12, ఫిబ్రవరి 2014, బుధవారం

ఓ నేతల్లారా మీరు మీ పిల్లలు మీ వంశం వెయ్యేళ్ళు మమ్ములను పాలించాలి

అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి,అప్పుల్లోనే మరణిస్తాడని మన రైతుకు నిర్వచనం. అలానే అధికారంలోనే పుట్టి, అధికారంలోనే పెరిగి, అధికారంలోనే శాశ్వతంగా ఉండాలనుకునేవాడే రాజకీయ నాయకుడు. పూర్వం పెళ్లి కాగానే కొత్త దంపతులను గంపెడు పిల్లలతో వెయ్యేళ్లు వర్థిల్లమని ఆశీర్వదించేవారు. వెయ్యేళ్లు బతకాలని ఎవరికుండదు. అది సాధ్యమా? కాదా? అనే లాజిక్ వదిలేస్తే, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు హైదరాబాద్‌లో నీకెన్ని ఫ్లాట్లున్నాయి అని అడుగుతారు. హైదరాబాద్‌లో బతికేందుకు పడే పాట్లు ఎవడిక్కావాలి? మనకెన్ని ఫ్లాట్లుంటే అంత గొప్ప. ఇప్పుడు పిల్లల సంఖ్య కన్నా ప్లాట్లు, ఫాట్ల సంఖ్యనే ముఖ్యం. ఇంతకు ముందు పెళ్లి చేసుకుంటే ఓ ఇంటివాడయ్యాడు అనే వాళ్లు. ఇప్పుడు కొత్త దంపతులను హైదరాబాద్‌లో త్వరలోనే సొంతింటి వాడవు కా అంటూ ఆశీర్వదిస్తున్నారు.


కాలం మారింది మనుషులను ఆశీర్వదించే మాటలు మారినట్టే నాయకులను ఆశీర్వదించే మాటల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. పూర్వం ఖద్దరు వేసుకున్న నాయకుడు అంటే భార్య మంగళహారతి పాడి వీర తిలకం దిద్ది పంపించేది. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ మా ఆయన జైలుకు వెళుతున్నాడని వీరనారి సగర్వంగా ప్రకటించుకునేది. ఇప్పుడు జైలు నుంచి బెయిల్‌పై వస్తే వీరతిలకాలు దిద్దుతున్నారు. కేసుకే భయపడి స్టే తెచ్చుకున్నాడు వాడిదీ ఒక బతుకేనా మా నాయకుడు చూడు ధైర్యంగా కేసు ఎదుర్కొని బెయిల్‌పై వచ్చాడని రొమ్మువిరుచుకుని అభిమానులు సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వ్యవహారం కేసు వర కు రాకుండా రాజీ పడిన వాడి కన్నా రాజీపడకుండా జైలుకు వెళ్లి వచ్చిన వాడే వీరుడు కదా? అనే ఆలోచన పెరిగితే తప్పేముంది.


ఎన్నికల సమయంలో నాయకులు నా ఓటు నీకే అని ఓటరు నుంచి, అందరి ఓట్లు మీకే అని పెద్దల నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. చిన్నా చితక నాయకులు కోరుకునే ఆశీర్వాదాలు ఇవి. కానీ కొందరు ఘరానా నాయకుల కోరికలు పొందాలనుకునే ఆశీర్వాదాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి.
జీవిత కాలమంతా అధికారంలో ఉండాలని అనుకుంటున్నాను అని ఎవరైనా అంటే ఏమనుకుంటారు,్ఛ..్ఛ.. ఎంత వీడికెంత అధికార దాహం అని చీత్కరించుకోకుండా ఉంటారా? ఇదే మాటను కాస్త తిప్పి చెబితే ఎంత చక్కగా ఉంటుంది. దేశంలో అవినీతిని పారద్రోలేంత వరకు రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాను, అవినీతి రహిత భారత దేశం ఏర్పడగానే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తే అయినా, రాజకీయ ఆలోచనలకు కొత్తేమీ కాదని నిరూపిస్తున్నారు. ఆయన ఐదేళ్లు అధికారంలో ఉండడం కష్టమే అనుకుంటుంటే, ఐదారు నెలల కూడా ప్రభుత్వం నిలబడేట్టు లేదని అనుభవజ్ఞులు అంటుంటే, ఆయన మాత్రం తన జీవిత కాలమంతా రాజకీయాలను వీడేట్టుగా లేరు, ఆయన మాట ప్రకారం చూస్తే మాత్రం మానవ జాతి బతికి ఉన్నంత వరకు ఆయన రాజకీయాల్లో ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మనిషి అనేవాడు ఉన్నంత వరకు అవినీతి ఉంటుంది. అవినీతి ఉన్నంత వరకు ఆయన రాజకీయాల్లో ఉంటారటమరి! అన్ని విషయాల్లో బాబుగారు కాపీ కొడుతున్నారని అంటారు కానీ ఈ విషయంలో మాత్రం బాబునే కేజ్రీవాల్ కాపీ కొట్టారని మనం సగర్వంగా ప్రకటించుకోవచ్చు. పేదరికం లేని సమాజాన్ని చూడడమే నా ధ్యేయం, అప్పటి వరకు అలుపెరగని పోరాటం చేస్తాను, అధికారంలో ఉంటాను అని బాబుగారు ఎన్నోసార్లు చెప్పారు. అవినీతి, పేదరికం ప్రపంచంలో ఏ దేశంలోనైనా లేకుండా పోయిందా? భవిష్యత్తులో పోతుందా? మేం రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటామని బాబుగారు చెప్పిన మాటలను కేజ్రీవాల్ మరో రూపంలో కాపీ కొట్టారు. అదేదో ఇంగ్లీష్ సినిమాను కళాత్మకంగా కాపీ కొట్టి రాజవౌళి ఈగ తీసినట్టు.


2012వరకు నేనే అని పెదబాబు విజన్ 2020 అంటే సర్లే ఇక నాకెప్పుడు చాన్స్ వస్తుందని చినబాబు లోకేశ్ రాజకీయాలకు దూరం గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని ఎంత ఫోకస్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. హీరో మంచి ఫాంలో ఉన్నప్పుడు అబ్బాయి రంగంలోకి వస్తే హీరోగా స్థిరపడతాడు. అలానే నాయకుడు మంచి ఫాంలో ఉండగానే వారసుడు వస్తే నిలబడతాడు. పెదబాబు పాపులారిటీ గ్రాఫే కిందికి పడిపోతే ఇక చినబాబు చేసేదేముంటుంది.


వైఎస్‌ఆర్ గ్రాఫ్ పైనే ఉన్న కాలంలోనే ఆయన పై లోకాలకు వెళ్లడంతో జగన్‌కు ఆ గ్రాఫ్ కలిసొచ్చింది. ఇంకా అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే విజన్ 2044 అంటున్నారు. అదేంటయ్యా అంటే రాసిపెట్టుకోండి 30 ఏళ్లపాటు పాలించేస్తానని భరోసా ఇస్తున్నారు.
అద్వానీకి కాలం కలిసిరాలేదు కానీ వాజ్‌పాయి తరువాత రంగంలో ఉండేవారు. నేనింకా ఔట్ కాలేదు రంగంలో ఉన్నాను అని ఆయన చెబుతున్నా పాపం ఆ పార్టీలో వినిపించుకునేవారేరి? ఎంత కాలం ఉండేది మోడీ చెప్పడం లేదు కానీ గుజరాత్‌లో ఆయన వ్యూహాన్ని చూస్తే ఒక్కసారి అవకాశం అంటూ లభించాలి కానీ వాజ్‌పేయి ఎవరు, అద్వానీ ఎవరు? అని బిజెపి వాళ్లతోనే చెప్పించగలరు. కంప్యూటర్‌ను కనిపెట్టింది మన బాబే అని మనం నమ్మినట్టుగానే మోడీతోనే బిజెపి ఆవిర్భవించింది అని నమ్మించగలరు. జాతీయ చినబాబు రాహుల్ గారేమే అధికారం ముళ్లకిరీటం అంటూనే ఆ ముళ్లకిరీటాన్ని మన కోసం ధరించేందుకు సిద్ధమంటున్నారు.
మన కోసం, మన బాగు కోసం ముళ్లకిరీటాలు ధరించేందుకు, తమ జీవిత కాలమంతా అధికారంలో ఉండేందుకు ముందుకు వస్తున్న మన నాయకుల త్యాగాన్ని దేంతో పోల్చగలం?


1 కామెంట్‌:

  1. "ఓ నేతల్లారా మీరు మీ పిల్లలు మీ వంశం వెయ్యేళ్ళు మమ్ములను పాలించాలి."

    - అందుకే ఉన్నదంతా ఇప్పుడే, మీరే దోచేసుకోకండి. భవిష్యత్తులో మీ వారసులు కూడ దోచుకోవడానికి కొంచెం ఉంచండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం