27, జూన్ 2012, బుధవారం

దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం..జగన్..బాబు

‘‘ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఇంటికి పై కప్పు దేంతో వేద్దామనా? ’’


 ఏరా జోకేసినా నవ్వవా?’’


‘‘ఇది జోకా? ముందే చెబితే నవ్వేవాన్ని కదా? ’’
‘‘అంత దిగులుగా ఉన్నావేంటి? 2012 డిసెంబర్‌లో యుగాంతం దగ్గరికొస్తుందనా? ’’


‘‘యుగాంతం దిగులు నాకెందుకు? ఇంతటి అవమానాన్ని భరిస్తూ ఉండడం కన్నా యుగాంతం ఎంతో సంతోషం కలిగించే విషయం నాకు.
ప్రజలు చెడిపోయారు. ఇక మనం ఎంత మాత్రం బాగు చేయడానికి వీలులేనంతగా చెడిపోయారు అదే నా బాధ’’
‘‘నిన్నటి వరకు బాగానే ఉండేవాడివి, రాత్రికి రాత్రి ప్రజలకేమైంది నీకేమైంది’’
‘‘మీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ నా అభిమాన నటుడే సినిమాల్లో చిర కాలం నంబర్‌వన్‌గా ఉండాలి. రాజకీయాల్లో అంతే నా అభిమాన నాయకుడే నంబర్ వన్‌గా ఉండి చక్రం తిప్పాలి. నంబర్ టూ కూడా నాకు నచ్చదు అలాంటిది ఇప్పుడు నంబర్ త్రీ స్థానంలోకి మా అభిమాన పార్టీని నెట్టివేసిన ఈ ప్రజలందరి చరిత్ర ఎంత తొందరగా అంతం అయితే అంత బాగుండు అనిపిస్తుంది? ఆ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాతలు రాసినా, ఆ పార్టీ గెలవడం ఏమిటి? మయసభలో అభిమాన ధనుడు దుర్యోధనుడికి జరిగిన పరాభవం గుర్తు కొస్తోంది నాకు’’


‘‘ ఓహో అదా నీ సమస్య. దానవీర శూరకర్ణ సినిమా చూశావా?’’
‘‘నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చూశావు? అని అడుగు. ఇప్పటికీ ఆ సినిమా డైలాగులు వింటాను? డైలాగు చెప్పమంటావా? ఏమంటివేమంటివి....’’
‘‘వెరిగుడ్ కురుక్షేత్రం చూశావా?’’
‘‘లేదు చూడలేదు... చూసే ఉద్దేశం కూడా లేదు...ఐనా నేనడిగిన ప్రశ్నకు, ఈ రెండు సినిమాలకు సంబంధం ఏమిటి?’’


‘‘అక్కడికే వస్తున్నాను
1977కు దేశ రాజకీయాల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో, రాష్ట్ర సినిమా చరిత్రలో సైతం అంత ప్రాముఖ్యత ఉంది. అప్పుడే కృష్ణ కురుక్షేత్రం తీస్తే ఎన్టీరామారావు దానవీర శూరకర్ణ తీశారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. రెండూ మహాభారత కథలే. కురుక్ష్రేత్రంను అప్పటి సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీశారు. మహాభారత యుద్ధం రాజస్థాన్‌ప్రాంతంలో జరిగిందని భావిస్తారు. కృష్ణ ప్రత్యేక రైళ్లలో నటీనటులను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులను
రాజస్తాన్  తరలించారు. యుద్ధం జరిగిన చోటే కురుక్షేత్రం సినిమాలోని యుద్ధం సీన్లను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతోరాజస్తాన్, అంబాల ప్రాంతాలలో  షూట్ చేయించారు. పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరుపొందిన కమలాకర కామేశ్వరరావు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు.


ఎన్టీరామారావు దానవీర శూరకర్ణ సినిమాను కేవలం ఆరువారాల్లో నిర్మించారు. కౌరవులు, పాండవులు తమ తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించే సీన్ కోసం కృష్ణ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మల్ల యుద్ధంలో చాంపియన్‌లను ఉపయోగించుకున్నారు. ఇక ఎన్టీఆర్ దానవీర శూరకర్ణను ఇప్పుటి ఇసిఐఎల్, ఎఎస్‌రావు నగర్ ప్రాంతంలో అప్పుడంతా ఖాళీగా ఉండేది. అక్కడే ఒక పెద్ద గొయ్యి లాంటి ప్రాంతం ఉంటే అక్కడే వందమందితో కురుక్షేత్ర యుద్ధం సీన్లు, మల్లయుద్ధం సీన్లు ఔట్ డోర్ షూటింగ్ అంతా అక్కడే ముగించేశారు. హైదరాబాద్ పాత బస్తీ పహిల్‌వాన్‌లను మల్లయోధులుగా ఉపయోగించుకున్నారు. కృష్ణ కురుక్షేత్రం సాంకేతిక విలువలతో హాలివుడ్ సినిమా స్థాయిలో తీస్తే, దానవీరశూరకర్ణ మాత్రం ఏ మాత్రం సాంకేతిక విలువలు లేకుండా బాణాలకు కట్టిన దారాలు, చెట్టునుంచి ఆపిల్ పండు పడకుండా కట్టిన దారం కనిపించి నవ్వు తెప్పిస్తుంది. 


కానీ ఎన్టీఆర్ దుర్యోధనుడి డైలాగులే ఈ సినిమాకు ప్రాణం. కథ ఒకటే కానీ కృష్ణ కురుక్షేత్రంలో అర్జునుడు హీరో, ఎన్టీఆర్ సినిమాలో దుర్యోధనుడే హీరో. పౌరాణిక బ్రహ్మ, దైవభక్తి గల కమలాకర కామేశ్వరరావును దేవుడు చిన్నచూపు చూసి కురుక్షేత్రం ప్లాప్ షోగా మిగల్చాడు. నాస్తికుడైన కొండవీటి వెంకటకవిని దేవుడు అనుగ్రహించి దానవీర శూరకర్ణను సూపర్‌హిట్‌గా నిలిపాడు. దీన్ని బట్టి నీకేమర్ధమైంది.?
’’ 

‘‘ అర్ధం కాలేదు’’


‘‘ రెండు కథల్లో ఏది వాస్తవమైన కథ అని అడిగితే కురుక్షేత్రం అని సమీక్షకులు సమాధానం చెబుతారు. ఏది మంచి సినిమా అంటే దానవీరశూరకర్ణ అని ప్రేక్షకులు తేల్చేశారు. జనం మెచ్చిన సినిమాకు కాసులు కురుస్తాయి, జనం నచ్చిన పార్టీకి ఓట్లు పడతాయి.


అటు 38 ఏళ్ల కుర్ర జగన్. అందులోనూ లక్ష కోట్లు సంపాదించాడనే ఆరోపణ. ఉన్నదేమో జైలులో. ఇటు చూస్తే మొత్తం ప్రపంచానే్న ప్రభావితం చేశారని పేరున్న వృద్ధ బాబు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను క్రమ శిక్షణలో పెట్టడంతో పాటు నవ గ్రహాలను సరైన కక్షలో ఉండేట్టు చూశాడని ఆయన అభిమానులు నమ్ముతారు. పైకి చెప్పరు కానీ సూర్యుడు ఎపిలో ఉదయించడానికి ఇష్టపడనప్పుడు ఆయనే నచ్చజెప్పి రాష్ట్రంలో ఉదయించేట్టు చేశాడని కొందరి నమ్మకం. ఇక కుర్ర జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పలుకుబడి వల్లనే వరుణుడు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాడని కొందరి నమ్మకం. ఈ రెండు నమ్మకాల్లో ఏ నమ్మకాన్ని ఎక్కువ మంది నమ్మితే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం.


ముక్తాయింపు: గడ్డం ఉన్నవాళ్లంతా మేధావులు కాదు. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్లంతా రాజకీయ నాయకులు కారు.

21, జూన్ 2012, గురువారం

ప్రభుత్వం పడిపోదు . కాంగ్రెస్ బతికి బట్ట కట్టేది లేదు

రానున్న సాధారణ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? కొత్త రాజకీయ సమీకరణలకు అవకాశం ఉందా? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నట్లు ఉపఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పిల్లి శాపనార్థాల తరహాలో ఇవి కేవలం సానుభూతి ఓట్లు, ఈ సానుభూతి తాత్కాలికంగానే ఉంటుంది, వచ్చే ఎన్నికల నాటికి ఉండదు అంటూ వివిధ పార్టీల నాయకులు పైకి మాట్లాడుతున్నా లోలోన మాత్రం జగన్ రాజకీయ బలం వారిని కలవరపరుస్తోంది.


 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని సాధించింది. అంటే ఉప ఎన్నిక జరిగిన నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి అసెంబ్లీ స్థానాన్ని మినహాయిస్తే మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 నియోజకవర్గాల్లో మెజారిటీ అది కూడా భారీగా వచ్చింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో దాదాపుగా పది శాతం ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు అయింది. 


తెలంగాణలోని ఒక నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన 23 అసెంబ్లీ నియోజక వర్గాలు సీమాంధ్రలోనివే. అంటే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 23 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు చెప్పారు. దాదాపు 15 శాతం ఓటర్లు అంటే ఇది పెద్ద శాంపిలే. అయితే వారంతా జగన్ వర్గీయులు, మళ్లీ వాళ్లే ఎన్నికయ్యారు.  మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సాధారణ ఎన్నికల్లో సైతం ఈ స్థాయి విజయం ఉంటుందని గట్టిగా చెప్పలేం కానీ రాష్ట్రంలో ప్రబలమైన రాజకీయ శక్తిగా జగన్ ఎదిగాడని మాత్రం ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. చివరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను సైతం సవాల్ చేసే స్థితిలో ఆ పార్టీ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో  ప్రభుత్వం పడిపోకపోవచ్చు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పరిస్థితి మరోలా ఉండేది, కానీ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం సైతం డీలా పడిపోయింది. 2009 సాధారణ ఎన్నికలు, వైఎస్‌ఆర్ మరణం తరువాత రాష్ట్రంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటి బలం తరుగుతూ వస్తోంది. అధికార పక్షం బలహీనపడితే ఆ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బలపడాలి కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం బలహీనపడుతూ వస్తుంటే కొత్త పక్షం క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది.
1983లో టిడిపి ఒకేసారి తన బలాన్ని ప్రదర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అలా కాకుండా పలు ఉప ఎన్నికల్లో తన బలాన్ని చాటిచెబుతూ అధికారపక్షం, ప్రతిపక్షాన్ని వణికిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం అధికారపక్షానికి లేదు, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం అటు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిలోనూ లేదు. ఈ పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి అవిశ్వాస తీర్మానం వంటి సవాల్ ఎదురుకాక పోవచ్చు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వారు ఎంతమంది ఉంటారు, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేం జగన్ పార్టీలో చేరుతున్నాం, ఇదిగో రాజీనామా అని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తారా అన్న అనుమానాలు కలగడం సహజం. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటిస్తే గవర్నర్ జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ మనుగడ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి 2014 వరకు కొనసాగుతుందా?
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే. ప్రతిపక్షం దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి. రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు, సమీకరణలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.

20, జూన్ 2012, బుధవారం

చీమ తల - నాయకుల మెదడు

చీమ తల ఎంతుంటుంది? అందులో మెదడు సైజు ఎంత? రాజవౌళి ఈగ హిట్టయితే తరువాత చీమ వంతు రావచ్చు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోలను నమ్ముకోవడం కన్నా ఈగ, చీమ, దోమలను నమ్ముకోవడం బెటర్ అని కృష్ణానగర్‌లో వినిపిస్తున్న టాక్. సరే ఉప ఎన్నికలతో రాష్ట్రం భవిష్యత్తు ఏమిటా? అని టెన్షన్ పడుతుంటే చీమ తల గురించి ఆలోచిస్తున్నావు అంటారా? ఎన్నికల ఫలితాల గురించి ఆలోచిస్తుంటేనే చీమ సంగతి గుర్తొచ్చింది. చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావు? అంటే పుట్టలో వేలెడితే కుట్టనా అని సమాధానం చెబుతుంది. తన పుట్టలో వేలు పెడితే కుట్టాలి అనే జ్ఞానమే కాదు, ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే తెలివి కూడా ఉంది. అదే నాయకులను ఓ ప్రశ్న అడిగితే ఇలా చెబుతారా? చెప్పనే చెప్పరు ఎందుకంటే వారి మెదడు చీమ తల కన్నా చాలా పెద్దది కాబట్టి. ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడారు? అనడిగితే?
***
నర్సరావుపేట ఎంపి నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని మీ ప్రత్తిపాడు, మాచర్లలో టిడిపి ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నిస్తే, నియోజక వర్గం ప్రజల్లో సగం మందికి జనగణమన జాతీయ గీతం రాదు. దాంతో డబ్బుకు, మద్యంకు ఓటు అమ్ముకున్నారు. అందుకే ఓడాం అని చెప్పారు. పోనీ మిగిలిన సగం మందికి జనగణమన వచ్చినా ఓటు వేసే సమయంలో మరిచిపోయినట్టున్నారు. బాబుగారూ ఇప్పుడు మీరు అర్జంట్‌గా ఓటర్లకు జనగణ మన జాతీయ గీతాన్ని నేర్పించండి.
**
పిసిసి బొత్స గారూ ఏంటండి ఉప ఎన్నికల్లో ఇలా జరిగింది. రెండు సీట్లకే పరిమితం అయ్యారు? అని ప్రశ్నిస్తే, ఎండల వల్ల ఓడిపోయాం అని చల్లగా చెప్పారు. బాబుగారి పాలనలో ఐదారేళ్లపాటు వర్షాలు లేక వానదేవుడి వల్ల ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎండల వేడికి ఓడిపోయామని చెబితే నమ్మాలి మరి. బొత్స మాటలపై టీవీలో చర్చ నిర్వహిస్తే, టీవీ ప్రేక్షకుడొకరు ఫోన్ చేసి అలాగా అయితే వర్షాల్లో ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 18 సీట్లు గెలిచేవారా ? అని ఎకసెక్కాలాడాడు. మరొకాయనేమో! జగన్ అరెస్టు వల్ల సానుభూతితో గెలిచాడని టీవీలో నేతలు మాట్లాడుతుంటే, ఐతే బాబు తన కోర్టు కేసుల నుండి స్టే తెచ్చుకోవడం ఎందుకు, అధికారంలో ఉన్నప్పుడు తన వాళ్ల కోసం చేసినవన్నీ సిబిఐకి చెప్పి అరెస్టయి మొత్తం 294 సీట్లు గెలవ వచ్చు కదా? అని సలహా ఇచ్చారు. 

కిరణ్ కుమార్‌రెడ్డి సంతోషంగా స్వీట్లు పంచుతున్నారు. ఏం సార్ ఎందుకు ఓడిపోయారు? అంటే ఓడిపోవడం ఏమిటి? రెండు సీట్లు గెలిచాం అని అనువాదం అవసరం లేని తెలుగులో చెప్పాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే టేబుల్‌పైన 30 రోజుల్లో తెలుగు పుస్తకం కనిపించింది. సరే చెప్పండి అంటే? మా పై మాకూ, హై కమాండ్‌కు, మీకు, మా అభ్యర్థులకు ఎవరికీ నమ్మకం లేకపోయినా నర్సాపురం, రామచంద్రాపురం తెలుగు తమ్ముళ్లకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే వాళ్లు మద్దతిచ్చారు, మా వాళ్లు గెలిచారు అని చెప్పుకొచ్చారు. ఆ రెండు కాదండి మిగిలిన వాటి సంగతి చెప్పండి ? అని అడిగితే ఎవరో ఒకరు గెలిపించాలి కానీ ఓడించడానికి మాత్రం మా శక్తి మాకు సరిపోతుందని నవ్వాడు. ఏ విషయంపైనైనా అంకెలతో సహా చక్కగా విశే్లషించి చెప్పే చంద్రబాబు వద్దకు స్పష్టంగా చెబుతాడని వెళితే....
***
టేబుల్ నిండా ఫైళ్లు ఉన్నాయి. వాటిని పక్కకు జరిపి చూస్తే చంద్రబాబు కనిపించారు. ఏంటిసార్ సెక్రటేరియట్‌లో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదట కిరణ్ కుమార్ మొత్తం ఫైళ్లు మీకే పంపిస్తున్నట్టున్నారు? అని జోకేస్తే, ఇవి మా పార్టీకి సంబంధించిన ఫైళ్లు అని చిన్నబుచ్చుకున్నారు. ఓహో మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు ఉన్నట్టున్నాయి. రాష్ట్రం కాదు ఒక్క నియోజక వర్గంవే మా వద్ద పూర్తి వివరాలు ఉంటాయి. చదువుతా వినండి అని ఇంటి నంబర్ 1-2.12 తింగరి వీధి, ఓటరు పేరు నాలేశ్వర్ వయసు 50. ఎత్తు 5.5 అడుగులు, బరువు 65 కేజీలు, పలానా కులం. వారానికి ఒకసారి భార్యాభర్తలు సినిమాకు వెళతారు. మహేష్‌బాబు, ఇలియానా అభిమాని. తాగి వస్తే భార్యను చితగ్గొడతాడు, తాగకుండా వచ్చినప్పుడు భార్య చితగ్గొడుతుంది. 1980లో పెళ్లి....
సార్ ... ఆగండి సార్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలిసిపోయింది. ఇక చాలు. మీ వద్ద అవసరమైన సమాచారం కన్నా అనవసర సమాచారం ఎక్కువగా ఉంటుంది. అంకెలను నమ్ముకుని బోర్లా పడుతున్నారు. మీ వద్ద రాష్ట్ర ప్రజల జీవిత చరిత్ర ఉంది కానీ ప్రజలేమనుకుంటున్నారో మీకు తెలియదు..


***
సరే మేధావి గారు ఎన్నికల ఫలితాల పై మీరేమంటారు ?
ప్రజల్లో నిజాయితీ, మంచితనం లోపించింది. ప్రజలంతా అవినీతి పరులయ్యారు ?
 డబ్బులు అన్ని పార్టీల వాళ్ళు పంచారని వార్తలు వచ్చాయి కదా ?
 నేను అదే చెబుతున్నాను. ప్రజలు ఒక పార్టీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతర పార్టీ వారి నుంచి డబ్బు తీసుకోవడం తప్పు కదా 
మా సామాజిక వర్గాన్ని గెలిపించని ఈ ప్రజలన్నా, వీళ్ళ తీర్పు నాకు కంపరమేస్తోంది ? అయితే నేను ఆశావాదిని 2014 లో మా సామాజిక వర్గం విజయం సాదిస్తుంది . కుల రహిత సమాజాన్ని నిర్మిస్తుంది .
***
నేను ఎక్కడికెళితే అక్కడికి నా వెంటే పరిగెత్తుకొస్తున్నావు? ఇంతకూ నువ్వు ఎవరు బాబు? అని అడిగితే, నన్ను ఓటరు అంటారు. ఓడించేది, గెలిపించేది నేనే? నన్ను తప్ప అందరినీ ఫలితాలపై అడుగుతున్నావు అని ఓటరు కోపంగా చూశాడు.

16, జూన్ 2012, శనివారం

ఔను.. బాబుకు రెండు కళ్లూ సమానం!.......కెసిఆర్ ‘దొరగారు’ మేల్కొనాలి!


అరవై మూడేళ్ల చంద్రబాబుకు ఇది నిజంగా కష్టకాలమే. బాబు రాజకీయ జీవితమంత వయసు కూడా లేని వైఎస్ జగన్ ఇప్పుడు ‘దేశం’ అధినాయకుడి రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు. ఇంత క్లిష్టమైన పరిస్థితిలోనూ చంద్రబాబుకు ఒక అనుకూలమైన అంశం ఉంది. టిడిపికి బాబే మైనస్, బాబే ప్లస్. ఆయన నాయకత్వానికి ఆ పార్టీ నుంచి సవాల్ ఎదురయ్యే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ కుమారులకు సినిమా గ్లామర్ ఉన్నా, పాపం.. వాళ్లు బావ చాటు బావమరుదులే.
19చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఒక్కటంటే ఒక్క చోట కూడా టిడిపి గెలవలేదు. ఒంటి చేత్తో యుద్ధం చేస్తూ ఓటమినే కవచకుండలాలుగా మార్చుకున్న బాబు రాబోయే మహాయుద్ధానికి వారసుడిని ఎంపిక చేసుకుంటారా? లేక తనలో శక్తి పోలేదు, చావో రేవో తానే తేల్చుకుంటానని అంటారా? వేచి చూడాలి. ‘టిడిపి నాతోనే పుట్టింది.. నాతోనే పోతుంది’-అని ఎన్టీఆర్ చెప్పేవారు. కానీ ఎన్టీఆర్‌కు అది సాధ్యం కాలేదు. కానీ బాబు సాధ్యం చేస్తాడేమో? అనే కలవరపాటు మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో మెల్లగా మొదలైంది.
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ టిడిపిని సమానంగా చూస్తున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్లు’-అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలను తాజా ఉపఎన్నికల్లో ప్రజలు నిజం చేశారు. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి చావుదెబ్బతింది. నేడు సీమాంధ్ర ఉప ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి ఎదురైంది. రెండు కళ్లతో రెండు వైపులా చూడడం సాధ్యం కాదు. ఒకవైపే చూడాలి. ఇది కళ్లకున్న విచిత్రమైన లక్షణం. రెండు ప్రాంతాల ప్రజలు టిడిపిని సమానంగానే చూస్తున్నారు. ఒక ప్రాంతంలో ఓడిపోయి, మరో ప్రాంతంలో విజయం సాధించి ఉంటే టిడిపి రెండు కళ్ల సిద్ధాంతంపై జనంలో అనుమానాలు రేకెత్తేవి. ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి ఆయింది. టిడిపిని రెండు ప్రాంతాల్లోను ప్రజలు సమానంగానే తిరస్కరిస్తున్నారని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
కాగా, ఉప ఎన్నికల ఫలితాలపై టిడిపి పెద్దగా షాక్ తినలేదు. ఎందుకంటే ఇలాంటి ఫలితాలకు ఆ పార్టీ నేతలు ఎప్పుడో అలవాటు పడిపోయారు. 2009లో ‘మహాకూటమి’ గెలుపు తథ్యమన్న ప్రచారం జోరుగా సాగినా, అది రెండో ఓటమి కాబట్టి టిడిపి వారు పెద్దగా షాక్ తినలేదు. ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు సైతం గల్లంతు కావడం వల్ల ఇప్పుడొచ్చిన ఫలితాలకు టిడిపి పెద్దగా దిగులుపడాల్సిందేమీ లేదు.
కేవలం మీడియా ప్రచారంపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్న టిడిపిని ఉప ఎన్నికలు చావు దెబ్బతీస్తున్నాయి. చంద్రబాబు తాజా ఉప ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం సాగించారు.

 కనీసం రెండు, మూడు స్థానాలు గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఆశలు కలిగించవచ్చునని భావించారు. ఇప్పుడు భవిష్యత్తు మనదే అని నమ్మించడానికి కొత్త కారణాలు వెతుక్కునే పనిలో పడింది టిడిపి నాయకత్వం. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజక వర్గంలో గత ఎన్నికల్లో టిడిపి గెలిచింది ఒక్కటి కూడా లేకపోవచ్చు. ‘ఓడినవి మా సీట్లుకాదు’-అని సమర్ధించుకోచ్చు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండగా, ప్రతి ష్ఠాత్మకంగా జరిగిన ప్రస్తుత ఉపఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్కసీటు కూడా గెలుచుకోలేని స్థితిలో ఉంటే ఇక ఆ పార్టీ ప్రజల్లో ఎలా విశ్వాసం సంపాదించగలుగుతుంది. కాంగ్రెస్ రెండుగా చీలిన తరువాత సాధారణంగా టిడిపి తన ఓటు బ్యాంకును నిలుపుకొని ఉంటే విజయం సాధించాలి. 

కానీ కాంగ్రెస్ ఓట్లతో పాటు టిడిపి ఓట్లను సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కొల్లగొడుతోంది. ‘కాంగ్రెస్ వ్యతిరేకతే మా పార్టీ సిద్ధాంతం’-అని చెప్పుకున్న బాబు పార్టీ ఇప్పుడు ‘జగన్‌పై వ్యతిరేకతే మా సిద్ధాంతం’ -అని ప్రచారం చేసుకుంటోంది. బాబు తనకు అనుకూలంగా ఎంత ప్రచారం చేయించుకుంటున్నా ప్రజల్లో మాత్రం విశ్వసనీయత నెలకొల్పుకోలేక పోతున్నారు. ఆయనను పార్టీ శ్రేణులే కాదు... చివరకు ప్రజలు నమ్మడం లేదు. నమ్మకం కలిగించడానికి ఎనిమిదేళ్లుగా చేసిన కృషి ఫలించలేదు. తన చర్యల ద్వారా నమ్మకం కలిగించాలి కానీ... నమ్మకం కలిగించడమే ఒక ప్రధాన కార్యక్రమంగా ప్రయత్నం సాగిస్తే జనం నమ్మరని మరోసారి రుజువైంది.

‘దొరగారు’ మేల్కొనాలి!


తెలంగాణ ‘దొర’కు ఇది నిజంగానే ఊహించని షాక్. తెలంగాణ వాదానికి తాను తప్ప మరో గత్యంతరం లేదని భావిస్తున్న టిఆర్‌ఎస్‌కు ఇది గట్టిదెబ్బే. తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం తెలంగాణ కోసం ఒకటిగా ఉన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన దశలో జరిగిన ఉప ఎన్నికల్లో 50వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కని పరిస్థితి నుంచి ఇప్పుడు పరకాలలో స్వల్ప మెజారిటీతో తెరాస గట్టెక్కాల్సి వచ్చింది.
‘టిడిపి ముసలి నక్క.. దాని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు, మింగేయడానికి వస్తున్న యువ కిశోరం జగన్‌పై దృష్టి పెట్టాలి’- అని ఓ తెలంగాణ వాది ఇటీవల ఆ ప్రాంత ఉద్యమకారులను హెచ్చరించారు. నిజమే.. పరకాల ఉప ఎన్నికల ఫలితాలు ఆ మాటలనే రుజువు చేశాయి. ‘ఓదార్పు’ అంటూ జగన్, ఏదో ఒక పేరుతో చంద్రబాబు ఉప ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ గడిపారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్రమే అనే మాట బాబూ చెప్పాడు, ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చెబుతోంది. తెలంగాణ పేరుతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట మార్చిన టిడిపిని తెలంగాణ ప్రజలు డిపాజిట్ కూడా దక్కని విధంగా ఓడిస్తుంటే, అదే మాట చెప్పిన జగన్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో గట్టి మద్దతు ఇస్తున్న బిజెపిని కలుపుకొని పోవడానికి కెసిఆర్ ప్రయత్నించి ఉండాల్సింది. ‘మీరు పోటీ చేయవద్దు మద్దతు ఇవ్వండి’- అని అభ్యర్థిస్తే బిజెపి తప్పుకునేది కానీ కెసిఆర్‌కు కావలసింది అది కాదు. బిజెపి పోటీ చేయాలి, డిపాజిట్ దక్కకుండా ఓడిపోవాలి.


దాంతో మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి లభించిన ఊపు పరకాలతో కొట్టుకుపోతుంది, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ బేరమాడే శక్తి కోల్పోతుందనేది కెసిఆర్ ఎత్తుగడ. ఎత్తుగడ బాగానే ఉంది కానీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం, జగన్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం తెలంగాణ వాదానికి సవాల్ కాదా? తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న బిజెపిని శత్రువుగా దూరం పెట్టడం వల్ల సాధించిందేమిటి? టిఆర్‌ఎస్‌కు విజయం లభించినా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో గట్టి పోటీ తప్పదని పరకాల ఉపఎన్నిక నిరూపించింది.




15, జూన్ 2012, శుక్రవారం

ఔను.. రాజకీయ యుద్ధమే! ...ధర్మం గెలుస్తుందా? గెలిచినదాన్ని ధర్మం అనుకుంటున్నామా ?


రాష్ట్రంలో ఒక రసవత్తరమైన యుద్ధం మొదలైంది. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒకవైపు, కొత్తగా పుట్టిన పార్టీ ఒకవైపు. ఇది ఒకటి రెండేళ్ల పాటు జరిగే యుద్ధం కాదు. సుదీర్ఘ యుద్ధం. మరో రెండేళ్ల భీకరంగా సాగితే కానీ విజేత ఎవరో తేలదు.
రాజ్యాధికారం మత్తు గమ్మత్తయింది. రాజ్యాధికారం కోసం తండ్రిని చంపిన తనయులు ఉన్నారు. రాజ్యం నిలుపు కోవడానికి రాజ్‌పుత్‌లు, మొగలాయిల మధ్య పెళ్లి సంబంధాలు జరిగేవి. ప్రజాస్వామ్యంలో అంతకు మించిన ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి. ఇక్కడ అధికారం కోసం మామను పోటు పొడిచే వారుంటారు, తండ్రి మరణాన్ని ఉపయోగించుకునే వారు ఉంటారు. బాబు, బాలయ్యల కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు, వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యుల పెళ్లి సంబంధాల్లో సైతం ఎంతో ముందు చూపుతో సాగిన రాజకీయం ఉంది.
ఈ మహాయుద్ధంలో పోటీ పడుతున్న ముగ్గురిలో గెలిచేది ఒకరు, మిగిలేది మరొకరు, అసలు మాయ మైపోయేది మరొకరు. గెలవాలని ఒకరు గెలవక పోయినా రెండవ స్థానం లో నిలవాలని ఒకరు. బతికి బట్టకట్టాలని మరొకరు. మహా యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ రాజకీయ బతుకు పోరాటంలో జాలి దయ ఏమీ ఉండదు. ఒకరు బతకాలంటే ఒకరిని మింగక తప్పదు.
ప్రేమలో, యుద్ధంలో ఏమైనా చేయవచ్చునంటారు. సాయంత్రం సమయంలో యుద్ధం చేయవద్దని, నిరాయుధుడిపై ఆయుధాన్ని ప్రయోగించవద్దని యుద్ధంలో కొన్ని నిబంధనలుంటాయి. రాజకీయ యుద్ధంలో ఆ మాత్రం ఆంక్షలు కూడా ఉండవు. రాజకీయ యుద్ధంలో ఏదైనా చేయవచ్చు. ఇక్కడ యుద్ధ రంగం విస్తృతమైంది. యుద్ధ కాలం సుదీర్ఘమైనది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది రాజకీయ యుద్ధం. జగన్ అరెస్టు సైతం ఈ యుద్ధంలో భాగమే. రాజకీయ యుద్ధంలో జాలి, దయ ఏమీ ఉండదు. గెలుపు కోసం ఏమైనా చేయవచ్చు. జగన్ యుద్ధాన్ని ప్రారంభించాడు. అల్లా టప్పా యుద్ధం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు లేని కాలంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చారు. రామారావు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేశాడని ఆయన అభిమానులు అంటుంటారు. నిజానికి రామారావు రాష్ట్రంలో కాంగ్రెసేతర పక్షాలను భూ స్థాపితం చేశారు. రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పక్షాల ఓట్లను ఏకం చేశారు. అప్పటి వరకు దాదాపుగా 33శాతం వరకు ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును తెలుగుదేశం ఏర్పాటు తరువాత ఎన్టీఆర్ మూడు శాతం మాత్రమే తగ్గించారు. జగన్ అలా కాదు తన రాజకీయ భవిష్యత్తు కోసం మొత్తం కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేసే విధంగా యుద్ధం ప్రారంభించారు.
చివరకు కాంగ్రెస్ వ్యతిరేకత అనే సిద్ధాంతంపైనే రాజకీయ జీవనం సాగిస్తున్న టిడిపి సైతం భయపడే విధంగా జగన్ యుద్ధాన్ని ప్రారంభించారు. కడప పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదు. పులివెందులలో స్వయంగా వైఎస్‌ఆర్ సోదరుడు పోటీ చేస్తే డిపాజిట్ మాత్రమే దక్కింది. ఇక కోవూరులో కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును జగన్ ఏ మేరకు చీల్చగలడో అంచనాకు వచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ చురుగ్గానే పావులు కదిపింది. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీయడం అంటే ఢిల్లీలో కాంగ్రెస్‌ను చావు దెబ్బతీయడమే. నువ్వు గొంతు నులమాలనుకున్నప్పుడు కాంగ్రెస్ వౌనంగా ఎందుకు ఉంటుంది. ఆత్మ రక్షణ కోసం హత్య చేసినా తప్పు లేదంటుంది చట్టం. జగన్‌ను రాజకీయంగా హతమార్చడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తను కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దానిలో భాగంగానే జగన్ అరెస్టు.
ఈ యుద్ధంలో జగన్‌వి రెండు లక్ష్యాలు. తనను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేయడం, అధికారం చేపట్టడం. రెండవ లక్ష్యం ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి కానీ మొదటి లక్ష్యం ఇప్పటికే సాధించారు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం బతికి ఉండాలంటే జగన్ జైలులో ఉండాలి. ప్రభుత్వ మనుగడ కోసం జగన్‌ను అరెస్టు చేశారంటే, జగన్ తన మొదటి లక్ష్యాన్ని సాధించినట్టే. జగన్ కాంగ్రెస్‌ను వీడి వెళ్లకుండా ఉండినా, ఇప్పుడు వైఎస్‌ఆర్ ఉండి ఉండినా ఈ అరెస్టు జరిగేదా?
అవినీతి అంతమే కాంగ్రెస్ లక్ష్యం, దాని కోసమే అరెస్టులు అని నమ్మే పరిస్థితి లేదు. మద్యం మాఫియాపై ఎసిబి నివేదిక ఇస్తే మాఫియాను ఏమీ చేయకుండా అధికారులను మాత్రం బదిలీ చేశారు. బినామీ పేర్లతో తనకు వైన్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్న పిసిసి అధ్యక్షున్ని విచారించడం లేదు.
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సాక్షిలో పెట్టుబడులు పెట్టించారని సిబిఐ ఆరోపణ. ఇప్పుడు సిబిఐ చెబుతున్న విషయాలు ఈ రోజు కొత్తగా సిబిఐ పరిశోధించి కనుక్కున్నవేమీ కాదు. గత ఆరేళ్ల నుంచి ఈ విషయాలను ప్రధాన ప్రతిపక్షం ప్రతి రోజూ చెబుతున్నవే. ప్రధాన మంత్రికి, సోనియాగాంధీకి, వివిధ విచారణ సంస్థలకు ఈ వివరాలన్నీ టిడిపి ఆధారాలతో పాటు పుస్తకాలు అందజేసింది. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే ఈ ఫిర్యాదులు చేశారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అధికారం చలాయించింది కెవిపి రామచంద్రరావు. భారీ వ్యవహారాలన్నీ ఆయన సమక్షంలోనే జరిగేవి. కెవిపి సూట్‌కేసులను ఢిల్లీ హై కమాండ్‌కు అందజేస్తున్నారని టిడిపి పలు సార్లు ఆరోపించింది. సిబిఐ రాజకీయాలతో సంబంధం లేకుండా విచారణ జరిపితే మరి కెవిపిని విచారించాలి. వైఎస్‌ఆర్ కెవిపిని తన ఆత్మగా చెప్పుకున్నారు. ఆయన ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు కాబట్టి ఆయన్ని విచారించరు. రాష్ట్రం నుంచి నిధులు ఢిల్లీకి వెళ్లాయని, అందుకే సోనియాగాంధీ వైఎస్‌ఆర్ అక్రమాలపై వౌనంగా ఉన్నారు అని గతంలో టిడిపి ఆరోపించింది. సిబిఐ దీనిపై కనీసం విచారించింది. లేక కాంగ్రెస్ హై కమాండ్ అలా డబ్బులు తీసుకునే రకం కాదు,సచ్ఛీలమైనది అని సిబిఐ భావిస్తుంటే, అదే విషయాన్ని ప్రకటించాలి. జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచే అలా జరిగితే ఆయన ఆస్తులపై విచారణ జరిపిస్తారు అనే వార్తలు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ నిజంగా అవినీతిపై యుద్ధం ప్రకటించాలనుకుంటే జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లిన తరువాతనే ఆ పని చేయాలా? వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు, జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నప్పుడు వారి అవినీతి గుర్తుకు రాలేదా? అంటే పార్టీలో ఉంటే ఎలాంటి అవినీతికి పాల్పడినా పరవాలేదు. పార్టీ వీడి వెళితే సహించేది లేదు వెంటపడి వేటాడుతామని కాంగ్రెస్ చెప్పదలుచుకుందా? వివాదాస్పదమైన 26 జివోలను రద్దు చేయడం లేదు, ఆ జివోలకు సంబంధించిన మంత్రులను విచారించడం లేదు. మద్యం మాఫియాపై ఎసిబి నివేదికపై నోరు మెదపడం లేదు కానీ పార్టీ వీడి వెళ్లిన వారిపై మాత్రం యుద్ధం ప్రకటించింది. 

రాష్ట్రంలో రాజకీయాలు భారీ పెట్టుబడితో కూడిన ఖరీధైన వ్యాపారంగా రెండు దశాబ్దాల క్రితమే మారిపోయాయి.
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 15లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అంత కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హుడు అవుతారు. అయితే మనకు అంత మాత్రమే ఖర్చు చేసిన ఎమ్మెల్యే ఒక్కరూ కనిపించరు. అంత కన్నా ఎక్కువ ఖర్చు చేశారని ఒక్కరిని కూడా నిరూపించడం సాధ్యమూ కాదు. ఓసారి అసెంబ్లీలో అవినీతి చర్చ తరువాత బయటకు వచ్చి విలేఖరుల ముందు ఒక ఎమ్మెల్యే ఇంతటి అవినీతి మయమైన అసెంబ్లీలో నేను సభ్యుడినైనందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరే ఎన్నికల్లో మీరెంత ఖర్చు చేశారు అని ప్రశ్నిస్తే రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే గట్టిగా నవ్వి నేను ఏడు కోట్లు ఖర్చు చేశాను. నువ్వెంత ఖర్చు చేశావో చెప్పు అని ఆ నీతుల ఎమ్మెల్యేను అడిగితే, అతను చెప్పడానికి నిరాకరించారు. ఆ ప్రాంతంలో కనీసం పది కోట్లు ఖర్చు చేస్తే కానీ గెలవరు. చివరకు అతను సరే నేను ఆ విషయంలో తప్పు చేశాను, కాబట్టి అవినీతిపై మాట్లాడే హక్కు లేదా? అని అడిగాడు. మీరు చేసిన ఖర్చు ప్రకారం అసలు మీరు సభలోకి అడుగు పెట్టే అర్హతనే లేదు కదా? నిజంగా ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వాళ్ళను సభలోకి రాకుండా చేసి కోట్లు ఖర్చు చేసి మీరు వస్తున్నారు అంటూ ఆ చర్చ సాగింది.
రాజకీయాలను భారీ పెట్టుబడుల వ్యాపారంగా మార్చి సామాన్యులు, నిజంగా సమాజం కోసం ఆలోచించే వారు అసెంబ్లీవైపునకు వచ్చే అవకాశం లేకుండా చేశారు. బట్ట సంచి భుజాన వేసుకుని అసెంబ్లీకి వచ్చిన వావిలాల గోపాలకృష్ణయ్య, పార్లమెంటుకు సైతం సైకిల్‌పై వెళ్లిన పుచ్చల పల్లి సుందరయ్య, తన భూమిని మొత్తాన్ని ప్రజలకు పంచి, భారీ మెజారిటీతో నెహ్రూనే ఆశ్చర్యపరిచిన రావినారాయణరెడ్డిల కాలం కాదిది. ఇప్పుడు రాజకీయం అంటే భారీ వ్యాపారం. భారీ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిందే. అటువంటివారే నిలుస్తారు.
వ్యాపారం అన్నాక చిక్కులు, సమస్యలు, లాభాలు, నష్టాలు సహజం. కులం, మతం, ప్రాంతంతో పాటు అనేక అంశాలను చూసి జనం ఓటు వేస్తారు, పార్టీల యజమానులు వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారంలో ఒకరు జైలుకు వెళ్లారని, ఒకరు జైలుకు పంపారని, అధికార పక్షం, ప్రతిపక్షం వ్యాపారులు కుమ్మక్కు అయి మూడో వ్యాపారిని రాకుండా చేస్తున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యాపారం మొదలు పెడితే పోటీ వ్యాపారుడు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాడా? వ్యాపారం అంటే ఎంత కష్టమో చూపిస్తాడు.
ఈ యుద్ధంలో మతాలు, కులాలు, ప్రాంతాలు తమ తమ పాత్రను పోషిస్తాయి. ధర్మం గెలిచిందని చెబుతూ సంతృప్తి చెందుతారు. కానీ నిజానికి ధర్మం ఎప్పుడూ గెలవదు. గెలిచిందాన్ని ధర్మం అనుకుంటున్నాం.. అంతే!!

14, జూన్ 2012, గురువారం

పిల్లలకు పాకెట్ మనీ ఎంతిస్తున్నారు ? ఎంతివ్వ వచ్చు ?


కొన్నాళ్ళుగా -ప్రపంచ దేశాల్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తోంది. అగ్రదేశాలే అరిటాకులా వణికిపోతున్న ఈ ఆర్థిక త్సునామీ దెబ్బకు -్భరత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కనిపించని గాయాలతో సతమతం అవుతున్నాయి. మానవ జీవన శైలినే మార్చేసేంత ఈ భారీ కుదుపు -కొన్ని అంశాలపై ఎలాంటి పరిణామం చూపించక పోవడం ఆశ్చర్యకర పరిణామం. అందులో -పిల్లలకు అందించే పాకెట్ మనీ వ్యవహారం ఒకటి. మాంద్యం గాలులు నెమ్మదించకముందే -‘అమ్మానాన్న -పిల్లల పాకెట్ మనీ’ అన్న కోణంలో సాగిన ఓ సర్వే విచిత్రమైన అంశాలను తేటతెల్లం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమానురాగాలు, అదే సమయంలో అమ్మానాన్నలు ఎదుర్కొంటున్న ఆర్థిక అంశాలను అంతర్లీనంగా సమన్వయ పరుస్తూ సాగిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తేటతెల్లమయ్యాయి.

 బిడ్డలమీద అమితమైన ప్రేమను చూపించే చాలామంది తల్లిదండ్రులు -ఆ ప్రేమను ఆర్థిక కోణంలోంచే చూస్తున్నారన్న కఠిన వాస్తవం మారుతున్న సామాజిక పరిణామాన్ని కళ్లముందుంచుతుంది. పిల్లల పాకెట్ మనీకి ఎంత ఎక్కువ సొమ్ములిస్తే -అంత ప్రేమను కనబర్చినట్టు. అదీ -అవసరాలను ప్రశ్నించకుండానే పాకెట్ మనీగా ‘క్రెడిట్’, ‘డెబిట్’లాంటి ప్లాస్టిక్ పెంకుల్ని వెదజల్లటం మరో వైచిత్రి. సర్వేలో స్పష్టమైన ఈ మానసిక వైఖరి మార్పు దేనికి సంకేతం? ఒకసారి ఆలోచించాలి. **** ‘ఏరా నా క్రెడిట్ కార్డు నుంచి లక్ష మాత్రమే ఖర్చు చేశావ్. ఇలాగైతే నా పరువేం కావాలి?’ -అమెరికా నుంచి ఓ తల్లి అసంతృప్తి. కొడుకుమీద ప్రదర్శించిన అసహనం. ‘ఖర్చు పెట్టుకోరా అని కార్డిస్తే లక్ష కూడా వాడుకోలేకపోయావ్. ఇంకోసారి ఇలా జరిగితే చచ్చినా కార్డు ఇవ్వను’ -దుబాయ్ నుంచి తండ్రి ఆగ్రహం. ఈ మధ్య వచ్చిన ‘అష్టా చెమ్మా’ సినిమాలో సామాజిక జీవన శైలిలో మార్పుల్ని దృశ్యీకరించిన కొన్ని ఫ్రేముల తాలూకు డైలాగులివి. దేశంలో చదువుకుంటున్న కొడుక్కి, విదేశాల్లో వ్యాపారం నిర్వహించే తల్లిదండ్రులు ఒకేసారి ఫోన్‌చేసి తమ క్రెడిట్ కార్డుమీద బిల్లు తక్కువైందని కొడుకుతో పడిన పేచీ. ‘ఈసారి ఎక్కువ ఖర్చు చేస్తానులే’ అంటూ కన్న తల్లిదండ్రులకు కొడుకు ఇచ్చుకున్న సంజాయిషీ. ఆ.. అది సినిమా సీనే అని కొట్టిపారేయొచ్చు. కానీ, దర్శకుడికి అలాంటి ఆలోచన రావడానికి మూలం ఎక్కడో ఏదో ఉండేఉంటుంది. చిన్నదో పెద్దదో అలాంటి సంఘటన ఎదురయ్యే ఉంటుంది. విచిత్రం ఏంటంటే -ఇలాంటి దృశ్యాలు దేశంలో ఒక వర్గం కుటుంబాల్లో ఇప్పుడు సర్వ సాధారణమైంది.

 చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్ళే సమయంలో రోజుకు మీ నాన్నకు పది పైసలు ఇచ్చేవాడిని తెలుసా? అని పిల్లలకు తాతో బామ్మో చెబితే వాళ్లను వింతగా చూసే పరిస్థితి. పది పైసలు ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతారు. పది పైసలతో రోజంతా ఎలా గడిపేవారని ప్రశ్నిస్తారు. ఇప్పటి రోజులు ఇవీ. ఆర్థికంగా ఒక మోస్తరు స్థాయివున్న చాలా కుటుంబాలు -వారంలో ఒకసారైనా అంతా ఒకచోట కూర్చొని గడిపే అదృష్టానికి నోచుకోవడం లేదు. ఆ బాధ పిల్లలకు తెలియకుండా ఉండటానికే, కొదవలేని డబ్బును పాకెట్ మనీగా విసురుతున్నారన్న వాదనా కొంతకాలం బలమైన చర్చనే లేవదీసింది. అలాంటి హద్దులేని పాకెట్ మనీ సంస్కృతే ఇప్పుడు -ప్లాస్టిక్ మనీ స్థాయికి చేరింది అన్నది సర్వేలో తేలిన విచిత్రమైన అంశం. క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో జేబు ఖర్చుల కింద పిల్లలకు ఇవ్వడం ఒక వర్గం తల్లిదండ్రులకు ఇప్పుడు ఫ్యాషన్. వీరి సంఖ్య తక్కువే కావచ్చు. కానీ, ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోందన్నది మానసిక శాస్తవ్రేత్తల విశే్లషణ. చదువుకునే కాలేజీల్లో ఇలాంటి పిల్లల పట్ల మిగిలిన వారికి ఆసక్తి పెరుగుతోంది. చూస్తుండగానే, వీరి ప్రభావం క్లాస్ మొత్తంమీద పడుతోంది. తరువాతి పరిణామాలు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటాడు సైకాలజిస్ట్ ప్రభు భరద్వాజ్. దేశంలోని ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలాంటి మహా మెట్రో నగరాలు దాటి మన రాష్ట్రంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది ఈ సంస్కృతి. పిల్లలు పాకెట్ మనీ, చేతికందిన సొమ్మును ఖర్చు చేసే విధానంపై ఇటీవల ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ఐదు మెట్రో నగరాల్లో ఒక సర్వే నిర్వహించారు. కోల్‌కతాలో యువత అతి తక్కువగా నెలకు రెండు వేల రూపాయల పాకెట్ మనీ ఖర్చు చేస్తున్నట్టు తేలింది. అయితే, అక్కడి యువతరం కొంతలో కొంతనయం. పాకెట్‌కు అందే రెండు వేల రూపాయల మనీలో, ఎంతొకొంత రేపటి అవసరాలకూ పొదుపు చేస్తున్న పరిస్థితి లేకపోలేదు. అబ్బాయిలు అయితే, సగటును తొమ్మిది శాతం పొదుపు చేస్తుంటే, అమ్మాయిలు 13శాతం వరకూ పొదుపు చేస్తున్నట్టు సర్వేలో తేలిన వాస్తవం. ఇక దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో పాకెట్ మనీ ఎంతిస్తే అంతా ఖర్చు చేసేసి, తరువాతి అవసరాల కోసం ఎదురు చూడడమే తప్ప పొదుపనేది కనిపించడం లేదని సర్వేలో తేల్చారు. ముంబయిలో అమ్మాయిలైతే తమ పాకెట్ మనీలో 22శాతం బట్టల కోసం వెచ్చిస్తున్నట్టు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీ అమ్మాయిలైతే పాకెట్ మనీ మొత్తం బ్యూటీపార్లర్‌కు ఖర్చు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మహానగరాల్లో కాలేజీలకు వెళ్లే పిల్లలకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉండటం ఇప్పటి జనరేషన్‌కు కామన్. -‘ఏటిఎం కార్డు ఉంది కానీ, స్టేట్‌మెంట్ అమ్మానాన్నలకు అందే అవకాశం ఉంది. ఇదే ఇబ్బందికరమైన విషయం. లేదంటేనా.. ’ అంటాడు వర్శిటీ స్టూడెంట్ 

కాలేజీ అమ్మాయిలైతే ఎక్కువగా డ్రెస్‌ల కోసమే ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నారు. తమ గ్రూప్‌లో ఎవరో ఒకరు మంచి డ్రెస్ వేసుకున్నారంటే, పోటీపడి తామూ కొనాలని ప్రయత్నిస్తున్నారు. మార్కుల్లో కంటే డ్రెస్సుల్లోనూ పోటీ కనిపిస్తోంది. తమకన్నా ఒక్క మార్కు ఇతరులకు ఎక్కువ వస్తే సహించకుండా పోటీ పడి మార్కులు ఎక్కువ సాధించే వారు కొందరైతే, డ్రెస్‌లు, ఖర్చుల విషయంలో పోటీపడే వారు ఇంకొందరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వాలా? ఇస్తే ఎంతివ్వాలి అనేది పాకెట్ మనీ సంస్కృతి ప్రారంభమైన నాటినుంచీ సాగుతున్న చర్చ. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇవ్వవచ్చనేది చర్చకు కంక్లూజన్. దీనికీ ఇప్పుడు హద్దులు చెరిగిపోతున్నాయి. పాత సంగతినే ఒకటి ఇక్కడ గుర్తు చేసుకుంటే -నటుడు అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున కాలేజీలో చదివేప్పుడు సొంతకారులో కాకుండా ఆర్టీసీ బస్సులోనే పంపేవారట! ‘మీ నాన్న మరీ పిసినారి’ అని అంతా ఆట పట్టిస్తున్నారంటూ నాగార్జున ఇంటికొచ్చి నెత్తి మొత్తుకున్నా అక్కినేని తన విధానాన్ని మార్చుకోలేదు. నాగార్జున మాటలకు నవ్వేసి ఊరుకునేవారు కానీ, బస్సులో పంపడం మాత్రం మానుకోలేదు. ఈ విషయం అనేక సభల్లో ఆయనే చెప్తుకొస్తారు. ‘పిల్లలకు డబ్బు విలువ తెలియాలి. అందుకే నాగార్జునని బస్సులో పంపేవాడిని’ అంటారు అక్కినేని.

 కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం అతి గారాబంతో పిల్లలకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇచ్చేస్తూ చదువులో కాకుండా డబ్బు ఖర్చు చేసే ఆటలో వారిని ప్రావీణ్యులుగా మార్చేస్తున్నారు. మహానగరాల్లో చాలామంది అబ్బాయిలు తమ పాకెట్ మనీని అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తున్నారనేది సర్వేలో తేలింది. పిల్లలకు ఎక్కువ డబ్బులిస్తే ఎక్కువగా ప్రేమ చూపినట్టని కొందరు తల్లిదండ్రుల పిచ్చి భావన. పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలియాలి. అలాగని పాకెట్ మనీకి దూరంగా ఉంచమని కాదు. ఎంతవరకు అవసరం, ఆ అవసరాలు ఎలాంటివి అనేది గ్రహించి అంతవరకే పరిమితం చేయాలి. అంతే తప్ప హోదా ప్రదర్శనకు పాకెట్ మనీ పెంచితే, పిల్లల జీవితాలతో ఆటలాడినట్టే. చెన్నైలో ఎనిమిది వేల నుంచి 15వేల రూపాయల వరకూ పాకెట్ మనీ ఖర్చు చేసే పిల్లలున్నట్టు సర్వేలో తేల్చారు. రోజుకు 28 రూపాయల సంపాదన కూడా లేక దారిద్య్రరేఖకు దిగువకు చేరుకుంటున్న కోట్లాదిమంది ఉన్న దేశంలో మరోవైపు వేల రూపాయల పాకెట్ మనీ ఖర్చు చేసే నవ యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తోంది. ఇది దేనికి సంకేతం? ఎటువైపు దారితీస్తుందీ పరిణామం? యువతరమే ఆలోచించాలి. ఆలోచించుకోవాలి.

13, జూన్ 2012, బుధవారం

శనీశ్వరుడు-క్విడ్ ప్రో కో

ఈశ్వరుడు శనీశ్వరుడు పందెం వేసుకున్నారు. నా తడాఖా చూపిస్తాను అంటే ఎవరిపైనైనా చూపిస్తావేమో కానీ నాపై చూపించలేవని ఈశ్వరుడు పందెం కాశాడు. శనీశ్వరుడి గర్వం అణిచివేయాలని, అతనికి చిక్కకుండా ఈశ్వరుడు చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈశ్వరుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదాయె. అలాంటి నాతో శని గేమ్స్ అడతాడా? అని ఈశ్వరుడు అనుకున్నాడు. పందెం తేదీ వచ్చేంది. శివుడు విజయగర్వంతో చూశావా? నన్ను కనిపెట్టలేకపోయావు, నా జాడ పట్టలేక పోయావు, నాపై ప్రభావం చూపలేకపోయావు అని దాసరినారాయణ సినిమా డైలాగు స్టైల్‌లో ఒకే మాటలను ఈశ్వరుడు తిప్పితిప్పి చెప్పాడు. శని వౌనంగానే విని ఎక్కడో కైలాసంలో హాయిగా ఉండే మీరు పాడుపడిన చెట్టు తొర్రలో ఇన్నాళ్లు దాచుకోవడం అంటే నా ప్రభావం కాకపోతే ఇంకేమిటి? మహానుభావా? మనం పందెం వేసుకున్న క్షణం నుంచే మీపై నేను ప్రభావం చూపుతూనే ఉన్నాను అని నవ్వాడట!


 శనీశ్వరుడి ప్రభావం లేని ప్రాంతం ఈ సృష్టిలో లేదని అప్పటికి కానీ ఈశ్వరుడికి అర్ధం కాలేదు. విశ్వామిత్రుడి ప్రతిసృష్టి విజయవంతం అయి ఉంటే అక్కడ శని ప్రభావం ఉండేదో లేదో తేలీదు. అది సరే ఇంతకూ శనీశ్వరుడికి క్విడ్ ప్రో కో కు సంబంధం ఏమిటి? అనే కదా సందేహం. అక్కడికే వెళదాం..


పాత సినిమాల్లో హీరో, హీరోయిన్‌కు కష్టం వస్తే ఏమవుతుందో తెలియాలంటే అప్పుడప్పుడు పాత సినిమాలు కూడా చూస్తుండాలి. సముద్రంలో అలలు పైకి ఎగిసి పైనే ఉండిపోతాయి. ఆకాశమంత ఎత్తున్న ఈతచెట్లు కొమ్మలు అప్పటి వరకు గాలికి ఊగిపోతూ ఒక్కసారిగా ఆగిపోతాయి. ఎక్కడి గాలి అక్కడే నిలిచిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోకు, హీరోయిన్‌కు కష్టం వస్తే మొత్తం ప్రకృతి స్తంభించి పోతుందన్నమాట! అలానే క్విడ్ ప్రో కో నిలిచిపోతే మొత్తం వ్యవస్థ నిలిచిపోతుంది.
 రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో పదం పాపులర్ అవుతుంది. ఇప్పుడు క్విడ్ ప్రో కో నాయకుల నోళ్లలో నానుతున్న పదం. ఈ పదం సామాన్యులకు అంతగా చేరలేదు. సామాన్యుడికి చేరువైతేనే కదా రాజకీయాల్లో ప్రయోజనం కలిగేది. ఇండియాషైనింగ్ అనే మాట బిజెపి కొంప ముంచింది. అది రాజకీయాల్లో అత్యంత నెగిటివ్ ప్రభావం చూపిన మాట. పలకడానికి ఇబ్బంది కరమైన పదం కావడమో, లేక దానికి అతీతులైన వారు ఎవరూ లేకపోవడం వల్లనో కానీ క్విడ్ ప్రో కో పదం నాయకుల్లో తప్ప జనంలో వినిపించడం లేదు. కొంచం క్లిష్టంగా ఉన్నందున ఈ పదానికి ఆత్మగౌరవం, సంపూర్ణ మద్య నిషేధం, స్వర్ణాంధ్ర వంటి పదాలకు లభించినంత పాపులారిటీ లభించడం లేదు కానీ మిత్ర మీడియా మాత్రం శక్తివంచన లేకుండా ఆ పదాలకు మించిన పాపులారిటీ క్విడ్ ప్రో కోకు తీసుకు రావడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తూనే ఉంది. ఇలా కృషి చేయడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే ఒకటి శత్రువు అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చు, మిత్రున్ని అధికారంలోకి తీసుకు రావచ్చు ఇంతకు మించిన ప్రయోజనం రాజకీయాల్లో ఇంకేముంటుంది. ఒకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఒకరికి మేలు చేయాలనే ప్రయత్నం కూడా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందేమో!


అక్కినేని నుంచి మోహన్‌బాబు వరకు చాలా మంది హీరోలు అనివార్యమైన పరిస్థితుల్లో హీరోయిన్‌ను రేప్ చేసి మనసు మార్చుకుని హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటారు. కాబట్టి రేప్ అనగానే ఒకే దృష్టితో చూడవద్దు. విలన్ రేప్ చేస్తే అది దుర్మార్గమైన చర్య అవుతుంది. అదే హీరో రేప్ చేస్తే ఆ బలీయమైన సంఘటన హీరోగారు మారిన మనిషిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని అర్ధం. అలానే క్విడ్ ప్రో కో మన వాళ్లు చేస్తే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టు భావించాలి. మనకు పడని వాళ్లు చేస్తే దేశ ద్రోహంగా, మన రాష్ట్రాన్ని బంగ్లాదేశ్‌కు అమ్మేసే కుట్రగా భావించాలి.
 పప్పు బెల్లం పెడితే తప్ప తల్లి చెప్పిన మాట వినను అని పూర్వం పిల్లలు మారాం చేసేవారు అది పిల్లచేష్టల క్విడ్ ప్రో కో. మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప రాష్టప్రతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతు ఇచ్చేది లేదని తృణముల్ దీదీ, సమాజ్ ములాయం మారాం చేస్తున్నారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని క్విడ్ ప్రో కో గా భావించవద్దని కాంగ్రెస్ హై కమాండ్ ప్రజలను ఆదేశించింది. రాజుగారు చేస్తే శృంగారం అని, సామాన్యుడు చేస్తే రంకు అని అదేదో సామెత చెబుతారు కదా? అలా అన్నమాట!


 అసలు ప్రకృతి మొత్తం క్విడ్ ప్రో కో సిద్ధాంతంతోనే కదా పని చేస్తోంది. సముద్రంలోని నీటిని సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాల ద్వారా వర్షం కురిపిస్తారు. ఆ వర్షం నీటిని ఎవరికి కావలసినవి వారు తీసుకుంటారు. మళ్లీ నదిలోకి , అటు నుంచి సముద్రంలోకి మళ్లీ సూర్యుడి కిరణాలు ఆవిరి చేయడం ఇది ప్రకృతి ధర్మం. క్విడ్ ప్రో కో కూడా అంతే నీ ప్రయోనాన్ని నేను కాపాడుతాను, నా ప్రయోజనాన్ని నువ్వు కాపాడు. సింపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ ఆటోలపై రాసి ఉంటుంది బతుకు బతికించు అని. క్విడ్ ప్రో కో అంటే అంతే.. శనీశ్వరుడి ప్రభావం లేని చోటుండదు, క్విడ్ ప్రో కో లేని వ్యవహారం ఉండదు. అదన్నమాట శనీశ్వరుడికి, క్విడ్ ప్రో కోకు సంబంధం.

8, జూన్ 2012, శుక్రవారం

న్యాయ వ్యవస్థ కు చెదలా ?... మనం మహా నటులం


న్యాయ వ్యవస్థకు అవినీతి కళంకం

గాలి జనార్ధన్ రెడ్డి బెయులు వ్యవహారం లో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. దీంతో మహా నటులయినా మన నాయకులు న్యాయ వ్యవస్థకు కూడా చెదలా ? అంతు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు . న్యాయ వ్యవస్థ గురించి అక్కడి స్థితి గతుల గురించి ఈ నటులు చెప్పేది ఎలా ఉన్న న్యాయం కోసం కోర్టుకు వెళ్ళిన వారికీ,  న్యాయ వాదులకు , కోర్టు గుమాస్తాలకు కూడా బాగా తెలుసు .

సమాజంలో అన్ని వ్యవస్థలూ అవినీతిలో కూరుకుపోయినా న్యాయవ్యవస్థకు మాత్రం అవినీతి అంటలేదన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ నిప్పుకు చెదలంటినట్లు న్యాయవ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదన్న విషయం వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇతర వ్యవస్థలపై వచ్చినంతగా అవినీతి ఆరోపణలు న్యాయవ్యవస్థపై రావు. అవినీతి జరగకపోయినా ఇతర వ్యవస్థలపై ఆరోపణలు చేసినంత సులభంగా న్యాయవ్యవస్థలో అవినీతి జరిగినట్లు తెలిసినా ఆరోపణలు చేయడానికి సాహసించక పోవడం వల్లే ఇప్పటికీ న్యాయవ్యవస్థ మీద చాలామందికి నమ్మకం కలుగుతోంది. అక్కడక్కడ పట్ట్భా రామారావు లాంటివారు బయట పడినపుడు మాత్రమే న్యాయవ్యవస్థలో అవినీతి చర్చకు వస్తోంది.

అధికారం చలాయించే అధికార వ్యవస్థ, న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థ, తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఓటరు అందరూ మనుషులే. మనుషుల మంచి కోసం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థల్లో పని చేసేది మనుషులే. మనుషులకు ఉండే సహజ లక్షణాలన్నీ ఏ వ్యవస్థలో పనిచేసే వారికైనా ఉంటాయి. కానీ కొన్ని వ్యవస్థలను పవిత్రంగా చూడడం అలావాటైన మనకు ఇతర వ్యవస్థల మాదిరిగా న్యాయ వ్యవస్థలో సైతం అవినీతి ఉంది అంటే నమ్మబుద్ధి కాదు. అలా నమ్మబుద్ధి కాని వారి కళ్లు తెరిపించారు సిబిఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో పట్ట్భారామారావుకు కోట్లాది రూపాయల ముడుపులు ముట్టాయనేది ఆరోపణ. ఆధారాలు లభించడంతో పట్టాభిరామారావును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయశాఖ మంత్రి ప్రమేయం ఉందనే లీకేజీ వార్తలపై మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రమేయం ఉందని నిరూపిస్తే రాళ్లతో కొట్టి చంపేయమని ఏరాసు చెబుతున్నారు. మరోవైపు పట్ట్భారామారావు సస్పెన్షన్‌కు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కు ఎలాంటి సంబంధం లేదని గాలి సోదరుడు ఒక ప్రకటనలో తెలిపారు.

బెయిల్ కోసం మూడు కోట్ల రూపాయలు చెల్లించినట్టు తొలుత వార్తలు వచ్చాయి, తరువాత అది పది కోట్లకు, అంటు నుంచి 15 కోట్లకు, చివరకు కొందరు 60 కోట్లకు చేర్చారు. ఏదో జరిగింది కానీ ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏమిటీ? అనేది సిబిఐ చెప్పడం లేదు. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో సిబిఐ అధికారికంగా వెల్లడించలేదు. జగన్‌కు బెయిల్ రాకుండా ఆపడానికి ఇదో ఎత్తుగడ అనే వాదన ఒకటుంది. ఏం జరిగిందో, ఎవరు ముట్టచెప్పారో, ఎంత ముట్టచెప్పారో అధికారికంగా వెల్లడించాల్సిన బాధ్యత సిబిఐపై ఉంది. బెయిల్ కోసం ముడుపుల వ్యవహారం బయటపడగానే కొందరు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమైన వ్యవహారం. అందులోనూ అనుభజ్ఞులే ఎక్కువ దిగ్భ్రాంతి చెందారు. న్యాయవ్యవస్థకు ఒక మంచి ఉద్దేశంతో రక్షణ కవచం ఏర్పాటు చేశారు. మిగిలిన వ్యవస్థలపై ఆరోపణలు చేసినంత సులభంగా న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ఈ రక్షణ సమాజానికి మంచి చేయడానికి ఉపయోగపడాలి కానీ పట్టాభి రామారావులను రక్షించడానికి ఉపయోగపడితే ఏం ప్రయోజనం. న్యాయస్థానాల్లో ఇలాంటి వ్యవహారాలకు పట్టాభి రామారావు మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కాదు. 1949లోనే జస్టిస్ సిన్హాను పార్లమెంటు అభిశంసించింది. అన్నాహజారే నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఆయన బృందంలోని సభ్యులు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులు. దీన్ని నేను నిరూపిస్తాను. నేనీ మాటలు అన్నందుకు నాపై కేసు పెట్టండి, నా మాటల్లో నిజం ఉందని నిరూపిస్తా అని సవాల్ చేశారు. అవినీతిపరులు అంటూ ఆయన కొందరు న్యాయమూర్తుల పేర్లు కూడా ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని, తమ కేసును రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘చంద్రబాబు నాట్ బిఫోర్’ వ్యవహారం విమర్శల పాలైంది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కేసు కర్నాటకలో విచారణ జరుగుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై కేసు ఆ రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో విచారణ చేపట్టాలనే డిమాండ్ వచ్చింది. ఇక అలహాబాద్ హైకోర్టు అవినీతిమయం అయిందని స్వయంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బలమైన రక్షణ కవచం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థపై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి, అవి ఉట్టి ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలు అని విచారణలో తేలింది.

 నిరూపణ అయిన కొన్ని కేసుల్లోనే ఇలా ఉంటే న్యాయవ్యవస్థకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో? ఏ వ్యవస్థ అవినీతికి దూరంగా లేదు అని పదే పదే నిరూపణ అవుతోంది. నైతికంగా వేగంగా పతనం అవుతున్న సమాజంలో ఏదో ఒక వ్యవస్థ పవిత్రంగా ఉందని, మిగిలిన వ్యవస్థలు చెడిపోయాయని చెప్పడం హిపోక్రసీ అవుతుంది. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే న్యాయవ్యవస్థకు సైతం సంస్కరణల చికిత్స అవసరం.

6, జూన్ 2012, బుధవారం

పాలు+నీళ్ళు=విలువలు

చుట్టూ ముస్లిం దేశాల మధ్య యూదు దేశం ఇజ్రాయిల్ తరహాలో ఉంటుంది నగరంలో భోలక్‌పూర్. చుట్టూ అధిక సంఖ్యలో హిందువులు ఉండే కాలనీలు. గాంధీనగర్, కవాడీగూడ, పద్మశాలి కాలనీ, రాంనగర్.. వీటి మధ్యలో ఉంటుంది ఎక్కువ మంది ముస్లింలుండే భోలక్‌పూర్. అచ్చం ఇజ్రాయిల్ లానే.


ఇప్పుడంటే ప్రైవేటు డెయిరీల సంఖ్య పెరిగిపోయింది కానీ మూడు దశాబ్దాల క్రితం పాల కోసం భారీ క్యూలు కనిపించేవి. ఇప్పుడు సైకిళ్లు ఎక్కువగా కనిపించడం లేదు కానీ ఆ రోజుల్లో సైకిళ్లుఅద్దెకిచ్చే షాపులు ఉండేవి. అలా సైకిళ్లు అద్దెకిచ్చే ముస్లిం వ్యక్తి బిజినెస్ డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా పాల వ్యాపారంపై దృష్టి పెట్టారు. కొన్ని బర్రెలు కొనుగోలు చేసి వినియోదారుల ముందే పితికి పోసేవాళ్లు. కళ్లముందు పితికి పోస్తున్న ఆ చిక్కటి పాల కోసం భారీ క్యూ ఉండేది. బర్రెల అరుపులే తప్ప అతని నోటి నుంచి మాటలు వచ్చేవి కావు. మొదట్లో అతనికి మాటలు రావేమో అనిపించేది. క్యూలో నిలబడిన వారికి పాలు పితికి పోయడం తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. కొద్ది రోజులు తరువాత మెల్లగా అతను మాట్లాడడం మొదలు పెట్టాడు. అతని ఇంటి వాళ్లు మాకూ పాలు పితికి ఇవ్వండి అంటూ చిన్న బిందె ఇచ్చే వాళ్లు ఆ బిందెలో సగం వరకు పాలు పితికిన తరువాత ఆ వ్యక్తి ఇంటి వారికి తరువాత ముందు కస్టమర్ ముఖ్యం అంటూ కొద్దిసేపువ్యాపార విలువలు, ఖాతాధారుల ముఖాల్లో చిరునవ్వు చూడడం వల్ల తనకు కలిగే సంతృప్తి , దీని వల్ల పై లోకంలో తనకు లభించే సౌకర్యాల గురించి చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చి ఇంటి వాళ్లను పక్కకు జరిపి ఆ పాలను కూడా క్యూలో ఉన్నవారికి పోసేవాడు.


 సైకిల్ అద్దెకివ్వడం, పాలు అమ్మడం వంటి వ్యాపారమే అయినా విలువల గురించి అతను చెప్పే మాటలు ముచ్చటేసేవి. అన్నిట్లోకి తొంగి చూసే పిల్లకాయలకు ముందు, పెద్దవారికి తరువాత క్రమంగా అందరికీ ఆ బిందె రహస్యం తెలిసిపోయింది. బిందెలో ముందుగానే కొన్ని నీళ్లు ఉండేవి. ఆ నీళ్లలో పాలు పితికి తరువాత ముందు కస్టమర్లకు అంటూ నీళ్లు కలిపిన ఆ పాలు పోసేవాడు. పాల గురించి తక్కువగా, విలువల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. నువ్వు ఏదైతే కాదో అది అని నమ్మించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తావు అంటారు ఓషో రజనీష్. విలువల గురించి అతని ఉపన్యాసం క్రమంగా పెరుగుతూ వచ్చింది, బిందెలో నీటి రహస్యం బట్టబయలు అయ్యాక క్యూ క్రమంగా తగ్గుముఖం పట్టింది. మూడు దశాబ్దాల్లో ఆ సైకిల్ షాపు లేదు అక్కడ పాలమ్మడం లేదు.


పాలు, నీళ్లు, విలువలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఆత్మను శరీరాన్ని వేరు చేయలేట్టుగానే ఆ మూడింటిని వేరువేరుగా చూడడం కష్టం. సగం పాలు సగం నీళ్లు కలిపినా అవి పాలలానే తెల్లగా ఉంటాయి. ఆ రెంటిని కలిపి పాల ధరకే అమ్మితే వ్యాపారం విలువ పెరుగుతుంది. అది ఏ వ్యాపారం అయినా కావచ్చు, వ్యాపారంలో విలువ అంటే ఇదే?
నాచారంలోని విశాలమైన ఆ ఇంటికి వెళితే మహాశక్తిసంపన్నమైన ఒక ఆలయంలోకి వచ్చిన భావన కలుగుతుంది. ఎక్కడ చూసినా దేవుని బొమ్మలు, భక్తి పాటలు, పచ్చని మొక్కలతో

దైవత్వం   కళ్లముందు కనిపిస్తుంది. ఆ ఇల్లు గాలికి బెయిల్ కోసం న్యాయమూర్తి పట్ట్భారామారావుకు కోట్ల రూపాయల ముడుపులు మట్టుచెప్పడంలో మధ్యవర్తిత్వం వహించిన ప్రముఖ రౌడీషీటర్ పరుచూరు యాదగిరిరావు గారిది. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో జీవిత విలువల గురించి అనర్గళంగా ఉపన్యసించగలరు.



నేనే దేవుణ్ణి అంటూ అన్ని మతాల్లోనూ కొందరు వ్యక్తులు బయలు దేరడం సాధారణ విషయమే. హైదరాబాద్ పాత నగరంలో ఈ మధ్య సర్వమత దేవుడొకరు వెలిశారు. శ్రీరాముడిని నేనే, ఏసును నేనే, అల్లానూ నేనే అంటూ పాతనగరం మైనారిటీ రౌడీ షీటర్ ఒకరు అన్ని దేవుళ్ల అవతారం ఎత్తారు. అదేదో సినిమాలో ఒకాయన దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణడు వంటి వేషాలన్నీ తానే వేసి మెప్పించినప్పుడు ముగ్గురు దేవతల వేషం నేను వేయలేనా? అనుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. అతనికి నోటి కన్నా చేయి చురుకైనది. కనిపించిన వారినల్లా కొడుతూ నేను దేవుణ్ణి నన్ను గౌరవించేది లేదా అని చితగ్గొట్టడం మొదలు పెట్టాడు. మాటలైతే వింటారు కానీ చేతలను ఎవరు సహిస్తారు. తిరగబడి చితగ్గొట్టి ప్రాణాలు తీశారు.


వయసులో ఉన్నప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివిన వారు అక్షరాలతో నిప్పు పుట్టించారని ముచ్చటపడిపోతారు. అదే విషయం పై ఒకాయన ఓస్ అదేం గొప్ప శ్రీశ్రీ అక్షరాలతో మంట పుట్టిస్తే, కరుణశ్రీ కన్నీటిని తెప్పించాడు, కానీ మా జర్నలిస్టు అక్షరాలతో పవర్ ప్రాజెక్టు కూడా పుట్టించాడు తెలుసా?అని గర్వంగా చెప్పుకొచ్చాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మకం కుదరదు కానీ కళ్ల ముందు వార్తలతో ప్రాజెక్టులు పుట్టిస్తే నమ్మకుండా ఎలా ఉంటాం.