27, జూన్ 2011, సోమవారం

పుస్తకాలు చదవకండి ప్లీజ్ .........సికింద్రాబాద్ ముచ్చట్లు

ప్రశాంతంగా ఉండే కాలనీ అంతకన్నా బాగున్న ఇల్లు .సంపదను ప్రదర్శిస్త్న్నట్టు కాకుండా సింపుల్ గా అందంగా కనిపించిందా ఇల్లు .ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు కానీ నాకు మాత్రం ఇంటిని చూసి ఆ ఇంటిలో పుస్తకాలు చూడడం అలవాటు . ఇంట్లోకి అడుగు పెట్టగానే ఖరీదైన సోఫా, అడవులనుంచి కొట్టుకొచ్చిన టేకు ఫర్నిచర్ ఉందా? లేదా ?అనేది ఏమాత్రం చూడకుండా ఎదురుగా కనిపించిన అద్దాల షెల్ఫ్ పైకి నా దృష్టి వెళ్ళింది . ఆ షెల్ఫ్ లోపల పెద్ద పెద్ద బుక్స్ కనిపించాయి. షెల్ఫ్ తెరవడానికి ప్రయత్నిస్తే రాలేదు. తాళం వేసి ఉంది. అతను నువ్వుతూ తాళం చెవి నా వద్ద కూడా లేదు అన్నాడు. నేను వదులుతానా ? హీరోయిన్ ను వదిలేయి అని విలన్ ఎంత భయపెట్టినా హీరో వదలడు కదా మరి చిన్నప్పటినుంచి సినిమాలు చూస్తూ  పెరిగిన మనం ఇష్టపడ్డ దాన్ని  వదులుతామా ?  

****
అతనో పార్టీ నాయకుడు. మీడియా వ్యవహారాలు  చూసేవాడు. నాయకుడు అంటే సహజంగా ఉండే అభిప్రాయానికి భిన్నంగా ఉండే వాడు. సరదాగా కబుర్లు చెప్పుకునే వారం . నాయకుడు అన్నాక సంపాదన కోసం ఏదో ఒకటి చేయాలి.
నాయకులకు బాగా కలసి వచ్చే వ్యాపారం . కాంట్రాక్టులు. భారీగా కాకపోయినా తన స్థాయికి  తగిన కాంట్రాక్టులు చేస్తూ ప్రజా సేవ చేసేవాడు. ఓసారి విజిటింగ్  కార్డు ఇచ్చాడు .  చెన్న.......చౌదరి   అని ఉంది . నేనేమి మాట్లాడక ముందే మరో జేబులోనుంచి మరో కార్డ్ తీసి చూపాడు . అందులో అతను మైనారిటీ మతానికి చెందిన వ్యక్తి అని  సూచించే విధంగా అతని పేరు ముందు సంకేతం ఉంది .
 అది టిడిపి అధికారం లో ఉన్న కాలం . కాంట్రాక్టులు అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి. పనుల కోసం ఎక్కడ ఏది ఉపయోగ పడితే ఆ ఆయుధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది అని నవ్వాడు. నైతిక  విలువల గురించి అతిగా మాట్లాడే వారికన్నా ఇలా నిర్మోహమాటంగా మాట్లాడే వారే నయం అనిపిస్తుంది. 
*****
 పరిచయమైన కొత్తలో  నేను రజనీష్ గురించి మాట్లాడితే మరుసటి రోజు రజనీష్ ఉపన్యాసాల క్యాసెట్ ఇచ్చాడు. పార్టీ కార్యాలయం లో ఆందరూ  పార్టీ గురించి మాట్లాడుకుంటుంటే భలే చెప్పాడు కదా అంటూ  మేం రజనీష్ గురించి మాట్లాడుకునే వాళ్ళం .నువ్వు రాజకీయాలకు పనికి రావు నా మాట విను అని అతనికి సలహా ఇస్తే నా అభిప్రాయం కూడా ఇదే నువ్వు చేసే పనికి నువ్వు పనికి రావు అన్నాడు. నాకు ఇది తప్ప ఇంకో పని రాదు అని చెప్పేశాను. 
***
ఓషో రజనీష్ జీవిత సత్యాలు అప్పుడే చదవడం మొదలు పెట్టాను . నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఆ పుస్తకం కిక్కు అప్పటికే నాకు మెల్లగాఎక్క సాగింది. 
 మనిషి తాను ఏదైతే కాదో అది అని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడు. ఆ పుస్తకంలో  రజనీష్  చెప్పిన ఈ మాట నాకు బాగా నచ్చింది  ఆ రోజు యం యల్ ఏ క్వార్టర్ లో అయ్యదేవర కాళేశ్వర్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. అప్పటికి చంద్రబాబు విజయ వంతంగా తన మామను అధికారం నుంచి దించి ముఖ్య మంత్రి పదవి చేపట్టారు. ముఖ్య మంత్రిగా ఆయన హాజరు అవుతున్న తొలి కార్యక్రమం. ఆహుతులందరినీ ఒకసారి పరికించి చూసిన ఆయన  రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని ఆవేదనగా ప్రసంగించారు. చెప్పాను కదా అప్పటికే రజనీష్ మాటల కిక్కు ఎక్కడం మొదలైందని. బాబు నోటినుంచి నైతిక విలువల మాట రాగానే కిసుక్కున నవ్వాను. తన్మయంతో వింటున్నట్టు జీవించిన కొందరు నా వైపు చూశారు. పుస్తకాన్ని చదివానే అనుకో ఇప్పుడు గుర్తు చేసుకోవాలా అని నన్ను నేనే మందలించుకున్నాను. 
*** 
మళ్లీ మన చెన్న ... చౌదరి వద్దకు వద్దాం .....  అప్పుడు వారాసి గూడా లో ఉండే వాణ్ణి. పద్మారావు నగర్ పక్కనే కాబట్టి ఓసారి ఇంటికి రమ్మని పిలవడం వల్ల చె ... ఇంటికి వెళ్ళాను. షెల్ఫ్లో  అన్ని పుస్తకాలు చూసి   నేనేమి తీసుకొను ఇక్కడే చూసి ఇస్తాను అని చెప్పాను. నిజంగానే తాళం చెవి లేదు నేనే కావాలనే పారేశాను అని చె....... చౌదరి చెప్పాడు . నాకు నమ్మకం కలగలేదు . చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద పుస్తకాలను అలంకరణ కోసం పెడతారు.  హాలులో  విప్పి చూడని  హిందూ పేపర్, షెల్ఫ్ లో  భగవద్గీత  చాలా చోట్ల చూసినవే నాకు తెలుసులే అని అన్నాను. ఆతను అదికాదు అని అసలు విషయం చెప్పాడు.   నేను అలాకాదు నిజంగానే అవి చదివాను . ఎదురుగా కనిపించే వాటిలో  అంబేద్కర్ బుక్స్ కూడా చాలానే ఉన్నాయి . అంబేద్కర్ బౌద్ద మతాన్ని స్వికరించేప్పుడు చెప్పిన విషయాలు అధ్బుతం . మతం గురించి, తన జీవితం గురించి, తాను ఎదుర్కొన్న వివక్ష గురించి , మనిషి కి మతం ఏ విధంగా మేలు చేయాలో చెబుతూ అనేక మతాల సారాన్ని వివరిస్తూ ఉపన్యసించారు . ఆ పుస్తకాల్లో అది కూడా ఉంది. ఆ బుక్ చదివాక అది నాపై తీవ్రమైన ప్రభావం చూపింది.  చివరకు నేను కాంట్రాక్ట్ పనులు చేయలేక పోయాను. నేను చేసే పనిలో ఎన్నో తప్పులు తప్పవు . నిజాయితిగా ఉంటే భార్యాపిల్లలకు తిండి కూడా పెట్టలేను , కాంట్రాక్టులు చేయలేను అన్నాడు. కనీసం నెల రోజుల పాటు ఆ పుస్తకం నన్ను వెంటాడింది . ఒక్క పుస్తకం తోనే నా పరిస్థితి ఇలా మారింది అన్ని చదివితే ఏమవుతుందో అని భయమేసింది  అప్పుడే ఆ షెల్ఫ్ కు లాక్ వేసి కీ పారేశాను,  ఇక నాకు విశ్రాంతి కావాలి అనుకున్నరోజున ఆ షెల్ఫ్ తెరుస్తాని అని చెప్పాడు. 

***
అతని కథ మనకు తెలియక ముందే మనం పిల్లలను పుస్తకాలకు దూరంగానే పెంచుతున్నాం .  చిన్నప్పుడు చందమామ కథలు పెద్దయ్యాక నీతి కథలు చదివి చాలా మంది చెడిపోయారు . సరే ఇప్పుడు అది కాస్త తగ్గింది. 10 వ తరగతి వరకు అమ్మమ్మ , నానమ్మలను పలకరించెంత సమయమే ఉండదు . ఇక వారు చెప్పే కథలు వినేంత సమయం ఉంటుందా? తరువాత రెండేళ్లపై ఎలాంటి దిగులు అవసరం లేదు. చైతన్య, నారాయణ వాళ్ళు ఉపిరి తీసుకోవడానికి కొంత  సమయం ఇస్తారు తప్ప సాహిత్యానికి ఇవ్వరు. కాబట్టి మనం రెండేళ్ళు బయపడాల్సిన అవసరం లేదు. 
****
మనిషి మనిషిగా మారడం అత్యంత ప్రమాదకరం. పుస్తకాలతో ఆ ప్రమాదం ఉంది.

 ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము 
నరుడు narudouta యెంతో దుష్కరము  సుమ్ము -గాలిబ్  
అన్నింటికన్నా మనిషి మనిషి కావడం కష్టం అంటాడు గాలిబ్ . పుస్తకాలు అలాంటి కష్టమైన పనిని సులభంగా చేసేప్రమాదం ఉంది.  లాడెన్ లాంటి వాడిని సైతంమనిషిగా మార్చేంత ప్రమాదకరమైంది సాహిత్యం. 
****
 రాకుమారుడిని అష్టకష్టాలు పడి పెంచిన రాజమాత ఎక్కడికైనా వెళ్ళు ఆ గుహలోకి మాత్రం వేళ్ళకు అని జాగ్రతలు చెబుతుంది. రాజ కుమారుడు మాత్రం చివరకు  ఆ గుహలోకే వెళ్లి రాక్షసునితోపోరాటం వంటి కష్టాలెన్నో కొని తెచ్చుకుంటాడు.  వద్దని చెబుతాం లేదు మేం మనుషులుగానే ఉండాలను కుంటున్నాం. చదువుతాము అంటే అది మీ ఇష్టం .  ఆవిడెవరో ఆలమూరు సౌమ్య వివాహ భోజనంభు అంటే కడుపు నింపు కుందామని వెళితే మెదడు నింపుకోవడానికి పుస్తకాల జాబితా ఇచ్చింది . మరో 54 మంది . మెదడు నింపుకోవడానికి మరిన్ని పుస్తకాల పేర్లు ఇచ్చారు. మరింత మంది తమ తమ బ్లాగ్స్ లో  తాము చదివిన బుక్స్ పై సమీక్షలు చేస్తున్నారు . నేను ముందే చెబుతున్నాను పుస్తకాలతో చాల ప్రమాదం . వాటిని నమ్మొద్దు అవి మనిషిని కుదురుగా ఉండనివ్వవు . మానవత్వం తో వ్యవహరించెట్టు చేస్తాయి. మనిషికి ఇంతకన్నా ప్రమాదం ఇంకేముంటుంది .
(సికింద్రాబాద్ ముచ్చట్లు ౫)

5 కామెంట్‌లు:

  1. "పుస్తకాలతో చాల ప్రమాదం . వాటిని నమ్మొద్దు అవి మనిషిని కుదురుగా ఉండనివ్వవు."
    That's right! :)

    రిప్లయితొలగించండి
  2. నిజం!! కా..నీ.. ప్రమాదమని తెలిసీ బయట పడలేని పరిస్థితి.. చాలా సంఘర్షణ.. అతని పరిస్థితిని నేను ఊహించగలనండీ..
    కానైతే, పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే వచ్చేది కాదనీ, దూరం పెడితే రాకుండా ఉండేది కాదనీ నా అభిప్రాయం.. అప్పటివరకూ పుస్తకం అంటే ఏమిటో తెలియకుండా, యాదాలాపంగా కథో మరొకటో చదివి ఆ తర్వాత పుస్తకాలకి అక్షరాలా అడిక్ట్ అయిన వాళ్ళు నాకు తెలుసు.. అలాగే కొన్నాళ్ళు చదివి, మధ్యలో బ్రేక్ వచ్చి, ఇంక పుస్తకాలని మర్చిపోతున్నాం అనుకున్న సమయంలో మళ్ళీ ఎందుకో మొదలు పెట్టి పీకలోతు మునిగిన వాళ్ళూ తెలుసు.. సౌమ్య గారి లాంటి వాళ్ళ జాబితాలు చూసినప్పుడు 'దేరీజ్ ఏ లాంగ్ వే టు గో' అన్న మాట గుర్తొస్తూ ఉంటుంది నాకు...

    రిప్లయితొలగించండి
  3. ఎంత నిజం!, అవును, పుస్తకాలు మనిషిని కుదురుగా ఉండనివ్వవు. ప్రశాంతంగా పడుకోనివ్వవు. సమజాంలో జరిగేవాటిని చూస్తూ పోతేపోనీలే నాకెందుకు అని ఊరుకోనివ్వవు, కోపం తెప్పించకుండా ఉండవు, నవ్వించవు, అన్యాయాన్ని చూసీచూడనట్టు పోనివ్వవు...ఈ సంఘర్షణ పుస్తకాలు చదివే ప్రతీవారికి ఎప్పుడో ఒకప్పుడు కలగకమానదు. నెమలి కన్ను మురళీ గారు చెప్పినట్టు ఈ వ్యసనం వద్దంటే పోయేది కాదు, కావాలనుకుంటే వచ్చేది కాదు.

    మీ పోస్టు ఇప్పటికి మూడు సార్లు చదివానండీ..చదువుతున్నకొద్దీ లోతు తెలుస్తూనే ఉంది...చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  4. నిజమే! లాడెన్ ని మార్చేసేంత శక్తి సాహిత్యానికి ఉంది. చాలా శక్తివంతమైన సాహిత్యం మనిషిని మార్చేసేదే అయితే, ఇంక కొత్తగా ఈ రోజు రాసే వాళ్ళు రాయడానికి ఏం లేదు. అన్నీ చర్విత చర్వణాలే. పూర్వం గాలిబ్, శ్రీ శ్రీ.. రాసెయ్యగానే సమాజం మారిపోయేదేగా! బాటం లైన్ ఏమిటంటే శక్తివంతమైన సాహిత్యానికి మించినది మనుగడకై పోరాటం. సిధ్ధాంతాన్నో,సాహిత్యాన్నో నమ్మి కూర్చుంటే పెళ్ళం తంతుంది కనుక మనసుని చంపుకు "మనం కాని దృక్కోణాన్ని జనాలకు కనిపించేలా" ఎలుగెత్తి ఘొషించక తప్పట్లేదు.లాడెన్ గారూ అదే చేసి ఉంటారేమో పాపం!(ఆయన పుస్తకాలు చదివి ఉంటే!) చౌదరి గారు ఆత్మ సాక్షిని తృప్తి పరిచే పని చేసి పుస్తకాల బీరువాకి తాళం పెట్టారు. మనలో చాలా మందికి దమ్ము చాలక కొట్టుమిట్టాడుతూ ఉంటాం. పుస్తకాలపై మోజు చంపుకోలేక చదువుతూ ఉంటాం.

    ఏంటో! చాలా పెద్ద మాటలు మాట్లాడేసానేంటో!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం