21, జూన్ 2015, ఆదివారం

మీ నేరంతో మీకు సంబంధం లేదు!..ముందస్తు‘‘ నిర్దోషిత్వ ’’ పత్రం

‘‘యురేకా... ’’
‘‘ చిన్నపిల్లాడిలా పాట పాడుతూ ఆ గెంతులేమిటి? ’’
‘‘ నేను పాట పాడానా? ’’
‘‘ హలో ఇక్కడ మేం కూడా చిరంజీవి ఫ్యాన్స్‌మే. చదువుకునే రోజుల్లో కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిన వాళ్లమే. యూరేకా తస్సమిస్స అంటూ అదేదో పాటే కదా నువ్వు పాడదలుచుకున్నది. ఆ పాట తెలుసు ఆ పాట మీద చిరంజీవి, రాధిక వేసిన స్ట్ఫె్పలూ తెలుసు. థర్టీ ఇయర్ అభిమానులం. తక్కువగా అంచనా వేయకు’’
‘‘ మీరు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అయితే మేం ఇక్కడ 40 ఇయర్ ఇండస్ట్రీ. మొన్న ప్రెస్‌మీట్‌లో కృష్ణ విజయనిర్మల మమ్ములను ఆదరించినట్టే మా అబ్బాయిని , అల్లుడిని ఆదరించారు. అలానే పిన్నత్త కొడుకు, బాబాయ్ పిన్ని కొడుకు, చిన్నత్త పెద్ద కొడుకు త్వరలోనే సినిమాల్లో హీరోగా రానున్నారు వారందరినీ ఆదరించమని చెప్పారు కదా? వాళ్ల బంధువులందరి సినిమాల కోసం , మా బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. నాకస్సలు హోమియో వైద్యం మీద నమ్మకం లేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మొత్తానికి అన్ని జబ్బులకు చికిత్స చేసింది ఫలానా హోమియో అని టీవిలో చూసి ఏ జబ్బు లేకున్నా ఆ హోమియో డాక్టర్‌ను కలుస్తాను తెలుసా? అభిమానం అంటే ఇది. నాతో పెట్టుకోకు ’’
‘‘చిన్నప్పుడు తల్లి పాలు తాగకపోయినా, పెద్దయ్యాక పిల్లలకు పాలు కొనిచ్చే స్థితి లేకపోయినా హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఎదిగిన జీవితాలు మనవి. అభిమానం విషయంలో గొడవెందుకు కానీ ఈ వయసులో అలా యూరేకా కస్సమిస్స అంటూ ఎగరొద్దంటున్నాను అంతే.’’
‘‘ శాస్తవ్రేత్తలు ఏదైనా కొత్త విషయం కనిపెడితే యూరేకా అంటూ అరుస్తూ బయటకు వస్తారు కదా? నా యూరేకాకు అర్ధం అది’’
‘‘ అబ్బో అంత గొప్ప విషయం ఏం కనిపెట్టావు?’’
‘‘ ప్రపంచ వైద్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టే గొప్ప విషయం కనుగొన్నాను’’
‘‘ ఇక చాలు.. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం. యోగాతో సర్వ రోగాలు మాయం అవుతాయనే నమ్మకం ఈనాటిది కాదు. మోదీ పూర్వీకుల కన్నా ముందు నుంచి ఉన్నదే. తెలంగాణలో తమ పార్టీ భవిష్యత్తు తలుచుకుంటే నిద్ర రాని బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులను తనలానే యో గా చేయాలని పిలిచింది కూడా తెలుసు. ’’
‘‘నా ఆవిష్కరణ కోట్లాది మందికి సంజీవనిలా పని చేస్తుంది. ఏ మల్టీనేషన్ కంపెనీ వాడన్నా కొట్టేస్తాడేమోనని, నా ఆవిష్కరణ మన దేశ పౌరులకే చెందాలని మొదటి నీకు చెబుతున్నాను. ’’
‘‘ఎంసెట్‌లో ట్యాప్ ర్యాంకర్లు అంతా పేదలకు సేవ చేస్తాం అని రొటీన్ డైలాగులు చెబుతారు. చదువయ్యాక విదేశాలకు చెక్కేస్తారు. టెన్త్‌లో చెప్పాల్సిన డైలాగు ఇప్పుడు చెప్పడం ఏమిటి? ’’
‘‘నాది అలాంటిలాంటి పరిశోధన కాదు. వైద్య రంగంలో విప్లవం సృష్టించే పరిశోధన. ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధుడికి బోధి వృక్షం వద్ద జ్ఞానోదయం కావడం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో, నా జ్ఞానం రోగులను అలా మార్చేస్తుంది.’’
‘‘ ఊరించకు అసలు విషయం చెప్పు’’
‘‘ సమస్యలకు కారణం అన్వేశించడానికి  బుద్ధుడు బయలు దేరినట్టు రోగాలకు కారణం ఏమై ఉంటుందా? అని నేను పరిశోధించాను . రోగరహిత సమాజాని కోసం ఏం చేయాలో తెలుసుకున్నాను .  మనుషుల రోగాలకు, పోలీసు స్టేషన్లు, కోర్టులకు అవినాభావ సంబం ధం ఉందని నా పరిశోధనల్లో తేలింది’’
‘‘ అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదు.  నీ పరిశోధన పరీక్షలకు నిలవాలి ... మాట్లాడిన దానికి ఆధారాలు చూపించాలి, నీ పరిశోధన ప్రజలకు ఏ విధంగా ఉపయోగమో నిరూపించాలి’’
‘‘ అక్కడికే వస్తున్నాను. రేవంత్‌రెడ్డిని చూశావా? అచ్చం సినిమా హీరోలా కనిపించేవారా? కాదా? ’’
‘‘కాలేజీ కెళ్ళే స్టూడెంట్‌లా కనిపించే నాయకుడిని పట్టుకుని సినిమా హీరో అంటావేమిటి? హీరో అంటే కనీసం 60 ఏళ్లయినా నిండి ఉండాలి కదా’’
‘‘ అబ్బా రోజులు మారాయి.. నీకన్నా అనుమానాలే.. సరే హీరో కాదు.. చిన్న సినిమా హీరోలా కనిపించేవాడు అంటే అభ్యంతరం లేదు కదా? ’’


‘‘ అలా సరిగా చెప్పు హీరో అంటే 60 ఏళ్ల వయసు చిన్న సినిమా హీరో అంటే 20 ఏళ్ల వయసు’’
‘‘ చిన్న సినిమా హీరోలా గెంతుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించే రేవంత్‌కు గుండె సమస్య, కీళ్ల సమస్య, నోటి సమస్య అబ్బో లెక్కలేనన్ని సమస్యలు ఒక్కసారే వచ్చిపడ్డాయి .. ఆయనొక్కడే కాదు. పహిల్వాన్‌లా, మఫ్టీలో ఉన్న డిఎస్‌పిలా కనిపించే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తీవ్రంగా ఆలోచించడం వల్ల హఠాత్తుగా మోకాళ్లలో నొప్పి, వెన్నముకకు తెలియని సమస్యలు ఒకేసారి బయటపడ్డాయి. అచ్చం హీరో అన్న నరేష్‌లా నవ్వు ముఖంతో కనిపించే వేం నరేందర్‌రెడ్డికి  చెప్పుకోలేని , నోరు తిరగని రోగాలు ఎన్నో ఉన్నాయని ఎప్పుడైనా ఊహించావా? ఒక్కసారి అవన్నీ బయటపడ్డాయి. ఇంకా చాలా మంది నాయకులకు ఇలాంటి సమస్యలు బయటపడనున్నాయి.’’


‘‘చాల్లే పెద్ద ఇంతోటి విషయానికి ఏదో అతిగా ఊహించుకుంటున్నావ్. ఒక ఓటు ఐదుకోట్లు కేసులో ఎవరికి నోటీసు వచ్చినా మాయదారి జబ్బులన్నీ బయటకు వస్తాయి. ఏకేసులోనైనా ఇంతే ఇది కామన్. బాలకృష్ణకైతే ఏకంగా మతి స్థిమితం లేదనే విషయం బయటపడింది.అప్పటి వరకు ఆ రోగం గురించి బాలకృష్ణ కు కూడా తెలియదు .  ఇదా నువ్వు పరిశోధన చేసి కనుగొని యూరేకా అని అరిచింది ’’
‘‘ నోటీసు రాగానే రోగాలు బయటపడడం తెలిసిందే. కానీ నా పరిశోధన అది కాదు. కోరికలు లేని లోకం కోసం బుద్ధుడు కలగన్నట్టు అసలు రోగాలు లేని లోకాన్ని నేను కనుగొన్నాను. ’’
‘‘ అదెలా సాధ్యం’’
‘‘ నోటీసు ఇవ్వగానే రోగాలు బయటకు వస్తున్నాయి కదా? మీరు చేయబోయే నేరంతో మీకెలాంటి సంబంధం లేదు. చేసిన నేరం లో 
..చేయబోయే నేరం లో మీరు నిర్దోషులు .  మీరే విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు అని అందరికీ ముందస్తు‘‘ నిర్దోషిత్వ ’’ పత్రం అంటే అడ్వాన్స్ క్లీన్ చిట్ ఇవ్వాలి.’’
‘‘ ఇదెలా సాధ్యం’’
‘‘ ఎందుకు సాధ్యం కాదు. అరెస్టయ్యే అవకాశం ఉన్నవారికి ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు, అందరికీ మీ నేరంతో మీకు సంబంధం లేదని ముందస్తు క్లీన్ చిట్ ఇస్తే ఇక రోగాలు వచ్చే అవకాశమే  ఉండదు.’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం