9, నవంబర్ 2015, సోమవారం

బడా రాజన్ - చోటా స్క్రీన్!

‘‘బ్రే‘కింగ్ న్యూస్... న్యూస్ చానల్స్ చరిత్రలోనే అద్భుతమైన ఇంటర్వ్యూ మీరు చూడబోతున్నారు. బడా రాజన్ గారూ నమస్కారం సార్..రాష్టప్రతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ వంటి ఎంతో మంది ముఖ్యులతో ఎలాంటి తత్తరపాటు లేకుండా మాట్లాడాం కానీ మీతో మాట్లాడుతుంటే నాలోని ఎగ్జయిట్ మెంట్ ఆపుకోలేక పోతున్నాను. పాటుతో మాటలు తడబడుతున్నాయి.’’
‘‘నూటా 20 కోట్ల మంది ప్రజలు, ప్రపపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని గడగడలాడించిన రియల్ హీరోను ప్రత్యక్షంగా చూసినప్పుడు తత్తరపాటు సహజమే ’’


‘‘ మీ గురించి చెబుతారా? ’’
‘‘ ప్రపంచ యువతకు నా సందేశం పేరుతో నా ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నాను. కళకు ప్రాంతం, మతం, కులం భేదం ఉండదని గొప్పగా చెప్పుకుంటారు. అందులో నిజం లేదు. నేరస్తులకు మాత్రమే కులం, మతం, ప్రాంతం అనే తేడా ఉండదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేరాలకు పాల్పడతారు. ప్రాంతీయ బేధం ఉండదని చెప్పుకునే అర్హత మాకే సొంతం. ప్రపంచ యువతను చైతన్య పరిచే విధంగా నేర ప్రపంచానికి గైడ్‌లా ఉపయోగపడే విధంగా ఆత్మకథ రాస్తాను ’’


‘‘మిమ్ములను కన్న పుణ్యమూర్తుల పేర్లు? మీ బాల్యం ఎలా గడిచిందో మా ప్రేక్షకులకు చెబుతారా? ’’
‘‘ తప్పకుండా నన్ను కన్నది ఏ మూర్తులో నాకు తెలియదు. కానీ బాల్యం మాత్రం అద్భుతంగా గడిచింది. చిన్న చిన్న దొంగతనాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పోయాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఆనాడు పడిన బలమైన పునాదే కారణం. హైదరాబాద్‌లో బ్లాక్ టికెట్లు అమ్మడంపై యాదగిరి వద్ద శిక్షణ పొంది, ముంబైలో అమలు చేసి, ఇంతటి వాడినయ్యాను. అంటే హైదరాబాద్ ను ప్రపంచ పటం లో చేర్చింది ముందు నేనే . జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా మనం నడిచి వచ్చిన దారిని మరువ వద్దు . బాంబులు పేల్చి పారిపోయినా, హత్యలు చేసి దొరక్కుండా తప్పించుకున్నా నా చిన్ననాటి అనుభవం ఉపయోగపడింది. ’’


‘‘ మీ జీవితం చాలా ఆసక్తి కరంగా ఉంది’’
‘‘ కష్టపడనిదే ఏదీ సాధ్యం కాదు. దేశంలో కొన్ని లక్షల మంది దొంగ వెధవలు ఉన్నారు. మరి నాలాంటి వాడే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడంటే కారణం? నాలో ఉన్న ప్రత్యేకతలే కదా? ’’


‘‘నిజమేనండి ఏ రంగంలోనైనా ప్రత్యేకతలు ఉంటేనే ఎదుగుతారు. అనాధ  శవాలు కొని కాలువలో పడేసి, ఈ శవాలు ఎక్కడివి? అని స్పెషల్ స్టోరీలు చేసి ఎదిగిన జీవితాలు మావి! మాఫియాలానే మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ’’


‘‘ మీడియా అంటే గుర్తుకొచ్చింది. మేం ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాం. మా కాలంలో మీడియా ఇంత ప్రోత్సాహకరంగా లేదు. మేం ఎదిగిన తరువాత సినిమాలే మాకు వెన్నుతట్టి ప్రోత్సహించాయి .. తరువాత మీడియా. కానీ ఈ తరం నేరస్తులు అదృష్టవంతులు. బావ కళ్లల్లో వెలుగు చూసేందుకే హత్య చేశాను అని కోన్ కిస్కా గాడు ఒక్క పంచ్ డైలాగు టీవిల్లో పేలిస్తే తెల్లారే సరికి వాడు పాపులర్ నేరస్తుడు అయిపోతున్నాడు. కనీసం డజను హత్యలు, రేప్‌లు, దోపిడీలు చేస్తే కానీ నేరస్తుడిగా సమాజం నుంచి మాకు తగిన గుర్తింపు లభించేది కాదు. చానల్స్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఔత్సాహిక నేరస్తులకు చక్కని ప్రోత్సహం అందిస్తున్నారు. తగిన ప్రచారం కల్పిస్తున్నారు. శతృదేశంతో వీరోచితంగా పోరాడి విజయం సాధించే సైన్యాధ్యక్షుడికి కూడా ఇవ్వనంత ప్రచారం నేరస్తులకిస్తున్నారు. మా కాలంలో ఇప్పుడున్నంత ప్రచారం ఉంటే నేను ఎప్పుడో విశ్వనేరస్తుడ్ని అయ్యేవాడిని. అయితే నాకో బాధ కూడా ఉంది. మీడియా ఇంత ప్రోత్సహం అందిస్తున్నా, మనం నేరస్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగలేదు. నైజీరియా అనే చిన్న దేశం ఇంత పెద్ద దేశానికి నేరస్తులను దిగుమతి చేయడమే నాకు కొంత బాధగా ఉంది.’’


‘‘ దీనిపై మీరేమైనా చేయాలనుకుంటున్నారా? ’’
‘‘నాకో ఆలోచన ఉంది. క్రికెటర్లు, టెన్నిస్ ప్లేయర్లు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత అకాడమీ ఏర్పాటు చేస్తారు కదా? ప్రభుత్వం తగిన ప్రోత్సహం ఇచ్చి అవసరం అయిన నిధులు ఇస్తే నేరస్తుల అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తాను. అప్పుడు నైజీరియాకు కూడా మనమే ఎగుమతి చేయవచ్చు. ’’
‘‘మీ జీవిత లక్ష్యాలు? నిజానికి ఈ రంగానికి సంబంధించి ఒక సెజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది . ’’
‘‘నా జీవితంలో నేను కోరుకున్నవి అన్నీ సాధించాను. మీలాంటి వాళ్లు హీరోలను దేవుళ్లుగా కొలుస్తారు. అలాంటి హీరోలే మా దర్శనం కోసం పడిగాపులు కాస్తారు. కనిపిస్తే కాళ్లు మొక్కుతారు. సహాయం కోరుతారు. ఈ దేశంలో మహాత్మాగాంధీపై ఒకే ఒక సినిమా వచ్చింది. అదీ విదేశీయుడు నిర్మించింది. నా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇక మొత్తం నా కథ అధారంగా 1999లో ‘వాస్తవ్’ వచ్చింది. సంజయ్‌దత్ పోషించిన పాత్ర నాదే. ఆ తరువాత ‘కంపెనీ’ సినిమాలో వివేక్ ఒబేరాయ్ పోషించిన చందు పాత్ర నాదే. ఈ జీవితానికి ఇది చాలు’’


‘‘ మీరెలా అరెస్టయ్యారు’’
‘‘ నేనా అరెస్టా? ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం అలానే మాకు లొంగు బాటు వయసు సహజం. ’’
‘‘ యువతకు మీరిచ్చే సందేశం. మహాత్మాగాంధీకి కూడా భయపడరు. డాన్‌కు భయపడతారు. డాన్ కావడం, దేశాన్ని దోచుకోవడం, మర్డర్లు చేయడం గురించి లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. చూడండి నేర్చుకోండి. హీరోలుగా సమాజం గుర్తింపు పొందండి. చానల్స్‌లో దేశానికి సందేశం ఇవ్వండి ’’
***
‘‘నువ్వు చేసిన ఇంటర్వ్యూతో మన చానల్ రేటింగ్ ఎక్కడికో పోయింది. వెరిగుడ్.. భారత రత్న సిఎన్‌ఆర్ రావు హైదరాబాద్ వచ్చారు. ఇంటర్వ్యూ చేస్తావా? ’’
‘‘యుఆర్ ఇన్సల్టింగ్ మీ.. నేనేంటి ఎవరో రావును ఇంటర్వ్యూ చేయడం ఏమిటి? బడా రాజన్ లాంటి వారిని ఇంటర్వ్యూ చేసిన నన్ను మీరిలా అవమానించడం సరికాదు. అవసరం అయితే బడా రాజన్‌కు చానల్ పెట్టమని సలహా ఇచ్చి అక్కడ సిఇఓగా చేరిపోగలను ఏమనుకుంటున్నారో?’’

-బుద్దా మురళి (జనాంతికం 8.11. 2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం