26, జులై 2015, ఆదివారం

నిదుర లేవరా తమ్ముడా!

‘‘యత్ర యత్రే... తత్ర తత్రే...యత్రో యత్రః’’
‘‘అంటే ఏంటి గురువా?’’
‘‘అర్థం కావాలా? పరమార్థం కావాలా? అర్థమే లేదనుకుంటే నన్ను వదిలేయ్.. శిష్యా?’’
‘‘ అర్థం తెలిస్తేనే కదా గురువా? పరమార్థం తెలిసేది? ’’
‘‘అర్థం తెలియాలంటే నిఘంటువు చూడు. పరమార్థం తెలియాలంటే నా మాటలు నమ్ము ’’
‘‘ చెప్పండి గురువా? వింటాను’’


‘‘ అందరినీ నిద్ర లేపాలనుకునే వాడు నిద్రకు దూరమవుతాడు. నిద్రకు దూరమైనవాడు చిత్త చాపల్యంతో మాట్లాడతాడు. చిత్త చాపల్యం తో భయం , దాని వెంట క్రోధం , ఆ వెనకే తిక్క ఆవహిస్తుంది ..  అందరినీ తానే నిద్ర లేపుతున్నాననుకుంటాడు. ప్రపంచాన్ని తానే కనిపెట్టానని, విశ్వం తన కనుసన్నల్లో నడుస్తుందని, ప్రపంచ పటంలో ఏమేమి ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో తానే నిర్ణయిస్తానని, ప్రపంచం తనను కీర్తిస్తుందని, ప్రపంచానికి తనను పొగడడం తప్ప మరో పని లేదనే భ్రమల్లో ఉంటాడు. ’’
‘‘ అవును గురువు గారు నాకూ అప్పుడప్పుడు ఇలానే అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న అలారం మోగితేనే ప్రపంచం నిద్ర లేస్తుందని. ఆ అలారం పని చేయడం మానేస్తే ప్రపంచ ఏం ఏమైపోతుందనే ఆందోళన కూడా కలుగుతుంది’’


‘‘ నీది తాత్కాలిక భ్రమ.. నేను చెప్పేది ఏది నిజమో ఏది భ్రమో గ్రహించలేనంత తీవ్ర భ్రమల్లో మునిగిపోయిన బ్రహ్మీ గురించి ’’
‘‘ యత్ర.. తత్ర అనే ఒక్క మాటలో ఇంత అర్థం ఉందా? గురువా? ’’
‘‘ వినేవాడి ఓపిక, చెప్పేవాడి ‘కాలం’ సైజును బట్టి ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం తరువాత మనిషి బతకడానికి కావలసింది నిద్ర. ఇలాంటి నిద్ర ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే’’
‘‘మరి నేను నిద్ర పోను .. మిమ్ములను నిద్ర పోనివ్వను అని అంటుంటారు కదా? ’’
‘‘ నిజమే శిష్యా అధికారం నుంచి దిగిపోయిన వారికి, అధికారం కోసం పరి తపించే వారికి తీవ్రమైన ఆలోచనలతో నిద్ర రాదు. వాడికి నిద్ర రానప్పుడు ప్రపంచమంతా హాయిగా నిద్ర పోవడాన్ని సహించలేడు. అందుకే నేను నిద్ర పోనప్పుడు మీరేలా నిద్ర పోతారో చూస్తాను అని చిత్తభ్రమతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ’’


‘‘కొంత మంది మీ గుండెల్లో నిద్ర పోతాను అంటుంటారు’’
‘‘బాగా శ్రమించిన తరువాత కటిక నేలపై పడుకున్నా నిద్ర వస్తుంది. గతుకుల రోడ్లపై ఆర్టీసిలో ప్రయాణించినా గోతుల్లో పడినప్పుడల్లా జోలపాట పాడుతున్నంత హాయిగా నిద్ర వస్తుంది కానీ మనిషన్న వాడెవడూ ఇంకో మనిషి గుండెల్లో నిద్ర పోలేడు. ఆ ఎమ్మెల్యే ఇంటికి, పిసిసి మాజీ అధ్యక్షుని ఇంటికి వెళ్లి చూడు. కెసిఆర్ గుండెల్లో నిద్ర పోతాను అని చెప్పినాయన్ని పదవి నుంచి తీసేశాక ఇంట్లో హాయి గా పడుకునే ఉంటున్నారు. ఇదే మాటన్న కొందరు నేతలు జైలులో, ఇంట్లో నిద్ర పోతున్నారు. ’’
‘‘ గురువా? మీరు అసలు విషయం మరిచి పోయారు... భాగ్యనగరం ప్రజలకు నిద్ర నుంచి మేల్కొలపడం నేర్పిందే మా మామ అని అల్లుడు చెబుతున్నాడు’’


‘‘ఆది చెప్పడానికే కదా ఇంత సేపు నీతో నిద్ర గురించి మాట్లాడింది. చిన్నప్పుడు ఇల్లలికిన ఈగ కథ చదివావా? ఓ ఈగ ఇల్లును అలుకుతూ పనిలో పడిపోయి చివరకు తన పేరే మరిచిపోతుంది’’
‘‘ నేను ఎన్టీఆర్ నిద్ర లేపడం గురించి అల్లుడి గారి స్టేట్‌మెంట్ అడిగితే మీరు ఈగ గురించి చెబుతారేమిటి గురువా ? ప్రెస్ కాన్పరెన్స్‌లో విలేకరులు అడిగే ప్రశ్నలకు అల్లుడు గారు చెప్పే దానికి సంబంధం ఉండదు మీరూ అలానే చెబుతున్నారు. ’’
‘‘వౌనం కూడా శక్తివంతమైన సమాధానమే. అర్ధం లేకుండా మాట్లాడడం వెనుక కూడా ఓ పరమార్థం ఉంటుంది అర్ధం చేసుకోవాలి. వెనకటికో రాజు చరిత్రలో తన పేరు చిరస్థాయిగా గుర్తుండి పోవాలని కొత్త రూల్ పాస్ చేశారు. జనం ఇకపై రాత్రి మేల్కొనాలి.. ఉదయం నిద్ర పోవాలని ’’
‘‘ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది? ఎవరా రాజు ఏమా కథ. ఆయన రూల్‌ను ప్రజలు అమలు చేశారా? ’’
‘‘ జనం కొత్త విధానానికి అలవాటు పడలేక రోగాల పాలయ్యారు. ఇదే అదను అనుకుని శత్రురాజు దండెత్తి నిద్రలో జోగుతున్న దేశాన్ని ఆక్రమించేసుకున్నాడు.’’


‘‘ అయ్యో ఆయన ప్రయత్నాన్ని ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేదన్నమాట’’
‘‘ ప్రకృతిని జివోలు శాసించలేవు’’
‘‘ ఇంతకూ ఎన్టీఆర్ నిద్ర గురించి చెప్పనే లేదు’’
‘‘మత్తు వదలా నిద్దుర మత్తు వదలరా అంటూ జ్ఞానబోధ చేసే శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన జీవించేశారు. రాముడి వేషం వేస్తే శ్రీరాముడు అచ్చం ఇలానే ఉంటాడనిపించేది. రావణుడి వేషం వేసినా, చివరకు రిక్షారాముడి వేషమైన, డ్రైవర్ రాముడి వేషం అయినా అచ్చం ఇలానే ఉంటాడు అనిపించేట్టు నటించే వారు. సినిమా హీరోగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత రాజకీయ వేషం వేశారు. సినిమాలో ఎవరి పాత్ర ఏమిటో దర్శకుడు నిర్ణయిస్తాడు. రాజకీయాల్లో ఎవరికి వారే నటుడు, దర్శకుడు, అన్నీ రాజకీయాల్లో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో, పక్కనున్న వాడు సహాయ నటుడు అని హీరో అనుకుంటే వాడు చివరకు వెన్నుపోటు పొడిచి పారేస్తాడు. ఎన్టీఆర్ అందరూ మేల్కొన్న సమయంలో నిద్ర పోయే వారు. అందరూ నిద్ర పోయిన సమయంలో లేచే వారు. దాంతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఆయనకు అర్ధం కాలేదు. బ్రహ్మాండమైన బ్రహ్మీ ముహూర్తం అంటూ ఆయన నిద్ర నుంచి లేచి చూసే సరికి అంతా అయిపోయింది. ఆయన్ని కుర్చీ నుంచి దించేశారు. విషయం అర్ధం అయ్యాక నిద్ర లేని రాత్రులు గడిపి, శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ’’


‘‘ ఇంతకూ భాగ్యనగర వాసులను ఆయన నిద్ర లేపలేదంటారా? ’’
‘‘ చివరకు తన సంతానానే్న నిద్ర లేప లేకపోయాడని నేను చెబుతుంటే, నీకేమైనా అనుమానం ఉంటే వైస్రాయ్ చరిత్రను మరో సారి రివైండ్ చేసుకొని చూడు. ’’
‘‘ మీరెంత చెప్పినా నాకెందుకో హైదరాబాద్ వారిని ఎన్టీఆరే నిద్ర లేపారనిపిస్తోంది’’
‘‘సూర్యున్ని ప్రతి రోజూ తెల్లవారు జామున నేనే నిద్ర లేపుతాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు. సూర్యుడు ఫీలవుతాడు.’’

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయానికి స్వాగతం