2, ఆగస్టు 2017, బుధవారం

తెలుగు చిత్ర పరిశ్రమ తరలిపోగలదా..!



అసలెందుకు తరలిపోవాలి?
తెలుగు పరిశ్రమ తరలిపోతుందా? వెళ్లిపోదామని ఒకరిద్దరనుకుంటే -40వేలమంది సమూహంతో సాగుతోన్న ఇండస్ట్రీ తెల్లారేసరికి తరలిపోవడం సాధ్యమా? ఒక్కో సందర్భంలో ఏ ఒకరిద్దరికో నొప్పికలిగిన ప్రతిసారీ -ఇలాంటి తర్కం తలెత్తడం పరిశ్రమకు మంచిదేనా?
**
తెలంగాణ ఉద్యమకాలం తరువాత మరోసారి తెలుగు సినిమా రంగాన్ని డ్రగ్స్ వ్యవహారం ఆలోచనల్లో పడేసింది. తెలంగాణ ఆవిర్భవిస్తే సినిమా పరిశ్రమ ఆంధ్రకు తరలిపోతుందనే ప్రచారం -ఉద్యమ సమయంలో బలంగా సాగింది. డ్రగ్స్ వ్యవహారంతో మళ్లీ అదే తరహా వాదన చర్చకొస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సినిమావాళ్లకు కోపం తెప్పించిందన్న కథనాలున్నాయి. దీంతో బహిరంగ ప్రకటన చేయకున్నా పరిశ్రమ విశాఖకు తరలి పోతుందేమో అని కొందరంటుంటే, పోతే బాగుండని ఇంకొందరూ ఆశ పడుతున్నారు.
**
తెలుగు సినిమా ఇతర ప్రాంతాలకు విస్తరించడం వేరు. హైదరాబాద్ నుంచి తరలి పోవడం వేరు. ఆంధ్రలోని విశాఖకే కాదు తెలంగాణలోని కరీంనగర్ లాంటి ప్రాంతాలకూ సినిమా విస్తరిస్తోంది. అంతమాత్రాన దీన్ని తరలిపోవడం అనలేం. టెక్నాలజీ పెరిగింది. చిన్న సినిమా హాళ్లపై దృష్టి మళ్లుతోంది. గుత్త్ధాపత్యానికి గండిపడే రోజు కనిపిస్తోంది. కనుక -సినిమా విస్తరించడం ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. అమెరికావంటి దేశాల్లో డాలర్లు సంపాదించిన ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా తెలుగు సినిమాపై దృష్టిపెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోన్న పరిణామం. ఇది బలపడినపుడు జిల్లాలస్థాయికీ తెలుగు సినిమా విస్తరిస్తుందేమో కానీ, మూలాలు వదులుకునే పరిస్థితి ఉండదు, ఉండబోదు కూడా. అందుకు -అనేక కారణాలు.
**
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదు కానీ -ఆంధ్ర ఐటి మంత్రి లోకేశ్ తెలుగు సినిమా పరిశ్రమ విశాఖకు వచ్చేలా చేస్తామని చాలాకాలంగానే చెబుతున్నారు. చెబుతూనే ఉన్నారు. అలాంటి ప్రకటనలు వెలువడినపుడూ -నిజంగా తెలుగు సినిమా ఆంధ్రకు తరలిపోతుందా? సాధ్యమా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో అధికశాతం ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారి చేతిలోనే ఉందన్న భావన ఉన్నపుడు -ఆ రాష్ట్రానికి తరలిపోదని ఎలా ఎప్పగలం? బహుశ ఇంతటి సంక్లిష్టత ఒక్క తెలుగు సినిమాకే పరిమితమేమో. ఇక ఇలాంటి అంశాలు చర్చకు వచ్చినపుడే -రాత్రికి రాత్రి పరిశ్రమ తరలిపోవడం సాధ్యమా? అన్న ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి. సాధ్యం కాదనీ గతా అనుభవాలు రుజువు చేశాయి.
**
ఒకప్పుడు-
తెలుగువారికి రాష్ట్రం కావాలి. తమిళనాడులో రెండో తరగతి పౌరులుగా ఉండలేమన్న ఉద్యమం తీవ్రమైనపుడు -53లో రాష్ట్రం ఆవిర్భావమైంది. 56లో ఉమ్మడి ఆంధ్ర ఏర్పడింది. అయితే, పోరాడి తెచ్చుకున్న తెలుగునాడుకు సినిమా పరిశ్రమను తెచ్చుకోవడానికి దాదాపు అర్థ శతాబ్దం పట్టింది. 2000 సంవత్సరానికి సంపూర్ణంగా వచ్చిందన్న భావన కలిగింది. ఆంధ్ర సిఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన చిరునామా మద్రాస్ నగరమే. సినిమా గ్లామర్‌తో మహానటుడు సిఎం అయినా, తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరాలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో తరలింపు మొదలైతే, చంద్రబాబు సిఎంగా ఉన్నప్పటికి పూరె్తైంది. దశాబ్దానికో స్టూడియో నిర్మాణం చొప్పున మెల్లగా అడుగులేస్తూ 2000 నాటికి సినిమా పత్రికల కార్యాలయాలు సహా మద్రాస్ నుంచి ఆంధ్రకు తరలివచ్చింది. తమిళనాడులో తెలుగు సినిమాకు ఎలాంటి మార్కెట్ లేదు. సొంత రాష్ట్రం కాదు. సొంత భాష కాదు. మరి నాలుగు దశాబ్దాల పాటు మద్రాస్ కేంద్రం నుంచి తెలుగు సినిమా ఎందుకు కదల్లేదు. అందుకూ అనేక కారణాలు. అందులో ప్రధానంగా -ఎస్టాబ్లిష్‌మెంట్. అది పూర్తికాకుండా పరిశ్రమ మరోచోటికి కదలడం అంత ఈజీ కాదు.
**
ఇక తెలంగాణ నుంచి తరలి వెళ్లడాన్ని ఆలోచిద్దాం. తెలుగు సినిమాకు తెలంగాణ పెద్ద మార్కెట్టే. హైదరాబాద్ వద్దనుకుని విశాఖకు తరలిపోవడం అంటే, మార్కెట్‌ను దూరం చేసుకుంటున్నట్టే. మార్కెట్‌ను విస్తరించుకోవాలన్న ఆశతో ఇతర రాష్ట్రాలకు, ఓవర్సీస్‌కు పరుగులు తీస్తున్న తెలుగు పరిశ్రమ -ప్రస్తుత తరుణంలో తరలిపోవాలన్న నిర్ణయాలు తీసుకుంటుందా? మళ్లీ జీరో నుంచి కొత్త మార్కెట్ సృష్టిద్దామన్న ఆలోచనలకు పోతుందా? ఆలోచించాల్సిన ప్రశ్న.
**
వెళ్లిపోతాం.. పరిశ్రమ వెళ్లిపోతుందని ప్రచారం చేసేవారి లక్ష్యమేమిటోకానీ, ఇలాంటి ప్రచారాల వల్ల పరిశ్రమకు కలిగే ప్రయోజనం కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత పరిశ్రమకు ప్రభుత్వం వల్ల ఏదైనా భారీనష్టం కలిగివుంటే, అప్పుడు పరిశ్రమ తరలిపోవచ్చన్న చర్చకు అర్థముంటుంది. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏర్పాటైన ప్రభుత్వం పరిశ్రమపట్ల సానుకూలంగానే ఉందని సినిమావాళ్లే అంటున్నారు. అందుకు ఎన్నో అంశాలనూ ఉదహరిస్తున్నారు. పరిశ్రమ ఎదుగుదలకు ఎలాంటి సాయంకావాలో సూచించమంటూ ప్రభుత్వమూ అడుగుతోంది. మరెందుకు పరిశ్రమ తరలిపోవాలి అన్నదే చర్చ?
డ్రగ్స్ కేసులో సినిమావాళ్లను విచారించడం కొందరికి నచ్చడం లేదు. అందుక్కారణం సెలబ్రిటీలు అన్నింటికీ అతీతులన్న భావనే వాళ్లలో కనిపిస్తోంది. అందుకు కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ -డ్రగ్స్ కేసుతో సంబంధముందన్న విషయం బయటపడితే హీరోలు, హీరోయిన్లను విచారించడం తప్పా? కానీ, అదే తప్పైనట్టు, అందుకే పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోవాలని ఆశిస్తున్నట్టు పరిశ్రమలో కొందరి నుంచి సన్నాయినొక్కులు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలైన తమను విచారించడం ఏంటనే అహం తప్ప -తెలుగు సినిమా తరలిపోవచ్చన్న ప్రచారానికి మరో కారణం కనిపించడం లేదు. విశాఖపట్నానికి తరలిపోవాలన్నది కొందరి ఆశ. బాగానే ఉంది. అక్కడ -చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలుండవన్న హామీ ప్రభుత్వాలేమైనా ఇస్తాయా?
***
ఒక్కసారి చరిత్రను పరికిస్తే-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే నిజాం రాజ్యం 1920ల్లోనే హైదరాబాద్‌లో స్టూడియోలు ఉన్నాయి. హైదరాబాద్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్, దీరేంద్ర నాథ్ గంగూలీని హైదరాబాద్ పిలిపించి, 1921లో ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర స్టూడియో కట్టించారు. లోటస్ ఫిల్మ్ కంపెనీగా నామకరణం చేశారు. నిజాం రాజ్యంలో సినిమా పరిశ్రమ పునాధులను బలోపేతం చేయడానికి ఆ కాలంలోనే ప్రయత్నాలు జరిగాయి. దీరేంద్ర నాథ్ గంగూలీ సలహాపై రెండు సినిమా హాళ్లను కట్టించారు. లోటస్ స్టూడియోలో అప్పుడు  ఐధు సినిమాలు నిర్మించి మన దేశంలోనే కాదు, పొరుగు దేశాల్లోనూ విడుదల చేశారు. దీరేంద్రనాథ్ గంగూలి నిర్మించిన సినిమాల్లో ఒకటి -ముస్లిం యువరాజు, హిందూ యువతి ప్రేమ కథ. ఈ సినిమా వివాదాస్పదం కావడంతో ఆగ్రహించిన నిజాం, 24 గంటల్లో సినిమా యూనిట్ సభ్యులు హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాంతో ఆయన వెళ్లిపోయారు. 1928లో హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో అజంతా సినీ స్టూడియోస్ నిర్మించారు. 1970 వరకు పనిచేసిన ఆ స్టూడియోలో దాదాపు 200 సినిమాలు నిర్మించారు. 1931లో సికిందరాబాద్‌లో మహావీర్ సినీ కార్పొరేషన్ పేరిట స్టూడియో నిర్మించి 16 హిందీ సినిమాలు, ఎనిమిది ఇంగ్లీష్ సినిమాలు నిర్మించారు.
కొన్ని సినిమా కుటుంబాలు హైదరాబాద్‌కు వచ్చి ఉండకపోతే హైదరాబాద్‌కు అసలు సినిమా గురించే తెలిసి ఉండకపోయేది అన్న తలంపునూ కొందరు వ్యక్తం చేస్తుండటం దురదృష్టకరం. హైదరాబాద్ నగరంకన్నా చిన్న సైజులో ఉన్న దేశాలే సొంత భాషలో సినిమాలు తీస్తున్నాయి. అంతర్జాతీయ అవార్డుకలు అర్హమైన సినిమాలను ఆ దేశాలు అందిస్తున్నాయి. ఆంధ్ర ఏర్పడకుండా హైదరాబాద్ అలాగే ఉండివుంటే, అప్పుడూ సినిమాలు ఉండేవి. అందులో సందేహం లేదు. కారణం -సినిమా వ్యాపార కోణానికి ఎప్పుడో మారింది.
తెలంగాణ యాసతో శేఖర్ కమ్ముల ఫిదా తీసినా, మరో నిర్మాత కోస్తా యాసతో సినిమా తీసినా -అదంతా వ్యాపారమే. వ్యాపారికి లాభం ముఖ్యం. సెంటిమెంట్ వ్యక్తిగతం, వ్యాపారం వాస్తవం.
ప్రస్తుత తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా ఉన్న దిల్‌రాజు తెలంగాణకు చెందిన వారే. అయినా, తెలంగాణ కోణంలో సినిమా తీయలేనని, సినిమా అనేది వ్యాపారం అంటూ బహిరంగంగానే చెప్పుకున్నాడు. ఇప్పుడు దిల్‌రాజే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన వారూ తెలంగాణ యాసతో సిసినా విజయం సాధిస్తుందని అనుకుంటే, పోటీ పడి మరీ సినిమా తీస్తారు. ఇటీవల సక్సెస్ అయిన పలు సినిమా కథల్లో తెలంగాణ హీరోలు, హీరోయిన్లు కనిపిస్తారు. పెళ్లిచూపులు, అమీతుమీ, ఫిదావంటి సినిమాల్లో ప్రధాన పాత్రలది తెలంగాణ నేపథ్యంగానే చూపించారు. హీరో హీరోయిన్లలో ఒకరిది ఆంధ్ర, మరొకరిది తెలంగాణ నేపథ్యాలుగా చూపించారు. మారిన పరిస్థితుల్లో అనివార్యంగా మారిన ట్రెండ్ ఇది. రెండు ప్రాంతాల్లో మార్కెట్ ఉంది. ఒక ప్రాంతం కోసం ఇంకో ప్రాంతం మార్కెట్ వదలుకోలేరు.
సినిమా రంగాన్ని హైదరాబాద్‌లో ఉంచేది మార్కెట్ తప్ప సెంటిమెంట్ కాదు. సినిమా పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించొచ్చు. విస్తరించాలి కూడా. అంతేగాని, తరలిపోవాలన్న ఆలోచనలు రేకెత్తించడం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే నష్టం.
-బుద్దా మురళి( వెన్నెల ఆంధ్రభూమి 1.8. 2017)

1 కామెంట్‌:

  1. సరైన కారణం లేకుండా పరిశ్రమని కదపటం అనాలోచితమైన చర్య. అందరూ కూలంకుషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి వ్యాసం.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం