12, జూన్ 2016, ఆదివారం

మేధావికి కోపమొచ్చింది!

‘‘పినాకిని వాళ్ల అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. హైదరాబాద్‌లో మూడు వందల గజాల ప్లాట్, పాతిక లక్షల కట్నం ఇస్తున్నారట!’’
‘‘అమ్మాయి అందవికారంగా ఉంటుందా?

 ‘‘ఎందుకలా అడిగావు ?’’

‘‘ కాలం మారి చాలా కాలం అయింది. అమ్మాయిలే అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్నారు. మన కాలంలో అబ్బాయి కట్నం వద్దంటే ఏదో లోపం అనుకునే వాళ్లు. ఇప్పుడు అమ్మాయికి భారీ కట్నం ఇస్తే ఏదో లోపం అనుకుంటున్నారు.’’

‘‘మళ్లీ కన్యాశుల్కం వస్తుందేమో’’
‘‘మేధావుల చర్చ విసుగేసి సినిమా చానల్స్‌లో కన్యాశుల్కం మళ్లీ వస్తే చూశా’’
‘‘చిన్నపిల్లలూ ,మేధావులు ఒక్కటే వారికి ఎప్పుడూ తృప్తి ఉండదు. స్థిరంగా ఉండరు. వారికేం కావాలో వారికే తెలియదు’’
‘‘మేధావులంటే నీకు చాలా చిన్నచూపు. వారి అసంతృప్తిపై ఏమంటావు?’’
‘‘ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా, సాహసోపేతంగా ఒక పూట దీక్ష చేసిన ఆంధ్ర మేధావి గురించా?’’
‘‘కాదు’’


‘‘మేధావుల్లో అనేక రంగులున్నాయి. అనేక దారులు ఉన్నాయి . లెఫ్ట్ మేధావులు , రైట్ మేధావులు . ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంటే రోజుకు రెండుసార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలి. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఫైళ్లను స్వయంగా పరిశీలించాలని, అలా ఐతేనే వాళ్లు పని చేస్తున్నట్టు అని మన నమ్మకం. గవర్నమెంట్ ఆఫీసులో ఇన్ని ఫైళ్లు పెరుకుపోతే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేయడం ఏమిటని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదో ప్రచారం కోసం వీటిలో వాళ్లు వేళ్లు,కాళ్లు,చేతులు,చీపుర్లు పెడతారు. అంతే తప్ప వారి పని ఇది కాదు. ప్రధానమంత్రి అంటే ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులో క్లర్కా 10 నుంచి సాయంత్రం ఐదు వరకు ఉండేందుకు. దేశాలు తిరిగితే ఆయా దేశాలతో సంబంధాలు బలపడతాయి. ఆకస్మిక తనిఖీలతో ప్రచారం తప్ప ఏమొస్తుంది. ప్రధాని పర్యటనలను మేధావులు ఎందుకు విమర్శిస్తారో వారికే తెలియాలి..’’


‘‘నేను తెలంగాణ మేధావుల గురించి అడుగుతున్నాను’’
‘‘పవన్, మహేశ్, ఎన్టీఆర్‌ల సినిమాలు చూస్తావా? తాము చూస్తున్నది వాస్తవ ప్రపంచం కాదు. సినిమా తెర అనే విషయం మరిచిపోయి హీరోలు చేసేదంతా నిజమేనని, హీరో తలుచుకుంటే ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ ఉండదని అభిమానులు అనుకుంటారు. ఐతే సినిమా చూసేది పిచ్చోళ్లేమీ కాదు.’’
‘‘ రాజకీయాల గురించి అడుగుతుంటే సిల్లీగా సినిమాల గురించి చెబుతున్నావు’’
‘‘రెండూ ఒకటే. ‘రాజకీయం సినిమానే. నేను నటుణ్ని’అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో సగర్వంగా ప్రకటించారు. తెలుగునాట సినిమాలు రాజకీయాలు అద్వైతంలా ఒకటే. ’’


‘‘కెసిఆర్‌ను ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు కదా దాని గురించి చెప్పు’’
‘‘మహాత్మాగాంధీనే స్వాతంత్య్ర పోరాట కాలంలో విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తున్నారు. హిందూమతంలో దైవాన్ని విమర్శించే నాస్తికత్వం కూడా భాగమే. చార్వాకుల గురించి తెలిసిందే కదా? కెసిఆర్, కోదండరామ్ ఎవరూ విమర్శలకు ఎవరూ అతీతులు కారు. విమర్శలో సారం ఏంటీ? అనేది ముఖ్యం.’’


‘‘సరే అదే చెప్పమంటున్నాను. విమర్శలో సారం ఉందా? లేదా?’’
‘‘అప్పటి వరకు అమ్మాయిలతో సముద్ర స్నానాలు చేస్తున్న హీరో ప్రపంచం ప్రమాదంలో పడిందనే సమాచారం అందగానే 007 అంటూ రంగంలోకి దిగి ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఇది ఇంగ్లీష్ సినిమాల కథ. అదే తెలుగులోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి, కుటుంబానికి, హీరోయిన్‌కు ఎంత కష్టం వచ్చినా మహేశ్‌బాబు వచ్చి రక్షిస్తాడు. ఎంతటి క్లిష్టపరిస్థితిలోనైనా సినిమా హాలులోని ప్రేక్షకుడు చలించడు. హీరో వచ్చి రక్షిస్తాడనే పూర్తి భరోసాతో మల్టీఫ్లెక్స్‌లో కాలుమీద కాలు వేసుకొని సినిమాలో నిమగ్నమవుతాడు.’’
‘‘మళ్లీ నువ్వు సినిమాల్లోకి వెళ్లావు.’’
‘‘నువ్వడిగిందే నేను చెబుతున్నాను. నీకు విషయం అర్ధం కావడం లేదు. కోదండరామ్ మాటలను బట్టి కెసిఆర్‌ను విమర్శించాడని నువ్వనుకుంటున్నావ్..  కానీ ఆలోచిస్తే  కెసిఆర్ ను  తెలంగాణా హీరో గా భావిస్తున్నారని   నాకనిపిస్తోంది ..  టాలీవుడ్ హీరో చిటికెలో సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు తెలంగాణా హీరో రెండేళ్లలో తెలంగాణా సమస్యలు పరిష్కరించాలేరా ?  అనేది వారి విమర్శలోని ప్రశ్న కావచ్చు .  హీరోపై అభిమాని పెట్టుకున్నన్ని ఆశలు తెలంగాణ ప్రభుత్వంపై పెట్టుకున్నారని అర్థమవుతుంది.’’
‘‘ఎలా?’’
‘‘సాధారణ తెలంగాణ ప్రజలకు వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి కరువు పోతుందని, నాలుగైదేళ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయని, మూడేళ్లలో మిషన్ భగీరథ పూర్తయి ఇంటింటికి నీళ్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ సినిమాలో హీరో క్షణాల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని అభిమాని కోరుకున్నట్టు తక్షణం తెలంగాణ సర్వ సమస్యలను కెసిఆర్ పరిష్కరించేస్తారని  అనుకున్నారేమో’’
‘‘సూటిగా చెప్పు’’


‘‘ఎన్టీఆర్ తొలిసారి సిఎం అయినప్పుడు ఒక  అద్భుత ప్రయోగం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే పుట్టిన కొందరు పసిపిల్లలను తీసుకు వచ్చి ఈ మనుషులకు దూరంగా పెంచి, నాయకులను చేయాలనుకున్నారు. వారికి కుటుంబం ఉండదు కాబట్టి సమాజం కోసం పని చేసే నాయకులుగా మారుతారు అని చెప్పారు. ఇంట్లో అల్లుళ్ల పోరుతో ప్రయోగాన్ని అటకెక్కించారు. కుటుంబం గురించి కాకుండా కేవలం సమాజం గురించే ఆలోచించే పౌరులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయాలనుకోవడం బ్రహ్మాండమైన ఆలోచన కదా? మావోయిస్టులు సైతం ఇలానే ఆచరణ సాధ్యం కాని కలలు కంటుంటారు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న రాజకీయ సిద్ధాంతాలు ప్రంపంచంలో ఎక్కడా ఆచరణలో కనిపించవు. గద్దర్ గొప్ప గాయకుడు కానీ నాయకుడు కాలేక పోయారు. ఎన్టీఆర్ మహానటునిగా పూజలందుకున్నా నాయకునిగా నిలదొక్కుకోలేదు. రెండుసార్లు వెన్నుపోటు పాలయ్యారు. మేధావి వేరు రాజకీయ నాయకుడు వేరు. ఐన్‌స్టిన్ లాంటి ప్రపంచలోనే మేటి మేధావిని పిలిచి పదవి ఇస్తామంటే నేను పాలనకు పనికిరాను అని తిరస్కరించారు.’’
‘‘ఇంతకూ ఎవరిది తప్పో? ఎవరిది ఒప్పో చెప్పనే లేదు’’
‘‘కోదండరామ్ దృష్టిలో కోదండరామ్‌ది కరెక్ట్ కెసిఆర్‌ది తప్పు. కెసిఆర్ దృష్టిలో కెసిఆర్‌ది కరెక్ట్ కోదండరామ్‌ది తప్పు. ఎవరి పని వాళ్లు చేస్తారు. మన పని మనం చేద్దాం’’

-జనాంతికం - బుద్దా మురళి (12-6-2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం