16, నవంబర్ 2014, ఆదివారం

పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే... చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవి

‘‘ఏమోయ్ కుటుంబరావు   నీ కోసమే ఎదురు చూస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’అని విశ్వనాథం ఫోన్ చేశాడు. ‘‘ఇదిగో నినే్న మీ కుటుంబరావు అన్నయ్య వస్తున్నాడు, మంచి టీ చేయ్ సీరియస్ విషయంపై సీరియస్‌గా మాట్లాడుకోవాలి’’
‘‘ఏంటో అంత సీరియస్ విషయం ’’అని శ్రీమతి అడిగింది.


‘‘దేశంలో ఇప్పుడు ఇదే అత్యంత కీలకమైన అంశం. జవహర్ లాల్ నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే ఎలా ఉండేదని దేశ పాలకులు మొదలుకుని, సామాజిక మాధ్యమాల వరకూ అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రిటైర్ అయ్యాక ఈ దేశం కోసం ఏమైనా చేయాలని తెగ ఆలోచించాను. ఆలోచించడానికి మించిన దేశసేవ లేదని మా ఆలోచనల్లో తేలింది. అందుకే ఇవ్వాళ ఈ సీరియస్ విషయం మీద కుటుంబరావు, నేను సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించుకున్నాం. వినాలని ఆసక్తి ఉంటే వంట గది నుంచి విను... అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మూడ్ పాడు చేయకు’’ అని విశ్వనాథం చెబుతుండగానే కుటుంబరావు వచ్చినట్టుగా శబ్దం అయింది.


పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే పాకిస్తాన్‌తో పాటు నాలుగైదు దేశాలు మన దేశంలో కలిసిపోయేవని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ పెరిగి ఉండేవని, చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవని, జాంబాగ్ ఫ్రూట్‌మార్కెట్‌లో పండ్ల ధర ఇంకా తక్కువుండేదని నాకెందుకో గట్టిగా అనిపిస్తోందోయ్ నువ్వేమంటావు’’ అని విశ్వానాథం చర్చ ప్రారంభించాడు.


‘‘అన్నయ్య గారూ బాగున్నారా? ఈ మధ్య రావడం లేదేమిటి ’’ అని కుటుంబరావును శ్రీమతి అడిగింది. ఇంకా భార్య అక్కడే నిలబడడంతో ‘‘ఇలాంటి విషయాలు నీకు అర్ధం కావు. ముందు టీ పెట్టుపో..’’ విశ్వనాథం శ్రీమతిని ఆదేశించాడు.
‘‘సరే టీ పెడతాను కానీ మొన్న పెళ్లిలో మీరు చాలా సేపు మాట్లాడారు చూడండి ’’
‘‘ఎవరూ ఆ బట్టతల అతని గురించేనా నువ్వు చెబుతున్నది’’.
‘‘అవును అతనే ఇంటికి రమ్మని పిలిచాం కదా వస్తానన్నాడు. వచ్చేప్పుడు ఫోన్ చేస్తాడు కాస్త చూడండి ’’


‘‘సరే చూస్తాను కానీ ఎవరతను చాలా ఇంట్రస్టింగ్ పర్సన్ తెగ మాట్లాడేస్తాడు కొత్తా పాత అని లేనే లేదు. బాగా కలిసిపోతాడు. ఆ పెళ్లిలో అతనున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఇబ్బంది పడేవాడిని.. ఔను ఏదో సినిమాలో కూడా నటించాడట కదా?’’ అని విశ్వనాథం అడిగాడు.


‘‘అతను మీకూ నచ్చాడా! అతనంతే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాడు. బాగా మాట్లాడతాడు. తహసిల్దారుగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు. బాగానే సంపాదించాడు. వాళ్ల పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక రిటైర్ అయ్యాక ఇప్పుడు ఆసక్తి కొద్దీ సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడు. మాయా మశ్చింద్ర సినిమా చూశారా! అందులో రాజు యుద్ధానికి వెళ్లేప్పుడు చాలా మంది సైనికులు ఉంటారు కదా! ఆ సైనికుల్లో ముందు వరసలో 14వ వాడు ఆయనే... ఆ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను చాలా దగ్గరి నుంచి చూశాడట! ఎన్టీఆర్ అచ్చం మనిషిలానే ఉన్నాడట కలిసినప్పుడల్లా 40ఏళ్ల క్రితం నాటి ఆ సినిమా షూటింగ్ కబుర్లు కళ్లకు కట్టినట్టు చెబుతాడనుకో... 


ఇంట్లో ఆ సినిమా సీడీ ఉంది. చూడండి. చేసింది సైనికుడి వేషమే అయినా, డైలాగులు లేకపోయినా ఎంత హుందాగా నిలబడ్డాడు... ఆ ఠీవీ... దర్పం...’’ అంటూ శ్రీమతి చెప్పుకుపోతున్నది.


‘‘సర్లేఈ సారి నువ్వు ఆ సినిమా చూసేప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు నన్ను పిలువు చూస్తాను....అది సరే ఇంతకూ అతను నీకేమవుతాడో చెప్పనే లేదు.’’ని విశ్వనాథం ఆసక్తిగా అడిగాడు.


‘‘ఏమవుతాడు చేసుకుంటే ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన కూర్చునే వాడు. అది జరిగితే నా జీవితం ఎంత బాగుండేది. సినిమాల షూటింగ్‌లకు తీసుకు వెళ్లేవాడు. కాలం కలిసి వస్తే మహానటుడు అయ్యేవాడు. ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు. మధ్యలోనే పోతే ఆ స్థానంలో నేను ముఖ్యమంత్రిని అయ్యేదాన్ని. దూరపు బంధువు.. వరుసకు బావ అవుతాడు. మా తరఫు వాళ్లు, వాళ్ల తరఫు వాళ్లు అంతా ఓకే అనుకున్నారు. మాయదారి గోత్రాలు కలవలేదు’’ అని శ్రీమతి ఏదో చెబుతుంటే


విశ్వనాథం మధ్యలోనే జోక్యం చేసుకుని, ఎవడూ ఆ ఉడత ముఖం వాడు నిన్ను చేసుకోవాలనుకున్నాడా! అయినా వాడేంటి ఆడవాళ్లలా అలా కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఎదుటివాడు వింటున్నాడా లేడా? అనే స్పృహనే ఉండదు. పొట్టివెదవ, ఏదో లంచం తీసుకుంటుంటే ఎసిబి వాళ్లు పట్టుకున్నట్టున్నారు. తీసేసిన తహసిల్దారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి అలా చెబుతున్నాడేమో! వాడ్ని చూడగానే దొంగ ముఖం అనిపించింది ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వాడ్ని నువ్వు చేసుకుని ఉంటే పీడాపోయేది నేను ఏ వాణిశ్రీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాన్ని అని విశ్వనాథం ఉడుక్కుంటూ చెప్పాడు.

 సర్లేండి మీ బట్టతల ముఖానికి వాణిశ్రీ లాంటి అమ్మాయి దొరికేదా? అని శ్రీమతి ఎత్తి పొడిచింది.

‘అది సరే వాడు మహానటుడు, ముఖ్యమంత్రి అయ్యేవాడా? ? ఎలా?’’


’’డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి ఇన్‌స్పెక్టర్‌గా చిన్న పాత్రలో నటించిన ఎన్టీఆర్ మహానటుడై, తరువాత ముఖ్యమంత్రి కాలేదా? ఆయన ఏకంగా తహసిల్దారు... సైనికుడి వేషం వేశాడు ఏం ఎన్టీఆర్‌లా ఎందుకు కాకూడదు ?’’ అని శ్రీమతి నిలదీసింది...
శ్రీమతితో వాదించి ప్రయోజనం లేదని గ్రహించిన విశ్వనాథం ‘‘సర్లేవే నీతో వాదనెందుకు? పెళ్లయిన ఆరు దశాబ్దాల తరువాత వాడెవడితోనో పెళ్లయి ఉంటే అనుకోవడం పిచ్చితనం’’ అన్నాడు.
‘‘ మరి దేశంలో మరే సమస్య లేనట్టు.. ఏడు దశాబ్దాల తరువాత నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే? ’’ అని చర్చించుకోవడం తెలివైన పనా? అని శ్రీమతి అడిగింది.


గుర్తు తెలియని వ్యక్తి వీరి చర్చలో దూరి ‘‘మా గుండప్ప బతికుంటే దేశంలో ఇన్ని సమస్యలే ఉండేవి కాదు. వాడు మా ఊర్లో పెద్ద రౌడీ వాడంటే అందరికీ హడల్ పిచ్చి కుక్క వెనకనుంచి వాడ్ని దెబ్బతీసింది’’ అని చెబుతుంటే .. ఒక గుంపు అదిగో గుండప్ప అక్కడున్నాడు అని ఆ అగంతకుని వైపు పరిగెత్తు కొచ్చారు. 

4 కామెంట్‌లు:

  1. ఇటువంటి చర్చల్ని సరైన కోణంలోంచి (right perspective అనచ్చా?) ఎలా చూడాలో బాగా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
  2. ఏమైతే ఏం కానీ పటేల్‌ను ముందువరసలో 14వ సైనికుడితో పోల్చారు చూశారూ... అద్భుత:.

    పటేల్‌ ప్రధాని అయివుంటే జమ్మూకశ్మీర్‌ రావణకాష్టం రగిలివుండేది కాదు.. దేశం మీద నెహ్రూ చేత బలవంతంగా రుద్దబడి నేటికీ దేశాన్ని తగలబెడుతున్న చాలా సమస్యలు ఉనికిలోనైనా ఉండేవి కావు... అని అనుకోడం కూడా తప్పయిపోయిందన్న మాట. :)

    నెహ్రూ ప్రధాని అయ్యాడు కాబట్టి... దేశం మీద శోషలిజం రుద్దాడు కాబట్టి... పాకిస్తాన్‌తో అంతూ దరీ లేని తగవులకు కారణమయ్యాడం కాబట్టి... సొంత కీర్తి ప్రతిష్టల కోసం కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి ఎక్కించాడు కాబట్టి... తాను కోటు మీద పెట్టుకుని ప్రజలకు చెవుల్లో పువ్వులు పెట్టాడు కాబట్టి... ఆ చంటిపిల్లాడి పుట్టినరోజును జాతీయ పర్వదినంగా జరుపుకుని తీరాల్సిన పవిత్ర కర్తవ్యాన్ని పక్కకు నెట్టేయడం ఎంత బాధ కలిగిస్తోందో... :(

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం