చిన్నిచిన్ని ఆశ... - ‘ఆపేశావేం పాడు రాధా పాడు.. అయ్యో నా ఉద్దేశం అది కాదు రాధా పాడడం ఆపేశావేంటీ పాడమని అడుగుతున్నాను. ఐనా మన పరిచయం ఇప్పుడే కదా! అప్పుడే ‘పాడు’ రాధవు ఎలా అవుతావు అని గోపి మనసులోనే అనుకున్నాడు.
గోపీ నీ చిన్న కోరిక తీర్చకపోవడానికి ఈ రాధ అంత కర్కశురాలేమీ కాదు పాడుతా గోపీ పాడుతా అంటూ రాధ పాటందుకుంది. అడగ్గానే పాడావు, మరో చిన్న కోరిక కాదనవు కదా! అని తన్మయంగా రాధముఖంలోకి చూశాడు గోపి. రాధ సిగ్గుతో ముడుచుకుపోయింది. అడుక్కో గోపి అడుక్కో ఏమడుగుతావో అడుక్కో అంది రాధ!
ఇంత అద్భుతంగా పాడిన నీ చేతిమీద చిన్నముద్దు అంటే నా ఉద్దేశం పాడింది నీ గొంతే అనుకో కానీ అలా పాడినందుకు నీ చేతిమీద చిన్నముద్దు పెట్టుకోవాలని అంటూ గోపి మెలికలు తిరిగిపోయాడు. రాధ ఫక్కున నవ్వింది.
పిచ్చి గోపీ ఇది 2011 నువ్వు మరీ 1911 నాటి వాడిలా అమాయకుడిలా ఉన్నావని చేతిని ముందుకు చాచింది. పిచ్చి ఎవరికో నీకు తరువాత తెలుస్తుంది చెయ్యిచ్చి నువ్వు నా చిన్నకోరిక తీర్చావు ఆ తరువాత ముందుకు దూసుకెళ్లడం ఎలానో నాకు తెలుసు అని గోపి మనసులో అనుకున్నాడు.
చిన్నిచిన్ని కోరికే కదా అని మనం నమ్మామనుకో కొంప మునుగుతుంది అని ఇప్పుడు రాధ అందరికీ చెబుతోంది.
భక్తా నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో?-అని హిరణ్యకశిపుని సృష్టికర్త అడిగాడు .
మరీ పెద్ద పెద్ద ఆశలేమీ లేవు భగవాన్ నావన్నీ చిన్నిచిన్న ఆశలే. ఈ చరా చర సృష్టిలో నేనో చిన్నప్రాణిని, ఈ ప్రాణం ఉంటేఎంత? లేకుంటేఎంత? కావున ఈ ప్రాణాం శాశ్వతంగా ఉండాలనేది నా చిన్నికోరిక.
నా కోసం కాదు , మిమ్ములను నిరంతరం కొలుచుకోవాలనే ఈ చిన్న కోరిక కోరుకుంటున్నాను. సరే కండిషన్స్ అప్లై అంటూ చిన్న స్టార్ గుర్తుతో మీరు మడత పేచీ పెట్టాలని ప్రయత్నించకండి స్వామీ.
సరదాగా ఈసారి కండీషన్స్ నేనే పెడతాను. రాత్రి కానీ పగలు కానీ , ఇంట్లో కానీ ఇంటి బయట కానీ, జంతువుతో కానీ, మనిషితో కానీ చావకుండా ఉండే చిన్న కోరిక తీర్చండి స్వామి అని హిరణ్య కశిపుడు కోరుకున్నాడు. కస్టమర్‌కే ఇన్ని తెలివితేటలుంటే ఉత్పత్తిదారుడికెన్ని ఉండాలనుకున్న దేవుడు చిరునవ్వుతో తథాస్తు అన్నాడు.
సరే మెచ్చాను కానీ నీ కోరికేమిటో చెప్పూ -అని అప్పటికే బోలెడు మందికి వరాలిచ్చిన శివుడు భస్మాసురుడ్ని అడిగాడు. నేను ఎవడి తలపై చేయి పెడితే వాటు మటాష్ కావాలి శివా! అని కోరుకున్నాడుభస్మాసురుడు . సరే నువ్వు ప్రజాస్వామ్యం వచ్చాక రాజకీయ నాయకుడిగా పుడతావు అని శివుడు వరమివ్వబోతే అయ్యో స్వామి చిన్న కోరిక తీరడానికి అన్ని యుగాలు వేచి ఉండాలా? నా వల్ల కాదు అని అలిగాడు. నీ మంచి కోసమే చెబుతున్నాను ఏ కాలంలో పండే పళ్లను ఆ కాలంలో తింటేనే ఆరోగ్యానికి మంచిది నువ్వు కలియుగం చివరి దశలో కోరాల్సిన కోరికను ఇప్పుడు కోరుతున్నావు దీని వల్ల నీకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మంచి కస్టమర్‌ను వదులుకోవడానికి షాపువాడు, మంచి ఉద్యోగిని వదులుకోవడానికి ఏ కంపెనీ వాడు ఇష్టపడడు అలానే మంచి భక్తున్ని వదులుకోవడం దేవుడికి ఇష్టం ఉండదని చెబుతున్నాను ఆ తరువాత నీ ఇష్టం అని శివుడు నిష్టూరంగానే పలికాడు. నేను చిన్నవరం అడిగితే మీరు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నారు అంటూ భస్మాసురుడు చిన్నబుచ్చుకున్నాడు.
సరే చావు నీ ఇష్టం అని శివుడు వరమిస్తే పరీక్షించడానికి శివుని తలపైనే చేయిపెట్టేందుకు భస్మాసురుడు పరుగు తీశాడు.అలా పరుగు తీస్తూ తీస్తూ రాజకీయాల్లోకి గెంతాడు. అదే రూపంలో ఉంటే భగవంతుడు తనను గుర్తు పట్టి విష్ణుమాయ చేస్తాడనే అనుమానంతో భస్మాసుడు అనేక రూపాలు దాల్చాడు. ఎక్కువ భాగాన్ని రాజకీయాల్లోకి పంపించాడు.
అక్కడ ఇక్కడ అని లేదు మనకు పార్కుల్లో, మహానగరంలో బైకులపై కనిపించే కుర్ర కుంకలు మొదలుకుని రాజకీయాల వరకు అన్ని చోట్ల భస్మాసురుడు తన సూక్ష్మరూపాన్ని ప్రవేశపెట్టాడు. చిన్నకోరిక అనే మాట వినిపిస్తే అలాంటి వారిని ఒకసారి పరిశీలించి చూడండి వాడిలో భస్మాసుర లక్షణాలు కనిపించొచ్చు.
అలా అని అందరినీ భస్మాసుడు అనలేం కొందరు గోపిలు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు.
ఈ కథ నిజం కాదేమో అనే అనుమానం కలుగుతోంది. ఐనా చిన్నిచిన్ని కోరికలు లేనిదెవరికి? అన్న తరువాత నేనే సిఎంను అనే చిన్నకోరిక బాబుగారికి చాలా కాలం నుండే ఉండేది. వదిన రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డోస్తే రోడ్డునే తవ్వేసి స్పీడ్ బ్రేకర్‌ను తప్పించి సిఎం అయ్యాడు.
కోరిక తీరుతుందని కలలో కూడా అనుకోకుండానే రోశయ్య చిన్న కోరిక తీరిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మగారి ముందు క్యూలో నిల్చుని తన చిన్నకోరిక తీర్చుకున్నారు. జగన్‌మంకుపట్టు పట్టి రోడ్డున పడ్డాడు.
మణులడిగానా? మాణిక్యాలడిగానా? ఏదో చిన్న కోరిక తెలంగాణ ఇమ్మన్నాను అంతే కదా! అని కెసిఆర్ గుర్రు మంటున్నాడు.
అడగక ముందే చిన్న కోరిక తీర్చారు మరి అడిగిన చిన్నకోరిక గవర్నర్ పదవి సంగతేమిని రోశయ్య అడుగుతున్నారు.
మంచి దయ్యమా నీ చిన్న కోరికేమిటి? అంటే మనిషిని కావాలని అంది. నీ కోరికేంటి అని వడ్డీ వ్యాపారినడిగితే ఎవరికీ చెప్పరు కదా! అని ఒట్టేయించుకుని మెల్లగా చెప్పాడు ‘‘ఏదో ఒక రోజు ప్రపంచ బ్యాంకు నా వద్దకు అప్పు కోసం రావాలి’’ అన్నాడు.. వాడొస్తే ఎంత రేటుకిస్తావేమిటి? అంటే ‘‘వాడొస్తే,నిన్నేవ్వడు నమ్ముతాడు నీకు చచ్చినా లోన్ ఇవ్వనుపో అని చెప్పాలనేది మరో కోరిక’’ అన్నాడు.
ఈ ‘కాలం’ ఇలా సాగిపోవాలని ,చదివి బాగుందని అనాలని చిన్నకోరిక.