29, ఆగస్టు 2012, బుధవారం

వై యస్ ఆర్ తో మంత్రులకు .. చూపులు కలసిన శుభవేళ!

మాయాబజార్‌లో శ్రీకృష్ణుడు శశిరేఖకు ఆ కాలం నాటి ల్యాప్‌టాప్ ఇస్తే అమె తెరిచి చూడగానే అభిమన్యుడిగా అక్కినేని కనిపిస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. సావిత్రి శశిరేఖగా కలవరపడుతుంది. చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము అంటూ అక్కినేని పాజిటివ్ సంకేతాలిస్తాడు. అలానే ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే మన మంత్రులకు వైఎస్‌ఆర్ కనిపించారనుకోండి. అప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది. వణికిపోతున్నట్టు, క్షమించమని వేడుకుంటున్నట్టు అనిపిస్తుందా? లేక నీవు పోయావు మమ్ములను చంపేస్తున్నావు.. వా! అని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుందా? ఏమో కానీ ఈ సందేహం స్వయంగా వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మకు వచ్చింది.


ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్న మంత్రులు ఒకవేళ వైఎస్‌ఆర్ బతికి మళ్లీ వస్తే ఆయన కళ్లలో చూస్తూ ఈ మాటలు మాట్లాడగలరా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. యాధృచ్చికమే కావచ్చు కానీ కళ్లు సినిమా విడుదలై పాతికేళ్లయిన సందర్భంగా ఉత్సవాన్ని నిర్వహించిన రోజునే విజయమ్మ కళ్ల గురించి చెప్పుకొచ్చారు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమీ? అని హీరోయిన్ అడిగితే హీరో అక్కినేని నాగేశ్వరావు కలలే అని చాలా సింపుల్‌గా సమాధానం చెప్పేస్తారు. ఆ కాలంలో ఆయనకంటే అది సాధ్యమైంది కానీ ఇప్పుడు మంత్రులకు మాత్రం అంత ఈజీకాదు. కనులు కనులతో కలబడితే ఏమవుతుంది అని అడిగితే మంత్రులు నీళ్లు నములుతున్నారు. కళ్లకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. 

బాఫూజీ మొదలుకొని బాబు నుండి మొద్దు శీను వరకు రాజకీయ నాయకులు వీలున్నప్పుడల్లా కళ్ల డైలాగులు చెబుతుంటారు. కళ్లు చిదంబరం కన్నా మన నాయకులే రాజకీయాలకు కళ్లను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బతికి వస్తే ఆయన కళ్లల్లోకి చూస్తూ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాట్లాడగలరా? అని వైఎస్‌ఆర్ శ్రీమతి విజయలక్ష్మి ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రులు కాని వాళ్లు స్పందిస్తున్నారు తప్ప మంత్రులు స్పందించడం లేదు. బావ కళ్లలో ఆనందం చూడడానికే పరిటాల రవిని హత్య చేశానని మొద్దుశీను చేసిన ప్రకటన రాజకీయాల్లో పంచ్ డైలాగుగా మిగిలిపోయింది. మొద్దుశీనుకు ఈ డైలాగు ఎవరైనా రాసిచ్చారో? సొంతంగా చెప్పాడో కానీ ఈ డైలాగును రాజకీయాల్లో, సినిమాల్లో తెగ వాడేసుకున్నారు. బావ కళ్లల్లో ఆనందాన్ని చూసేందుకు మొద్దు శీనును ఎవరో ఉపయోగించుకుంటే మొద్దు శీనును చంపడం ద్వారా అన్నో, బావమరిదో కళ్లల్లో ఆనందం చూసేందుకు ఎవరినో ఎవరో నియమించుకోకుండా ఉంటారా? దాంతో మొద్దు శీను కళ్లు మూశాడు. ఆ డైలాగు పాతపడిపోయింది. మత ప్రాతిపదికన దేశ విభజన డిమాండ్ వచ్చినప్పుడు మహాత్మాగాంధీ హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లు అని చెప్పినప్పటి నుంచి రాజకీయాల్లో కళ్లు పాపులర్ డైలాగు అయింది. కొన్ని సార్లు ఈ డైలాగులే ఇబ్బంది కరంగా మారుతాయి.

 ఆంధ్రా, తెలంగాణ నాకు రెండు కళ్లు అంటూ బాబు చెబితే, రెండు కళ్లు రెండు ఒకేవైపు చూస్తున్నాయి అది ఆంధ్రావైపే అని తెలంగాణ వాళ్లు విమర్శిస్తుంటే రెండు కళ్లు సరే మా మూడో కన్ను సంగతేమిటిని రాయలసీమ ప్రశ్నిస్తోంది. మేం కోరిన పాట అంటూ రాయలసీమ గీతాన్ని కర్నూలు నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ రమణారెడ్డి వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఇప్పుడు బాబు నాకు మూడు కళ్లు అనాలి లేకపోతే రాయలసీమలో కష్టం తప్పదు.


చిన్నింటి సంగతి బయటపడగానే భర్తకు విడాకులివ్వలేక, చిన్నంటిని జీర్ణం చేసుకోలేక మధ్య వయసులోని మధ్య తరగతి భార్య కుమిలిపోతుంటే నన్ను నమ్ము ... మీరిద్దరూ నాకు రెండు కళ్ల లాంటి వాళ్లు అంటాడా! దొంగ మొగుడు. గుడ్డికన్ను కన్నా మెల్లకన్ను, మెల్లకన్ను కన్నా ఒంటికన్ను మేలు అనుకుని అసలు లేని మొగుడి కన్నా ఇద్దరిని రెండు కళ్లు అంటున్న మొగుడే కొంత బెటర్ అనుకుని సర్దుకుపోతారు. ధర్మేంద్ర నుంచి బోనీకపూర్ వరకు, సూపర్ స్టార్ నుంచి, క్యారెక్టర్ స్టార్ వరకు ఈ డైలాగులు వినిపించిన వాళ్లే. హేమామాలిని నుంచి, శ్రీదేవి వరకు ఈ డైలాగును జీర్ణం చేసుకున్న వారే. కళ్లు రెండు అయినా చూపు ఒకవైపే ఉంటుంది. ఒక సమయంలో రెండు కళ్లు రెండు వైపుల చూడలేవు ఒకేవైపు చూస్తాయి. నాకు రెండు కళ్లు అని తారలు, నేతలు పైకి చెప్పినా వారి చూపు ఒకవైపే ఉంటుంది. ఈ విషయం తెలిసే బాలకృష్ణ ఒకవేపే చూడు అని ఓ సినిమాలో సీరియస్‌గానే చెప్పారు.


సర్వేంద్రియా ల్లో నయనం ప్రధానం అన్నారు. ప్రధానం సంగతేమిటో కానీ నిజానికి శరీరంలో అత్యంత శక్తివంతమైనవి కళ్లే. నోటితో అబద్ధం చెప్పవచ్చు కానీ కళ్లు అబద్ధం చెప్పవు. కళ్లు మన మనసు మాట వింటాయి తప్ప మన మాట వినవు. అందుకే మనసులో ఏముందో కళ్లు బయటపెట్టేస్తాయి. కళ్లు ఇంత శక్తివంతమైనవని తెలిసే ఇంద్రుడి పాపానికి శాపంగా శరీరమంతా కళ్లు ఉండేట్టు శపించారు. రెండు కళ్ళ డైలాగును నమ్మించ లేకనే నేతలు హైరానా పడిపోతుంటే శరీరమంతా కళ్లున్న ఇంద్రుడు ఎన్ని బాధలు పడ్డాడో.

రాజకీయాల్లో కళ్లడైలాగులు చప్ప పడిన కాలంలో విజయమ్మ హఠాత్తుగా కళ్లను గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ బతికి వస్తే ఆయన కళ్లల్లోకి చూస్తూ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడగలరా? అనేది ఆమె ప్రశ్న. కచ్చితంగా మాట్లాడలేరు, ఎందుకంటే అవినీతిలో వారికే తగు వాటా ఉంది, వాటా పొందిన వాళ్లు కళ్లలోకి చూస్తూ అబద్ధం చెప్పలేరు. దేశాన్ని మోసం చేసే రాజకీయ నాయకులు సైతం తమ కళ్లను మోసం చేయలేరు. కళ్లకున్న శక్తి అదీ! అసలే కంటిచూపుతో చంపేసే రోజులొచ్చాయి మనకెందుకులెండి!

5 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం