8, జూన్ 2014, ఆదివారం

ధృతరాష్డ్రుడి సెన్సాఫ్ హ్యూమర్.. దుర్యోధనుడి వందో తమ్ముడు!

‘‘ధృతరాష్డ్రుడిది మంచి సెన్సాఫ్ హ్యూమర్’’
‘‘కొంపతీసి మహాభారతంలో సెన్సాఫ్ హ్యూమర్ అనే అంశంపై పిహెచ్‌డి ఏమైనా చేస్తున్నావా? ’’
‘‘రామాయణంలో మహిళలు, భారతంలో పురుషులు, భాగవతంలో ఋషులు అంటూ పరిశోధనలు చేసినప్పుడు సెన్సాఫ్ హ్యూమర్‌పై చేస్తే తప్పేముంది. కానీ నేనేం ఉద్యోగం చేయడం లేదు కదా? ప్రమోషన్ కోసం పిహెచ్‌డి చేయడానికి’’
‘‘్ధృృతరాష్ట్రుడంటే ప్రేమతో కళ్లు మూసుకుపోయిన తండ్రి గుర్తుకు వస్తాడు కానీ నీకేంటి అలా?’’
‘‘కెసిఆర్ అనగానే తెలంగాణ వారికి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఉద్యమ కారుడిగా కనిపిస్తారు. ఇతరులకు వేర్పాటు వాదిగా కనిపిస్తారు. బాబు కొందరికి వెన్నుపోటు దారుడిగా గుర్తుకు వస్తే, కొందరికి జాతి రత్నంగా, యుగపురుషుడిగా కనిపిస్తారు. ఈ ఇద్దరు వారు వారే. కానీ వీరిని చూసేవారు తమ తమ కోణాల్లో చూస్తున్నారు. ధృతరాష్ట్రుడిలో గుడ్డితనం ఒకరికి కనిపిస్తే, సెన్సాఫ్ హ్యూమర్ ఒకరికి కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు ఒక్కడే చూసేవారే వేరువేరు’’
‘‘అంతే నంటావా? ’’


‘‘ సరే ధృతరాష్ట్రుడి వందో కొడుకు పేరు తెలుసా? ’’
‘‘తెలిస్తే మీలో ఎవరో కోటీశ్వరుడికి, నాగార్జున కోటి ఇచ్చినట్టు సమాధానం చెబితే ఏమిస్తావు? ’’
‘‘నీకు తెలియదని నాకు తెలుసులే... ఒక్కరు లేక ఇద్దరు చాలు అని నిర్ణయించుకున్న మన తరానికి పిల్లల పేర్లు పెట్టడడానికి ఎంతో తంటాలు పడాల్సి వస్తోంది. అన్ని భాషల్లో పిల్లల పేర్ల పుస్తకాలు నాలుగైదు కొంటే కానీ ఒక్క పేరు చిక్కడం లేదు. ఆ రోజుల్లో వంద మంది సంతానానికి ధృతరాష్ట్రుడు అన్ని పేర్లు ఎలా పెట్టాడో? ’’
‘‘ముందు అతని సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పు’’
‘‘ అక్కడికే వస్తున్నా? ధృతరాష్ట్రుడి వందో కొడుకు, దుర్యోధనుడి చివరి తమ్ముడి పేరు కవి. కౌరవులంటే ఎవరు మహాభారతంలో విలనే్ల కదా? వాళ్ల పేర్లు కూడా అలానే ఉంటాయి ధుర్యోధనుడు, దశ్శాసనుడు అంటూ అలా పేర్లు పెడుతూ పోయాక చివరకు ధృతరాష్ట్రుడు వందో వాడిపేరు కవి అని పెట్టుకున్నాడు.’’


‘‘మహాభారతంలో ప్రధానంగా ధుర్యోధనుడి యుద్ధ కాంక్ష, దుశ్శాసనుడి ద్రౌపది వస్త్రాపరణం గురించే ప్రస్తావన ఉంది కానీ మిగిలిన వారి గురించి ఎక్కువగా కనిపించదు. మొదటి వాడు యుద్ధాలతో హింసిస్తే చివరి వాడు కవిత్వంతో హింసించే వాడేమో? లేక వాడు పెద్దయ్యాక కవి అవుతాడని తండ్రి ముందే ఊహించి ఉంటాడు. పెద్దయ్యాక కవులయిన వారున్నారుక కానీ పుట్టగానే కవి అయిన ఘనత ధృతరాష్ట్రుడి కుమారుడికి మాత్రమే దక్కింది. ఆ పేరుతో ధృతరాష్ట్రుడు కవులపై సెటైర్ వేశాడేమోననిపిస్తోంది. అందుకే ధృతరాష్ట్రుడి సెన్సాఫ్ హ్యూమర్ తెగనచ్చేసింది..’’
‘‘అయినా నేటి కవి వేరు ఆ కవి వేరు’’
‘‘కాలం ఏదైనా కావచ్చు కవి కవే. 144 సెక్షన్ విధించినా జనం చెల్లాచెదురు కాకపోవచ్చు కానీ అక్కడికి నలుగురు కవులను పంపించామంటే ఒక్క పురుగు కంటికి కనిపించడు అదీ కవి శక్తి సామర్ధ్యం ’’
‘‘అది సరే నీకు హఠాత్తుగా వందో సంతానం పేరు ఎందుకు గుర్తుకు వచ్చింది’’


‘‘వంద రోజుల్లో మీరేం చేస్తారో ప్రణాళిక రూపొందించుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించారు. కేజ్రీవాలేమో మోదీకి 101 రోజుల గడువు ఇస్తున్నామని ఆ రోజు నుంచి ప్రశ్నించడం మొదలు పెడతానని చెబుతున్నారు. యుపిఏ మొదటి సారి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో సాధించే లక్ష్యాలతో ఇలానే ఆర్భాటం చేసింది. ధరలు తగ్గించడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వంటివన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వంద సంఖ్యకు భారతీయుల జీవితంలో విడదీయరాని అనుబంధం ఉందేమోననిపిస్తోంది. శతమానం భవతి అంటూ వందేళ్లు జీవించాలని దీవిస్తారు’’
‘‘దీవించడమే కాదు శిక్షించడంలో సైతం వందకు ప్రాముఖ్యత ఉంది. శిశుపాలుడు 99 తప్పులు చేసేంత వరకు క్షమించిన శ్రీకృష్ణుడు వందో తప్పు తరువాతే కదా? శిక్షించింది.. చంద్రబాబు వంద తప్పులపై బిజెపి కూడా శత్రుపక్షంగా ఉన్నప్పుడు చార్జీషీట్ విడుదల చేసింది’’
‘‘ఔను డెల్‌కార్నిగ్ తాత పుట్టక ముందు వ్యక్తిత్వ వికాసం గురించి మన వాళ్లు చెప్పింది శతకాల ద్వారానే కదా? శతకాల ద్వారా వంద మంచి మాటలు కలకాలం గుర్తుండేట్టు చెప్పారు కదా? సుమతీశతకం, భాస్కర శతకం, వేమన శతకాలను మనసు పెట్టి చదవాలి కానీ అందులో కావలసినంత వ్యక్తిత్వ వికాస సాహిత్యం దొరుకుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి. పాలకుల మనస్తత్వం ఎలా ఉంటుంది. మానవ జీవితానికి ఉపయోగపడే ప్రతి అంశం ఈ శతకాల్లో కనిపిస్తుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్టు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్‌లో చెబితే కానీ మనం విలువ ఇవ్వం. ప్రబంధ నాయికలు కూడా వంద మందే.. శత ప్రబంధ నాయికలు అని ముచ్చటగా పిలుచుకున్నాం. అభిసారిక విరహత్కంఠిత వంటి ఇద్దరు ముగ్గురు ప్రబంధ నాయికల పేర్లే పాపులర్ కానీ కులట కూడా ఈ శత ప్రబంధ నాయికల్లో ఒకరు ’’
‘‘వంద లేనిదే సినిమా చరిత్ర లేదు. ఇప్పుడంటే సినిమా వంద రోజులు నడిస్తే గొప్ప కానీ గతంలో వంద రోజులు నడిస్తేనే సినిమాకు గుర్తింపు. తమ అభిమాన హీరోల సినిమా వంద రోజులు నడిపించేందుకు అభిమానులు తామే టికెట్లు కొనే వారు కూడా. చిరంజీవి 150వ సినిమా హిట్టు కావాలని మంచి కథ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన రాజకీయ జీవితం మాత్రం అట్టర్ ఫ్లాపైంది.’’
‘‘అధికారంలో ఉన్న పార్టీ మారుతోంది కానీ ప్రజల జీవితాలు మారడం లేదు’’
‘‘ఐతే’’

బహుశా ప్రజలు తాము కోరుకున్న రీతిలో ప్రజాస్వామ్య ఉండేందుకు వందేళ్ల గడువు అవసరం అనిపిస్తోంది. అంటే మన ప్రజాస్వామ్యం వయసు 67 ఏళ్లు ఇంకా 33 ఏళ్లు అనుభవించాలి. నువ్వు ఎలాగైనా అర్ధం చేసుకో... పాలకులపై ఇప్పట్లో పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పడమే నా ఉద్దేశం.’’

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం