29, జూన్ 2014, ఆదివారం

అసెంబ్లీ కాలేజీ!


అర్జునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తే, కౌరవులకు చెట్టు, చెట్టుమీద పండ్లు, ఆకులు, పిట్టలు ఇంకా ఏమేమో కనిపించాయి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అందరూ ఒకే కుటుంబ సభ్యులు, అందరు చూసింది ఒకటే కానీ కనిపించింది వేరు వేరు. పిట్టకన్ను కథే కాదు మన ప్రజాస్వామ్యం కథ కూడా ఇలాంటిదే. అదో బ్రహ్మపదార్థం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు అర్ధం చేసుకోవచ్చు,దర్శించుకోవచ్చు. అసెంబ్లీకి రాగానే మీకు ఎలా అనిపించింది అని ప్రముఖ హీరో, అల్లుడిగారి వియ్యంకుడు బాలకృష్ణను అడిగితే ఆయన ఏ మాత్రం తడుముకోకుండా, స్కిృప్టు రైటర్ కోసం ఎదురు చూడకుండా కాలేజీకి వచ్చినట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. అడిగిన వారు,విన్నవారు విస్మయం చెందారు. భైరవద్వీపంలో రాజకుమారిగా రోజా, రాజకుమారుడిగా బాలకృష్ణ నటించారు. ఇప్పుడు ఒకే సభలో ఇద్దరూ శాసన సభ్యులు. తండ్రి కొడుకులు ఒకే సభలో సభ్యులుగా తెలంగాణ శాసన సభ ఒక రికార్డు సృష్టిస్తే, హీరో,హీరోయిన్ ఒకే సభలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డు సృష్టించింది. హీరోగారికి అసెంబ్లీని చూశాక కాలేజీ ఎందుకు గుర్తుకొచ్చిందా? అని చాలా మంది అనుమానం. కాలేజీలో 60 నిమిషాలకో పిరియడ్ ఉన్నట్టు, బహుశా బావగారి గంట ఉపన్యాసం విన్నాక అలా అనిపించిందేమో అని సర్ది చెప్పుకున్నారు. అదో కాలేజీ అని అక్కడున్నవారంతా బుద్ధిగా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులనే అభిప్రాయంతో బాలయ్య ఉంటే మంచిదే పాపం వాళ్ల నాయన కూడా ఇంతే అమాయకంగా అసెంబ్లీ అంటే ఆలయం లాంటిదని, తాను దైవాన్ని మిగిలిన సభ్యులు భక్తులు అనుకున్నారు, అధికారం నుంచి దించేసే వరకు. చరిత్రలో స్వాతంత్య్ర పోరాటం చేసిన సన్యాసుల గురించి చదివి ఉంటారు కానీ భక్తుల తిరుగుబాటును ఆయన ఊహించి ఉండరు. అదే ఆయన కొంప ముంచింది. 


మళ్లీ పిట్టకన్ను దగ్గరికి వస్తే అసెంబ్లీ ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తోంది. తరిమెల నాగిరెడ్డి అనే పెద్దాయన అసెంబ్లీ కన్నా అడవులే నయం అనుకుంటూ అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చి అటు నుంచి అటే అడవుల్లోకి వెళ్లారు. అధ్యక్షా అంటూ గొంతు చించుకుని ప్రజల సమస్యలను ఎంతగా చెప్పినా అరణ్య రోదనే అవుతోందని ఆయన ఆ సమస్యల పరిష్కారానికి అడవుల బాట పట్టారు.


ఉగాదికి పంచాంగ పఠనం చేసినట్టు అసెంబ్లీలో ఇరుపక్షాలు ప్రత్యర్థి కుంభకోణాల పఠనం చేయడం ఆనవాయితీ. ఏడాది కాలంలో ఏం జరగబోతుందో రాశుల వారిగా చదివి చెబుతుంటే వినడానికి ముచ్చటగా ఉంటుంది. వాటిని నమ్మేవాళ్లు ఉంటారు, నమ్మని వాళ్లు ఉంటారు కానీ వినడానికి మాత్రం అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అసెంబ్లీలో అవినీతి పంచాంగంలో మాత్రం కొత్తదనం ఏమీ ఉండదు. సంవత్సరాల తరబడి అవే విషయాలు అటు వారు ఇటువారు చెప్పుకుంటారు. సరే అధికారం ఉన్నప్పుడు వీటిపై మీరెందుకు చర్య తీసుకోలేదు అంటే వాళ్లు చెప్పరు, అధికారంలో ఉన్నారు కదా ఆరోపణలు చేయడం ఎందుకు? చర్య తీసుకోవచ్చు కదా?అంటే వీళ్లు సమాధానం చెప్పరు. ఆ విషయాలు చెప్పి అధికారంలోకి రావాలని కోరుకుంటారు కానీ చర్య తీసుకోవాలని వారెందుకనుకుంటారు అనేది కొందరి వాదన. ఎంత గొప్ప సినిమా అయినా కొనే్నళ్ల పాటు అవే డైలాగులు వినాలంటే విసుగే కదా? కొత్త ఆరోపణలు, కొత్త విమర్శలైనా చేయవచ్చు కదా?


ఓ రెండు దశాబ్దాల క్రితం ఇలానే అసెంబ్లీలో భూ ఆక్రమణల గురించి రోజూ వినీ వినీ, రాయలేక విసుగేసిన ఓ మీడియా ఆయన మీడియా గ్యాలరీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ కనిపించలేదు. ఏమయ్యాడా అంటే ఎవరో ఆక్రమించుకుంటే ఎవరో విమర్శస్తే మనం రాయడం ఏమిటి? ఆ మాత్రం తెలివి తేటలు మనకు లేవా? అని ఆత్మవిమర్శ చేసుకుని రంగంలో దిగాడట! ఐతే ఏమైంది అంటే ఫోర్ట్ ఎస్టేట్ కన్నా రియల్ ఎస్టేట్ గొప్పదనే జీవిత సత్యాన్ని అతను గ్రహించాడు. అతను గ్రహించిన జ్ఞాన సారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు ఎందుకంటే అతను అంత బిజీ మరి.
ఆ మధ్య కర్నాటకతో పాటుకొన్ని రాష్ట్రాల్లో చట్టసభల్లో కొందరు సభ్యులు ఉత్సాహంగా కనిపించారు. నిద్ర మబ్బుతో ఉండే వారి ముఖాలు వెయ్యి వాల్టుల బల్బుల్లా వెలిగిపోతున్నాయి కారణం ఏమిటబ్బా అని గ్యాలరీలోని మీడియా కెమెరాకు అనుమానం వచ్చింది. అటువైపు జూమ్ చేసి చూస్తే ఆ పెద్దల ఉత్సాహానికి కారణం బయటపడింది. సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు వీక్షిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. బెడ్‌రూమ్‌లోకి బుల్లి తెర

రావడాన్నే అబ్బురంగా చెప్పుకున్నాం, అలాంటిది అరచేతిలో నీలి చిత్రం ఇమిడిపోయి చట్టసభల వరకు తీసుకు వచ్చినందుకు ఆ సభ్యుల తెలివి తేటలకు ముచ్చటపడాల్సింది పోయి. వేటు వేశారు. ఇంతకూ చట్టసభలు ఏం చేస్తాయి అని అడిగితే తడుముకోకుండా సమాధానం చెప్పడం చాలా మందికి కష్టమే. చట్టాలు తప్ప అన్నీ చేస్తాయని గిట్టని వాళ్ళు అంటారు 


చాలా కాలం నుంచి చట్టసభలు సామూహిక గోదాలా మారిపోయాయి. పాత కాలంలో గోదా అంటే ఇద్దరు మల్లయోధులు గోదాలోకి దిగి బాహాబాహి పోరాడే వారు. చట్టసభల్లో అలా బాహా బాహీ చేతులతో కాకుండా మాటలతో సామూహికంగా బాహాబాహీకి దిగుతారు. మొన్నో మీడియా మిత్రుడు ఇదేం సభ చప్పగా ఉంది, ఇలా అయితే ఇక మనం పని చేసినట్టే నంటూ వాపోయాడు. ఏం జరిగింది అని ఓదారిస్తే, ఇలా ప్రశాంతంగా సభ జరగడం చాలా అవమానకరంగా ఉంది. చర్చకే పరిమితం అయితే మనమెందుకు, చానల్స్‌లో చూపేందుకు మసాలా లేందే ఎలా అంటూ వాపోయాడు. ప్రజాస్వామ్యం గురించి నాకు బాగా తెలుసు అన్ని రోజులు ఇలానే ఉండవు, మంచిరోజులు వస్తాయి అంటూ మిగిలిన వారు అతన్ని ఓదార్చారు. భవిష్యత్తుపై ఆశలు కల్పించారు. కొందరైతే ఇది కలా నిజమా? అని తమను తాము గిల్లి చూసుకున్నారు. తెలిసిన ముఖాలే కావడంతో కల కాదు కలలాంటి నిజం అనుకున్నారు. కల లాంటి నిజాలు ఎక్కువ రోజులు ఉండవని తమను తాను ఓదార్చుకున్నారు.

2 కామెంట్‌లు:


  1. >>> ఉగాదికి పంచాంగ పఠనం చేసినట్టు అసెంబ్లీలో ఇరుపక్షాలు ప్రత్యర్థి కుంభకోణాల పఠనం చేయడం ఆనవాయితీ.

    ఈ మీ ఒక్క వాక్యానికే వేయి మార్కుల 'చీర్స్' అండీ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి garu mi maata జిలేబి antha teeyagaa undi

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం