18, జనవరి 2015, ఆదివారం

ఆరేసుకోబోయి...

‘ఆరేసూకోబోయి పారేసుకున్నాను హరిహరి ’’
‘‘ ఏంటీ మంచి ఉషారు మీదున్నావు? ఏంటి కథ పంకజం కలిసిందా? లాటరీ తగిలిందా? కొడి పందాల్లో బాగా డబ్బు చేసిందా? ’’
‘‘అదేం లేదులే’’
‘‘మారండయ్యా మారండి... ఇంకా 77 నాటి పాటలేనా? ప్రపంచం చాలా ముందుకెళుతోంది.  అంత సడెన్‌గా నీకు జయప్రద గుర్తుకొచ్చిందేంటో?
‘‘అదేం కాదురా! ఈ ఫోటో చూడగానే మనసంతా ఉల్లాసంగా తేలిపోయినట్టు అనిపించింది. ’’
‘‘బిజెపిలోకి జయప్రద.. ఈ వార్తను చూసేనా? అంతగా సంతోషిస్తున్నావు. ఏరా నువ్వు కూడా పార్టీ మారావా? అదేదో నోరు తిరగని పార్టీ అభిమానివని గుర్తు. బిజెపిలోకి వెళ్లిపోయావా? ’’


‘‘జయప్రద బిజెపిలో చేరినందుకు సంతోషంగా ఉందని నేనేమైనా చెప్పానా? జయప్రద ఫోటో చూడగానే సంతోషం వేసిందని చెప్పాను అంతే తప్ప నేనెందుకు పార్టీ మారుతాను. తాప్సీ, జిప్సీ ఎంత మంది హీరోయిన్లు వచ్చినా జయప్రద అందమే అందం. అంతులేని కథలో మధ్యతరగతి సరితగా నటించినా, అడవిరాముడులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ అందాలు ఆరబోసిన జయప్రదకు ఎవరూ సాటిరారు. అడవిరాముడులో ఎన్టీఆర్‌పై జయప్రద మనసు పారేసుకున్నట్టు చూపించారు కానీ ఆ పాటలో మాత్రం జయప్రద అందాలకు ఎన్టీఆరే మనసు పారేసుకున్నట్టు అనిపిస్తుంది. అంతందగా ఉంటుంది జయప్రద. యమగోలో ఎన్టీఆర్‌కు తిక్కరేగేట్టు చేసింది ఇప్పటికీ మరిచిపోలేం. ఓలమీ తిక్కరేగిందా? అంటూ ఆరుపదుల వయసులోనూ ఎన్టీఆర్ చెలరేగిపోలేదా? ’’
‘‘నిజమే కానీ ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన తారల వల్ల ఈ కాలంలో రాజకీయ పక్షాలకు ఉపయోగం ఉంటుందంటావా? ’’
‘‘పిచ్చోడా? ఎందుకుండదు బాగా ఉంటుంది. అప్సరస భువిపైకి వచ్చి నిన్ను పలకరించి, నీ సహాయం కోరిందనుకో నువ్వేమంటావు? కాదంటావా?’’


‘‘చచ్చినా కాదనను ’’


‘‘జయప్రద అంటే ఒకప్పటి అప్సరసే కదా? అప్సరస బిజెపి కోసం నాలుగు మాటలు మాట్లాడేందుకు వస్తే చూసేందుకు రాని వారుంటారా? నవ్వు ఔనన్నా కాదన్నా జయప్రద మహానటి’’
‘‘అంతులేని కథ గురించే అంతులేకుండా ఎన్నిసార్లు చెబుతావు’’
‘‘మహానటి అని  కేవలం సినిమాల రికార్డును చూసి అన్న మాట కాదు... రాజకీయాల్లో నూ  ఆమె ప్రతిభను చూశాకే ఆ మాట అంటున్నాను’’


‘‘ఇప్పుడు రోజుకు డజను మంది హీరోయిన్లు వస్తున్నారు. అరడజను సినిమాల్లో కూడా నటించకుండా, ఆరేడు వారాలకు కనుమరుగవుతున్నారు. అలాంటిది ఎప్పుడో 76లో వచ్చిన జయప్రద మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఆ తరువాత మరో రెండున్నర దశాబ్దాల నుంచి రాజకీయాల్లో వెలిగిపోతున్నారంటే మహానటి కాకుంటే మరేమిటి? ’’


‘ ఏమోరా నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ కావడం లేదు. సావిత్రిని తప్ప మరొకరిని మహానటి అంటే ఒప్పుకోబుద్ధి కావడం లేదు’’
‘‘ సావిత్రి మహానటే కాదనను, ఆమె సినిమాల్లో తప్ప కనీసం జీవితంలో కూడా నటించలేకపోయారు. మరి జయప్రద సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో సైతం అద్భుతంగా జీవించేస్తున్నారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా జయప్రద మహానటి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని సినిమాలో పాడినా, రాజకీయ జీవితంలో మాత్రం పారేసుకోకుండా జాగ్రత్తగా అరేసుకుంటున్నారు. ’’


‘‘ఏంటో నీ అభిమానం మరీ మితిమీరిపోతోంది’’
‘‘నా అభిమానం కాదు... ఈ మాట నీతో కూడా చెప్పిస్తాను చూడు. నాటకంలో ఎప్పుడు ప్రవేశించడమో తెలియడమే కాదు.. ఎప్పుడు దిగిపోవాలో తెలిసిన వాడే మంచినటుడు అంటారు కదా? అలాంటి లెక్కలు తెలియక పోవడం వల్లనే కదా మెగస్టార్లు కూడా జీరో అయ్యారు. లెక్కలు తెలిసి  ఎన్టీఆర్ హీరో అయ్యారు. ’’


‘‘ఎన్టీఆర్, చిరంజీవి, జయప్రద.. ఒకరితో ఒకరికి ఏం సంబంధం? ’’
‘‘అక్కడికే వస్తున్నా? ఎంత వీరాభిమానులున్నా 60 ఏళ్ల తరువాత హీరోగా అవకాశాలు ఉండవని గ్రహించి సరైన సమయంలో సినిమా నటన వదిలి ఎన్టీఆర్ రాజకీయ నాటక రంగంపైకి వచ్చారు. విజయం సాధించారు. అదే చిరంజీవి ఏం చేశారు 2009 ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి బొక్క బోర్లా పడ్డారు. అదే అంత కన్నా ముందు 2004 ఎన్నికల్లో వచ్చినా, లేక 2014 ఎన్నికల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చినా ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఆయనకు కూడా తెలియని పరిస్థితి’’


‘‘నిజమే! పాపం ప్రజా సేవ చేసేందుకు చిరంజీవికి కాలం కలిసి రాలేదు’’
‘‘అదే జయప్రద ఏం చేశారో 94లో హీరోయిన్‌గా కాలం చెల్లిందని గ్రహించే ముందు ఎన్టీఆర్ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని 82లోనే ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. కానీ అప్పుడు హీరోయిన్‌గా దూకుడు మీదున్న జయప్రద పనె్నండేళ్ల తరువాత ఆపిలుపునకు స్పందించారు. తెలుగులో అవకాశాలు ఉండగానే హిందీ సినిమాల్లోకి వెళ్లినట్టు తెలుగునాట తన రాజకీయాలకు కాలం చెల్లగానే ఢిల్లీలో వాలిపోయారు. అమర్‌సింగ్‌ను ఆశ్రయించి అప్పటి వరకు పేరు కూడా వినని రాంపూర్ మట్టిని ముద్దాడి ఇక ఇదే నా పుట్టిల్లు అని ఎంత చక్కగా డైలాగు చెప్పారు. పదేళ్లపాటు ఆమెను రాంపూర్‌కా రాణి అన్నట్టుగా చూశారా ప్రజలు. అమర్‌సింగ్ కాలం కలిసిరాకపోవడంతో జయప్రద ఆలోచనల్లో పడ్డారు. ఏమిటీ? నా రాజకీయ భవిష్యత్తు అని ఆమె దీర్ఘంగా ఆలోచిస్తుండగా, నరేంద్ర మోదీ ఆశాకిరణంలా కనిపించారు. మోదీ చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అంటూ మీడియా ముందు దేశ ప్రజలకు ఆమె సందేశం ఇస్తున్నారు’’


‘‘ఐనా ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే బిజెపిలో భవిష్యత్తు ఉంటుందని, ఇతరులను నమ్మరు అంటారు కదా? ’’
‘‘ పిచ్చోడా అదంతా అధికారంలోకి రాకముందే. ఎన్నికల ముందు కెసిఆర్ ఏమన్నారు. ఉద్యమం ముగిసింది,తెలంగాణ వచ్చింది ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారా?లేదా? ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా చేర్చుకోవచ్చు అని, అలా చేస్తేనే కదా? అధికారం నాలుగు కాలాలా పాటు పదిలంగా ఉంటుంది. ’’


‘‘ఇప్పుడు బిజెపి కూడా అంతే ఫక్తు రాజకీయ పార్టీ. సినిమాల్లో కథ నుంచి కాస్సేపు రిలీప్ కోసం ఐటం సాంగ్స్ పెట్టినట్టు.. సీరియస్ రాజకీయాల్లో కాసింతైనా మనోల్లాసం కోసం ఎన్నికల సమయంలో సినిమా తారలను పార్టీల్లో చేర్చుకుంటారు. ఈ విషయం చేరిన వారికి తెలుసు, చేర్చుకునే వారికీ తెలుసు. ఓటేసే వారికి ఇంకా బాగాతెలుసు. అంతా ఓ నాటకం.’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం