన్ 8 అమలు చేయాలని మొత్తుకున్నది’’
‘‘ ఏంటి నాన్నా అమ్మను ఊరికే అలా తిడుతూనే ఉంటావు’’
‘‘నువ్వు కూడా నాకు చెప్చొచ్చావా? నువ్వు మూడవ తరగతి చదివేప్పుడు లెక్కల్లో తక్కువ మార్కులు ఎందుకొచ్చాయి. ముందు ఆ సంగతి చెప్పు. అడిగే వాడు లేకపోతే ప్రతోడు మాట్లాడే వాడే. ఏమేవ్ అమ్మాయి మూడవ తరగతి ప్రోగ్రెస్ కార్డు ఓసారి ఇలా తీసుకు రా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ’’
‘‘ నాన్నా నీ మాటలు నీకే కానీ ఎదుటి వారు చెప్పేది అస్సలు వినిపించుకోవా? నాకు గుర్తున్నంత వరకు నాకు 90శాతానికి తక్కువ మార్కులు ఎప్పుడూ రాలేదు. కావాలంటే సర్ట్ఫికెట్లు చూడండి’’
‘‘నీ ఇంజనీరింగ్ మార్కుల మెమో చూపించి నన్ను మోసం చేయాలని చూడకు. నేనడిగింది నీ మూడవ తరగతి ప్రొగ్రెస్ కార్డు నువ్వు చూపుతున్నది రెండేళ్లక్రితం పూర్తయిన ఇంజనీరింగ్ మార్కుల లిస్ట్’’
‘‘నిజంగానండి అమ్మాయికి 90 శాతానికి తక్కువ మార్కులు ఎప్పుడూ రాలేదు. మీరు థర్డ్ క్లాస్‌లో మార్కులు తక్కువ వచ్చిందన్నది పదిహేనేళ్లక్రితం మనం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్నప్పుడు మన పక్కింటి మీనాక్షి వాళ్ల అబ్బాయిదండి. కావాలంటే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడదాం. ఈ మధ్య మీరు మరీ పిచ్చిగా మాట్లాడుతున్నారు.’’
‘‘అంటే నాకు మన అమ్మాయికి, మీనాక్షి వాళ్ల అబ్బాయికి తేడా తెలియదా? మీరంతా కలిసి కుట్ర పన్నుతున్నారు. సిగ్గుండాలి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి’’
‘‘ మీరు ఇంట్లో ఉన్నప్పుడే మీ మాటలను భరించలేం ఇక మీరు బయటకు వెళ్లాక మీ ఫోన్ ట్యాపింగ్ చేయడమా? మీరీ మధ్య పిచ్చిగా మాట్లాడుతున్నారు. ’’
‘‘ బాస్ సరిగ్గా ఇదే మాట అని చివాట్లు పెట్టాడు. మీరు అదే మాట అంటున్నారు, మీరే కాదు ఇంకా చాలా మంది నా గురించి ఇలానే అంటున్నారు. అంటే మీరంతా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనడానికి ఇంకేం నిదర్శనం కావాలి. సెక్షన్8 అమలు చేస్తే కానీ మీరంతా దారికి రారు.’’
‘‘ ముందు ఆ న్యూస్ చానల్స్ చూడడం తగ్గించండి. బుర్ర కాస్త చల్లబడి పని చేస్తుంది ’’

***
‘‘డార్లింగ్’’
‘‘ఊ’’
‘‘రాజీ’’
‘‘ఊ’’
‘‘ పిల్ల గాలులు. నిండు పున్నమి వాతావరణం ఎంత రొమాంటిగ్ ఉందో ఆకాశంలోకి ఒకసారి చూడు. నాకైతే మనసు తేలిపోయినట్టుగా ఉంది. పాత సినిమాలో దేవానంద్‌లా నీ కోసం ఓ పాట పాడాలి ఉంది. కృష్ణశాస్ర్తీలా కవిత్వం చెప్పాలని ఉంది. ఉర్దూ రాదు కానీ వచ్చుంటే నీ కోసం ఓ షాయరీ చెప్పాలనిపిస్తోంది మరి నీకు’’
‘‘ పైన చందమామ. ఆకాశంలో మబ్బులు ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటే మీరు మాత్రం పడుకున్న వారికి నిద్రా భంగం కలిగించి కవిత్వం చెబుతాను పాట పాడతాను అని హింసిస్తున్నారు. పడక గదిలో విధ్వంసం సృష్టిస్తున్నందుకు సెక్షన్ 8 అమలు చేస్తే తప్ప నీలాంటి వారు దారికి రారు. ’’
‘‘ సర్లే మూడ్ లేదని చెబితే సరిపోతుంది కదా అంత పెద్ద పెద్ద సెక్షన్‌లు ఎందుకులే కానీ హాయిగా నిద్ర పో.. నేను కూడా నిద్ర పోతా? రొమాంటిక్ సినిమాలు చూసి ఆనందించడమే కానీ దేవుడు నా జీవితంలో రొమాంటిక్ రాసిపెట్టలేదనుకుంటా? నిద్ర రావడం లేదు. నేను వెళ్లి హాల్‌లో టివిలో పాత సినిమా చూస్తుంటే నువ్వు హాయిగా పడుకో.. సెక్షన్ 8 లాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి నన్ను భయపెట్టకు’’

***
‘‘మనిద్దరం ఇలా లాంగ్ డ్రైవ్‌కు వచ్చి ఎన్ని రోజులైంది డార్లింగ్ ’’
‘‘ కదిలారంటే కత్తితో పొడిచేస్తా. మీ మెడలో ఉన్న బంగారు నగలు , డబ్బు మర్యాదగా ఇవ్వండి, లేదంటే ప్రాణాలు తీస్తాను’’
‘‘ దొంగా... దొంగా... రక్షించండి’’
‘‘ మీరెంత అరిచినా వృధా. సెక్షన్ 8 అమలులో ఉంది. దొంగతనం మా వృత్తి ... మా విధి నిర్వహణనను అడ్డుకుంటే మీమీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ’’
‘‘గొడవ ఎందుకు కానీ ఇదిగో నగదు, నగలు తీసుకో. ఇదిగో దొంగాయన.. ఇంతకూ సెక్షన్ 8 అంటే ఏంటి? ’’
‘‘ మహా మహా నేతలే సెక్షన్ 8తో ఎవరేమైనా చేసుకోవచ్చునంటున్నారు కదా. దీంతో అడ్డంగా వాదించవచ్చునని తెలుసు కానీ, నిజంగా అదేంటో నాకేం తెలుసమ్మా’
జై సెక్షన్ 8 ... సెక్షన్ 8 వర్థిల్లాలి.....
-బుద్దా మురళి 
(జనాంతికం 14-6-2015)

2 కామెంట్‌లు:



  1. కామెంట డానికి బెరుగ్గా ఉందండోయ్ :) కామెంటు కి వేటు సెక్షన్ ఎనిమిది తో ఏమైనా వేసేస్తారే మో అని :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారు ఇక్కడ సెక్షన్ 8 వర్తించదు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం