17, సెప్టెంబర్ 2024, మంగళవారం

ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు.. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114

ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు.. ఇందిరా గాంధీ పేరు వద్దంటే సభ్యత్వం తీసుకోకండి : రేవంత్ బృందంతో వై యస్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114 రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీలో ఇద్దరు సభ్యులకు ముఖ్యమంత్రి పదవి దక్కింది కానీ ఇప్పటి వరకు ఇంటి స్థలం మాత్రం దక్కలేదు . అటు పార్టీ వాళ్ళు ఇటు మారారు . సీఎంలు అయ్యారు , మంత్రులు అయ్యారు కానీ ఓ ఇంటివారు కాలేదు . ఎన్నో రాజకీయ మార్పులు చూసిన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ కథ ఇది . ***** టీడీపీ శాసన సభ్యుల బృందం అప్పటి ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి మెల్లగా తమ కోరిక బయటపెట్టారు . ఇందిరాగాంధీ పేరు వద్దు ఇంకేదైనా పేరు పెట్టండి అని కోరారు . వైయస్ నింపాదిగా మీకు ఇందిరాగాంధీ పేరు నచ్చలేదా ? నో ప్రాబ్లమ్ బలవంతం ఏమీ లేదు . మీకు నచ్చక పోతే ఇందిరా గాంధీ పేరుతో ఉన్న ఆ సొసైటీలో చేరకండి అని చెప్పి పంపించేశారు . ఆ రోజు ఇందిరాగాంధీ పేరు మార్చాలి అని వైయస్ ను కలిసిన శాసన సభ్యుల బృందంలో ఇప్పటి ముఖ్యమంత్రి , అప్పటి శాసన మండలి సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు . ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాలు , గాంధీ కుటుంబం సేవల గురించి సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆవేశంగా మాట్లాడారు . ఇందిరాగాంధీ పేరుతో సొసైటీ వద్దు పేరు మార్చాలి అని కోరిన రేవంత్ రెడ్డి అంతే ఆవేశంగా గాంధీ కుటుంబ త్యాగాలు గుర్తు చేసినప్పుడు పాత విషయాలు గుర్తుకు వచ్చాయి . శాసన సభ్యులకు , జర్నలిస్ట్ లకు , సివిల్ సర్వీస్ అధికారులు , న్యాయమూర్తులకు నివాస స్థలాలు ఇవ్వడానికి హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్న సమయం అది . ఉమ్మడి రాష్ట్రంలో 2006లో టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో టీడీపీ శాసన సభ్యులు , మండలి సభ్యుల సమావేశం . గుర్తున్నంత వరకు అనుముల రేవంత్ రెడ్డి , పయ్యావుల కేశవ్ , దూళిపాళ నరేంద్ర , ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొంత మంది టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో సమావేశం . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ బృందం ఇలానే ఓ సారి సమావేశం అయింది . ఇంటి స్థలాల కోసం అని చెబితే .. శాసన సభ్యులకు ఇంటి స్థలాలు అంటే బాబు ఒప్పుకోరు . బాబు ఒప్పుకునే ఐడియా చెబుతాను అని . ఎమ్మెల్ల్యేల హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టవద్దు .ఎమ్మెల్యేస్ ఇన్ఫో టెక్ సొసైటీ అని పేరు పెట్టుకోండి అని దయాకర్ రావు బృందానికి సలహా ఇచ్చాను .. ఐటీ పేరుంటే కోరినంత భూములు ఇస్తున్న రోజులు అవి . వీరి వినతిని బాబు పట్టించుకోలేదు . పేరులో ఏముంది అంటారు కానీ అంతా పేరులోనే ఉంది . టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైయస్ సీఎం అయ్యారు . హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వ అనుసన్నల్లో ఏర్పాటు అయ్యాయి . అన్నింటికీ వై యస్ ఆర్ నే పేరు పెట్టారు . శాసన సభ్యుల సొసైటీకి ఇందిరాగాంధీ పేరు పెట్టడం టీడీపీ సభ్యులకు ఇబ్బంది కరంగా మారింది . పయ్యావుల కేశవ్ ( ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి ) నాయకత్వంలో అనుముల రేవంత్ రెడ్డి , దూళిపాళ నరేంద్ర , దయాకర్ రావు , వేం నరేందర్ రెడ్డి తదితరులు సమావేశం అయి పేరు మార్చాలి అని వైయస్ ఆర్ ను కోరారు . బలవంతం ఏమీ లేదు మీకు పేరు నచ్చక పోతే సొసైటీలో చేరకండి అని వై యస్ సలహా ఇచ్చి పంపించారు . శాసన సభ్యుల సొసైటీ ఇందిరాగాంధీ పేరుతో ఉంటే , జర్నలిస్ట్ లకు సంబంధించిన సొసైటీ కి జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు . మాకా ఇబ్బంది లేదు నెహ్రూ జర్నలిస్ట్ కూడా అని అసలే దిగులుగా ఉన్న టీడీపీ శాసన సభ్యులకు చెప్పాను . **** శాసన సభ్యుల సొసైటీకి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించారు . ఆ తరువాత ఆయన ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ అయ్యారు . ఢిల్లీలో ప్రయత్నాలు ఫలించి రోశయ్యను తప్పించి సీఎం కూడా అయ్యారు . అనుముల రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కూడా ఫలించి సీఎం అయ్యారు . వీరిద్దరూ సీఎంలు అయినా హౌసింగ్ సొసైటీలో సొంత ఇంటి కల ఫలించలేదు. శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ ఎన్నో పరిణామాలు చూసింది . తెలంగాణ ఉద్యమ కాలం లో తెరాస శాసన సభా పక్షం నాయకునిగా ఈటెల రాజేందర్ ఉండేవారు . ఒక దశలో తెరాస శాసన సభ్యులను మేం మీకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వం అని ఈటెల బృందంపై కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు . వారు ఆ ఒత్తిడికి తలొగ్గలేదు . అటు శాసన సభ్యులు , ఇటు జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీ ద్వారా ఎప్పుడు ఓ ఇంటివారు అవుతారో ఎవరికి తెలియదు . రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్లకు కూడా ఇదే సందేహం వచ్చింది . జర్నలిస్ట్ లకు పట్టాలు ఇచ్చారు . మరి మన కెప్పుడు పట్టా వస్తుంది అని అడిగారట . ఓ సభలో రేవంత్ రెడ్డినే ఈ విషయం చెప్పారు . శాసన సభ్యులు పది లక్షలు కట్టి ఎదురు చూస్తుంటే జర్నలిస్టులు రెండు లక్షలు కట్టి రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు . రెండు లక్షలు కట్టిన సమయంలోనే కొందరు జర్నలిస్టులు మన్నెవారి తుర్కపల్లి అనే గ్రామంలో రోడ్డు పై ఉన్న పొలం ధర అడిగి వచ్చారు . 80 వేలకు ఎకరం ధర , ఇప్పుడు అక్కడ ఎకరం రెండు నుంచి మూడు కోట్ల . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని ఉంటే ? ఇటిచ్చిన రెండు లక్షలతో అటు రెండున్నర ఎకరాలు కొని ఉంటే ఇప్పుడు చకోర పక్షిలా ఎదురు చూసే అవసరం ఉండదు . మార్కెట్ రేటుకు కొన్నా, అదేదో డ్వాక్రా సంఘాల సభలా మూడు రంగుల జెండా పట్టి పాటకు నృత్యం చేసి భావోద్వేగాలకు గురైనా , కొనుక్కున్న స్థలం ఎప్పుడు చేతికి వస్తుంది అనే ప్రశ్నకు సగటు జర్నలిస్ట్ వద్ద సమాధానం లేదు . ఈ ప్రశ్న ఇంట్లో వాళ్ళు అడిగితే సీఎం నే చెప్పలేనప్పుడు సగటు జర్నలిస్ట్ ఏం చెప్పగలడు . ఎంత అంతులేని కథ అయినా ప్రతి కథకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తప్పదు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం