25, జనవరి 2015, ఆదివారం

అల్లుడు గారి తాతమ్మ కల!

‘‘ఏనాటికైనా ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు అల్లుడు గారే అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?? ’’
‘‘ఏంటో అల్లుడిగారిలో నేను ఒప్పుకునేంత గొప్ప మార్పు ఏమొచ్చింది? మనం ఎన్ననుకున్నా, కారణాలు ఏమైనా అన్నగారి పార్టీ అల్లుడిదే అని కోర్టులు కూడా తేల్చేశాయి. ప్రజలు ఓటు కూడా వేసేసి అధికారం అప్పగించారు. నీ, నా ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వల్ల వచ్చేదేముంది? పోయేదేముంది? ’’


‘‘ప్రజలిచ్చిన తీర్పు గురించి కాదు నేను చెప్పాలనుకున్నది ’’
‘‘ఏంటో మరి నేరుగా చెప్పు’’
‘‘అల్లుడు గారు ఏమన్నారు? ’’
‘‘నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలా కష్టమోయ్! కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్, మీలో ఎవరు కోటీశ్వరుడులో నాగార్జున చివరి రౌండ్‌లో ఇలాంటి ప్రశ్న అడిగితే హాట్ సీట్‌లో ఉన్నవారు పిచ్చేక్కి సీటు దిగివెళ్లిపోతారు. అలాంటి సంద ర్భం కోసం ఈ ప్రశ్న దాచిపెట్టుకోవాలి కానీ నువ్వు నన్నడిగితే ఎలా?’’


‘‘జోక్ కాదు నేను సీరియస్‌గానే అడుగుతున్నాను’’
‘‘నేను కూడా సీరియస్‌గానే చెబుతున్నాను. బాబుగారు రోజుకు మూడు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి అనేక సందేశాలు ఇస్తుంటారు. ఈ లోగా నాలుగైదు లీకేజీలు, రెండు మూడు వీడియో కాన్ఫరెన్స్‌లో, మరో ఒకటో రెండో మనసులోని మాట అంటూ ఏవో విడుదల అవుతుంటాయి. ఆయన చెప్పారని చానల్స్‌లో వార్తా ప్రవా హం వస్తుంటుంది. సరే 24 గంటల న్యూస్ చానల్స్‌లో బతికించేందుకు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. సంతోషం. నువ్వే చెప్పు గంటకు కొన్ని డజన్ల మాటలు చెప్పే నాయకుడి గురించి బాబుగారు ఏమన్నారు అని అడిగితే, నేనేం సమాధానం ఇవ్వాలి’’
‘‘నిజమే... సరే నేరుగా విషయంలోకి వస్తాను... పిల్లలను కనడం గురించి బాబుగారేమన్నారు? ’’


‘‘ఓ అదా? ఇంతకు ముందు చిన్నకుటుంబం గురించి నేనే పిలుపు ఇచ్చాను అన్నారు’’
‘‘ఆ తరువాత ఏమన్నారు? ’’
‘‘అప్పుడలా పిలుపు ఇచ్చింది నేనే.. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కువైనా సరే అర్జంట్‌గా కనేయండి అని పిలుపు ఇచ్చారు.. దాని గురించేనా? నువ్వు చెప్పాలనుకున్నది. దీంట్లో ఎన్టీఆర్ వారసత్వం ఏముంది? ఆయన మార్గంలో అల్లుడు గారు పయనించడం ఏముంది? ’’
‘‘మామ గారు కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకి అయితే అల్లుడు గారు రాజకీయంగా పుట్టింది కాంగ్రెస్‌లోనే. మామ సినిమాల్లో మాత్రమే నటిస్తే, అల్లుడు రాజకీయ నటనలో జీవించేస్తారు. ఆలోచనలు, అలవాట్లు, వృత్తి ప్రవృత్తి, మాట తీరు, సంపాదన అన్నింటిలో మామా అల్లుళ్ల వ్యవహారం తూర్పు పడమర కదా? ఔను అంతే కాదు చివరకు మామ గారికి ఒకరు తక్కువ ఒక డజను సంతానం ఉంటే.. అల్లుడి గారికి ఒకరే సంతానం.’’
‘‘అలా రంధ్రానే్వషణ చేయకు. నేను చెప్పాలనుకున్న దానికి సపోర్ట్‌గా నీకేమీ ఉదాహరణలు దొరకవా? ’’
‘‘నాకేమీ దొరకడం లేదు. నీకు దొరకితే చెప్పు వింటాను’’
‘‘ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమా తాతమ్మ కల గురించి తెలుసా? ’’


‘‘అప్పుడే కాదు దానవీర శూరకర్ణ ఇప్పటికీ అద్భుతంగా నిలిచే సినిమా.. అలాంటి సినిమాను వదిలిపెట్టి ఎవరికీ పెద్దగా గుర్తుండని తాతమ్మ కల గుర్తుకొచ్చిందెందుకు నీకు? ’’
‘‘ పేరు తాతమ్మ కల అయినా ఆ సినిమా ఎన్టీఆర్ అలోచనలకు రూపం. నటనా, దర్శకత్వం అన్నీ ఆయనే. అంతే కాదు చివరకు ఆ సినిమాలో నటించింది కూడా ఆయన పిల్లలే. 74లో వచ్చిన ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. అధిక సంతానానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ యుద్ధం ప్రకటిస్తే, ఎమో ఎవరు చెప్పొచ్చారు, అధిక సంతానం ఉంటే అందలో చివరి వాడే కుటుంబాన్ని ఆదుకునేవాడు కావచ్చు అంటూ ఎన్టీఆర్ కథ నిర్ణయించి, దర్శకత్వం వహించి తాతమ్మకల తీశారు. తాతమ్మ కుమారుడికి ఐదుగురు కొడుకులు. వీరిలో నలుగురు పనికిరాని వారుగా తేలితే ఐదవ వాడు ప్రయోజకుడై తాతమ్మ కల తీరుస్తాడు. ఆ ఐదవ కుమారుడిగా నందమూరి బాలకృష్ణ నటించాడు. ఆయన తొలి సినిమా ఇదే. ఇదీ కథ. ఎక్కువ సంతానం ఉండాలని చెప్పడమే కాదు ఎన్టీఆర్ ఆచరణలో కూడా చూపించారు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ నమ్మిన తాతమ్మకల సిద్ధాంతాన్ని ఇంత కాలానికి అల్లుడు గారు కూడా ప్రచారం చేస్తున్నారంటే, మెచ్చుకోకుండా ఏవేవో గుర్తు చేస్తావేంటి? ’’
‘‘పాత సినిమాల్లో తరుచుగా వినిపించే విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో! ఎన్టీఆర్ తాతమ్మ కలలో ఐదుగురిలో చివరి వాడు కల నెరవేరిస్తే, ఎన్టీఆర్‌కు నిజ జీవితంలో పదకొండు మంది సంతానంలో ఒక్కరు కూడా ఆయన కల తీర్చలేదు. ఆ సినిమాలోలానే బాలకృష్ణ తన వారసుడిగా నిలవాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. కానీ చివరకు 11 మంది సంతానం ఉన్నా అల్లుడే రాజకీయ వారసుడయ్యాడు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చిన ఎన్టీఆర్‌కు 11 మంది సంతానంలో కుమారుడో, కుమార్తెనో రాజకీయ వారసులు కాకుండా అల్లుడే రాజకీయ వారసుడు కావడం వింత కాకపోతే మరేంటి? బాలకృష్ణ నా రాజకీయ వారసుడు అని ఎన్టీఆర్ ప్రకటించగానే అల్లుడు గారు అలిగి ఆ ప్రకటనను ఉద్దేశం అది కాదని చెప్పేంత వరకు ఊరుకోలేదు’’
‘‘నేనేదో చెబుతుంటే నువ్వెక్కడికో వెళుతున్నావు? ’’
‘‘సర్లే ఇప్పుడు అల్లుడి గారిది గొప్ప నినాదం, మామకు ఆయనే వారసుడు అని ఒప్పుకోమంటావు? ’’
‘‘ఒప్పుకోమని బలవంతం పెట్టడం లేదు. నిజమా? కదా? చెప్పమంటున్నాను? ఆయనెవరో ఐదుగురు పిల్లల్ని కనమంటే దేశమంతా చర్చ పెట్టారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో బిజీబిజీగా ఉన్న అల్లుడు గారు పిల్లల్ని కనడంలో మీరు బిజీబిజీగా ఉండండి అని ఈ కాలంలో పిలుపు ఇవ్వడం ధైర్యం కాకపోతే మరేంటి?
‘‘సర్లే నీ మాట ఎందుకు కాదనాలి? అల్లుడు గారి సరికొత్త ఉద్యమం అభినందనీయం. ఈ ఉద్యమానికి ఓ బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తే బాగుంటుందేమో!’’
‘‘వెరీగుడ్ ఇప్పుడు దారిలోకి వచ్చావు’’


‘‘లాలూ ప్రసాద్ యాదవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటారా?’’
‘‘ఎన్‌డిఏలో ఉంటూ థర్డ్ ఫ్రంట్ నాయకుడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకుంటే బాగోదేమో? ’’
‘‘నిజమే పోనీ చినబాబుగారిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే ఎలా ఉంటుంది? ’’
‘‘ఆ !!! ??? ’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం