పాలనలో పారదర్శత కోసం తెచ్చిన చట్టం సమాచారహక్కు చట్టం. 2005లో వచ్చిన ఈ చట్టం గురించి సామాన్యులకు ఇంకా పెద్దగా తెలియదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు. సరైన సమాచారం ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నారు, చట్టాన్ని గౌరవించడం లేదని చాలామంది అధికారులపై ఫిర్యాదులు. అదే సమయంలో కక్ష సాధింపులు, వేధింపులకు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని అధికారుల విమర్శ. ఇరువర్గాల వాదనలకు బలమైన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఒక మహిళ తనను వేధిస్తున్న వ్యక్తిపై నిర్భయ పెడితే.. ఆమెను వేధించేందుకు ఆర్‌టీఐ చట్టాన్ని ఉపయోగించుకొంటున్న వ్యక్తి ఉదంతం ఒకటి కమిషన్ దృష్టికి వచ్చింది.
రికార్డులు తారుమారు చేసి తన భూమిని ఇతరుల పేరు మీదికి మార్చారు. స.హ.చట్టం కింద వివరాలు కోరితే స్పందించడం లేదని ఎంతోమంది గ్రామీణ సామాన్యులు కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా పేరు మార్చిన బాధితులకు స.హ.చట్టం అండగా నిలుస్తున్నది. వెట్టి చాకి రీ నుంచి విముక్తి పొందినవారికి పునరావాసం కోసం ఉన్న పథకాలు, వాటి అమలు గురించి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకరు స.హ. చట్టం కింద సమాచారం అడిగారు. దాంతో అధికారులు పునరావాస పథకాలు అమలుచేయడమే కాకుండా ఇలా అడుగడం వల్లనే వారికి న్యాయం చేయగలిగామని సమాచారం అడిగినందుకు అధికారులే కృతజ్ఞతలు చెప్పారు. ఇలా సామాన్యులకు మేలు జరిగినప్పుడు ఈ చట్టానికి సార్థకత. అదే సమయంలో కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
నిర్భయ చట్టం అత్యంత శక్తివంతమైంది. ఒక మహిళ తనను వేధిస్తు న్న వ్యక్తిపై ఆధారాలతో నిర్భయ చట్టం కింద కేసు పెట్టింది. మాములుగా అయితే ఆ వ్యక్తి సిగ్గుతో చచ్చిపోవాలి. తన జీవిత అయిపోయిందని అనుకోవాలి. కానీ అతను స.హ.చట్టాన్ని ఉపయోగించుకొని ఆ మహిళను వేధిస్తూ కేసు ఉపసంహరించుకొని లొంగిపోతే సరే లేదంటే స.హ.చట్టం కింద నిన్ను ఇలానే వేధిస్తానని బెదిరిస్తున్నాడని కేసులకు సంబంధించిన ఆధారాలతో ఆమె కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఒక మైనార్టీ మహిళ భర్తతో వివాదం వల్ల ఒంటరి జీవితం గడుపుతున్నది. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వివాదాన్ని పరిష్కరిస్తాం, పెద్దమనుషులమని కొందరు ఆమెను కలిశారు. అందులో ఒక వ్యక్తి ఆమెను నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? అని వేధిస్తున్నాడు. అతను సెల్‌ఫోన్‌లో వేధించినప్పుడు బాధిత మహిళ సెల్‌ఫోన్ లో అతని సంభాషణ రికార్డు చేసింది. పోలీసులకు ఆ రికార్డ్‌ను అందజేసింది . స్థానికంగా ఒకషాప్ ను కాల్చిన సంఘటనలో తన నేరాన్ని సెల్ ఫోన్ సంభాషణల్లో అతను వివరించాడు. దాంతో పోలీసులు దీని ఆధారంగా ఆ వ్యక్తిపై నిర్భయ కేసుతో పాటు, షాప్ తగులబెట్టిన కేసు నమో దు చేశారు.
ఆ మహిళపై కక్ష పెంచుకొని ఏదో ఒక పేరుతో స.హ.చట్టం కింద పిటిషన్లు పెడుతున్నాడు. చట్టం ప్రకారం సర్వీస్ రికార్డ్ వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవలసిన అవసరం లేకపోయినా ఇచ్చాను. సమాచారం ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ రోజూ స.హ.చట్టం కింద పిటిషన్లు రావడం వల్ల అధికారులు, తోటి టీచర్లు నీ వల్లనే ఇదంతా అని చిరాకు పడుతున్నారని ఆ మహిళ తెలిపింది. నిర్భయ కేసు ఉపసంహరించుకొని నాకు లొంగిపోయే వరకు ఇలా స.హ.చట్టం కింద పిటిషన్లు పెడుతూనే ఉంటానని అతను బెదిరిస్తున్నాడని బాధిత మహిళ లిఖితపూ ర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తిపై నిర్భయ కేసు, రౌడీషీట్ వంటి కేసులకు సంబంధించిన సమాచారంతో బాధితురాలు పోలీసులను కలిసింది. సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స.హ.చట్టం కింద ఏదైనా సమాచారం కోరినప్పుడు సంబంధిత సమాచార అధికారి సాధ్యమైనంత వరకు తన వద్ద రికార్డులో ఉన్న సమాచారం ఇవ్వాలి. అంతే కానీ, ఆ ఉద్యోగి తృతీయ సమాచారం అడిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. పక్షం సమాచా రం కోరినప్పుడు మాత్రమే వారిని అడుగాలి.
బాధిత మహిళ ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు కావడం వల్ల నేరుగా ఆమె పేరు ప్రస్తావించకుండా ఆమె పనిచేసే పాఠశాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై రకరకాల పేర్లతో సమాచారం కోరుతూ దరఖా స్తు చేస్తున్నారు. ఒంటరి మహిళ భయపడకుండా ధైర్యంగా నిలబడటం అభినందనీయం. స.హ.చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది చేస్తు న్న వ్యవహారాలు చాలాసార్లు కమిషన్ దృష్టికి వచ్చింది కానీ ఒక ఒంటరి మహిళను వేధించినవారు నిర్భయ చట్టం కింద కేసు ఎదుర్కొంటూ బాధిత మహిళను స.హ.చట్టం పేరుతో వేధించడం ఆశ్చర్యం కలిగించిం ది. చట్టాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారా? అని పోలీసులు కూడా విస్తుపోయి మహిళకు ధైర్యం చెప్పి సమాచార హక్కు కమిషన్‌ను కలువమని సలహా ఇచ్చారు. తోటి ఉపాధ్యాయులు ఇదంతా నీ వల్లనే, నీవల్ల అందరి సమాచారం అడుగుతున్నారని ఆ మహిళపై చికాకు పడటం సరికాదు. ఒంటరి మహిళకు సాటి ఉద్యోగులు ధైర్యం చెప్పి అం డగా నిలవాలి .
పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు అర్థంకాని రాత తో కమిషన్‌కు డజన్లకొద్దీ దరఖాస్తులు చేశారు. అప్పీల్‌పై విద్యాశాఖ అధికారులను పిలిచి మాట్లాడితే పిటిషన్‌దారు మాత్రం రాలేదు. అతను తమ ఇం టికి చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నా డు. కోరిన ప్రాంతానికి డెప్యుటేషన్‌పై పంపేంతవరకు ఇలానే స.హచచట్టం కింద పిటిషన్ పెడతానని అధికారులకు బదులిచ్చాడు.సదాశివపేటలో ఒక టెక్నో స్కూల్‌తో ఒకరికి వివాదం ఒకే స్కూల్‌కు సంబంధించి అటుమార్చి ఇటుమార్చి మొత్తం 19 దరఖాస్తు చేశాడు. అతనికి కావలసింది సమాచారం కాదు వివాదం అంతే. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ప్రైవేట్ వ్యక్తుల భవనంలో అద్దెకున్న ప్రభుత్వ పాఠశాలను ఖాళీ చేయించేందుకు స.హ.చట్టం కింద లెక్కలేనన్ని పిటిషన్లు వేయడమే ఒకపనిగా పెట్టుకున్నారొకరు. కేసులు భరించలేక చివరికి భవ నం ఖాళీ చేశారు. మార్కెటింగ్‌శాఖకు సంబంధించి ఒక రు ఇదేవిధంగా లెక్కలేనన్ని కేసులు వేసి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.
ప్రజాధనం దుర్వినియోగాన్ని నివారించడం, పాలనలో పారదర్శకత వంటి పవిత్ర లక్ష్యాలతో ఈ చట్టం వచ్చింది. స.హ.చట్టం కోసం ఉద్యమించినా ఉద్యమకారులు సైతం ఈ చట్టం ద్వారా సామాన్యులకు మేలు జరుగాలని కోరుకున్నారు. కానీ ఇలా వేధింపులకు ఉపయోగించుకుంటారని ఊహించలేదు. కొందరు కొన్నివందల పిటిషన్లు వేస్తున్నారు. దీనివ ల్ల నిజంగా సమాచారం కోరేవారికి ఆలస్యమవుతున్నది. వంద పిటిషన్లు తాము వేయడం కన్నా పిటిషన్ ఎలా రాయాలో తెలియని వంద మందికి నేర్పించడం మంచిది. ఉద్యోగులు 75 శాతం పనిని స.హ.చట్టం కింద సమాచారం ఇవ్వడానికే కేటాయించాల్సి వస్తున్నదని, అవసరమైన సమాచారం సంక్షిప్తంగా స్పష్టంగా అడుగాలని ఒక కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.
2005లో ఈ చట్టం వచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా సమాచారం అంతా ఇంటర్‌నెట్‌లో అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలని చట్టం పేర్కొన్నది. 13 ఏండ్లయినా ఇంకా దీన్ని అమలుచేయడం లేదు. సమాచారం మొత్తం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేట్టు చేసి సమాచారం కోసం ఈ చట్టాన్ని ఆశ్రయించాల్సిన అవసరంలేని పరిస్థితి రావాల ని చట్టం చెబుతున్నది. ఆ రోజు ఎంత త్వరగా వస్తే వేధింపులు అంత త్వరగా సమసిపోతాయి.
2005లో ఈ చట్టం వచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా సమాచారం అంతా ఇంటర్‌నెట్‌లో అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలని చట్టం పేర్కొన్నది. 13 ఏండ్లయినా ఇంకా దీన్ని అమలుచేయడం లేదు. సమాచారం మొత్తం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేట్టు చేసి సమాచారం కోసం ఈ చట్టాన్ని ఆశ్రయించాల్సిన అవసరంలేని పరిస్థితి రావాల ని చట్టం చెబుతున్నది. ఆ రోజు ఎంత త్వరగా వస్తే వేధింపులు అంత త్వరగా సమసిపోతాయి.
ఈ చట్టం సాధారణ పౌరులకే కాదు , ప్రభుత్వ అధికారులకూ ఉపయోగపడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి మధుకర్ రాజుకు ప్రమోషన్లో అన్యాయం జరిగితే స.హ.చట్టం ద్వారానే ఆధారాలు సంపాదించి న్యాయపోరాటం జరిపారు. చివరికి అతనికి న్యాయం జరిగింది. అనంతరం అతను స.హ.చట్టం కమిషనర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. స.హ.చట్టం వల్ల కలిగే ప్రయోజనాలకు తానే ఒక ఉదాహరణ అని ప్రతి సభలో చెప్పేవారు. చట్టాన్ని మంచికోసం ఉపయోగించుకోవడం అందరి బాధ్యత దుర్వినియోగం చేయడం అంటే మనకు నీడనిచ్చే చెట్టును మనమే నరుక్కోవ డం వంటిదే. ధర్మం కోసం ప్రయోగించాల్సిన ఆయుధాన్ని అధర్మం కోసం ప్రయోగించడం మంచిది కాదు.
-బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 30-5-2018)
ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి మధుకర్ రాజుకు ప్రమోషన్లో అన్యాయం జరిగితే స.హ.చట్టం ద్వారానే ఆధారాలు సంపాదించి న్యాయపోరాటం జరిపారు. చివరికి అతనికి న్యాయం జరిగింది. అనంతరం అతను స.హ.చట్టం కమిషనర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. స.హ.చట్టం వల్ల కలిగే ప్రయోజనాలకు తానే ఒక ఉదాహరణ అని ప్రతి సభలో చెప్పేవారు. చట్టాన్ని మంచికోసం ఉపయోగించుకోవడం అందరి బాధ్యత దుర్వినియోగం చేయడం అంటే మనకు నీడనిచ్చే చెట్టును మనమే నరుక్కోవ డం వంటిదే. ధర్మం కోసం ప్రయోగించాల్సిన ఆయుధాన్ని అధర్మం కోసం ప్రయోగించడం మంచిది కాదు.
-బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 30-5-2018)