28, జులై 2014, సోమవారం

కమిటానంద స్వామి!

మహానగరంలో సమస్యలతో జీవితంపై విరక్తి కలిగి సన్యాసం స్వీకరించి తపస్సు చేసేందుకు నల్లమల అడవుల బాట పట్టిన అతనికి అడవిలోని స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం జీవితంపై ఆశలు రేకెత్తించాయి. చావైనా రేవైనా ఇక ఇక్కడే అనుకున్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో వీడెవడో కొత్త బిచ్చగాడు వచ్చినట్టుగా ఉందని తపస్సు చేసుకుంటున్న ముని యువకుడిని పిలిచాడు.
‘‘ఏమోయ్ ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయి వేసినట్టు నీ గొడవేంది?’’ అన్నాడు. ‘‘బాస్ నా మానాన నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను. నీ మానాన నువ్వు తపస్సు చేసుకో’’ అని యువకుడు సమాధానం చెప్పాడు.


‘‘నేను ప్రశాంతంగానే తపస్సులో మునిగిపోయాను నువ్వు వచ్చాకే నా ఏకాగ్రత దెబ్బతింది. జీవితంలో ఏం అనుభవించావని ఇంత చిన్న వయసులో తపస్సు కోసం వచ్చావు. నువ్వెవరు, నీ కథేమిటో చెప్పు’’ అని ముని అడిగాడు.
‘‘ఈ సమస్యలతో బతకడం కన్నా తపస్సు బెటర్ అనిపించి వచ్చాను ’’ అని యువకుడు మునికి తన కథంతా చెప్పుకొచ్చాడు.
‘‘పిచ్చోడా? సమస్యలు లేని ఒక్క బడుద్దాయినైనా చూపించలగవా? ఈ సమస్యలు అందరికీ ఉండేవే. వీటికి ఒ అద్భుతనమై పరిష్కార మార్గం ఉంది’’ అని చెవిలో మంత్రోపదేశం చేశాడు.
***
‘‘రెండురోజులు ఎక్కడికెళ్లారు? సర్లే ఎక్కడికి చస్తే నాకేంటి కానీ... నేను అడిగింది ఏం చేశారు?’’ అని భార్య గర్జించింది.
‘‘డార్లింగ్ మన పంట పండింది. నేను ఇదివరకటి మొగుడిని కాదు... నల్లమల అడవుల్లో నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నా కొత్త పేరు కమిటానంద స్వామి... ఒకసారి కమిట్ అయ్యానంటే అంతే... చెప్పు ఏమిటి నీ డిమాండ్స్..’’ అని మొగుడు అడిగాడు.
‘‘పట్టుచీర కొనిపెడతానన్నారు. వడ్డాణం చేయిస్తానని పెళ్లి రోజు వాగ్దానం చేశారు. వాటి సంగతి తేల్చమని అడుగుతున్నాను.’’ అంది భార్య.
‘‘తప్పకుండా డియర్ నీ ఈ చిన్నిచిన్న కోరికలు కూడా తీర్చకపోతే. నా జీవితం వృధా. బావ కళ్లల్లో ఆనందాన్ని చూడాలని మొద్దుశీనుకు, రైతు కళ్లల్లో ఆనందం చూడాలని పాలకులకు అనిపించినట్టుగానే వడ్డాణంతో నీ కళ్లల్లో ఆనందపు మెరుపులు చూడాలని నా కళ్లు పరితపిస్తున్నాయి,’’ అని మురిపెంగా పలికాడు.


‘‘ఐతే బంగారం బజారుకు వెళదామా? ’’ అని భార్య సంతోషంగా అడిగింది.
‘‘తప్పకుండా. దాని కన్నా ముందు కొంత తతంగం ఉంటుంది.
ఏ షాపులో బంగారం ఏ రేటులో ఉంది. ఎంత కొంటే ఎంత ఖర్చు, ఏ సమయంలో కొంటే ఎంత లాభం వంటి 36 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. దీని కోసం ఒక కమిటీ వేస్తున్నాను. మీ అమ్మానాన్నలు, మా అమ్మానాన్నలు, మీ చెల్లి మా చెల్లి.. మేనత్త వీళ్లంతా ఆ కమిటీ సభ్యులు. వీళ్లు నివేదిక ఇవ్వగానే వడ్డాణం కొనిస్తాను’’
‘‘మరి పట్టుచీర ?’’
‘‘ ఓకే డియర్ .. దానికీ ఓ కమిటీ వేద్దాం. మన కాలనీలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసి కమిటీ వేద్దాం. ఎలాంటి చీర కొనాలి, ఎంత ధరలో కొనాలో ఈ కమిటీ తేలుస్తుంది. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కమిటీ పర్యటించాలి...ఏమంటావు’’ అని భర్త పలికాడు.
‘‘మీదెంత విశాల హృదయమండి... మిమ్మల్ని అనుమానించి నన్ను నేను అవమానించుకున్నాను. నాకు నచ్చిన చీర కోసం ఇంత శ్రద్ధ చూపుతున్నారంటే మీరు మనిషి కాదండి మనిషి రూపంలో ఉన్న దేవుడు‘‘ అంటూ భార్య ఆనంద భాష్పాలు రాల్చింది. విషయం తెలియగానే కాలనీ ప్రజలంతా సామాజిక వర్గాల వారిగా వచ్చి కమిటానందరావును అభినందనల్తో ముంచెత్తారు.


‘‘నాన్నా! కనీసం ఈ ఆదివారమైనా సినిమాకు వెళదాం’’ అంటూ ఇద్దరు పిల్లలు కోరస్‌గా పలికారు.
‘‘ పిల్లలూ మీరు అడగడం నేను కాదనడమా? వెళదాం. పవన్ కల్యాణ్ సినిమానా? మహేశ్ బాబు, తారక రత్నల సినిమానా? తేల్చడానికి ఆడ పిల్లలతో కమిటీ వేద్దాం. సమంతా, కత్రినా కైఫ్, త్రిష? ఎవరి సినిమానో తేల్చడానికి మగ కుంకలతో కమిటీ వేద్దాం . ఈరెండు కమిటీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, మరో కమిటీ వేసి రెండు కమిటీల అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక ఇమ్మందాం’’ అని బదులిచ్చాడు.
‘‘ ఏమండోయ్ మీ చిన్నచెల్లెలు ఫోన్ చేసి ఏడుస్తోంది? వడ్డాణం కమిటీలో తనకు స్థానం కల్పించలేదని,తనను చిన్న చూపు చూస్తున్నా మంటోంది. చీరల కమిటీలో స్థానం కల్పించలేదని ఎదురింటి వనజొదిన మాట్లాడడం మానేసింది ’’ అంటూ భార్య ఏదో చెబుతూ పోతుంటే కమిటానందం సంతోషానికి అంతులేకుండా పోయింది. ఈ సంతోషాన్ని తన గురువుతో పంచుకోవాలనుకున్నాడు
***
నరక ప్రాయం అనుకున్న నా సంసారం ఒక్క మంత్రంతో స్వర్గంగా  మార్చేశారు అంటూ నల్లమల అడవుల్లో స్వామీజీ ముందు మోకరిల్లాడు.
గురువు గారూ ఈ కమిటీలను ఇంట్లో వాళ్లు ఎంత కాలం నమ్ముతారంటారు?
నమ్మక చస్తారా? పెళ్లి చేసుకున్న తరువాత కాపురం చేయాల్సిందే... నీకో రహస్యం చెప్పనా? కుటుంబానికైనా, ప్రభుత్వానికైనా తప్పించుకోవడానికి కమిటీలకు మించిన పరిష్కారం లేదు. 82లో ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానంటే గెలిపించారు, ఐదేళ్లపాటు బియ్యం ఇచ్చిన తరువాత ఓడించారు. ఒక హామీని నెరవేర్చగానే జనం ఆ విషయం మరిచిపోయి మరోటి ఏమిస్తారని చూస్తారు. అందుకే ఏ హామీ నెరవేర్చకుండా కమిటీలతో కాలం వెళ్లదీస్తే ఢోకా లేదు. నేటి హామీలు ఏడేళ్లతరువాత అమలు అని చెబితే వచ్చే ఎన్నికల్లో విజయానికి మెట్లను నిర్మించుకున్నట్టు ఉంటుంది. హామీ నెరవేరిస్తే ఏముంటుంది? అంటూ మునీశ్వరుడు జ్ఞాన బోధ చేశారు. ఆనాటి నుంచి కుటుంబరావు కమిటానంద స్వామిగా ప్రఖ్యాతి పొందారు.


***
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీలు వేశాయి అంటూ టీవిలో వార్తల శబ్దానికి మెలుకువ వచ్చింది. ఇప్పటి వరకు జరిగింది కలా నిజమా? అనే డైలమాలో పడిపోయాడు ఆదివారం ఆలస్యంగా లేచిన కుటుంబరావు...

4 వ్యాఖ్యలు:


 1. నాన్ 'కామితల్' కమిటా నందా జిందా బాద్ !!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అంత పవర్ ఫుల్ ట్రిక్కుని ఇంత ఫ్రీ గా చెప్పేసారు గురువు గారూ, మీ లాసు లెక్కేస్తే నాకు మీమీద చాలా జాలేస్తున్న దండొయ్!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Sats garu thanks Zilebi garu thanks Hari Babu Suraneni garu శిష్యుడి రహస్యాన్ని కాపాడడం గురువు బాధ్యత అందుక శిష్యుడి పేరు రాయకుండా విషయం రాసా శిష్యా

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం