28, డిసెంబర్ 2018, శుక్రవారం

దేవుళ్లూ.. పారాహుషార్..!


‘‘నన్ను డిస్ట్రబ్ చేయకు.. నేనో భారీ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నా..’’
‘‘ఏంటా ప్రాజెక్ట్? గరీబీ హఠావో అని ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించే ప్లాన్ చేస్తున్నావా?’’
‘‘అలాంటి దురాశ నాకేం లేదు. మనం పేదరికంలో మగ్గిపోవాలన్నా, సంపన్నులం కావాలన్నా అది ప్రభుత్వం చేతిలో లేదు.. మన మెదడులోనే ఉందనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవాడ్ని.’’
‘‘మరింకేం చేస్తున్నావ్?’’
‘‘చూడోయ్.. మనం ఇలానే నిర్లక్ష్యంగా ఉంటే అంతా మన చేయి దాటి పోతుంది. దెబ్బ తాకినప్పుడు పసుపు రాయడం మన అమ్మమ్మల కాలం నుంచి మనకు అలవాటే కదా? అమెరికా వాడు పసుపు, వేపగింజల మీద పేటెంట్ పొందేంత వరకు మనం మేల్కోలేదు. వాడికి పచ్చిపులుసు సంగతి తెలియదు కాబట్టి బతికి పోయాం. లేదంటే మామిడి కాయ సోగి, పచ్చిపులుసు, చింతకాయ తొక్కు, మాగాయ, ఆవకాయ, గోంగూర చట్నీ, పుంటికూర తొక్కు పేరేదైతేనేం.. ‘అన్నీ మావే’ అని పేటెంట్ హక్కులు పొందేవాడు.’’
‘‘అంటే నువ్విప్పుడు పచ్చిపులుసు, పుంటికూర తెలుగు వాడి హక్కు అని ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నావా?’’
‘‘కాదు.. అంతకన్నా మహత్తర కార్యంలో ఉన్నా..’’
‘‘ఊరించక అదేంటో చెప్పు?’’
‘‘హనుమంతుడు మా కులం అంటే మా కులం అని ఇప్పటికే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు, పార్టీలు, నాయకులు పోటీ పడుతున్నారు?’’
‘‘ఔను.. నేనూ చూశా మీడియాలో.. హనుమంతుడు, జాంబవంతుడు, రామలక్ష్మణులు, శబరి మా వారంటే మా వారని వాదులాడుకుంటున్నట్టు మీడియాలో చూశా. ఐతే నువ్వేం చేస్తావ్’’
‘‘ఆ మధ్య శ్రీకృష్ణదేవరాయల పాలన ఐదు శతాబ్దాల ఉత్సావాల సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి పాలక సామాజిక వర్గాల వారు కర్నాటక వెళ్లి- కృష్ణదేవరాయల వంశస్తులను కలిసి మీరు మా కులం అంటే మా కులం అని చెప్పండని పోటీ పడ్డారట! అధికార వర్గంలో, ఉన్నత పదవుల్లో ఉన్న ఆ సామాజిక వర్గాల ప్రతినిధి బృందం శ్రీకృష్ణ దేవరాయలను తమ వర్గంలో కలుపుకోవడానికి పడుతున్న తపన చూసి కర్నాటకలోని శ్రీకృష్ణదేవరాయల వంశస్తులు విస్తుపోయారు’’
‘‘ఔను.. దాదాపు దశాబ్దం క్రితం ఈ వార్త నేనూ చదివాను. దానిపై పరిశోధన చేస్తున్నావా? రాయలు ఆ రెండు సామాజిక వర్గాలకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వారని పరిశోధన జరుపుతావా?’’
‘‘అలా అని నేను చెప్పానా?’’
‘‘చరిత్రను తిరగరాస్తామంటే ఇదేనేమో? యుద్ధంలో విజయం సాధించిన వారు రాసిందే చరిత్ర కదా? ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినట్టు చరిత్ర కూడా మారితే భలే ఉంటుంది కదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు- ఐదు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వారు రాసింది తప్పుడు చరిత్ర, కొత్త చరిత్ర రాస్తాం అంటున్నారు’’
‘‘అధికారంలోకి వచ్చిన వారికి దేశచరిత్రను తిరిగి రాసే అధికారం ఉన్నట్టుగానే రాష్ట్రా ల్లో అధికారంలోకి వచ్చిన వారికి రాష్ట్ర చరిత్రను తిరిగ రాసే అధికారం ఉండాలి.’’
‘‘నువ్వేదో సరదాగానే అంటున్నా- కొందరు ఈ పని చేస్తూనే ఉన్నారు.’’
‘‘ఔను.. పాలనకు పనికిరారని దించేసిన వారినే విగ్రహాలుగా పెట్టి పూజిస్తూ, ప్రజలంతా పూజించాలని చెబుతున్నారు’’
‘‘వర్మ సినిమా గురించా?’’
‘‘కాదు- జరిగిన చరిత్ర గురించి’’
‘‘ఆ సంగతి వదిలేయ్.. ఇంతకూ నీ భారీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పనేలేదు’’
‘‘మనం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం అని చెబుతూనే ఉన్నాను. వెంకన్న మందిరాలు ఎన్నున్నా వెంకన్న ఆలయం అనగానే తిరుపతి గుర్తొస్తుంది కదా? అలానే ఊరూరా రామాలయాలున్నా దేశంలో శ్రీరాముని ఆలయానికి భద్రాచలం ప్రఖ్యాతి కదా? ’’
‘‘కాదని ఎవరన్నారు? రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణకు వచ్చిందని, ఆంధ్రలోని ఒంటిమిట్ట రామాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు కదా?’’
‘‘దాని గురించి కాదు. శ్రీరాముడిని కమలం పార్టీ వాళ్లు ఓన్ చేసుకుని రెండు సీట్ల నుంచి అధికారం వరకు ఎగబ్రాకారు. ఇప్పుడు మరోసారి శ్రీరాముని దయచేతను- అని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ’’
‘‘నిజమే- మన భద్రాది రాముడిని ఉత్తరాది రాముడిగా మార్చేశారు.’’
‘‘అందుకే చెబుతున్నా.. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మిగిలిన దేవుళ్లపై దృష్టి సారించాలి. ’’
‘‘అంటే ఏం చేయాలి’’
‘‘దేవుళ్లను మనం కాపాడుకోవాలి’’
‘‘నీకేమన్నా పిచ్చా? కష్టం వస్తే దేవుళ్లకు మొక్కుకుంటాం. మనల్ని కాపాడమని వేడుకుంటాం. మనం దేవుళ్లను రక్షించుకోవడం ఏంటి?’’
‘‘మరదే.. ఇప్పటికే కొంతమంది దేవుళ్లు మన చేతిలో నుంచి దాటి పోయారు. ఏ దేవుడు ఏ కులమో ఉత్తరాది వాళ్లు తేల్చేస్తున్నారు. దక్షిణాదికి న్యాయమైన వాటా ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకుండా దేవుళ్లను ఆయా కులాల వాళ్లు పంచుకుంటున్నారు. అసలే ఎన్నికల కాలం.. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటే దేవుళ్లను ఆ కోటా కింద వేసేస్తున్నారు. మనం వౌనంగా ఉంటే అన్యాయమై పోతాం. ’’
‘‘దానికి మనమేం చేస్తాం?’’
‘‘మనకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారు కదా? అందరి పేర్లు సేకరించి..’’
‘‘మొన్న మా మనవడు కౌరవులంటే వంద మంది సోదరులు కదా? 97వ సోదరుడి పేరు చెప్పమని అడిగితే తెల్లమొఖం వేశాను. దుర్యోధనుడి పేరు, ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల వల్ల దుశ్శాసనుడి పేరు తప్ప ఇంకో పేరు తెలియదన్నాను. నువ్వు ముక్కోటి దేవుళ్ల పేర్లు సేకరిస్తావా? సేకరించి ఏం చేస్తావ్?’’
‘‘ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగింది. ప్రతి సామాజిక వర్గం తమకో ఫవర్‌ఫుల్ దేవుడు ఉండాలని కోరుకుంటోంది’’
‘‘ఐతే నువ్వేం చేస్తావ్?’’
‘‘ముక్కోటి దేవుళ్ల పేర్లను మనమే రిజిస్టర్ చేయించుకుంటాం. వారిపై సర్వ హక్కులు మనకే ఉంటాయి. ఎవరైనా- తమ సామాజిక వర్గానికి ఓ దేవుడు కావాలంటే కేటాయించే అధికారం మన చేతిలోనే ఉంటుంది. అంటే- మనం చెప్పిన ధర చెల్లించి దేవుడిని కోనుక్కోవాలి’’
‘‘అంటే దేవుళ్లను అమ్ముకుంటావా?’’
‘‘మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దాన్ని అమ్ముకోవాలి. ఈ వ్యాపారానికి ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు నాకుంటాయి. ఏ మంటావ్?’’
‘‘దేవుళ్లూ పారాహుషార్. మిమ్మల్ని కూడా అమ్మేసుకుంటారని అంటాను’’
*బుద్దామురళి (జనాంతికం 28-12-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం