8, ఆగస్టు 2012, బుధవారం

ఇచ్చట మనోభావాలు దెబ్బతీయ బడును

స్కూల్ బస్సు దిగి ఇంట్లో అడుగు పెట్టగానే బుజ్జిగాడు ఏదో సీరియస్‌గా ఉన్నట్టు అనిపించింది. ఎవరినీ పలకరించకుండా బ్యాగ్‌ను పక్కన పడేసి అమ్మ చేతిలో నుంచి రిమోట్ లాక్కోని కార్టూన్ ఛానల్ పెట్టుకున్నాడు. కోపంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి ఎవరూ పలకరించడానికి సాహసం చేయలేదు. చివరకు తల్లే ఆ సాహసానికి ఒడిగట్టక తప్పలేదు. ఏరా బుజ్జి పరీక్ష ఎలా రాశావు? అని మెల్లగా పలకరించింది. ‘‘రాయలేదు... బహిష్కరించాను’’ అని వాడు ముక్తసరిగా సమాధానం చెప్పాడు. ఏం అని తల్లి అడగ్గానే ‘‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి... స్కూల్ టీచర్ పిల్లల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా బడుద్దాయి వెదవల్లారా సరిగ్గా రాసి చావండి.. అంటూ అమానుషంగా మాట్లాడి మా పిల్లల మనోభావాలను దెబ్బతీసింది. 

మేమంతా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకున్నాం, మా నిరసన తెలియజేయడానికి పరీక్షలను బాయ్‌కాట్ చేశాం ... పిల్లలమైతే మేం మనుషులం కాదా? మాకు మానవ హక్కులు ఉండవా? మా మనోభావాలు దెబ్బతినవా’’ అని మూడో తరగతి బుజ్జిగాడు ఆవేశంగా మాట్లాడుతుంటే తల్లి బిత్తరపోయింది. ఇంకేమన్నా అంటే తనపై కూడా మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాడేమో అని భయపడి వౌనంగా ఉండిపోయింది. 

నిజమే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల మనోభావాలే దెబ్బతిన్నాయని కోర్టులకెక్కినప్పుడు ఇంకా బుజ్జగింపులతోనే జీవితాన్ని గడిపితే బుజ్జిగాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడడంలో తప్పేముందని అనుకుంది.
***


సార్థక నాయధేయులు నిత్యానంద స్వామి తన మనోభావాలు, తన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తీవ్రమైన మనోవేదన చెందుతున్నారు. ఆయన వాదనలో సత్యం ఉంది. ఆయన చర్యల్లో శివం ఉంది, ఆయన భక్తురాళ్లు సుందరంగా ఉన్నారు. సత్యం శివం సుందరం అంటూ ఆయన పనిలో ఆయనుంటే ఆయన మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికుంది? ఒక పోలీసాయన లాఠీచార్జ్ చేస్తుంటే అడ్డుకొని చూడండి.. ఏమవుతుంది? ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణను అడ్డుకున్నందుకు బొక్కలో పడేస్తారు. కామిగాని వాడు మోక్షగామి కాడంటారు. మోక్షం కోసం నిత్యానంద సినీతారతో ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా కెమెరాల్లో బంధించడం ఆయన విధి నిర్వహణను అడ్డుకోవడమే కదా? 

సరే సన్యాసి కాబట్టి వెంటనే కోపం రాలేదు. పోనీలే అని క్షమించేసి ఎవరికీ కనిపించకుండా తపస్సు చేసుకోవడానికి హిమాలయాల్లోకి పారిపోయాడు. ఆయన ఊరుకున్నాడు కదా? అని ఆయన ‘విధి నిర్వహణ’ను సినిమాగా తీసి జనాలకు చూపిస్తే ఆయన మనోభావాలు ఏం కావాలి, ఆయన భక్తుల మనోభావాలు ఏం కావాలి. ఏ విషయాన్నైనా క్షమిస్తారు కానీ మనోభావాలు దెబ్బతినే విషయాన్ని మాత్రం ఎవరూ క్షమించరు. ఆయన మనోభావాలకు విలువ ఇస్తూ తెలుగులో ఆయనపై వచ్చిన సినిమా పేరు మార్చి కథ మార్చి, నటీనటులను మార్చి చివరకు ఆ సినిమా తీసిన దర్శకునికి సైతం సినిమా అర్ధం కానంత పిచ్చిగా తయారు చేసి తరువాత పెట్టుబడి పెట్టిన వారికి పిచ్చేక్కించేట్టు చేయడం ద్వారా నిత్యానంద తన మనోభావాలు దెబ్బతినకుండా రక్షించుకున్నారు.
 ఈ విషయం తెలిసో తెలియకనో  ఒకాయన కన్నడం లోకి డబ్ చేస్తున్నాడు  సినిమా సగం పూర్తయ్యాక నిత్యానంద హైకోర్టుకు వెళ్లారు ఈ సినిమా ద్వారా తన మనోభావాలు దెబ్బతిన్నాయని. మహిళా భక్తుల మనసు దోచడమే కాదు, కీలెరిగి వాత పెట్టడం కూడా నిత్యానందకు బాగా తెలుసు అందుకే సినిమా ప్రకటన వెలువడిన రోజు కాకుండా సగం పూర్తయ్యాక రంగంలోకి దిగారు.
***
మనోభావాలు దెబ్బతింటే మాత్రం ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. మయసభలో దుర్యోధనుడి మనోభావాలు దెబ్బతినడం వల్లనే కదా మహాభారత యుద్ధం జరిగింది!
సినిమా అభిమానుల మనోభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తమ అభిమాన హీరో పోస్టర్‌పై పేడ నీళ్లు పడ్డా ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్ర పోరు. ప్రత్యర్థి హీరో పోస్టర్‌ను చించి ముక్కలు చేసేంత వరకు నిద్ర పోరు. ఆ మధ్య ఒక హీరో పోస్టర్ తమ హీరో పోస్టర్ కన్నా పెద్దగా ఉండడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు అభిమానులు, పలానా హీరో పోస్టర్‌లోని డైలాగులు తమ హీరో అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని మరో అభిమానుల బృందం నిరసన ప్రదర్శనలు చేసింది. చివరకు పోలీసులు ఇరు హీరోల అభిమానులను సమానంగా లాఠీలతో సత్కరించి వారి మనోభావాలను గౌరవించారు. సినిమా అభిమానుల మనోభావాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడమే ఉద్దేశం తప్ప వారి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం కాదని అభిమానులు గ్రహించాలి.


రాజకీయాల్లో మనోభావాలు మరింత చిత్రంగా ఉంటాయి. పలానా కులం వారి మనోభావాలను మీరు దెబ్బతీశారు అంటూ ఒక పార్టీపై మరో పార్టీ దాడికి దిగుతుంది. బాబోయ్ అసలా కులం వాళ్లు ఉన్నారనే నాకు తెలియదు ఇక వారి మనోభావాలు దెబ్బతీయడం ఏమిటని ఆ నాయకుడు లబోదిబో మంటే ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్ళయంది. అయినా ఫలానా కులం ఉందని ఈ ఆ పార్టీ నాయకుడికి తెలియదు. అంటే ఆ కులం వాళ్ల మనోభావాలు దెబ్బతీయడం కాకుంటే మరేమిటధ్యక్షా అంటూ మరింత ఉధృతంగా ప్రచారం సాగిస్తారు. ఆ కులం వాళ్ల ఓటర్ల సంఖ్యను బట్టి వారి మనోభావాలకు గౌరవం ఉంటుంది. వేళ్లమీద లెక్కించదగిన ఓట్లున్న కులాల మనోభావాలకు రాజకీయాల్లో పెద్దగా విలువ ఉండదు.

15 వ్యాఖ్యలు:

 1. ఆర్యా,

  ఇంత పెద్ద టపాలో కనీసం ఒక్కసారి కూడా మాబోటి చదువరులను మెచ్చుకోలేదు. మమ్మల్ని ఇలా నిర్లక్ష్యం చేసినందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు క్షమాపణ చెప్పెంతవరకు మీ బ్లాగును బహిష్కరిస్తున్నాము.

  ఇట్లు మా ఖర్మ కాలి మీ బ్లాగు చదివిన అంతర్జాల అన్వేషకుల సంఘం అధ్యక్షులుం గారు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జై గొట్టి ముక్కల గారు శీర్షిక ఓ సారి చూడండి(ఇచ్చట మనోభావాలు దెబ్బతీయ బడును ) అంటే మాట నిలబెట్టుకున్నట్టే కదా . ఇక మీరు మా మనోబావాలను దెబ్బ ..... అనిపిస్తోంది ( ద. హా )

   తొలగించు
  2. మురళి గారూ, మీరు మా మనోభాలను దెబ్బ తీసినందుకు అర్జెంటుగా ప్రతీకారం తీర్చుకోవాలి. మీ మనోభావాలను దెబ్బ ఎలా తీయాలో అర్ధం కావడం లేదు. ఆ కిటుకేదో మీరే చెప్పండి థాంక్స్.

   తొలగించు
  3. ఆ రోజుల్లో అంటే మాయల పకీరు తన ప్రాణం ఎక్కడుందో అమాయకంగా నమ్మి చెప్పేశాడు .. ఈ రోజుల్లో మాయల పకిరే కాదు మామూలు మనిషి కూడా తన రహస్యం తాను చెప్పుకోడండి గొట్టిముక్కల గారు

   తొలగించు
 2. కాదేది మనోభావాల గౌరవం కి అనర్హం. :)
  ప్రస్తుతానికి బుజ్జిగాడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వనజ వన మాలి గారు మీరు ( తల్లులు ) ఇలా చేయడం వల్లనే బుజ్జి గాళ్ళు అలా సమ్మె చేస్తున్నారు (ద. హా )

   తొలగించు
 3. ఎవరితో మాట్లాడినా ఇష్టం లేకపోతే మనోభవాలు దెబ్బతినిపోతున్నాయండి. :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. kastephale గారు కొన్ని సార్లు మాట్లాడక పోయినా మనోబావాలు దెబ్బ తిన్నాయని అంటున్నారండి

   తొలగించు
 4. ఇంతకీ మీమనోభావాల కేదో అయింది .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. దుర్గేశ్వర గారు అవునండి మా మనోబావానికి రాయాలనే కోరిక కలిగింది

   తొలగించు
 5. ఈ మధ్య దర్శకుడు పూరీ జగన్నాధ్ "మనోభావాలని కనిపెట్టినవాడిని కాల్చి పారెయ్యాల"ని అన్నాడు. పాపం ఆయన బిజినెస్ మేను సినిమా పాట విని చూసి తరించిన వారు మనోభావాలు దెబ్బతిన్నాయ్యాన్నప్పుడు. మనోభావాలు అనేది గొప్ప అస్త్రం గా మారింది కొందరికి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పూరి ఎన్నో ఆశలు పెట్టుకొనితీసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆయనమనో భావాలు ఎలా ఉండేవో

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం