28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ బద్దమా ?విరుద్ధమా ? సుప్రీంకోర్టు లో తేలాలి

రాష్టవ్రిభజన రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇంత కాలం వాదిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొంది, తాను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిన తరువాత కూడా ఇదే మాట అంటున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన ప్రకటన. సీమాంధ్రులే కాదు తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీలు, తెలంగాణ కోసం ఉద్యమించిన వారు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాలి. విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? లేదా? పార్లమెంటుకు ఒక రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉందా? లేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు తేలుస్తుంది. ఇప్పటికే కొంత మంది పిటీషన్లు వేశారు. ముఖ్యమంత్రి పిటీషన్ వేసినా వేయకపోయినా కనీసం తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ వాదులైనా ఈ అంశంపై పిటీషన్ వేయాలి. రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన చేశారు అని వాదిస్తున్న వారి ప్రశ్నలకు సుప్రీంకోర్టు నుంచే సమాధానం వస్తే బాగుంటుంది.


పార్లమెంటులో విభజన అంశంపై అర్ధవంతమైన చర్చ జరిగితే బాగుండేది కానీ అల్లరి, గొడవ తప్ప అక్కడ చర్చకు అవకాశమే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో ఈ కేసుల వల్ల సుప్రీంకోర్టులో నైనా వాదనల ద్వారా, తీర్పు ద్వారా ఏది రాజ్యాంగ బద్ధమో! ఏది కాదో తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభించిన వెంటనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో,సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలు అయ్యాయి. పదే పదే ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించి కోర్టు సమయం వృధా చేస్తున్నారంటూ విభజనకు సంబంధించిన ఒక కేసులో పిటీషనర్‌కు హైకోర్టు 50వేల రూపాయల జరిమానా కూడా విధించింది. చట్టసభలు చట్టాలను చేస్తాయి. చట్టసభలు చేసిన చట్టాలు రాజ్యాంగ బద్ధంగా లేవు అనుకుంటే కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టులు ఈ చట్టాలను సమీక్షించి అవి రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేలో, చెల్లుబాటు అవుతాయో కావో తేల్చి చెబుతుంది.
సిడబ్ల్యుసి తెలంగాణపై నిర్ణయం తీసుకోగానే రాష్ట్ర విభజన జరపవద్దు అని కోరుకోవడం తప్పు కాదు, విభజన జరగాలని డిమాండ్ చేయడం తప్పు కాదు. ఎవరిష్టం వారిది, ఎవరి వాదన వారిది. కానీ కేంద్రానికి విభజన జరిపే అధికారం లేదని, అప్రజాస్వామికంగా విభజన జరిపారని, అడుగడుగునా రాజ్యాంగ వ్యతిరేకతంగా వ్యవహరించారని విమర్శలు చేశారు. సాధారణ వ్యక్తులు కాదు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పని చేసిన వారు చేసిన విమర్శలివి. విభజన వల్ల బాబు రాజకీయ జీవితానికి నష్టం అది వాస్తవం. దాని కోసం ఆయన విభజనను వ్యతిరేకించవచ్చు, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ విభజన జరుపుతోందనే విమర్శ చేయవచ్చు కానీ విభజన రాజ్యాంగ విరుద్ధం అనడం విచిత్రం. పార్లమెంటులో విభజన బిల్లుపెట్టిన సందర్భంలో సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో మేం జోక్యం చేసుకోము అని కోర్టు చెప్పిన దాని అర్ధం విభజన బిల్లు ఆమోదం పొంది అమలయ్యేంత వరకు కోర్టు జోక్యం చేసుకోదు. అమలు అయ్యాక చట్ట వ్యతిరేకంగా ఎక్కడైనా జరిగిందా అనేది తేలుస్తుంది. దాదాపు అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. వాటన్నింటిని కోర్టు కొట్టివేసినా తాజాగా మళ్లీ వేశారు. టిడిపి ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ వేసిన పిటీషన్‌ను చంద్రబాబు సమర్ధించారు కూడా. విభజన ప్రక్రియ జరిగేప్పుడు సుప్రీం కోర్టులో కేసు పేరుతో హడావుడి చేసిన పయ్యావుల ఇప్పుడు కేసు ప్రస్తావన ఎత్తడం లేదు . 


రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనే విమర్శ అలానే ఉంటే తెలంగాణకు అదో మచ్చలా నిలుస్తుంది. ఈ విమర్శలో నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సింది సుప్రీంకోర్టే. రాజ్యాంగ విరుద్ధంగా విభజన జరిగింది అని ఆరోపణలు చేసిన నాయకులను ప్రతివాదులుగా చేరుస్తూ తెలంగాణ వాదులు కోర్టును ఆశ్రయించాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా జరిగిందో ఆ నాయకులు నిరూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుపై పడిన మచ్చ తొలగిపోవాలంటే సుప్రీంకోర్టులో వాదన జరగాల్సిందే.. 

2 కామెంట్‌లు:

  1. విమర్శలు ఆరోపణలు అభియోగాలు వగైరాలు గిట్టని వాళ్ళు చేస్తూనే ఉంటారు. తన వాదాలను కోర్టులో నిరూపించుకొనే సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటె ఆయనే న్యాయస్తానం ఎక్కాలి. ఎవడో ఏదో అన్నాడని తెలంగాణకు మచ్చ రాదు.

    రిప్లయితొలగించండి
  2. కిరణ్ రెడ్డి ఆత్మవంచనకూ, పరవంచనకూ హద్దు లేకుండా పోతున్నది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం