22, డిసెంబర్ 2017, శుక్రవారం

కవిత్వానికి ఎన్‌కౌంటర్

‘‘ఏమోయ్ ఫాండురంగం అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా!’’
‘‘నిన్న నీ కవిత చూశాను. నిజం చెప్పు నువ్వు ట్రెజరీలో పని చేస్తున్నావా? లేక ఇంటెలిజెన్స్ అధికారిగా మారువేషంలో ట్రెజరీలో ఉన్నావా?’’
‘‘ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నీ బిల్లులన్నీ సాంక్షన్ చేస్తున్నందుకు నువ్వు నాకిచ్చే గౌరవం ఇదా? నీ చిన్నప్పటి తొలి ప్రేయసి విశాలాక్షి బిల్లులు కూడా నువ్వు చెప్పావని పైసా తీసుకోకుండా సాంక్షన్ చేస్తున్నందుకా ఈ అపవాదు.’’
‘‘విశాలాక్షి సంగతి ఇప్పుడెందుకు కానీ నిజం చెప్పు నీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా?’’
‘‘ఇంతకు ముందే ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్నావా? అన్నావు, ఇప్పుడేమో మావోయిస్టును అంటున్నావు అసలు నీకేమైందిరా? రాత్రి తాగింది దిగలేదా? పొద్దునే్న తాగావా? ’’
‘‘నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. నీ కవిత వ్యవహారంతోనే నాకీ అనుమానం వచ్చింది. నా దగ్గర దాచాలని ప్రయత్నించకు నిజం చెప్పు అసలు నువ్వెవరు? మావోయిస్టువా? పోలీసువా? ’’
‘‘చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం నేనేంటో నీకు తెలియదా? ఇదేమన్నా మహేశ్‌బాబు సినిమా అనుకున్నావా? జులాయి, పోకిరీ, రౌడీలా తిరిగి ఇంటర్‌వెల్ తరువాత మహేశ్‌బాబు ఐపిఎస్ 2014 బ్యాచ్ అని డైలాగు చెప్పేందుకు. నానా తంటాలు పడి క్లర్కు జాబు సంపాదించి రిటైర్‌మెంట్ నాటికి సెక్షన్ ఆఫీసర్ స్థాయికి చేరుకోవడానికే తాతలు దిగి వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా నీకెందుకొచ్చింది అనుమానం. ?’’
‘‘ఆధారాలు లేనిదే నేనేమీ మాట్లాడను. మీడియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.’’
‘‘నీ పరిచయాలతోనే కదా? నా కవిత్వం పత్రికల్లో వస్తోంది. ఆ సంగతి ఇప్పుడెందుకు? ’’
‘‘మొన్న ఎన్‌కౌంటర్‌పై కవిత్వం రాశావు కదా?’’
‘‘అవును రాశాను. చాలా బాగుందని చాలా మంది ఫోన్ చేశారు. కన్నులు చెమ్మగిల్లాయన్నారు. అన్నా నీ కవిత్వం చదివాక చదువు వదిలేసి అడవిలోకి వెళ్లి మొత్తం సమాజాన్ని కస కస కస నరికేయాలనిపించిందని ఓ యువ కవి అభినందించాడు తెలుసా? ’’
‘‘అడగడం మరిచిపోయాను. ఫేస్‌బుక్‌లో మొన్న మీ వాడి ఫోటో చూశా ఐబిఎంలో ఏటా 20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని పోస్ట్ చేశావు. ఉద్యోగంలో చేరాడా? ’’
‘‘లేదురా! అమెరికా వెళ్లి ఎంఎస్ చేస్తానంటున్నాడు. నీకు తెలుసు కదా ఒక్కగానొక్క కొడుకు వాడేం అడిగినా కాదనను. చుక్కా రామయ్య ఐఐటి కోచింగ్‌లో చేరుతాను నాన్నా అని మూడవ తరగతిలోనే అడిగితే ప్రశాసన్ నగర్ లోని సొంతింటిని అద్దెకిచ్చి, నల్లకుంటలో చుక్కా రామయ్య ఇంటి వీధిలోనే అద్దె ఎక్కువయినా పర్లేదని ఉన్నాను. ఇద్దరు ముగ్గురు ఐఎఎస్‌లు విశాలమైన ప్రభుత్వ క్వార్టర్లు కూడా వదలుకుని నల్లకుంటలో మా వీధిలోనే అద్దెకుంటున్నారు. అమెరికా వెళతాను డాలర్లలో జీతం వస్తుందంటున్నాడు. పిల్లల కోరిక తీర్చడం కన్నా ఈ జీవితానికి ఇంకేముంటుందిరా! ’’
‘‘నీకు సామాజిక బాధ్యత లేదా? మీ అబ్బాయికి ఓ తుపాకీ ఇచ్చి అడవి బాట పట్టించొచ్చు కదా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్ ! మనిషివేనా? నీ నోటి నుంచి ఆ మాటలెలా వచ్చాయిరా! ముక్కు పచ్చలారని నా బిడ్డను అడవిలో అనాధల్లా చనిపోయే వారితో పోలుస్తావా? చిన్ననాటి మిత్రుడివని ఊరుకున్నాను అదే మాట మరొకడు అనుంటే నాలుకు చీరేసేవాణ్ణి’’
‘‘సారీ నీకంత ఆవేశం వస్తుందని అనుకోలేదు’’
‘‘కన్న బిడ్డలను అడవికి పంపమంటే నాకే కాదు మనిషన్న ఎవడికైనా ఆవేశం వస్తుంది. ఆ సంగతి వదిలేయ్ ఇంతకూ నేను మావోయిస్టునో, పోలీసునో అనే అనుమానం ఎందుకు వచ్చింది ఆ సంగతి చెప్పు’’
‘‘ఎన్‌కౌంటర్‌పై నువ్వు పంపిన కవిత చదివేంత వరకు ఎనౌకౌంటర్ జరిగినట్టు తెలియదని, వాళ్ల రిపోర్టర్ నుంచి ఆ వార్త రావడానికన్నా ముందే నీ కవిత వాట్సప్‌లో వచ్చిందట మా జర్నలిస్టు మిత్రుడు చెప్పాడు. ఎన్‌కౌంటర్ సంగతి ముందుగానే తెలవడానికి పోలీసో, మావోయిస్టో ఆయితే తప్ప అంత వెంటనే మరొకరికి తెలియదని నీమీద మా వాడికి అనుమానం వచ్చింది. అయితే నీ కవితను బాగుందని పత్రికలో ఉద్యోగం మానేసి అటు నుంచి అడవి బాట పట్టాలన్నంత ఆవేశం తెప్పించిందని మా వాడు మెచ్చుకున్నాడు ’’
‘‘అదా నీ అనుమానం. మొన్న అక్కడెక్కడో ఎన్‌కౌంటర్ జరిగిందని చాలా మంది పోయారని వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. అది చూడగానే కవిత్వం రాశాను. కవిత్వం రాశాక మరుసటి రోజు చూస్తే పత్రికల్లో ఎన్‌కౌంటర్ వార్తే లేదు. వాట్సప్‌లో బోగస్ వార్త అని తేలింది. సర్లే ఎప్పుటికైనా పనికిరాకుండా పోతుందా? అని నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తుంటే టీవిలో ఎన్‌కౌంటర్ బ్రేకింగ్ వార్త కనిపించింది. వెంటనే మార్పులు చేసి వాట్సప్‌లో మీ వాడికి పంపించాను.’’
‘‘శవాల కోసం ఎదురు చూసే కాటికాపరిలా ఎన్‌కౌంటర్‌లో ఎవరు పోతారా? అని ఎదురు చూశావన్నమాట. నువ్వసలు ఏమీ మారలేదురా! చదువుకునే రోజుల్లో కూడా అంతే ప్రేమ కవిత్వం, ప్రేమ కవితలు రాసిపెట్టుకునే వాడివి కొత్తగా ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి పేరు చేర్చి ఇచ్చేవాడివి. ఓ సారి ఇద్దరు అమ్మాయిలకు ప్రేమలేఖ చేరింది. ఇద్దరి లేఖల్లో మ్యాటర్ ఒకటే, కోప మొచ్చి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు గుర్తుందా?’’
‘‘నా కవిత్వంతో విప్లవం సృష్టిస్తాను. ఓ కళాకారుడు నావల్ల పదివేల మంది అడవిబాట పట్టారు అని ప్రతి సభలోనూ గర్వంగా చెప్పుకుంటాడు. పదివేల మంది కాకపోయినా నా కవిత్వంతో ఓ పదిమంది అడవిబాట పడితే ఈ జీవితానికి అది చాలు.’’
‘‘ఓ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాను అని అంబానీ కూడా ఎప్పుడూ ఇంత గర్వంగా ప్రకటించలేదు. అంతకన్నా గర్వంగా వందలమంది యువతను అడవిబాట పట్టించాను అని కొంతమంది గర్వంగా ప్రకటించుకోవడం నేనూ విన్నాను. వస్తువులు అమ్మేప్పుడు షరతులు వర్తిస్తాయి అని రాసినట్టు, నా కవితతో మా పిల్లలు తప్ప ఇతరుల పిల్లలు అడవిబాట పడితే నా జీవితానికి అదే సంతృప్తి అని నీ కవితలో రాసుకుంటే బాగుంటుంది. చాతనైతే బతికే విశ్వాసం కలిగించు, బతికే మార్గం చూపించు. చంపే మార్గం చూపేందుకు నువ్వే కావాలా? లాడెన్ వారసుల నుంచి, అణ్వాయుధాల వరకు ఎన్నో ఉన్నాయి’’

‘‘ఏదో మిత్రుడివని వస్తే నా కవిత్వాన్ని ఎన్‌కౌంటర్ చేశావు. ఆ సంగతి వదిలేయ్ యాదగిరి గుట్ట వైపు రియల్ ఎస్టేట్ మంచి భూమ్ లో ఉంది . కొంత మంది ఫ్రెండ్స్ కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నాం . నీకేమైనా ఆసక్తి ఉంటే చెప్పు ’’
‘‘ స్టేట్ మిథ్య అని కవిత్వం రాసే మీరంతా కలిసి  రియల్ ఎస్టేట్ వాస్తవం అని పెట్టుబడులు పెట్టడం భలే గా ఉంది ’’

- బుద్దా మురళి(జనాంతికం 22-12-2017)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం