2, ఆగస్టు 2015, ఆదివారం

మంగళసూత్రం-బ్యాలెట్ బాక్స్

‘‘ఇదిగో నిన్నే  కాస్త వేడివేడిగా టీ పెట్టివ్వు..నా గదిలోకి ఎవరినీ రానివ్వకు. నేను రాసుకుంటున్నాను’’


‘‘చాల్లెండి బడాయి.. మీకు కవిత్వం సోకిన తరువాత మనింటికి బంధువులను పిలిచినా రావడం లేదు. పులి బోనులోకి వెళ్లేంత అమాయకులెవరుంటారు. కాలనీలో అందరి ఇళ్లలో దొంగతనాలు జరిగినా చివరకు దొంగలకూ మనిల్లంటే చిన్నచూపే. మీనాక్షి కూతురు పెళ్లికి వెళితే మా పిన్ని మీ ఆయన కవిత్వం రాస్తారా? అని సీరియస్‌గా అడిగి కిసుక్కున్న నవ్వింది. అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేసరికి కొట్టేసినట్టు అయింది. నాన్న కూడా చాలా బాధపడుతున్నారండి చూడమ్మాయ్ ఇద్దరాడపిల్లలున్నారు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు ఎన్నో ఖర్చులుంటాయి. ఇలా మీ ఆయన కవితా సంకలనాలు అంటూ ఖర్చు పెడుతున్నారని బాధపడుతున్నారు. ఆయన సొంత సమయంలో కవిత్వం రాసుకుంటూ, సొంత డబ్బుతో ముద్రించుకుంటున్నారు. నీకేంటి అని నిలదీశాను. మీ ఆయన కవిత్వం రాయడం మానేస్తే, ఆస్తిలో వాటా ఇస్తాను, రిటైర్ అయిన తరువాత వచ్చే డబ్బంతా ఇచ్చేస్తాను అని నాన్న ఆఫర్ ఇచ్చాడు. నేను కోపంగా నాలుగు తిట్టి వచ్చేశాను కానీ నాన్న గారి ఆఫర్ గురించి ఓ సారి ఆలోచించండి’’


‘‘నువ్వూ, మీ నాన్నే కాదు ఈ ప్రపంచం మొత్తం నాకు ఎదురు తిరిగినా నేను కవిత్వం రాయడం ఆపను. నా కవిత్వంతో భూకంపం సృష్టిస్తాను. సమాజాన్ని మార్చేస్తాను. ’’

‘‘మీరు సమాజాన్ని మార్చడం కాదు కానీ కవిత్వం విషయంలో మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. మాకీ కష్టాలు తప్పవనే విషయం నాకెప్పుడో అర్ధమైంది లెండి. ఏదో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి కవిత్వం రాసినా ఉద్యోగం నుంచి ఎవడూ తీసేయలేడు కాబట్టి బతికి పోయాం కానీ అదే ప్రైవేటు ఉద్యోగం అయితే రోడ్డున పడేవాళ్లం’’


‘‘ మేధావులను  తొలుత అంతా ఇలా పిచ్చివాళ్లుగానే చూశా రు’’
‘‘ పిచ్చివాళ్లంతా మేధావులు కాదు’’
‘‘ నన్ను పిచ్చివాడికింద జమేస్తున్నావా? ’’
‘‘ ఒక్క కవిత్వం విషయంలో తప్ప మీరు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ’’


‘‘ఘంటసాలకు పాడడం రాదని, అమితాబ్‌ను నటించలేవని, రేఖ, హేమామాలిని నటనకు పనికిరారని, మార్లిన్ మాన్రోను ఎక్కడైనా ఉద్యోగం చూసుకో పొమ్మన్నారు. నా ప్రతిభ మీకు ఇప్పుడు అర్థం కాదు.’’
‘‘మీ కవిత్వం వల్ల జేబులు ఖాళీ కావడం తప్ప బుర్రలు నిండుకుంటాయంటే నేనైతే నమ్మలేను. పోస్ట్‌మెన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడేదో ఉత్తరాలు ఇచ్చి పోవడానికి వస్తే కొత్త కవిత్వం రాశాను వినవోయ్ అని వినిపించారట! నీళ్లు రావడం లేదని అపార్ట్‌మెంట్ అత్యవసర సమావేశం జరిగితే సామాన్యుడి సమస్యలపై రాసిన కవిత అంటూ మీరు కవిత్వం చదవడం మొదలు పెట్టారు. కాలనీ ప్రెసిడెంట్ గుండె నొప్పి అంటూ వెళ్లిపోయాడు. సమస్య అలానే ఉండిపోయింది. ’’


‘‘ప్రజలను చైతన్య పరిచే వాడంటే ఎవరికైనా కోపమే. రాజులు ఉరితీసేవాళ్లు, ప్రజాస్వామ్యంలో ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. నా కవిత్వంతో ప్రజలను చైతన్య పరచడం ఆపే ప్రసక్తే లేదు కానీ... ఇప్పుడు నేను రాసేది కవిత్వం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు పదిహేనున దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తారు కదా ఆ ఉపన్యాసాన్ని రాయబోతున్నాను ’’
‘‘ నిజమా! క్షమించండి మీరు కవి అనుకొని చిన్న చూపు చూశాను. మీలో ఇంత ప్రతిభ ఉందని, ప్రధాన మంత్రి ఉపన్యాసాన్ని రాసేంత సీనుందని అస్సలు ఊహించలేదు. కవిగారూ నా ఉపన్యాసం మీరే రాయాలని అని నరేంద్ర మోదీ అంతటి వారు అడిగారంటే మన జీవితానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. కవిగా మిమ్ములను అంటరాని వానిగా దూరం చేసిన వారందరికీ ఈ విషయం ఇప్పుడే చెబుతాను ’’


‘‘ ఆవేశపడకు విదేశీ పాలకులు మన దేశానికి వచ్చినప్పుడు పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడతారు. అలానే నరేంద్ర మోదీ అప్పుడప్పుడు మన దేశంలో కూడా పర్యటించడానికి వచ్చినప్పుడు మన్‌కి బాత్ అంటూ రేడియోలో మాట్లాడుతూ మనసులోని మాట మాట్లాడతారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో ఏం మాట్లాడాలో మీరే చెప్పండి అని దేశ ప్రజలకు మోదీ ఆఫర్ ఇచ్చారు అదీ విషయం’’ పనిలో పనిగా నా కవిత ఒకటి ప్రస్తావిస్తూ మోదీ ఉపన్యాసం సిద్ధం చేస్తున్నాను’’
****
‘‘ఏమండీ రాయడం పూర్తయిందా? ఎంత వరకు వచ్చింది.’’
‘‘నువ్వూ వినవోయ్ స్వాతంత్య్రం వచ్చింది... వచ్చింది స్వాతంత్య్రం... స్వాతంత్య్రం మీద కవిత రాశాను. ఇక మ్యాటర్ రాయాలి ’’
‘‘మళ్లీ వచ్చావా? ఉగాది అంటూ ఉగాదికి రాశారు. దసరా, దీపావళి, స్వాతంత్య్ర దినోత్సవం అన్నీంటికీ అదేనా? మన విషయం ఏమన్నా రాశారా? రాయకపోతే చెబుతా నోట్ చేసుకోండి ’’
‘‘మన విషయమా ఏంటది?’’
‘‘ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనం దేశంలోకి తెస్తామని, ఆ డబ్బు పంచితే ఒక్కోక్కరికి ఎంత వస్తుందో మోదీ చెప్పారు కదా? ఇంట్లో నలుగురం ఉంటున్నాం. మీ అమ్మా నాన్నలను కూడా ఇంట్లోనే ఉండమని చెప్పాను. పాపం ఈ వయసులో వాళ్లకు ఎవరున్నారని, అందరి వాటాలు కలుపుకుంటే గాంధీనగర్‌లో ఒక చక్కటి ఫ్లాట్ కొనొచ్చు. మొన్న మా తమ్ముడు వెళ్లి ఫ్లాట్ చూసొచ్చాడు వాడికి బాగా నచ్చింది. .. విదేశాల్లో దాచిన సొమ్ము నుంచి చెప్పినట్టుగానే మీ వాటా మీకిచ్చేస్తున్నాను అని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో రాయండి. మన దరిద్రం తీరిపోతుంది. ’’


‘‘చూడోయ్ ప్రేమికులు పార్కుల్లో తిరిగేప్పుడు ప్రియుడు ఎన్నో మాటలు చెబుతాడు. పెళ్లయ్యాక వాటిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. మెడలో మంగళసూత్రం పడేంత వరకే ప్రేయసీ ప్రియులు, బ్యాలెట్ బాక్స్‌లో ఓటు పడేంత వరకే ఆ కబుర్లు. మెడలో మంగళసూత్రం, - బ్యాలెట్ బాక్స్‌లో ఓటు రెండూ ఒకటే.... పార్కులో విన్న ఊసులు ఇంట్లో వినాలనుకోవడం అత్యాశే. ఇదీ అంతే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం