26, జూన్ 2016, ఆదివారం

బ్రెగ్జిట్-ఉమ్మడి కుటుంబం

‘‘పని మనిషి రాలేదు. బ్రెగ్జిట్ ప్రభావమట! వాళ్ల గుడిసె అద్దె పెంచమని చెప్పారట!మనం జీతం పెంచాలట!పొద్దున అటోవాడు కూడా కిరాయి పెంచితేనే రేపటి నుంచి పిల్లాడిని స్కూల్‌కు తీసుకెళతానంటున్నాడు. ఎవర్ని పలకరించినా బ్రెగ్జిట్ అంటున్నారు! ? ’’
‘‘చిన్నప్పుడు స్కైలాబ్ పడుతుందని, రోజులు దగ్గర పడ్డాయని బర్రెలు, గొర్రెలు అమ్ముకుని జల్సా చేశారు గుర్తుందా? ఇది కూడా అలాంటిదేనన్నమాట’’


‘‘మీరు ఇంటికి ఆలస్యంగా వచ్చి చెప్పే కథలన్నీ నమ్ముతున్నాను కాబట్టి, ఏం చెప్పినా నమ్మేంత అమాయకురాలిని అనుకుంటున్నారా?’’
‘‘అర్ధం కాక అడిగాను. పూర్తిగా తెలియక కాదు. జిహాద్‌లా ఇది కూడా ఏదో ఒక ప్రమాదకరమైందని మాత్రం అర్థమవుతుంది. బ్రెగ్జిట్ వల్ల పని మనిషి, ఆటో వాడు రేట్లు పెంచడం ఏమిటి? వాళ్లకు కనీసం బ్రెగ్జిట్ అని పలకడం కూడా రాదు’’
‘‘ ప్రపంచీకరణ అంటే అంతే. గతంలో సోవియట్ రష్యాలో వాన పడితే మన దేశంలో ఎర్ర పార్టీల వాళ్లు తుమ్ముతారు అనే వారు. రష్యా కుప్పకూలి ఎర్రపార్టీలకు కాలం చెల్లి ప్రపంచీకరణ మొదలయ్యాక ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వాన పడ్డా ప్రపంచ మంతా తుమ్ముతోంది. పెళ్లప్పుడు నీకు వడ్డాణం చేయిస్తాను అని ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనుకునే సరికి బ్రెగ్జిట్‌తో బంగారం ధర పెరిగింది.’’


‘‘ అర్ధం కాలేదు’’
‘‘ఉమ్మడి కుటుంబం అనుకో. ఉమ్మడి కుటుంబంలో లాభాలు నష్టాలు ఎన్నున్నాయో ఐరోపా కూటమిలో అన్నిలాభ నష్టాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో పని మంతుడు, పని చేయలేని వాడు అంతా బతికేస్తారు. చిన్న కుటుంబంలో ఎవరి బతుకు వారిది అంతే. ఐరోపా కూటమిలో మా అవకాశాలు దెబ్బతింటున్నాయి, మేం విడిగా కాపురం పెట్టుకుంటామని బ్రిటన్ తేల్చేసింది. అంటే కొత్తగా పెళ్లయినప్పుడు మన ప్రేమ ముచ్చట్లకు ఉమ్మడి కుటుంబం అడ్డంగా ఉందని, మనం విడి కాపురం పెట్టుకున్నాం కదా? ఇదే అంతే బ్రెగ్జిట్ అంటే విడిగా కాపురం పెట్టుకోవడం అన్న మాట ’’
‘‘ఈరోజుల్లో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటున్నారీ కాలం పిల్లలు. అమ్మనాన్న, చెల్లి అన్న ఇవే కాకుండా ఇంకా చాలా బంధుత్వాలు ఉంటాయి అంటే నమ్మడం లేదు. మహేశ్ బాబు లాంటి హీరోతో ఈ తరానికి తెలియని బోలెడు బంధుత్వాలతో బ్రహ్మోత్సవం తీస్తే ఆదరణ దక్కలేదు. రైళ్లను వెనక్కి పరిగెత్తించే బాలకృష్ణ వల్ల బ్రెగ్జిట్ నష్టాన్ని ఆపలేరంటారా? ’’


‘‘ బాలకృష్టనే కాదు చిరంజీవి వల్ల కూడా కాదు’’
‘‘ఎవరి వల్ల కాకపోయినా రజనీకాంత్ వల్ల కానిది ఉండదు. ఈ యూరప్ వాళ్లకు ఇండియా అంటే చిన్న చూపు అందుకే రజనీకాంత్ లాంటి వారికి ఈ బాధ్యత అప్పగించడం లేదు’’
‘‘సర్లే కానీ సింపుల్‌గా చెప్పాలంటే యూరప్ సమాఖ్యలో ఉండడం వల్ల మా ఉద్యోగాలు, మా అవకాశాలు, మా అభివృద్ధి దెబ్బతింటోంది మా బతుకు మేం బతుకుతాం అని బ్రిటన్ బయటకు వెళ్లింది’’
‘‘ ఇప్పుడర్థమైంది. ఇది తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం అన్న మాట! కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పవని అంటే ఇప్పుడు బ్రిటన్‌లో సమైక్యాంధ్ర ఓడిపోయింది అంతే కదా? ’’
‘‘నీకు మునిమాణిక్యం గారి కాంతం బంధువు అవుతారా? ఏమీ లేదు ఆమె కూడా ఇలానే తలా తోకా లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది.’’
‘‘మీ బంధువులంతా నా బంధువులే కదా?’’
‘‘బ్రెగ్జిట్‌కు సమైక్యాంధ్ర తెలంగాణకు కిరణ్‌కుమార్‌రెడ్డికి అసలు సంబంధం ఏముంది?’’
‘‘అలా తేలిగ్గా తీసిపారేయకండి నాకు గుర్తు లేదనుకోకండి. బ్రిటన్ నుండి విడిపోవాలని స్కాడ్‌లాండ్ ఐదువందల ఏళ్ల నుంచి కోరుకుంటోంది. ఓటింగ్ జరిగితే తీరా కలిసే ఉందామనే వాళ్లు మెజారిటీ సాధించారు. అప్పుడు మీరేమన్నారు. సమైక్యాంధ్ర వాదం గెలిచిందని అన్నారు. మరిప్పుడు యూరప్ సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వెళదామని మెజారిటీ ప్రజలు చెప్పడాన్నిబట్టి తెలంగాణ వాదం గెలిచినట్టే కదా?’’
‘‘విద్యుత్ కొరత లేకపోవడంతో ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ జరిగినా టీవిలో చూస్తూ ఒంటరిగా రాజకీయ శేష జీవితం గడుపుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మధ్యలో ఎందుకు లాగుతావు’’
‘‘నేను లాగడం ఏమిటి? కావాలంటే విభజన, సమైక్య ఉద్యమ కాలం నాటి పత్రికలు చూడండి తెలంగాణ ప్రభావం దేశం మొత్తం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఉంటుందని చక్కగా రాశారు. ఏమో నండి ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అని భావించే అమెరికా మీద కూడా ఈ ప్రభావం ఉందని అనిపిస్తోంది. ఆయనెవరో ట్రంప్ అచ్చం కెసిఆర్‌లానే మా ఉద్యోగాలు మాకే. అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు అంటూ అక్కడ స్థిరపడ్డవారిని వణికిస్తున్నారట! పక్కింటి వనజాక్షి వాళ్లింట్లో మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే వాళ్ల అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేసే చాన్స్ పోతుందని భయపడుతోంది. ట్రంప్‌ను ఓడించేందుకు ఆమె తన ప్రయత్నం తాను చేస్తోంది.’’


‘‘ఉమ్మడి కుటుంబం, సమైక్య వాదం, తెలంగాణ వీటికి మద్దతుగా, వ్యతిరేకంగా గంటల కొద్ది వాదించవచ్చు. అలానే యూరప్ సమైక్యలో ఉండాలా? వద్దా అనే దానికి అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పొచ్చు. కాలానికి తగ్గట్టు ప్రజలు తమకు నచ్చిన నిర్ణయం తాము తీసుకుంటారు. దాని మంచి చెడును వారే అనుభవిస్తారు. మాకు నచ్చిందే గొప్ప నిర్ణయం. మా నిర్ణయాన్ని మీరూ ఆమోదించాలి మెజారిటీతో సంబంధం లేదు అంటే చీకటి గదిలో విశ్రాంతి జీవితం గడపాల్సి వస్తుంది.’’
‘‘యూరప్ సమైక్యలోని మిగిలిన దేశాలు కూడా తమ దారి తాము చూసుకుంటాయా?’’


‘‘ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి మనం చిలకా గోరింకల్లా ఉన్నామా? కీచులాడుకుంటున్నామా? అన్న దాన్ని బట్టి మిగిలిన వాళ్లు నిర్ణయం తీసుకుంటారు. ’’
‘‘ప్రపంచీకరణతో ప్రపంచం కుగ్రామంగా కాదు ఏకంగా చిన్న కుటుంబంగా మారిపోయింది. మన కాపురం మీదే యూరప్ సమాఖ్య భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట ’’

జనాంతికం - బుద్దా మురళి 26-6-2016

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం