7, జులై 2014, సోమవారం

ఆ హీరో జీవితమే సందేశం

పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే మా పేదోళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే అంటూ ఆ ముసలి తండ్రి ఆయసంతో దగ్గుతూ డైలాగులు చెబుతాడు. మనసులేని ఇలాంటి వాళ్లను ఎంత బతిమిలాడినా వారు కరగరు నాన్నా వాళ్లకు మనుషులు, మానవత్వం కన్నా డబ్బే ముఖ్యం అంటూ పేదింటి అమ్మాయి తన వంతు డైలాగులు వినిపిస్తుంది. చివరకు ఆ పెద్దింటి ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. మనిషికి కావలసింది డబ్బు కాదు, మనను ప్రేమించే మనుషులు అని తెలుసుకున్నాను, నా కళ్లు తెరిపించారు అంటూ ఆ పెద్దింటాయన వారిద్దరి పెళ్లి జరిపిస్తాడు. 

చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమిది. డబ్బు ముఖ్యం కాదు అని ఎన్ని సినిమాల్లో ఎంత మంది రచయితలు ఎన్ని పాత్రలతో చెప్పించినా అది నిజం కాదు. డబ్బు అన్నీ సమకూర్చకపోవచ్చు కానీ ఏది కావాలన్నా డబ్బు కావలసిందే. డబ్బు లేకుండా దొరికేవి కొన్ని ఉండొచ్చు కానీ చాలా అవసరాలకు మాత్రం డబ్బు కావలసిందే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కాకపోవచ్చు కానీ చాలా సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బుకు ఏమాత్రం విలువ లేదని చాటి చెప్పే సినిమా ను తీయాలన్నా బోలెడు డబ్బు కావాలి. డబ్బుకు విలువ లేదని డైలాగులు రాసే రచయిత డబ్బు కోసమే ఆ పని చేస్తాడు. డబ్బు ముట్టిన తరువాతే హీరో ఆ డైలాగులు చెబుతాడు.... డబ్బుచెల్లించి సినిమా చూసే మనలాంటి సగటు ప్రేక్షకుడు మాత్రం జీవితంలో డబ్బుకు విలువ లేదని ఎంత చక్కగా చెప్పారు అని ఆలోచిస్తూ ఖాళీ అయిన జేబులతో దియోటర్ నుంచి ఇంటికి వెళ్లాలి. అన్నింటికీ డబ్బు కావలసిందే. మనిషికి డబ్బు జబ్బు ప్రమాదకరమే కావచ్చు కానీ డబ్బు లేకుండా జబ్బులు వస్తే మనిషి జీవితం మహా ప్రమాదంలో పడ్డట్టే.


సినిమా కథల్లో డబ్బు విలువ గురించి చాలా తక్కువగా చెప్పినా చాలా మంది సినిమా వాళ్ల వాస్తవ జీవితాలు డబ్బు విలువను చాటి చెప్పే విధంగా ఉంటాయి. నా జీవితమే నా సందేశం అంటూ మహాత్మాగాంధీ తన ఆత్మకథ రాసుకున్నారు. ఒక రకంగా చిత్తూరు నాగయ్య జీవితానికి సైతం ఈ ట్యాగ్ బాగా సరిపోతుంది.


తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన తొలి సూపర్ స్టార్. అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడు. 1948 అంటే మహామహానటులే నెలకు మూడు వందలు నాలుగు వందల రూపాయల జీతంతో సినిమాల్లో నటించిన కాలం అది. ఆ సమయంలో చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా? సరిగ్గా లక్ష రూపాయలు. అంటే ఆ కాలంలో ఒక సినిమాకు చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషికంతో మద్రాసులోనో, హైదరాబాద్‌లోనూ కొన్ని వందల ఎకరాల భూములు వచ్చేవి. చిత్తూరు నాగయ్య అదే చేసి ఉంటే ఇప్పుడాయన ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యేది. అలా చేయలేదు కాబట్టి స్వయంగా ఆయనే చివరి దశలో అపాత్రదానం చేయవద్దు. నా జీవితం మీకు ఒక పాఠం కావాలి అని హితవు పలికారు తప్ప తన పరిస్థితికి ఎవరినీ నిందించలేదు. 1948లో లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న ఆ మహానటుడు. అవసాన దశలో 1970 ప్రాంతంలో కేవలం కడుపు నింపుకోవడానికి వందల రూపాయల పారితోషికానికి సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేస్తూ, అద్దె ఇంటిలో నివసించారు. ఇప్పటి హీరోలు విలన్ల కన్నా ఎక్కువ బీభత్సం సృష్టిస్తున్నారు. చిత్తూరు నాగయ్య హీరోగా వచ్చిన కాలంలో అన్ని సాధు పాత్రలే... ఆ పాత్రల ప్రభావం సినిమా షూటింగ్ వరకే ఉంటే బాగుండేది. కానీ ఆయన జీవితంపై సైతం ప్రభావం చూపించాయి. పోతన పాత్రలో జీవించిన ఆయన ఆయన లానే ధాన ధర్మాలు చేస్తూ పోయారు. రామదాసు సినిమాతో బాగా నష్టపోయారు. దానికి తోడు దాన ధర్మాలకు అంతు లేదు. ఆయన స్టూడియో నిత్యాన్న దాన సత్రంగా వెలుగొందేది. 1938 నుంచి 1973 వరకు చిత్తూరు నాగయ్య దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు. భక్తపోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య అని నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఈ సినిమాల ప్రభావం నాగయ్యపై బాగా పడింది. 

వాస్తవిక జీవితంలో అందులోనూ సినిమా రంగంలో నమ్మించి మోసం చేసేవారు ఎలా ఉంటారో, విజయం దక్కినప్పుడు కాటేసే పాములు ఎలా పొంచి ఉంటాయో ఆ సాధు స్వభావి గ్రహించలేకపోయారు. అంతా అయిపోయిన తరువాత ఇక్కడ గోముఖంతో ఉండే పులులు చాలా ఉన్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన వద్ద ఏమీ మిగలలేదు. 1947లో నాగయ్య నటించిన యోగివేమన నటించిన సినిమా చూసి ముమ్మడివరానికి చెందిన బాలుడు బాలయోగిగా మారారు. తెలుగునాట తొలి తరం హీరో, సంగీత కర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆ కాలంలో ఎంతో పేరు గడించారు. దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హీరో. చిత్తూరు నాగయ్య జీవితం సినిమా వారికే కాదు సంపాదనపై అవగాహన కలిగించడానికి, సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి చిత్తూరు నాగయ్య జీవితం ఏ కాలం వారికైనా ఏ రంగం వారికైనా ఒక పాఠంగా ఉపయోగపడుతుంది.
చిత్తూరు నాగయ్య తన తరువాత తరం వారికి నటనలోనే కాదు సంపాదన, జాగ్రత్తలపై కూడా తన జీవితం ద్వారా చాలా బలంగా పాఠం నేర్పించారు. ఈ తరం సినిమా వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటి వారి జీవిత చరిత్రలే కారణం. ఈ పాఠాలు సినిమా వారికే కాదు అందరికీ ఉపయోగకరమైనవే.

1 కామెంట్‌:

  1. డబ్బుకు ఏమాత్రం విలువ లేదని చాటి చెప్పే సినిమా ను తీయాలన్నా బోలెడు డబ్బు కావాలి. :-)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం