6, అక్టోబర్ 2017, శుక్రవారం

బట్టతలతో విప్లవం

‘‘దేవుని సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ ప్రత్యేకత ఉంటుంది.’’
‘‘ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా?’’
‘‘ఎప్పుడు తెలిసింది అని కాదు, ఎలా తెలిసింది అని అడుగు. బుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఆ దృశ్యం చూడగానే నాకిప్పుడు ఈ విషయం గుర్తుకు వచ్చింది.’’
‘‘ఏమా విషయం? ఏమా జ్ఞానోదయం?’’
‘‘భూమి  బల్లపరుపుగా వుంటుందని పతంజలి గోపాత్రునికి అనిపిస్తే పోలీసాయనకు తన లాఠీలా ఉంటుందనిపించింది. భూమి నిజంగా ఎలా వుంటుందో తేల్చకుండానే గోపాత్రుని పాత్రను ముగించారు. కానీ నాకు మాత్రం భూమి బట్టతలలా నున్నగా ఉంటుందనిపిస్తోంది.’’
‘‘అర ఎకరం భూమి కొని ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మొత్తం పదెకరాలను చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేవాళ్లు వుంటారు. అడ్డదిడ్డంగా వున్న భూమిని వాళ్లు చదును చేస్తారు. అంతే తప్ప భూమి తనంతట తానుగా చదునుగా ఉండదు. పక్కింటి పిల్లకు తల దువ్వమన్నా మనవారికి కోపం వస్తుంది. కానీ వీళ్లు మాత్రం తన పర అనే బేధం లేకుండా ఎక్కడ అనాధ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోయి చదును చేస్తారు. ఇంతకూ జ్ఞానోదయం గురించి చెప్పనేలేదు.’’
‘‘ప్రతి వ్యక్తి పుట్టుకకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అది తెలియకే కొందరు చెంప దెబ్బలు కొట్టినా, కాలితో తన్నినా దులపరించుకొని ఆత్మాభిమానం లేకుండా అభిమానులం అని వెంటపడతారు.’’
‘‘ముందు విషయం చెప్పు?’’
‘‘నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు మహానుభావులు. అలా తెలుసుకుంటే మన ప్రత్యేకత ఏంటో మనకు తెలుస్తుంది. ఆర్టీసీ డ్రైవర్‌గా వున్న గైక్వాడ్ తనకో ఫ్రత్యేకత ఉందని తెలుసుకుంటే రజనీకాంత్ అవుతాడు. ముక్కు మూసుకుని యోగాచేసే పతంజలి తన ప్రత్యేకత తెలుసుకుంటే మల్టీ నేషన్ కంపెనీలను కూడా గడగడలాడించే బ్రాండ్‌గా మారిపోతాడు.’’
‘‘అసలు విషయం చెప్పు?’’
‘‘వ్యక్తిత్వ వికాసం పాఠాలు అనగానే కుర్రకుంకలు మొదలుకుని వృద్ధ కుంకల వరకు అబ్రహం లింకన్ అంటూ చెప్పుకుంటూ వస్తారు. ఇంకెంత కాలం ఆయనే్న పట్టుకుని వేలాడతారు. ఇదిగో ఈయన్ని మించిన ఉదాహరణ ఇంకోటి ఉందా? చెప్పు’’
‘‘ఏదీ ఈ బట్టతలనా?’’
‘‘అవును ఈ బట్టతలనే.. హరిత విప్లవం ,శ్వేత విప్లవం కన్నా పెద్ద విప్లవం ఈ బట్టతల విప్లవం ..  అదేదో బంగారం షాప్ ఓనర్ తనను తాను బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చుకున్న తీరు అమోఘం. రేప్ చేసినవాడు, ఐపి పెట్టినవాళ్లు నలుగురిని ముంచిన వాళ్లు, మర్డర్ చేసిన వాళ్లు, చివరకు ఆకురౌడీలు కూడా తలెత్తుకుని తిరుగుతున్న ఈరోజుల్లో తలదించుకొని భారంగా బతుకుతున్న బట్టతల వాళ్లు తలెత్తుకుని తిరిగేట్టు చేసిన ఆ జ్యువెలరీ బట్టతల ఓనర్‌ను చూడగానే నాకెంత సంతోషమో!’’
‘‘సంతోషం ఎందుకు?’’
‘‘పతంజలి  , ఈ బట్టతలాయన మన కాలంలో పుట్టిన మహానుభావులు చరిత్రను మలుపుతిప్పిన చారిత్రక పురుషులు.’’
‘‘అంత గొప్పతనం ఏంటో వారిలో?’’
‘‘ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపాలు. స్వదేశీ వస్తువునే వాడాలని మహాత్మాగాంధీ కాలంనుంచి మన కాలం వరకు ఎంతోమంది ప్రచారం చేసారు. పట్టించుకున్నవారెవరు. మల్టీ నేషన్ కంపెనీలు మనదేశాన్ని మింగేస్తున్న కాలంలో రాందేవ్ బాబా తానే బ్రాండ్‌గా మారి పతంజలితో మల్టీ నేషన్ కంపెనీలను మట్టి కరిపించడం అంటే మాటలా?’’
‘‘మోకాలికి బోడిగుండుకు సంబంధం అన్నట్టు రాందేవ్‌కూ బట్టతలాయనకు సంబంధం ఏమిటి? ఈయనది వనమూలికల వ్యాపారం ఆయనది బంగారం వ్యాపారం.’’
‘‘ఎందుకు లేదు. చాలా విషయాల్లో ఇద్దరి వ్యూహం ఒకటే. పైగా ఇద్దరూ మల్టీనేషన్ కంపెనీలను వణికిస్తున్నారు. ’’
‘‘నిజమా?’’
‘‘నీ కిప్పుడు నవ్వులాటగానే వుండొచ్చు. చూస్తూ ఉండు ఏదో ఒకరోజు దేశంలో బట్టతల లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు అడుక్కునే వాళ్లు వేసుకునేవారు. దేశంలో సంపద పెరిగాక అన్నం అడుక్కునే వాళ్లు లేరు. చిరిగిపోయిన బట్టలు అడుక్కుని వేసుకునేవారు లేరు. కానీ ఇప్పుడు చిరిగిన బట్టలే లేటెస్ట్ ట్రెండ్. ఎంత చీలికలు పేలికలు అయితే అంత ఆధునికులన్నమాట. ఆ బట్టతలాయన కూడా ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోయారు. తనకు బట్టతల అని ఆయన ఏమాత్రం ముఖం చాటేయలేదు. నిముషానికోసారి టీవీలో దర్శనమిస్తు ఒక్కసారి మా షాపునకు వచ్చి ధరలు చూసి మీరే నిర్ణయించుకోండి అని పిలుస్తున్నాడు. మహేష్‌బాబు, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్ అంటూ బంగారం వ్యాపారులంతా వాళ్ల వెంట పరుగులు తీస్తే, ఆ బట్టతలాయన మాత్రం ఇంట్లో నిలువెత్తు అద్దంలో తన బట్టతలనుచూసి యురేకా అని అరిచి మురిసిపోయి ఇంతకు మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడా దొరకడు అని తన బట్టతలను నమ్ముకుని కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించి, వందల కోట్ల బంగారం వ్యాపారం చేస్తున్నాడు’’
‘‘దర్శకుని డేట్స్ దొరక్కపోతే వి.బి.రాజేంద్రప్రసాద్ తానే దర్శకుడిగా మారి ‘దసరాబుల్లోడు’ తీస్తే సూపర్ హిట్టయినట్టు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో డేట్స్ దొరక్క ఆ బట్టతలాయన తానేబ్రాండ్‌గా మారాడేమో అని నా అనుమానం.’’
‘‘60కి చేరువలో ఉన్న బట్టతల హీరోలు విగ్గుతో నటించడం కన్నా ఆ బట్టతలాయన ఒరిజినల్ తలతో కనిపించేసరికి అతని నిజాయితీపై నమ్మకం కలిగి అతని వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుందేమో అనిపిస్తోంది.’’
‘‘ఏ పుట్టలో ఏ పాముందో ఏ బట్టతలలో ఎవరి అదృష్టం దాగుందో? ఎవరు చెప్పొచ్చారు. హీరో డేట్స్ దొరక్కపోతే కుక్కను, పిల్లిని, పిట్టలను విఠలాచార్య హీరోలను చేసేవారట. రామానాయుడులాంటి నిర్మాతలు హీరోల డేట్స్ దొరక్కపోతే తన సంతానానే్న హీరోలను చేసిన సందర్భాలున్నాయి. అలాగనే ఈ బట్టతలాయనకు అదృష్టం వరించింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పుట్టి నెల్లూరులో కూలీగా జీవితం ప్రారంభించి తానే బ్రాండ్‌గా మారడం అంటే ఏదో సినిమా కథలా ఉంది.’’
‘‘బట్టతలాయన్ని నువ్వు ఆకాశానికి ఎత్తేస్తున్నావు గానీ, టీవీలో ఆయన్ని చూడగానే చిరాకేస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఎంత మంది రాశారో తెలుసా?’’
‘‘తెలుసు. అలా రాశారంటే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే బట్టతలాయన ప్రచార మంత్రం ఫలించినట్టే. ఫేస్‌బుక్‌లోఅందమైన అమ్మాయిలకు ఉదయం లేవగానే గుడ్‌మార్నింగ్ అని పడుకోబోయేముందు గుడ్‌నైట్ అని క్రమం తప్పకుండా మెసేజ్‌లు పంపే పెద్ద మనుషుల్లా ఈయన ప్రతిరోజు పలకరిస్తున్నాడు. ఓసారి పోయివద్దామని సోమాజిగూడ లలిత జ్యుయలరీకి పోతే ఆయన ఎదురొచ్చి స్వాగతం పలుకుతాడు అనుకున్నాను. కానీ అక్కడ మాత్రం బతుకమ్మ చీరల పంపిణీ బంగారు ఆభరణాల అమ్మకానికి తేడా తెలియలేదు అంత జనం ఉన్నారు. అక్కడున్న అందమైన సేల్స్ గర్ల్‌ను ఇదేంటమ్మా అంటే, ముసి ముసి నవ్వులు నవ్వింది. పక్కనున్న ఆవిడ ధుమధుమలాడుతూ ఇంకా నయం నిన్నటి రష్‌లో ఈరోజు పది శాతం కూడా లేదు అంది. నిజమే కోట్ల రూపాయల ప్రకటనల ప్రభావం మరి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంగళ్లలో రత్నాల రాసులు పోసి అమ్మారట! అదెంత వరకు నిజమో కానీ సోమాజిగూడలో ఆ రోడ్డు మొత్తం బంగారం షాపులే. బట్టతలాయన ప్రచార ధాటిముందు నిలువలేక నాగార్జున మొదలుకుని అందరు నటుల షాపులు వెలవెలబోయాయి. బంగారం కూడా చిన్నబోతుంది అనిపించింది మొదటిసారి.’’
‘‘ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే మల్టీ నేషన్ కంపెనీలు ఎందుకు వణికిపోతాయి. ఈయన జీవితమే ఓ సందేశం ఎలా అవుతుంది?’’
‘‘ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఎడారిలో పంట పండించినట్టు అదేదో టెక్నాలజీతో బట్టతలపై వెంట్రుకలు మొలిపించే బిజినెస్ జోరుగా సాగుతోంది. అరచేయి అంత బట్టతలపై గడ్డిపరకంత వెంట్రుకలు మొలిపిస్తే లక్ష రూపాయలు. పర్సనల్ లోన్ తీసుకుని దీనికి తగలబెట్టే వారు కూడా ఉన్నారు. కొందరు తమలో తామే కుమిలిపోయి విగ్గు ముఖం పెట్టుకుని తమది కాని జీవితంలో బతికేస్తున్నారు. ఒకటి రెండు వెంట్రుకలు రాలి తెల్లబడినా గజగజ వణికిపోయి తమ జీవితం ఇక అడవి కాచిన వెనె్నల అని కుమిలిపోతున్నారు. వీరిని ఆశ్రయించి మల్టీ నేషన్ కంపెనీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఎంత గొప్పవారైనా ఈలోకంలో మనసులో మాస్క్ వేసుకుని జీవించక తప్పదు. వీటితోపాటు తలకు రంగు, విగ్గు అంటే మనది కాని జీవితంలో జీవించేస్తున్నాం. ఇలాంటి వారందరిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి బట్టతలతో విప్లవం సృష్టించిన ఆ బట్టతలాయనకు భారతరత్న ఇవ్వాలని నా డిమాండ్.’’
‘‘నీకే గనుక అధికారం వుంటే నిజంగానే భారతరత్న ఇప్పించేట్టు ఉన్నావు?’’
‘‘ఏదీ ఒరిజినల్ కాని వారి నటనకు మెచ్చి అవార్డులు ఇస్తున్నప్పుడు ఒరిజినల్ నటునికి ఇస్తే తప్పేంటి?’’
‘‘మరీ ఓవర్ చేస్తున్నావు?’’
‘‘పొట్టిగా వున్నాను. నల్లగా ఉన్నాను, బట్టతల అంటూ వంకలు వెతుక్కుంటూ కుమిలిపోయేకంటే వాటిని పట్టించుకోకుండా మనం లోపాలు అనుకునే వాటిని కూడా తన ప్రత్యేకతగా భావించి ఎదగడమే కాకుండా ధైర్యంగా ప్రజలముందు నిలిచిన ఆ బట్టతలాయన బంగారం కొనకపోయినా ఆయనలోని ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం.’’
‘‘అంటే ఆ బట్టతలాయన జీవితమే సందేశం అంటావు.’’
‘‘ఆయనే కాదు. ఎవరు అమ్మినా బంగారు ఆభరణాలనైనా అనుమానించాల్సిందే కానీ బట్టతలతో విప్లవం సృష్టించవచ్చు అనుకున్న ఆయన ఆత్మవిశ్వాసాన్ని అనుమానించకు.’’
-బుద్దా మురళి( jananthikam 6.10.2017)

2 కామెంట్‌లు:

  1. ‘‘పొట్టిగా వున్నాను. నల్లగా ఉన్నాను, బట్టతల అంటూ వంకలు వెతుక్కుంటూ కుమిలిపోయేకంటే వాటిని పట్టించుకోకుండా మనం లోపాలు అనుకునే వాటిని కూడా తన ప్రత్యేకతగా భావించి ఎదగడమే కాకుండా ధైర్యంగా ప్రజలముందు నిలిచిన ఆ బట్టతలాయన బంగారం కొనకపోయినా ఆయనలోని ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం.’’

    మోకాలికి బోడిగుండుకు సంబంధం అన్నట్టు రాందేవ్‌కూ బట్టతలాయనకు సంబంధం ఏమిటి?
    ‘‘ఎందుకు లేదు. చాలా విషయాల్లో ఇద్దరి వ్యూహం ఒకటే. పైగా ఇద్దరూ మల్టీనేషన్ కంపెనీలను వణికిస్తున్నారు. ’’

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం