13, జూన్ 2012, బుధవారం

శనీశ్వరుడు-క్విడ్ ప్రో కో

ఈశ్వరుడు శనీశ్వరుడు పందెం వేసుకున్నారు. నా తడాఖా చూపిస్తాను అంటే ఎవరిపైనైనా చూపిస్తావేమో కానీ నాపై చూపించలేవని ఈశ్వరుడు పందెం కాశాడు. శనీశ్వరుడి గర్వం అణిచివేయాలని, అతనికి చిక్కకుండా ఈశ్వరుడు చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈశ్వరుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదాయె. అలాంటి నాతో శని గేమ్స్ అడతాడా? అని ఈశ్వరుడు అనుకున్నాడు. పందెం తేదీ వచ్చేంది. శివుడు విజయగర్వంతో చూశావా? నన్ను కనిపెట్టలేకపోయావు, నా జాడ పట్టలేక పోయావు, నాపై ప్రభావం చూపలేకపోయావు అని దాసరినారాయణ సినిమా డైలాగు స్టైల్‌లో ఒకే మాటలను ఈశ్వరుడు తిప్పితిప్పి చెప్పాడు. శని వౌనంగానే విని ఎక్కడో కైలాసంలో హాయిగా ఉండే మీరు పాడుపడిన చెట్టు తొర్రలో ఇన్నాళ్లు దాచుకోవడం అంటే నా ప్రభావం కాకపోతే ఇంకేమిటి? మహానుభావా? మనం పందెం వేసుకున్న క్షణం నుంచే మీపై నేను ప్రభావం చూపుతూనే ఉన్నాను అని నవ్వాడట!


 శనీశ్వరుడి ప్రభావం లేని ప్రాంతం ఈ సృష్టిలో లేదని అప్పటికి కానీ ఈశ్వరుడికి అర్ధం కాలేదు. విశ్వామిత్రుడి ప్రతిసృష్టి విజయవంతం అయి ఉంటే అక్కడ శని ప్రభావం ఉండేదో లేదో తేలీదు. అది సరే ఇంతకూ శనీశ్వరుడికి క్విడ్ ప్రో కో కు సంబంధం ఏమిటి? అనే కదా సందేహం. అక్కడికే వెళదాం..


పాత సినిమాల్లో హీరో, హీరోయిన్‌కు కష్టం వస్తే ఏమవుతుందో తెలియాలంటే అప్పుడప్పుడు పాత సినిమాలు కూడా చూస్తుండాలి. సముద్రంలో అలలు పైకి ఎగిసి పైనే ఉండిపోతాయి. ఆకాశమంత ఎత్తున్న ఈతచెట్లు కొమ్మలు అప్పటి వరకు గాలికి ఊగిపోతూ ఒక్కసారిగా ఆగిపోతాయి. ఎక్కడి గాలి అక్కడే నిలిచిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోకు, హీరోయిన్‌కు కష్టం వస్తే మొత్తం ప్రకృతి స్తంభించి పోతుందన్నమాట! అలానే క్విడ్ ప్రో కో నిలిచిపోతే మొత్తం వ్యవస్థ నిలిచిపోతుంది.
 రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో పదం పాపులర్ అవుతుంది. ఇప్పుడు క్విడ్ ప్రో కో నాయకుల నోళ్లలో నానుతున్న పదం. ఈ పదం సామాన్యులకు అంతగా చేరలేదు. సామాన్యుడికి చేరువైతేనే కదా రాజకీయాల్లో ప్రయోజనం కలిగేది. ఇండియాషైనింగ్ అనే మాట బిజెపి కొంప ముంచింది. అది రాజకీయాల్లో అత్యంత నెగిటివ్ ప్రభావం చూపిన మాట. పలకడానికి ఇబ్బంది కరమైన పదం కావడమో, లేక దానికి అతీతులైన వారు ఎవరూ లేకపోవడం వల్లనో కానీ క్విడ్ ప్రో కో పదం నాయకుల్లో తప్ప జనంలో వినిపించడం లేదు. కొంచం క్లిష్టంగా ఉన్నందున ఈ పదానికి ఆత్మగౌరవం, సంపూర్ణ మద్య నిషేధం, స్వర్ణాంధ్ర వంటి పదాలకు లభించినంత పాపులారిటీ లభించడం లేదు కానీ మిత్ర మీడియా మాత్రం శక్తివంచన లేకుండా ఆ పదాలకు మించిన పాపులారిటీ క్విడ్ ప్రో కోకు తీసుకు రావడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తూనే ఉంది. ఇలా కృషి చేయడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే ఒకటి శత్రువు అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చు, మిత్రున్ని అధికారంలోకి తీసుకు రావచ్చు ఇంతకు మించిన ప్రయోజనం రాజకీయాల్లో ఇంకేముంటుంది. ఒకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఒకరికి మేలు చేయాలనే ప్రయత్నం కూడా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందేమో!


అక్కినేని నుంచి మోహన్‌బాబు వరకు చాలా మంది హీరోలు అనివార్యమైన పరిస్థితుల్లో హీరోయిన్‌ను రేప్ చేసి మనసు మార్చుకుని హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటారు. కాబట్టి రేప్ అనగానే ఒకే దృష్టితో చూడవద్దు. విలన్ రేప్ చేస్తే అది దుర్మార్గమైన చర్య అవుతుంది. అదే హీరో రేప్ చేస్తే ఆ బలీయమైన సంఘటన హీరోగారు మారిన మనిషిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని అర్ధం. అలానే క్విడ్ ప్రో కో మన వాళ్లు చేస్తే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టు భావించాలి. మనకు పడని వాళ్లు చేస్తే దేశ ద్రోహంగా, మన రాష్ట్రాన్ని బంగ్లాదేశ్‌కు అమ్మేసే కుట్రగా భావించాలి.
 పప్పు బెల్లం పెడితే తప్ప తల్లి చెప్పిన మాట వినను అని పూర్వం పిల్లలు మారాం చేసేవారు అది పిల్లచేష్టల క్విడ్ ప్రో కో. మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప రాష్టప్రతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతు ఇచ్చేది లేదని తృణముల్ దీదీ, సమాజ్ ములాయం మారాం చేస్తున్నారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని క్విడ్ ప్రో కో గా భావించవద్దని కాంగ్రెస్ హై కమాండ్ ప్రజలను ఆదేశించింది. రాజుగారు చేస్తే శృంగారం అని, సామాన్యుడు చేస్తే రంకు అని అదేదో సామెత చెబుతారు కదా? అలా అన్నమాట!


 అసలు ప్రకృతి మొత్తం క్విడ్ ప్రో కో సిద్ధాంతంతోనే కదా పని చేస్తోంది. సముద్రంలోని నీటిని సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాల ద్వారా వర్షం కురిపిస్తారు. ఆ వర్షం నీటిని ఎవరికి కావలసినవి వారు తీసుకుంటారు. మళ్లీ నదిలోకి , అటు నుంచి సముద్రంలోకి మళ్లీ సూర్యుడి కిరణాలు ఆవిరి చేయడం ఇది ప్రకృతి ధర్మం. క్విడ్ ప్రో కో కూడా అంతే నీ ప్రయోనాన్ని నేను కాపాడుతాను, నా ప్రయోజనాన్ని నువ్వు కాపాడు. సింపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ ఆటోలపై రాసి ఉంటుంది బతుకు బతికించు అని. క్విడ్ ప్రో కో అంటే అంతే.. శనీశ్వరుడి ప్రభావం లేని చోటుండదు, క్విడ్ ప్రో కో లేని వ్యవహారం ఉండదు. అదన్నమాట శనీశ్వరుడికి, క్విడ్ ప్రో కోకు సంబంధం.

14 కామెంట్‌లు:

  1. మీరు టపా మాలికలో కనిపించిన వెంటనే చదువుతాను. చాలా బాగా రాసారు. మీ పోటో చూడాలని ఉంది. వీలైతే మీ పోటో పెట్టండి.

    శ్రీనివాస్
    అధ్యక్షుడు
    బుద్దమురళి ఫాన్స్ అసోసియేషన్
    బ్లాగులపాడు

    రిప్లయితొలగించండి
  2. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు .. ఏదో అలా ఉద్యోగం చేసుకుంటూ గుట్టుగా బతికేస్తున్నాను . జర్నలిజం లో ఆత్మ తృప్తి తప్ప ఆర్ధిక తృప్తి ఉండదని మా గురువులు కూడా ఉద్యోగం లో చేరిన కొత్తలోనే చెప్పి ఉంటే .. ఫోటో ఏమిటి ఇప్పటకే టివిల్లో నైతిక విలువల గురించి భోదిస్తూ ఉండే వాణ్ణి

    రిప్లయితొలగించండి
  3. సూర్యుడు ఎందుకు క్విడ్ ప్రో కో చేసాడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది ప్రకృతి ధర్మమండి గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు

      తొలగించండి
  4. Jagamantha quid pro ko ne. Ala ani corruption ne accept cheyalemu kada.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభ గారు అవినీతి చాలా శక్తి వంతమయిందండి మన గుర్తింపు లతో దానికి సంబందం లేదు ( సరదాగానే )

      తొలగించండి
  5. మన బ్లాగర్లు.. ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ.. కామెంట్లు రాసుకోవటం కూడా క్విడ్ ప్రో కో కిందకు వస్తుందేమో!

    (ఈ కామెంట్ నా పాత బాకీ కింద జమ వేసుకోండి!)

    రిప్లయితొలగించండి
  6. నిజమేనండి రమణ గారు బాగా గుర్తు చేశారు .అసలు బ్లాగ్స్ లోనే క్విడ్ ప్రో కో ఎక్కువ ( కానీ మనవి నిస్వార్ధ క్విడ్ ప్రో కో లు )

    రిప్లయితొలగించండి
  7. మొత్తం చదివినా నాకు క్విడ్ ప్రో కో అంటే అర్ధం కాలేదు. నా IQ ప్రోబ్లమో లేక ఈ పదం వినడం కొత్త మూలానో!

    రిప్లయితొలగించండి
  8. జలతారు వెన్నెల గారు ysr ముఖ్య మంత్రిగా ఉన్న కాలం లో కొందరు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకుర్చాడని , అలా ప్రయోజనం చేకుర్చినందుకు వాళ్ళు జగన్ కంపనీ లలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణ దీనిపై సిబి ఐ విచారణ జరుపుతోంది . ఈ సందర్బంగానే ఇప్పుడు మీడియా, నాయకులు ఈ పదాన్ని ఎక్కువగా ప్రచారం లోకి తెచ్చారు నాతో నువ్వ్వు ప్రయోజనం పొందు దానికి నాకు నువ్వు ప్రయోజనం కలిగించు అనేది ఈ క్విడ్ ప్రో కో .. మీరు అన్నట్టుగానే ఈ పదం జనం లోకి వెళ్ళలేదు . అధికారం లో ఉన్న వాళ్ళంతా చేసేది ఇదే ..

    రిప్లయితొలగించండి
  9. ఉదయమే ఆంధ్రభూమి లో ఈ వ్యాసం చదివాను. అప్పుడే వచ్చి కామెంటు పెట్టి ఉంటే బాగుండేది. నేను వ్రాద్దామనుకున్న కామెంటు శ్రీ రమణ గారు పెట్టేసారు. మీరు క్విడ్ ప్రో కో మరచి పోవద్దు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బులుసు గారు నిరంతరం మనం మనం ఇలా సహకరించుకుందాం

      తొలగించండి
  10. Barter system లాగా అన్నమాట! Got it! Thanks for clarifying అండి!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం