8, మార్చి 2015, ఆదివారం

మోడీ , కెసిఆర్ , కేజ్రివాల్ , బాబు , అమృతాంజనం... ఎవరు శక్తి వంతులు ?

‘‘నరేంద్ర మోదీ, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురిలో ఎవరు గొప్పంటావు? ’’
‘‘నువ్వో ప్రశ్న అడిగావంటే నా నుంచి సమాధానం కోసం కాదు. ఆ ప్రశ్నకు నీ దగ్గరో సమాధానం ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు నువ్వు ఆశిస్తున్న సమాధానం ఏమిటో కూడా నువ్వే చెప్పు వింటాను’’
‘‘ నాకైతే నరేంద్ర మోదీని మించిన నాయకుడు లేడనిపిస్తోంది’’
‘‘ ప్రపంచంలో నెటిజన్ల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వారిలో అమెరికా అధ్యక్షుడిది మొదటి స్థానం అయితే రెండవ స్థానం మోదీది.. ’’
‘‘నీ అభిప్రాయం నీ ఇష్టం. వెనకటికో ఎలుకకు పెళ్లీడు రాగానే తమ తోటి మగ ఎలుకలు పెళ్లి ప్రపోజ్ చేశాయి. ఛీ.. ఇంత అందగత్తెనైన నేను మీలాంటి వాళ్లను చేసుకునే ప్రసక్తే లేదు. అత్యంత శక్తివంతులు ఎవరో వాళ్లనే చేసుకుంటాను అందట. పులి, ఎనుగు, చివరకు నీరు,నీప్పు అన్నీంటిని తిరస్కరించింది. అన్నింటిని ఎదురొడ్డి నిలిచే కొండ చూసి మనసు పారేసుకుని కొండే శక్తివంతమైందని దాన్ని పెళ్లి చేసుకోవాలనుకొని ప్రపోజ్ చేసింది. కొండ నవ్వి నేను శక్తివంతమైన దానే్న కానీ ఎలుక నాకన్నా శక్తివంతమైంది. నా కింద కన్నం వేసి మట్టిని తొలచి నేను పడిపోయేట్టు చేసేంత శక్తి ఎలుకకు ఉందని చెప్పుకొచ్చింది. దాంతో బుద్ధిగా ఆ ఎలుక మరో ఎలుకతో జత కట్టింది’’
‘‘నేను మోదీ గురించి అడుగుతుంటే నువ్వు ఎలుక గురించి చెబుతున్నావు. మోదీ అంటే అంత చిన్నచూపా? ’’
‘‘ నేనెక్కడ చిన్నచూపు చూశాను. పర్వతం లాంటి మోదీని చిట్టెలుక లాంటి కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీలో చిత్తుగా ఓడించలేదా? ’’
‘‘ సరే పోనీ కేజ్రీవాల్ అందరి కన్నా శక్తివంతమైన నాయకుడనుకోవచ్చా’’
‘‘ ఆ మాట నేనెక్కడన్నాను. మోదీని కేజ్రీవాల్ ఓడిస్తే, కేజ్రీవాల్‌ను జలుబు ముప్పు తిప్పలు పెడుతూ అధికారంలోకి వచ్చాననే సంతోషం కూడా లేకుండా చేసింది. దేశమంతా గెలిచిన ఆనందం లేకుండా మోదీకి కేజ్రీవాల్ చేస్తే, కేజ్రీవాల్‌కు అనందం లేకుండా జలుబు చేసింది. అలాంటి జలుబుకు అమృతాంజనం లోకువ అనుకో అది వేరేవిషయం’’
‘‘ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అత్యంత శక్తివంతమైన నాయకుడు. 14 ఏళ్లపాటు ఉద్యమం జరిపి, అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించి చూపించాడు. చెన్నారెడ్డి చేయలేనిది కెసిఆర్ చేశాడు. చెన్నారెడ్డికి ఇందిరాగాంధీ కూడా భయపడేదట! చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచితే ప్రమాదం అనేదట! అలాంటి చెన్నారెడ్డి వల్ల కానిది కెసిఆర్ వల్ల అయిందంటే కెసిఆర్ శక్తివంతమైన నాయకుడే కదా? ’’
‘‘ముందే చెప్పాను. నీ అభిప్రాయం నీ ఇష్టం అని కానీ అలానే నీ లాజిక్ నీ ఇష్టం నీ లాజిక్‌తో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు’’
‘‘ అంటే ఇంతకూ చెన్నారెడ్డి కన్నా కెసిఆర్ శక్తివంతుడు అని ఒప్పుకుంటున్నావా? లేదా? ’’
‘‘ నువ్వు చెప్పిన లాజిక్ తరహాలోనే కొన్ని లాజిక్‌లు చెబుతాను. అప్పుడు నువ్వే చెప్పు నీ లాజిక్ సరైనదో కాదో? వాజ్‌పాయి లాంటి ప్రతిపక్ష నాయకుడు సైతం ఇందిరాగాంధీని శక్తిమాత అని కొనియాడారు. పాకిస్తాన్‌పై విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావం కావడానికి ఆమె చూపిన ధైర్యానికి ప్రతిపక్ష నాయకుడు సైతం మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. అలాంటి ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ శక్తి ముందు నిలువలేకపోయారు. తొలి వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా జనం స్పందన చూసి ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేట్టు చేశారు. అంటే నీ లాజిక్ ప్రకారం ఇందిరాగాంధీ కన్నా ఎన్టీఆర్ శక్తివంతుడు. ఆగాగు నా మాట పూర్తి కానివ్వు. టిడిపి అభిమానుల భాషలో చెప్పాలంటే ఇందిరాగాంధీ మెడలు వంచిన నాయకుడు ఎన్టీఆర్ కదా? అలాంటి ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించింది ఎవరు బాబుగారు. నల్లరంగు దుస్తులు వేసుకోని ఊళ్లన్నీ తిరుగుతూ ఎన్టీఆర్ నాకు అన్యాయం జరిగిందని ఘోషించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక చివరకు ఎన్టీఆర్ కన్ను మూశారు. ఇప్పుడు చెప్పు ఇందిరాగాంధీ మెడలు వంచిన ఎన్టీఆర్‌ను సైతం మట్టికరిపించిన చంద్రబాబు నీ లాజిక్ ప్రకారం ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ల కన్నా శక్తివంతుడే కదా? అవును అని నువ్వు చెబితే , మరి అంతటి శక్తి వంతుడు బాబును 2004 ఎన్నికల్లో 47 సీట్లకు పరిమితం చేసి ఘోరంగా ఓడించిన వై యస్ ఆర్ వీరందరి కన్నా శక్తి వంతుడు అని ఒప్పుకోవాలి  ’’
‘‘నా వాదనను నువ్వు సమర్ధిస్తున్నట్టే సమర్ధిస్తున్నావు కానీ వ్యతిరేకిస్తున్నావు. ఇంతకూ నువ్వు చెప్పు ఎవరి శక్తివంతుడు? ’’


‘‘ మహాభారత యుద్ధాన్ని అంతా శ్రీకృష్ణుడు ఒంటి చేత్తో నడిపించాడు. అలాంటి శ్రీకృష్ణున్ని కోన్ కిస్కా సామాన్యుడు బాణం పుల్లతో పైకి పంపించేశాడు. కాబట్టి అతను శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడు అందామా? ఇచ్ఛాపూర్వకంగా కోరుకున్నప్పుడు మరణించేంత గొప్ప వరపుత్రుడు, మహాశక్తివంతుడు భీష్ముడి మరణానికి శిఖండి కారణం. అంత మాత్రాన భీష్ముడి కన్నా శిఖండి శక్తివంతుడందామా? పురాణాల్లోనే కాదు ఫ్యాక్షన్‌లోనే ఇలాంటి సిత్రాలు జరుగుతుంటాయి. ఫ్యాక్షన్‌లో కోట్లు సంపాదించిన శక్తివంతులను కోన్ కిస్కా ఎవరో ఎవరి కళ్లల్లోనే ఆనందం చూడాలనుకుని పైకి పంపిస్తుంటారు. ’’


‘‘ మరి నీ వాదన ప్రకారం శక్తివంతులు అంటూ ఎవరూ లేరా? ’’
‘‘ అని నేనెక్కడన్నాను. ఎందుకు లేరు ఉన్నారు. పురాణాల కాలం నుంచి నేటి బూతు పురాణ కాలం వరకు శక్తివంతుడు ఒకే ఒకరు ’’
‘‘ ఎవరు దేవుడా? ’’
‘‘ పిల్ల రాక్షసుల చేతిలో పడి పరుగులు తీసిన దేవుళ్ల కథలు మనకు ఎన్ని తెలియవు’’
‘‘ మరి ఇంతకూ ఎవరయ్యా బాబు శక్తివంతుడు. ఎవరి పేరు చెప్పినా కాదంటావు? నువ్వు చెప్పవు’’
‘‘ సమాధానం చెప్పనని ఎప్పుడన్నాను’’
‘‘ మరి చెప్పు సమాధానం’’
‘‘ కాలం.. ఔను అందరి కన్నా శక్తివంతమైంది కాలం. కేజ్రీవాల్‌కు కాలం కలిసొచ్చింది బిజెపియేతర ఓటర్లు ఏకమయ్యారు గెలిచాడు అంతే తప్ప మోదీ కన్నా శక్తివంతుడు అని కాదు. అలానే కాలం కలిసి రావడంతో కెసిఆర్ వల్ల తెలంగాణ సాకారం అయింది అంతే తప్ప చెన్నారెడ్డి కన్నా ఎక్కువ తక్కువ అని కాదు. బాబుకు కాలం కలిసి రావడంతో ఎన్టీఆర్ నిర్వీర్యుడు అయిపోయాడు కానీ ఇందిరాగాంధీ కన్నా బాబు శక్తివంతుడు అని కాదు. బాబు పదేళ్ళ పాలనతో రాజశేఖర్ రెడ్డికి కాలం కలిసి వచ్చింది ..  నేతలను విజేతలుగా చేసేది పరాజితులుగా మార్చేది కాలమే.

- బుద్దా మురళి 

4 కామెంట్‌లు:

  1. చాలా చక్కటి అనాలిసిస్. కాలం కలిసొచ్చి విజయం సాధించిన ప్రతి వాడూ అది తన గొప్పేననుకుంటాడు.విర్ర వీగు తాడు. అదే కాలం కలిసి రాక మట్టిపాలవుతాడు.ఇది చరిత్ర చెప్పిన సత్యం.

    రిప్లయితొలగించండి
  2. మొత్తానికి ఇదొక విషవలయం అంటారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం