19, సెప్టెంబర్ 2024, గురువారం
ఓ గోల్డ్ మెడలిస్ట్ అనాధ మరణం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -115
ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థ లో జీవితాన్ని ప్రారంభించి ..దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరం లో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది .తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాధ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ అంత్యక్రియలు నిర్వహించారు . .... ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే ... మానవత్వం మంటగలిసింది ... ఎక్కడికి వెళుతున్నాం ... మనుషుల మేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసే వారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది .. మరణం నిజమే ... కానీ టివిలో , కానీ మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ ... ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే ... .... జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు ... ఈనాడు లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని నాకు ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు .. మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను ... ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను ... .... నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ ... ఆలోచన ... ఆమెతో పెద్దగా పరిచయం లేదు ..ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసే వారు ... ముందు ప్రభ తరువాత కరోనా లో భూమి లో పారితోషకం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు .. మిత్రుడు విష్వఈశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడు లోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎం వి ఆర్ శాస్త్రి , కె యల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు ... ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు ఒక రోజు ముచ్చట గానే మిగిలి పోయింది ... మళ్ళీ ఒంటరి జీవితమే ... ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం ...ఆమె అలానే జీవితమంతా భయం తో కలిసి బతికింది చనిపోయింది ... .... అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు ... ఎవరి బతుక్కు వారే కారణం ... సమాజం , తోటి వారు , యూనియన్ లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు ... ముందుకు బానిసలైన వారు ఉన్నారు ... ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది ... ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది ... ఐనా ఆఫీస్ లో వేధింపులు ...ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు .. చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్ వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని ... అలా వెళ్లిన ఎంతో మందిని చూశా ... శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్ట్ లే ... ఇవి ఆ రోజులు కాదు .. ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా అనాధల్లా మరణించిన వారిని చూశా ... ... భూమిలో చిక్కడ పల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు ... ఓ రోజు సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్చెప్పిన పని చేస్తా కానీ ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ అందరి మీద అధికారం చెలాయిస్తా ... నేను ఒక్కరికి తలవంచి అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయా డు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం ... ఎవరూ రాలేదు ... ఎన్టీఆర్ ను దించేసి సమయం ... అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ ... ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి మెల్లగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు ... ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది .. ప్రభుత్వాన్ని కూల్చడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లగా తన పని తాను చేసుకు పోతుంటే ... మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా ... ప్రపంచం లో ప్రతి పరిణామం పై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించు కోవాలి లేదంటే ? ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే ... బెంగళూరులో ఓ సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నారట ... అంత్యక్రియలకు ఎవరూ రాలేదట ... వాస్తవం ఇలానే ఉంటుంది ... భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి ... ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్ర నాథ్ ఓ మాట చెప్పారు ... సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడం తో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట ... ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు ... సీఎం తెలుసు పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే .... - బుద్ధా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం