15, డిసెంబర్ 2017, శుక్రవారం

తెలుగు భాష పుట్టిల్లు

‘‘ఏంటా పరుగులు! లేడికి లేచిందే పరుగు అన్నట్టు అలా పరుగెత్తుతున్నావు, ఎక్కడికి?’’
‘‘ఇంకెక్కడికి రాజధాని నగరానికి. నగరం మొత్తాన్ని ఓసారి తనివితీరా చూద్దామని?’’
‘‘మంచిది నేను కూడా వస్తాను పద! ఇంతకూ నువ్వెవరు? నీ కథేంటో చెప్పు’’
‘‘వినే ఓపికుంటే ఆత్మకథ మొత్తం చెబుతా విను’’.
‘‘ఆత్మకథ అంటే భయమేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ విషాదంగా ముగియడానికి ఆత్మకథనే కారణం కదా!’’
‘‘ఎన్టీఆర్ అంటే గుర్తుకు వచ్చింది. ఆయన మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. కానీ ఊహించని విధంగా ఆయన నాకు తీరని ద్రోహం చేశారు’’.
‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు కానీ, ఎన్టీఆర్ ఎవరికీ ద్రోహం చేయలేదు. నువ్వు చెప్పినా నేను నమ్మను’’.
‘‘నేనెవరో చెబితే నువ్వా మాట అనవు. నేను తెలుగు భాషను ప్రపంచ తెలుగు మహాసభలను కనులారా చూసేందుకు పుట్టింటికి వచ్చాను. ఇంతకూ నువ్వెవరు?
‘‘నేను తెలుగు భాషాభిమానిని. పద, ఇద్దరం కలిసి నగర సంచారం చేద్దాం. ముందు నీ ఆత్మకథ ఏంటో చెప్పు’’.
‘‘నా పేరు మీదనే నటరత్న పార్టీ పెట్టడంతో ఎంత మురిసిపోయానో, భాషాప్రయుక్త రాష్ట్రం అయినా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ సంగతే మరచిపోయారు. ఇంతకాలానికి నాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి కదా! అని ఎన్టీఆర్ వచ్చినప్పుడు సంతోషించాను. ఆయన వస్తూనే సంగీత, సాహిత్య, నృత్య నాటక అకాడమీలు అన్నింటిని ఒక్క కలంపోటుతో రద్దుచేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి ఆస్థాన కవిగా ఉంటే ఆ పదవిని రద్దుచేశారు. కళలు, భాష పరస్పర ఆధారితాలు. కళాకారుడైనా కళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్లుడేమో సామాజిక శాస్త్రాలే వృధా అన్నారు. మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగు మీడియం వద్దన్నారు.’’
‘‘మొదటి జీవో రద్దుచేస్తూ మళ్లీ జీవో ఇచ్చారులే’’
‘‘ఇదిగో ఇక్కడే నిజాం రాజ్యంలో సభలో తెలుగులో ఉపన్యసించినందుకు మరాఠీలు అవమానించారు. నాకు ఈ అవమానం కొత్తేమీ కాదు. ఈ అవమానాలకు ముగింపు లేదు. నిజాం రాజ్యంలో అధికార భాష ఉర్దూ. తెలుగులో మాట్లాడితే, మరాఠీల అవమానిస్తే ఊరుకోలేదు. తెలుగుకోసం తెగించి పోరాడాం. భాషా ప్రయుక్త రాష్ట్రం అయినా రెండున్నర జిల్లాల భాషే అధికార భాష అని, మిగిలిన జిల్లాల భాషను అవహేళన చేసినా అంతగా ఎదిరించలేకపోయాను. నన్ను సినిమాల్లో, హీరోల భాష, విలన్ల భాషగా చీల్చినప్పుడు ప్రశ్నించలేకపోయాను. విలన్ల భాష అని అవహేళన చేసిన చోటే సగర్వంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండడంతో పుట్టింటికి వచ్చాను’’.
‘‘అదిగో అది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తులేదు. వయోభారంతో అలా కనిపిస్తుంది కానీ వందేళ్ల క్రితం నిజాం రాజ్యంలో తెలుగుదనంతో కళకళలాడిన భాషా కేంద్రాన్ని నేనెలా మరిచిపోతాను. ఆంక్షలను ఖాతరు చేయకుండా తెలుగు గళం వినిపించిన పుణ్యభూమిని మరుస్తానా?’’
‘‘ఇదిగో ఇక్కడి నుంచి సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రికను నడిపారు’’.
‘‘ఔను.. మహానుభావుడు, నిజాం రాజ్యంలో నియంతృత్వాన్ని ఎదిరించి వీరోచితంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా గోల్కొండ పత్రికను నడిపినా, భాషాప్రయుక్త రాష్ట్రం వచ్చేనాటికి నడపలేకపోయారు’’.
‘‘ఇది నీకు తెలిసి ఉండకపోవచ్చు. సచివాలయం కొత్త ద్వారం. వాస్తు బాగా లేకనే మామ అర్థాంతరంగా కుర్చీ దిగాల్సి వచ్చిందని అల్లుడు లుంబిని పార్కు ఎదురుగా నిర్మించిన కొత్త ద్వారం ఇది’’.
‘‘అయ్యో అమాయకుడా! ఈ ద్వారం నాకు తెలియకపోవడం ఏమిటి? నీకు గుర్తులేకపోవచ్చు కానీ నాకు బాగా గుర్తుంది. ఈ కొత్త ద్వారం నిర్మించినపుడు ముఖద్వారంపై సచివాలయం అని తెలుగులో కూడా రాయాలని చాలామంది వయోవృద్ధ భాషాభిమానులు ఆందోళన చేశారు. సచివాలయం వద్ద బైఠాయిస్తే 70-80 ఏళ్ళ వయసువారని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి బయటపడేసిన విషయం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే వుంది. భాషా ప్రయుక్త రాష్ట్రం, అధికార భాష, భాష పేరుతోనే ఉన్న పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సచివాలయం అని తెలుగులోనూ రాయాలని ధర్నా చేయడం, వారిని చితగ్గొట్టడం గుర్తుకు వస్తే ఇప్పటికీ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి’’.
‘‘నగరాన్ని చూస్తే ఏమనిపిస్తోంది?’’
‘‘నాలుగేళ్ళ క్రితం నగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగులు జిగేల్ మంటూ కన్పించేవి. నాకే అర్థంకాని నా భాషలో మాట్లాడే ముఖ్యమంత్రి భారీ హోర్డింగులు కన్పించేవి. ఏసి వాడవద్దు, విద్యుత్ పొదుపు చేయాలనే నినాదాలు ఫ్లడ్‌లైట్‌లో హోర్డింగ్‌లు వెలిగిపోయేవి. ఇపుడు అదే చోట తెలుగు కవుల భారీ హోర్డింగ్‌లు చూస్తుంటే ముచ్చటేస్తోంది. నట వంశీయుల కుమారులు, మనవళ్ళు, వారి మనవళ్ళ హోర్డింగ్‌లే తప్ప తెలుగు కవుల హోర్డింగ్‌లు నేను బతికి ఉండగా చూస్తానని అనుకోలేదు’’.
‘‘రాజధానిలోనే కాదు జిల్లాలోనూ తెలుగు భాషా పండుగ వాతావరణం కనిపిస్తోంది. మీది సినిమాల్లో రౌడీ భాషేకాని తెలుగు కాదు అని కొందరంటే ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు రావడానికి చివరకు తెలంగాణలోని కురిక్యాల గ్రామంలో బొమ్మలగుట్ట క్రీ.శ. 946 నాటి తొలి కంద పద్య శాసనం ఆధారం కావడం కాలమహిమ’’.
‘‘ఏమైంది తెలుగు కుట్ర.. కుట్ర.. అని శబ్దాలు వినిపిస్తున్నాయి. మనుషులు కనిపించడంలేదు. ఆ శబ్దాలు భయం కలిగిస్తుంటే నువ్వేమో నవ్వుతున్నావు?’
‘‘తెలుగు భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రభుత్వం కిడ్నాప్ చేస్తోందని వారి అరుపుల సారాంశం’’.
‘‘అదేంటి. తెలుగుకు రాజాదరణ లేకే కదా! నిరాదరణకు గురై అంతరించిపోయే ప్రమాదంలో పడిందని అంతా ఆవేదన చెందుతుంటే వీళ్ళేంటి రివర్స్‌లో, వాళ్ళకు తగ్గట్టు నువ్వు కూడా రివర్స్‌లో స్పందిస్తున్నావు. నినాదాలపై నవ్వడం ఏమిటి?’’
‘‘పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చిందిలే! ఈ కాలం వారికి తెలిసే అవకాశం లేదు. గతంలో ప్రతి పెళ్లిలో కనీసం ఒక్కడైనా ఉండేవాడు. పెళ్లి భోజనంలో విశ్వరూపం చూపించేవాడు. ఆవకాయలో నూనె తక్కువ అయిందని, చింతకాయ తొక్కులో ఉప్పు తక్కువని, పచ్చిపులుసు పల్చగా ఉందని ఏదో ఒక సాకు చూపించి గట్టిగా గట్టిగా అరిచేవారు. పెళ్లి పెద్దలు వాళ్ళను బతిమిలాడడం, వాళ్ళు ఇలాంటి తిండి మేం తినం అని అలగడం భలే గమ్మత్తుగా ఉండేది. ఆడపిల్లల పెళ్లి అంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వస్తుంది. చచ్చీ చెడి పెళ్లి చేస్తే భోజనాల్లో ఇలాంటి శాల్తీ చేసే హడావుడి భలే ఉండేది. ఉప్పు తక్కువయింది, పప్పు ఎక్కువయింది అని గోల చేసే వాళ్ళను మిగిలినవాళ్ళు చిరాకుగా చూసినా ఏదో ఒక రకంగా మేం గుర్తింపు పొందాము అన్నట్లుగా ఉండేది వీరి గోల. ప్రపంచ తెలుగు పండుగకు దిష్టిచుక్కలా ఇలాంటి నినాదాలను సరదాగా తీసుకొని నవ్వుకోవాలి! ఈ కాలం పెళ్లిళ్ళలో సమయానికి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళడమే కానీ, భోజనాలు చేసి వంకలు పెట్టేవారు వెతికినా దొరకరు. అరుదైన అలకల సంస్కృతిని ప్రదర్శిస్తున్నందుకు వీరిని మెచ్చుకోవాలి కాని తప్పు పట్టాల్సిన అవసరం లేదు’’.
‘‘వ్యంగ్యంగా చెబుతున్నావు కానీ విషయం చెప్పడంలేదు’’.
‘‘సీరియస్‌గా చెప్పాలా?’’
‘‘అవును’’
‘‘తమ పిల్లలు చైనాలో, రష్యాలో ఎంబిబిఎస్ చదవాలి. అమెరికాలో స్థిరపడాలి. ఇతరుల పిల్లలు అడవిబాట పట్టాలి. అర్థాంతరంగా తనువు చాలించాలి అని కోరుకునేవారు ఏదైనా అడవిలోనే ఉండాలని కోరుకుంటారు. తాము జనారణ్యం లాంటి మహానగరాల్లో ఉంటూ తమ ఉపన్యాసాల ద్వారా చైతన్యవంతమైన యువత అడవి బాట పట్టాలని కోరుకుంటారు. భాషయినా, యువత అయినా ఉండాల్సింది అడవిలోనే అనేది వారి నినాదం. అడవిలో ఉండి ఈ మాటలు చెబితే ఎలా ఉండేదో కానీ జనారణ్యంలో ఉంటూ పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తూ తెలుగు భాష ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వారు చెబుతున్న మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు’’.
‘‘ఇంత కుట్ర ఉందా?’’
‘‘పండగ పూట వారి సంగతి ఎందుకులే వదిలేయ్. ఇంతకాలం మరిచిపోయిన తెలుగు బిడ్డలను ఓసారి మనసారా తలచుకుందాం. తెలుగు భాషకు మరణం లేదు. అజంత భాషే కాదు అజరామరమైన భాష అని ఎలుగెత్తి చాటుదాం’’.
‘‘భాషకైనా, మనిషికైనా పుట్టింటిని మించిన స్వర్గం లేదు. తెలుగు భాషకు పుట్టింటికి స్వాగతం’

3 కామెంట్‌లు:

  1. "...తమ పిల్లలు చైనాలో, రష్యాలో ఎంబిబిఎస్ చదవాలి. అమెరికాలో స్థిరపడాలి. ఇతరుల పిల్లలు అడవిబాట పట్టాలి....:

    అద్భుతంగా చెప్పారు. కొంతమంది ప్రొఫెసర్లు చేసేపని ఇదే!

    రిప్లయితొలగించండి
  2. అమృతం లాంటి తెలుగును బాగా మదించారు. విషపూరితం చేస్తున్న అన్య భాషా ఆరాధకులపై అధికారులపై వ్యంగాస్త్రం సంధించారు.👏👏👏

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం