5, సెప్టెంబర్ 2023, మంగళవారం
సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87
సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే ....
ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87
--------------------------------------
"మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం పై ఆదాయానికి పై ఆదాయం " ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేక సార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసిన వారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది మీ రెమో దిన దిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దిన దిన గండం నిజమే .
ఓ సినిమాలో బ్రహ్మానందం ఒక వైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరు క్షణమే ఇంకో వైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు . చాలా మంది జర్నలిస్ట్ లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది . బయటి వారే కాదు రిపోర్టర్ లను చూసి సబ్ ఎడిటర్ లు , సబ్ ఎడిటర్ లను చూసి రిపోర్టర్ లు మా కంటే వీరి జీవితమే బెటర్ అని ఈర్ష పడుతుంటారు .
నెల నెల జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్ లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని , అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది . జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్ ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది . తిను తినిపించు అనే నినాదం ను వీరు నమ్ముతుంటారు . అప్పుడుడప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న జర్నలిస్ట్ ల అరెస్ట్ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే . నెల నెల జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం దిన దిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందం ను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థ లో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్ లు ఉంటారు . కొన్ని సంస్థల్లో బాస్ ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే .. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు .
మీరు ఎన్నయినా చెప్పండి .. నిజాయితీ గా మన పని మనం చేస్తే బాస్ కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు .
****
ఒకరోజు ఆఫీస్ కు వెళ్ళగానే వాతావరణం వేడిగా ఉంది . చీఫ్ రిపోర్టర్ యస్ ఎన్ సి ఎన్ ఆచారిని పిలిచి ఎడిటర్ శాస్త్రి చెడా మడా తిట్టి పంపించారు . సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అయితే అలా తిడతారు . దానితో రిపోర్టర్ లు అందరూ అప్రమత్తమైన తమ బీట్ కు సంబంధించిన వార్త ఏమైనా మిస్ అయిందా అని అన్ని పత్రికలు చూశారు . ఏమీ మిస్ కాలేదు . మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే ... ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త భూమిలో మిస్ అయ్యారు . విషయం తెలిసి ఆఫీస్ లో మౌనంగానే ఉండి .. నవ్వు ఆపుకోలేక మిత్రులం టీ డబ్బా వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకున్నాం . ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్ కు ఏం బాధ్యత అది డెస్క్ వాళ్ళ పని ...
ఐతే ప్రతి తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది .
ఎడిటర్ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని దృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం . ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది . ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు .
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి . కిరణ్ కుమార్ రెడ్డి ఆచారికి సన్నిహితుడు .. ఎంత స్నేహం అంటే ఓ సారి చారికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే చారి బాబాయ్ నేను పనిలో ఉన్నాను , తరువాత నేనే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేయడం నా ముందే జరిగింది .
అంత సన్నిహితంగా ఉండేవారు పని చెబితే చేయడం లేదు అంటే ఎవరూ నమ్మరు . పుస్తకాల బిల్లుల కోసం ఎడిటర్ చారి మీద ఒత్తిడి , చారి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడడం అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రం లా వరుసగా జరుగుతున్నా బిల్లు మాత్రం మంజూరు కాలేదు .
బిల్లు కోసం చారి చిత్త శుద్దితో ప్రయత్నం చేయడం లేదు అని ఎడిటర్ నమ్మకం . చారి ఎంత ప్రయత్నించినా కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు . దాంతో అమెరికాలో తుఫాన్ఏం వచ్చినా , , ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి . పుస్తకాల డబ్బుల కోసం ఎడిటర్ కక్ష కట్టాడు అని అర్థమైన చారి ఇక ఉండలేను అని గ్రహించి భూమిని వదిలేసి డక్కన్ క్రానికల్ లో చేరిపోయారు .
మనం నిజాయితీ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్ లకు పని చేయదు . ఎడిటర్ పని కాక పోయినా , ఓనర్ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే .
ఇదే సమయంలో ఓనర్ పనులు, ఎడిటర్ పనులు చేస్తూ సొంత పనులు చక్కపెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఓనర్లు గా మారి సమాజానికి నైతిక విలువలు బోధిస్తున్నవారు కూడా ఉన్నారు . . అదేదో సినిమాలో పాము కాటుకు మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయాడు అని శ్రీ హరి చెప్పిన డైలాగులా , పుస్తకాల అమ్మకాల కోసం ఎందరినో బ లి చేసిన ఎడిటర్ ఉద్యోగం చివరకు ఆ పుస్తకాల కాటుతో ఊడింది . ఆ కథ మరోసారి ..
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం