1, నవంబర్ 2015, ఆదివారం

అసహన వీరులు!

‘‘హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు, ?ఎక్కడున్నావ్?’’
‘‘వావ్ బంగారం ఇప్పుడే నీ గురించి తలుచుకున్నాను. నువ్వే ఫోన్ చేశావు’’
‘‘ నీ మాటలు నమ్మను’’
‘‘ నీలో ఇంత అసహనాన్ని తట్టుకోలేక పోతున్నాను బంగారం.. సాయంత్రం మనం రెగ్యులర్‌గా కలిసే స్మశాన వాటికకు రా అక్కడ వివరంగా మాట్లాడుకుందాం.’’
‘‘ స్మశాన వాటికకు రమ్మనడం అంటే మన ప్రేమకు సమాధి కడతానని చెప్పడమే కదా? ’’
‘‘ అనుమానించడం భార్యల లక్షణం. మనకింకా పెళ్లి కాక ముందే ఇంతగా అనుమానించడం నాకస్సలు నచ్చలేదు. స్మశాన వాటిక అంటే నా ఉద్దేశం ఘాట్ అదే రెగ్యులర్‌గా మనం కలుసుకునే ఎన్టీఆర్ ఘాట్‌కు’’


***


‘‘హాయ్ డార్లింగ్’’
‘‘హాయ్ బంగారం ’’
‘‘ ఇంతకూ ఘాట్‌కు ఎందుకు రమ్మన్నట్టు డార్లింగ్’’
‘‘మన ప్రేమ పుట్టింది ఇక్కడే సమాధి చేద్దామని పిలిచాను ’’
‘‘ నేను లేకుండా క్షణం బతకలేను అన్నావ్ ఇప్పుడిలాంటి మాటలేంటి డార్లింగ్’’
‘‘ చూడు బంగారం స్మశాన వాటికలో పుట్టే స్మశాన వైరాగ్యం తాత్కాలికమే. ఈ ఘాట్‌లో పుట్టిన ప్రేమలు కూడా శాశ్వతం కాదు. మనమే కాదు మన చుట్టు కనిపించే వందల ప్రేమ జంటల పరిస్థితి ఇంతే. ప్రేమించుకునేప్పుడు ప్రపంచంలో మనంత అద్భుతమైన ప్రేమ జంట లేదనుకుంటాం. విడిపోయేప్పుడు ప్రపంచంలో ఇంత బాధ ఎవరికి లేదనుకుంటాం రెండూ అబద్ధాలే. ’’
‘‘ ఎందుకు విడిపోదామనుకుంటున్నావో చెప్పు ’’
‘‘అసహనాన్ని భరించలేను. దేశంలో అందరిలో అసహనం పెరిగిపోతోంది. నీలోనూ రోజు రోజుకు అసహనం పెరిగిపోతుంది. బంగారం అంటూ నీకు నేనిచ్చిన అవార్డును తిరిగి తీసుకుంటున్నాను. డార్లింగ్ అంటూ నువ్వు నాకిచ్చిన అవార్డు తీసేసుకో.. మన ప్రేమను ఇంతటితో మరిచిపో’’
‘‘ ఇచ్చేయడానికి ఇదేమన్నా సాహిత్య అవార్డులా? నా పరిస్థితేం కాను’’
‘‘ ఈ ప్రశ్నలు నరేంద్ర మోదీని గెలిపించే ముందు వేసుకోవలసింది. ’’
‘‘ ఏంటి డార్లింగ్ నరేంద్ర మోదీ అంటావు అసలు నీకేమైంది. ’’
‘‘ మనం విడిపోవడానికి ము మ్మాటికి నరేంద్ర మోదీనే కారణం. పాలకుడు అంటే దేశానికి తండ్రి లాంటి వాడు. దేశంలో ఎక్కడేం జరిగినా దానికి పాలకుడిదే బాధ్యత కదా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ వయసులో ఉన్న అమ్మాయితో ఈ తిరుగుళ్లేంటి బాబు అని ఎంత అసహనం వ్యక్తం చేసింది. మోదీ అధికారంలోకి రాక ముందు మీ అమ్మ ఎప్పుడైనా అలా మాట్లాడిందా? ’’


‘‘ మా అమ్మకు ఈ మధ్య మనం ప్రేమించుకుంటున్నామనే అనుమానం కలిగింది. అందుకే కొంత కోపంగా మాట్లాడిందేమో కానీ మోదీకి మా అమ్మ మాటలకు అస్సలు సంబంధం లేదు. నన్ను నమ్ము ’’
‘‘ అంతేనా మీ తమ్ముడు మొన్న స్కూల్‌లో ఎవడో నచ్చక పోతే పైన ఇంకు పోశాడట కదా? మీ కుటుంబంలో అందరికీ ఇలా అసహనం పెరిగిపోతోంది అందుకే నీ డార్లింగ్ అవార్డు నీకిచ్చేస్తున్నాను, బంగారం అవార్డు నాది నాకిచ్చేయ్’’


‘‘ స్కూల్‌లో వాళ్లకు వాళ్లకు ఏదో గొడవలు ఉన్నాయి. మోదీకి మా కుటుంబానికి సంబంధం ఏమిటి? ’’
‘‘ ఇంటి పెద్ద మంచి వాడైతే ఇల్లు బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం, తర్వాత దేశం. అంటే ఇప్పుడు దేశం బాగాలేకనే కదా మీ ఇంట్లో వాళ్లు అసహనంగా ఉన్నది. మీ ఇంట్లో వాళ్ల అసహనానికి దేశాన్ని పాలించే మోదీనే కదా కారణం. ’’
‘‘ అలా అనుకుంటే రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు కారణం కావాలి కదా? ’’
‘‘ చూశావా నా అభిప్రాయాన్ని మన్నించే సహనం నీలో లేదు అందుకే రాష్ట్రాలను పాలించే వారి గురించి చెబుతూ రాజకీయం చేస్తున్నావు’’


‘‘ రెండు వందల పాతిక రూపాయలకు కిలో కంది పప్పు ధర పెరిగితే పప్పు తినడం మానేశాం కానీ పాలకులను నిందించని మా లాంటి సామాన్య కుటుంబాలే దేశంలోని కోట్లాది మందివి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే గుర్తు పట్టలేనంత కాలుష్యం ముఖానికి అంటుకుంటే టెర్రరిస్టుల్లా ముఖానికి ముసుగు ధరించి వెళుతున్నాం కానీ అసహనంతో ఎవరినీ ఏమీ అనని సహన జీవితాలు మావి. చదివిని చదువుకు తగిన ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చదివి చప్రాసీ ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమయ్యే జీవితాలు మావి. ఉత్తర ప్రదేశ్‌లో చప్రాసీ ఉద్యోగాలకు లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు కానీ మేధావుల్లా అసహనంతో ఊగిపోలేదు. మెజారిటీ మతంలో పుట్టడమే పాపం అన్నట్టు పాలకులు వ్యవహరించినా పూర్వజన్మలో చేసుకున్న పాపం అనుకుని సహనంతో భరించిన జీవితాలు మావి. స్కూల్‌లో బొట్టుపెట్టుకున్నా, మాతృభాషలో మాట్లాడినా మూర్ఛ రోగులకు ఇత్తడి బిళ్ల కట్టినట్టు కట్టి తప్పయింది జీవితంలో ఇక బొట్టు పెట్టుకోము, తెలుగులో మాట్లాడం అని రాసి శిక్ష అనుభవించడమే కానీ ఇదేంటని అడగని సహనం మాది. మాలాంటి కోట్లాది కుటుంబాలే కాదు. ఈ దేశమే సహనానికి మారుపేరు. అలాంటిది ఈ దేశీయులకు అసహనం అంటావేమిటి? నువ్వన్నట్టు ఒక్కటి మాత్రం నిజం. దేశంలో అసహనం పెరిగిపోతోంది అది అక్షర సత్యం. మేధావుల్లో అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పార్టీ అధికారంలోకి వస్తే అసహనం వెర్రి తలలు వేస్తోంది. మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారని సమావేశం నిర్వహిస్తే అనుపమ్‌ఖేర్ తన అభిప్రాయం చెబుతుంటే మేధావులంతా అసహనంతో ఊగిపోయారు. నీకు నచ్చని సిద్ధాంతాన్ని నమ్మే పాలకులు అధికారంలోకి వస్తే సహించక పోవడం అసహనం. నీ కులం కాని వాడు ముఖ్యమంత్రి అయితే సహించక పోతే అసహనం. ’’


‘‘ ఇలా మాట్లాడుతావని తెలుసు కాబట్టే మనం విడిపోదామన్నాను’’


‘‘ చాలా మంచి పని చేశావు. ఇంకో విషయం తెలుసా? మానసిక వైద్యులకే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయట! అలానే దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆందోళన చెందే మీలాంటి వారే అసహనంతో బాధపడుతున్నారు అంతే తప్ప దేశానికి అసహనం లేదు. పైగా మీలాంటి వారి అసహనాన్ని సైతం భరించేంత సహనం ఈ దేశం సొంతం. ’’
మేధావుల మౌనం, మేధావుల అసహనం రెండూ ఒకటే 
-బుద్దా మురళి ( జనాంతికం 1-11-2015)

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం