23, మే 2018, బుధవారం

ఆర్‌టీఐలో ఆకాశ రామన్నలు

మీరు వెతుకుతున్న నేరస్తుడు ఫలానా వ్యక్తి అంటూ తగిన సమాచారంతో పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే.. అందులో విషయాలు నిజమే అనిపిస్తే పోలీసులు విచారిస్తారు. అనేక సందర్భాల్లో పోలీసులకు ఈ ఆకాశరామన్న ఉత్తరాలే కేసు విచారణకు ఎంతో ఉపయోగపడుతాయి. నేరం గురించి, నేరస్తుని గురించి తెలిసినా చెబితే తమ ప్రాణాలకు ముప్పు రావచ్చుననే భయంతో కొందరు చెప్పరు. సమాజం గురించి ఆలోచించే మరి కొందరు నేరస్తులను అలా వదిలివేయలేరు. అలాంటి వారు తగు జాగ్రత్తలు తీసుకొంటూ నేరానికి సంబంధించి తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా తెలియజేయవచ్చు. అనేక కేసుల్లో ఈ ఆకాశరామన్న ఉత్తరాలు నేర పరిశోధనలో కీలకంగా మారాయి. బంగారం, కలప స్మగ్లింగ్, గుట్కా అమ్మకాల వంటివెన్నో నేరాల్లో ఆకాశరామన్న ఉత్తరాలు కీలక పాత్ర వహించాయి. ఆకాశ రామన్న ఉత్తరాలను పోలీసులు తేలికగా తీసుకోరు. ఉపయోగపడే సమాచారం ఉందనుకొంటే సీరియస్‌గా దృష్టిసారిస్తారు.

అవినీతిపరులైన ఉద్యోగుల అవినీతి సంపాదన కూడా ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా బయటపడుతుంది. అవినీతిపరులను పట్టుకోవడంలో ఏసీబీకి ఆకాశరామన్న ఉత్తరాలు బాగా ఉపయోగపడుతాయి. కొందరు సాధారణ ఉద్యోగులు కూడా అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారి సమాచారం ఆకాశరామన్న ఉత్తరాల ద్వారానే ఎక్కువగా అందుతుంది. నేరానికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినవారు తమ పేరు వివరాలు తెలియకుండా తాము అజ్ఞాతంలో ఉంటూ ఆకాశరామన్న పేరుతో అధికారులకు సమాచారం అందించడం ఎప్పటినుంచో ఉన్నదే. సమాచారహక్కు చట్టం కింద ఆకాశ రామన్న సమాచారం అడుగవచ్చా? అంటే చట్టం దానికి అంగీకరించదు. అయితే పూర్తిగా ఆకాశరామన్న అని కాదు కానీ కొంతవరకు అవకాశం ఉన్నది. 

సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరడం ద్వారా దేశంలోని అనేక రాష్ర్టాల్లో హక్కుల కార్యకర్తలపై దాడులు జరిగాయి. కొన్ని రాష్ర్టాల్లో హత్యలు కూడా జరిగాయి. పాలనలో పారదర్శకత కోసం సమాచారహక్కు చట్టం తీసుకువచ్చారు. అప్పటివరకు ప్రయోజనం పొందినవారికి ఈ పారదర్శకత నచ్చక దాడులకు దిగారు. తమ వివరాలు రహస్యంగా ఉంచుతూ సమాచార హక్కు కింద వివరాలు కోరే అవకాశం లేదా? వివరాలు బహిర్గతమైతే ప్రాణభయం ఉంది. మరేం చేయాలి. దాడి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మా వివరాలేమీ చెప్పం, మాకు సమాచారం కావాలని తమ వివరాలు ఏమీ ఇవ్వకుండా కొందరు దరఖాస్తు చేస్తున్నారు. సమాచారహక్కు చట్టం ప్రకారం వీరికి సమాచారం ఇవ్వడం సాధ్యంకాదు. సమాచారం కోరేవారి పేరు, చిరునామా ఉండాలని చట్టం చెబుతున్నది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతున్న అభ్యర్థి తాను సమాచారం ఎందుకు కోరుతున్నారో కారణాలు వివరించాల్సిన అవసరం లేదు. 

తనకు సమాచారం అందించేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు అవసరం లేదని చట్టం చెబుతున్నది. ఆకాశ రామన్న ఉత్తరం ద్వారా సమాచారం కోరితే సమాచార అధికారి వివరాలు ఎలా పంపాలి? ఎక్కడికి పంపాలి. ఇక కోరిన సమాచారం అభ్యర్థికి రానప్పుడు సమాచార కమిషన్‌కు అప్పీల్ చేసుకున్నప్పుడు అక్కడా చిరునామా కావలసిందే. కమిషన్‌కు చేసుకొనే అప్పీలులో అప్పీలు దాఖలుచేసే వ్యక్తి పేరు, చిరునామా ఉండాలని చట్టం చెబుతున్నది. అప్పీలుదారునికి, సమాచార అధికారికి విచారణ కోసం కమిషన్ నోటీసు ఇవ్వాలంటే చిరునామా తప్పనిసరి. కమిషన్ అప్పీళ్లను పరిష్కరించే విధానంపై 2006 ఫిబ్రవరి 25న ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం జారీచేసిన జీవోలో కమిషన్ నోటీసులు అందజేయడం గురిం చి వివరణ ఇస్తూ, నేరుగా అందజేయడం, రిజిష్టర్ పోస్ట్‌ద్వారా పంపడం చేయాలని పేర్కొన్నారు. కమిషన్ విచారణకు అప్పీలుదారు లేదా అతని ప్రతినిధి వ్యక్తిగతంగా హాజరుకావచ్చు లేదా హాజరుకాకుండా ఉండవచ్చు. అయితే చట్టంలో పేర్కొన్నవిధంగా సమాచారహక్కు చట్టం కింద సమాచార అధికారిని సమాచారం కోరినప్పుడు పేరు, చిరునామా ఉండాలి. 

సమాచారం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారికి, కమిషన్‌కు పిర్యాదు చేసినప్పుడు కూడా పేరు, చిరునామా అవసరం. కాబట్టి ఇక్కడ ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా సమాచారం కోరడం సాధ్యం కాదు. సమాచారహక్కు కింద సమాచారం కోరే వారిపై దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం కోరేవారి భద్రత కోసం వారి వివరాలు బహిర్గతం చేయకుండా ఉండటం సాధ్యం కాదా? అంటే దీనికో మార్గం ఉన్నది. చట్టాన్ని పాటిస్తూనే వివరాలు రహస్యంగా ఉంచవచ్చు. సమాచారహక్కు చట్టం సెక్షన్ 6(2)లో సమాచారం కోరే వ్యక్తి ఎవరైనా సమాచారం కోరడానికి గల కారణం వివరించాల్సిన అవసరంలేదు. తనకు కబురు చేసేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసారం లేదని పేర్కొన్నది. దీన్ని ప్రస్తావిస్తూ గోయంక్ కలకత్తా హైకోర్ట్‌ను ఆశ్రయించారు.
Buddamurali
పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇస్తూ సమాచారం కోసం దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పోస్ట్‌బాక్స్ నెంబర్ అంటే సమాచారం పంపడానికి అవసరమైన వివరాలున్నట్టే. పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇవ్వడం అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు అవసరమైన వివరాలున్నట్టే. పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత పేరు, చిరునామా కోసం ఒత్తిడి తీసుకురావద్దని కోర్టు సూచించింది. పోస్ట్‌బాక్స్ నెంబర్‌కు సమాచారం పంపడంలో ఏమైనా ఇబ్బందులున్నాయని సమాచార అధికారి భావిస్తే పేరు, చిరునామా వివరాలు అడుగవచ్చు. కానీ అవిశేక్ గోయంకా కేసులో అలాంటిది లేదని కోర్టు భావించింది. ఈ కేసు తర్వాత పోస్ట్‌బాక్స్ నెంబర్‌ను కూడా చిరునా మాగా భావించి సమాచారం ఇవ్వాలని ఈ తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్ని రాష్ర్టాలకు సమాచారం పంపింది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలతో పాటు కొన్ని సందర్భాల్లో తమ పేరు బయటకు తెలియకుండా పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇస్తారు. పోస్టాఫీసుకు నిర్ణీత మొత్తం చెల్లిస్తే వారో నెంబర్ కేటాయిస్తారు. ఆ పోస్ట్‌బాక్స్‌కు వచ్చిన ఉత్తరాలు ఆ కంపెనీ తీసుకొంటుంది. ఇదే విధంగా ఎవరైనా వ్యక్తులు సైతం పోస్టాఫీస్‌లో పోస్ట్‌బాక్స్ నెంబర్ తీసుకోవచ్చు. దరఖాస్తులో పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇవ్వడం అంటే పరోక్షంగా మీ పేరు, చిరునామా ఇచ్చినట్టే. అదే సమయంలో మీ పేరు, చిరునామా రహస్యంగా ఉన్నట్టే. కొన్ని సందర్భాల్లో దాడుల ప్రమాదం ఉన్నదనుకొంటే పోస్ట్‌బాక్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే తప్పా ఆకాశరామన్న ఉత్తరంలా ఊరు, పేరు లేకుండా సమాచారహక్కు చట్టం కింద సమాచారం పొందడం సాధ్యం కాదు.
బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 23-5-2018)

1 కామెంట్‌:


  1. ఐడియా బావుంది‌కానండీ పోస్ట్ ఆఫీస్ లో కరప్షన్‌పెరిగే దానికి ఆస్కారుల్లానేయేమో నండి

    పోస్ట్ ఆఫీసులో పొస్ట్ బాక్సు నెంబరు వివరాలకి ఇక ధర పలుకుతుందేమో నండి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం