27, జులై 2014, ఆదివారం

నట విశ్వవిద్యాలయం... సావిత్రి

  ఓ రాజుగారికి ఓ వింత అలవాటు. దేశంలో పెద్ద ఎత్తున తోట కూర పెంచుతూ అందరికీ పంచి పెట్టేవాడు. ఆయన నోటి నుంచి తరుచుగా వినిపించే మాట అంతకు ఇంతైతే, ఇంతకు ఎంత? అని. ఓ రోజు మంత్రిని అదే మాట అడిగాడు. ఆ ప్రశ్న ఉద్దేశం ఏమిటో చెబితే సమాధానం దొరుకుతుందని మంత్రి అన్నాడు.... అప్పుడు రాజు అసలు విషయం చెప్పుకొచ్చాడు. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది. పూర్వజన్మలో నేను ఒక పేదవాన్ని. అయినా ప్రజలకు ఏదో దానం చేయాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో పెరటిలో తోటకూర పెంచి అందరికీ పంచేవాన్ని ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో రాజును అయ్యాను. అంత తోటకూర పంచితే రాజును అయ్యాను. ఇప్పుడు ఎంతో మందికి తోటకూర దానం చేస్తున్నాను, ఈ పుణ్యం వల్ల ఏమవుతానో తెలుసుకోవాలని అంతకు ఇంతైతే, ఇంతకు ఎంత ? అని అడుగుతున్నాను అని రాజు చెప్పాడు. మంత్రి నింపాదిగా ఇంతకు ఇంతే అవుతారు అని సమాధానం చెప్పారు. ఎందుకలా అంటే మహారాజా! పేదవాడిగా ఉండి కూడా తోట కూర పెంచిన పుణ్యఫలం వల్ల రాజు అయ్యారు. రాజుగా ఉండి తోట కూర పంచడం పిచ్చితనం అవుతుంది రాజుగా మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. తోట కూర పంచడం కాదు అని మంత్రి చెప్పిన సమాధానంతో రాజుకు జ్ఞానోదయం అయి తోటకూర దాన కార్యక్రమానికి స్వస్తిపలికారు. 

నిజంగా పునర్జన్మ జ్ఞానం ఉంటుందా? అని కాదు దానానికి సైతం వెనకా ముందు ఆలోచించుకోవాలని చెప్పడమే. ఉన్నదంతా దాన ధర్మాలు చేయడం సరైనది కాదు.. ఉన్నత స్థానంలో ఉండి తోట కూర దానం సరికాదు. మహానటి సావిత్రి జీవితాన్ని చూసిన సినిమా వారు చెప్పిన మాటల ప్రకారం దానాల విషయంలో సావిత్ర చేతికి ఎముక ఉండేది కాదు. ఆమె షూటింగ్‌లకు ఇంట్లోనుంచి బయట అడుగు పెట్టే సమయానికి సహాయం కోరి చాలా మంది వచ్చేవారు. చేతికి ఎంత వస్తే అంత సహాయం చేసేదట! ఇంతకూ సావిత్రి ఎవరు? అని అడిగే తెలుగువాడు ఉండడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆమె మరణించి మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పటికీ ఆమె ప్రభావం నేటి తరం నటీనటులపై అపారంగా ఉంది. నటన విషయంలోనే కాదు జీవితం విషయంలో కూడా
... 
ముందు చూపులేకపోతే జీవితం అంతిమ దశ ఎలా ఉంటుందో సావిత్రి జీవితాన్ని చూసిన వారికి జీవిత కాలం మరిచిపోలేని పాఠం అవుతుంది. మహానటి అనే మాటకు సార్ధకత చేకూర్చిన నటి సావిత్రి. నటన నేర్పేందుకు మాకు కళాశాలలులేవు, సావిత్రి నటనే మాకు నటనా పాఠాలకు విశ్వవిద్యాలయం అని వాణిశ్రీ ఒక సందర్భంలో సావిత్రి గురించి గొప్పగా చెప్పారు. నటన విషయంలోనే కాదు ఎలా జీవించాలి అనే విషయంలోనూ సావిత్రి జీవితం ఒక గొప్ప పాఠం. చేతికి ఎముక లేకుండా దానం చేసిన స్థితి నుంచి సావిత్రి అంతిమ కాలంలో చేతిలో ఏమీ లేని స్థితికి చేరుకున్నారు. ఆమె మరణం అత్యంత విషాదకరం. జీవితంలో మోసాన్ని, దగాను తట్టుకోలేని ఆమె దాదాపు రెండేళ్లపాటు కోమాలో ఆస్పత్రిలోనే మంచంపై గడిపి శాశ్వతంగా కన్ను మూశారు. నిర్మాతగా మారిన తరువాతనే ఆమె ఆర్థికంగా కృంగుబాటు ప్రారంభం అయింది. ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్ర్తి శిల్పులు ఉన్నారు. ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నయినా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్ర్తి శిల్పుల్లో ఇద్దరు తెలుగు వారే. మన సినిమా రంగంలోని ఆ మహిళా శిల్పులు జి. వరలక్ష్మి, సావిత్రి, హిందీ నటి మీనాకుమారి ’’ అంటూ మహాకవి శ్రీశ్రీ మహానటి సావిత్రి గురించి చెప్పిన మాట. కొమ్మారెడ్డి సావిత్రి డిసెంబర్, ఆరున 1937లో చిర్రావూరు గ్రామంలో జన్మించారు. సావిత్రికి ఆరునెలలు నిండాక తండ్రి నిశ్శంకరరావు టైఫాయిడ్‌తో మరణించారు. దాంతో సావిత్రి తల్లి సుభద్రమ్మ తన మకాంను విజయవాడలోని తన అక్క దుర్గాంబ ఇంటికి మార్చారు. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య. బహుశా బాల్యంలోనే తండ్రి మరణించడం, పెదనాన్న వారి ఇంటిలో పెరగడం వల్ల సావిత్రి అభద్రతా భావంతోనే అప్పటికే రెండు పెళ్ళిళ్లుచేసుకున్న జెమినీ గణేషన్‌ను పెళ్లి చేసుకొని ఉండవచ్చు. కానీ సావిత్రి జీవితానికి జెమినీ గణేషన్ ఏ మాత్రం భద్రత ఇవ్వలేకపోయారు. సావిత్రి నటి మాత్రమే కాదు నిర్మాత, దర్శకురాలు కూడా. మాతా పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి చిన్నారి పాపలు (1968) చిరంజీవి (69) వింత సంసారం(70) అనే సినిమాలను నిర్మించారు. మూగమనసులు సినిమాలో జెమిని గణేషన్‌తో కలిసి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటనలో సావిత్రి మహానటి కానీ జీవితంలో మాత్రం నటించలేకపోయారు, నమ్మిన వారి చేతిలోనే ఘోరంగా మోసపోయారు. సినిమా రంగంలో వినిపించే దాని ప్రకారం... భర్తతో గొడవలు బయటకు అడుగు పెట్టక తప్పని పరిస్థితులు. బయటకు వచ్చాక కనీస భద్రత ఉంటుందని, కన్నడ నటుని భార్య వద్ద కొంత బంగారం దాచి పెట్టింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆ నగల గురించి అడిగితే ఆ హీరో భార్య తన వద్ద ఎలాంటి నగలు దాచిపెట్టలేదని మహానటి షాక్ తినేంతగా నటించింది. ఆ తరువాత సావిత్రి కోలుకోలేక పోయారు. ఆ సమయంలో సావిత్రికి మంచి సలహాలు ఇచ్చే వారు ఉంటే ఆమె జీవితం అలా ఉండేది కాదని నిర్మాత కాట్రగడ్డ మురారి అంటారు. తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ సినిమా రంగం ఆమెను మహానటి అని గౌరవించుకున్నాయి. అంత సంపద దానం చేసిన సావిత్రి అంతిమ జీవితం అలా గడిచిపోవాలా? బాగా సంపాదించినప్పుడు ఎంతో ఆదాయం పన్ను చెల్లించాను కదా ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. నేను చెల్లించిన దానిలో కొంత వెనక్కి ఇచ్చే అవకాశం ఉందా? అని సావిత్రి ఒక దశలో విచారించారట! జీవితంలో తగిలిన దెబ్బలను, జరిగిన మోసాలను మరిచిపోవడానికి ఆమె మత్తును నమ్ముకున్నారు. 13 ఏళ్ల వయసులో నాటకాల్లో నటనకు శ్రీకారం చుట్టిన సావిత్రి 45ఏళ్లకే జీవితాన్ని ముగించారు. 
*** 
ప్రియాంక చోప్రా సినిమాల్లో, ప్రకటనల్లో రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆరోజు చేసిన ఖర్చు లెక్క రాసుకుని చూసుకుంటాను. అందులో అనవసర ఖర్చు ఉందని అనిపిస్తే నాకు నేనే వార్నింగ్ ఇచ్చుకుంటాను అంటూ ఆమె ఈ మధ్య చెప్పుకొచ్చింది. సమంత చెన్నైలో ఒక స్టార్ హోటల్‌ను కొనుగోలు చేసింది. వీరద్దరే కాదు ఈ తరం వారంతా ఇలా ముందు చూపుతూనే ఉంటున్నారు. ఈ ఇద్దరూ సావిత్రిని చూసే అవకాశమే లేదు. సావిత్రి 1981లో మరణిస్తే, ఆమె మరణించిన ఐదారేళ్లతరువాత పుట్టిన వారు ఈ ఇద్దరు. కానీ సినిమా రంగంలో ముందు జాగ్రత్త లేకపోతే జీవితం ఎలా ముగుస్తుందో సావిత్రి జీవితం ఇలాంటి వారిపై తీవ్రమైన ప్రభావం చూపింది. సావిత్రి తెలియకపోయినా ఆమె జీవితం ఈ తరం సినిమా వారికి ఆర్థిక అంశాల్లో బలమైన పాఠంగా నిలుస్తోంది. సావిత్రి జీవితం సినిమా వారికే కాదు డబ్బుకు సంబంధించి అందరికీ ఒక పాఠం కావాలి. దానం చేయడం తప్పు కాదు.. అపాత్ర దానం తప్పు... అమాయకంగా అందరినీ నమ్మడం తప్పు. భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోవడం ఆమె పాలిట శాపం గా మారింది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం