6, డిసెంబర్ 2011, మంగళవారం

మన చానల్స్ ప్రయోగాలూ చేయాలి



పొరుగున ఉన్న తమిళంలో అద్భుతమైన ప్రయోగాలతో సినిమాలు వస్తున్నాయి. అక్కడ విజయవంతం అయిన తరువాత తెలుగువారు డబ్బింగ్ హక్కులో, రీ మేక్ హక్కులో కొనుక్కుంటున్నారు. చివరకు షష్టిపూర్తి వయసులో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సైతం ప్రయోగాలు చేస్తున్నా మన వాళ్లు చేయడం లేదు. కాపీ కావచ్చు, కొత్త దనం కావచ్చు. గజనీ లాంటి కథలు అక్కడి నుంచే వస్తున్నాయి. వయసు మీరిన తరువాత కూడా ఆ ఇద్దరు తారలు రోబో, దశావతారాలు వంటి ప్రయోగాలు చేశారు. అలాంటి ప్రయోగాలు ఇక్కడ సరిపోవు కావాలంటే డబ్బింగ్ చేసుకోండి అని మన ఘనత వహించిన హీరోలు సూచనలు చేస్తున్నారు. ఇతర హీరోల సినిమాలు చూసే అలవాటు మాకు లేదు అని సగర్వంగా ప్రకటించుకునే హీరోలున్న మన తెలుగు సినిమా రంగంలో ప్రయోగాలు ఆశించగలమా?

 సినిమా వాళ్లు ప్రయోగాలు చేయాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. విజయవంతం అవుతుందో అట్టర్ ఫ్ల్లాప్ అవుతుందో తెలియదు కానీ టీవి రంగం అలా కాదు ప్రయోగాలకు అవకాశం ఉన్న రంగం ఇది. కానీ ఎందుకో కానీ అలాంటి సాహసాలు ఇక్కడ తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకరు దారి ఏర్పాటు చేస్తే ఆ మార్గంలోనే పయనించాలనే నిబంధన పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దూరదర్శన్ కాలంలో తెలుగులో తొలి ప్రైవేట్ 24 గంటల న్యూస్ చానల్ టీవీ 9. వారు తొలుత ప్రవేశపెట్టిన మూసలో నడవడానికే తెలుగు చానల్స్ అలవాటుపడిపోయాయి. స్టూడియోకు పిలిచి తిట్టిపించడం ఐనా, బ్రేకింగ్ న్యూస్‌లైనా టీవీ 9 ప్రవేశపెట్టిన ఒరవడే. ప్రతి దాన్ని సెనే్సషనలైజ్ చేయడం అతి అయిన తరువాత ప్రజలు దేనికీ పెద్దగా స్పందించని పరిస్థితి ఏర్పడింది.
ఈ మధ్య పెద్దగా రాజకీయాల్లో సంచలనాలు అంటూ ఏమీ లేదు. 24 గంటల పాటు లైవ్‌గా చూపించే వార్తలు లేవు, చూసేందుకు ప్రజలూ సిద్ధంగా లేరు. అలాంటి సమయంలో న్యూస్ చానల్స్ సైతం ఎక్కువ సమయాన్ని రాజకీయ వ్యంగ్య కార్యక్రమాలు, కామెడీ సినిమా బిట్స్, సినిమా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు.
జానపద గీతాలను దూరదర్శన్ ఎప్పటి నుండో ప్రసారం చేస్తోంది. కానీ కొన్ని ప్రైవేటు చానల్స్ జానపద గీతాల ప్రసారాన్ని ఎలా విజయవంతం చేయవచ్చునో చూపించాయి. దూరదర్శన్‌లో జానపద గీతాలు సీదాసాదాగానే వచ్చేవి. రేలా రేలా దుమ్ము రేపడం అంటే ఏమిటో మా చానల్ వాళ్లు చూపించారు. టీ న్యూస్ వచ్చిన కొత్తలో తెలంగాణ జానపద గీతాలను ఎక్కువగా ప్రసారం చేశారు. ఆ తరువాత అనేక చానల్స్‌లో జానపద గీతాలు వస్తున్నాయి. ఎవరో ఒకరు ప్రారంభించాక వ్యూయర్‌షిప్ ఎక్కువగా ఉంటే మిగిలిన చానల్స్ సైతం అటువైపు అడుగులు వేస్తున్నాయి. అలా కాకుండా ఎవరికి వారు సొంతంగా కొత్తదనం కోసం ఏదో ఒక ప్రయోగం చేయవచ్చు. అన్ని ప్రయోగాలు విజయవంతం అవుతాయని, ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని కాదు.
మూసలో ఉండే బదులు ప్రయోగం చేస్తే పోయేదేముంది.
ఏదోలా 24 గంటల ప్రసారాలు ఎలా అనే ఆలోచనకు బదులు, కొంత సమయాన్ని కొత్త ప్రయోగాలకు కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచన చేయవచ్చు కదా! వారు ప్రసారం చేసే కార్యక్రమాలు సెనే్సషనల్ కాకపోవచ్చు, వ్యూవర్ షిప్‌లో మొదటి స్థానంలో నిలవకపోవచ్చు కానీ హెచ్‌ఎం టీవిలో కొన్ని ప్రయోగాలు కనిపిస్తున్నాయి. దూరదర్శన్‌ను మినహాయిస్తే న్యూస్ చానల్స్‌లో సాహిత్య కార్యక్రమాన్ని ఊహించలేం. ఆ మధ్య టీవీ 9లో పుస్తక సమీక్ష ప్రారంభించినా అది ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హెచ్‌ఎం టీవిలో వందేళ్ల తెలుగు కథ పేరుతో గొల్లపూడి మారుతీరావు ఆధ్వర్యంలో వస్తున్న సాహిత్య కార్యక్రమం ఒక మంచి ప్రయోగం. గొల్లపూడి మారుతీరావు సినిమా నటుడు, రచయిత. సహజంగా సినిమా వారి పట్ల ప్రేక్షకుల్లో ఆకర్షణ ఉంటుంది. సాహిత్య కార్యక్రమాన్ని గొల్లపూడితో ప్రారంభించడం వల్ల అటు ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇటు సాహితీ విలువలు ఉంటాయి. ఇదో మంచి ప్రయత్నం. మరీ దుమ్ము రేపకపోయినా సాహితీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది విజయవంతం అయితే అదే చానల్‌లో మరిన్ని సాహిత్య కార్యక్రమాలు రావచ్చు, వాటికి ప్రేక్షకాదరణ ఉంటే వద్దన్నా ఇతర చానల్స్ అనుసరించి తీరుతాయి. టీవి5 తొలుత జిల్లాల వారీగా జిల్లా వార్తలను ప్రసారం చేసింది. హెచ్‌ఎంటీవి ప్రత్యేకంగా గిరిజన వార్తలకు ప్రత్యేక సమయం కేటాయించారు. అయితే గిరిజనులు అనగానే రోగాలు, తాగునీరు లభించక ఇబ్బందులు పడడం, ఆస్పత్రుల్లో మందులు లేకపోవడం డాక్టర్లు అందుబాటులో ఉండక పోవడం ఇవేనా? ఇలాంటి సమస్యలు గిరిజన ప్రాంతాల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్నవే. గిరిజనుల జీవితం అంటేనే కష్టాలే అనే కోణమే కాకుండా వారి ఆటపాటలు, వారి జీవిత విధానం చూపించవచ్చు కదా? దానికి కొంత శ్రమ ఎక్కువవుతుందేమో కానీ కచ్చితంగా కొత్తదనం చూపినప్పుడు ఆకట్టుకుంటుంది. గిరిజనుల వివాహాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. కొంత సమయం సమస్యలకు కేటాయించినా మరి కొంత సమయం వారిదైన ప్రత్యేక జీవన విధానంపై కథనాలు ప్రసారం చేయడానికి అవకాశం ఉంది.
అంబుడ్స్‌మెన్ వ్యవస్థ గురించి తెలిసిందే. మేం చెప్పిందే వేదం అని భావించే చానల్స్ వ్యవస్థలో తొలిసారిగా హెచ్‌ఎంటీవి అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి తీర్పరి అని తెలుగు పేరు పెట్టింది. చానల్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాల పట్ల అభ్యంతరాలు ఉంటే తీర్పరికి ఫిర్యాదు చేయవచ్చు. మంచి ప్రయత్నం.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం