24, ఫిబ్రవరి 2015, మంగళవారం

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్


తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ గురించి వివిధ సందర్భాల్లో వినిపించిన స్వర సమ్మేళనమిది. 

అసాధ్యం అనుకున్న లక్ష్యం కాస్తా సాకారం అయింది. తెలంగాణ పురుడు పోసుకొని తొమ్మిది నెలలవుతోంది. తెలంగాణ ఉద్యమం అర్థం కానట్టే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ ఎత్తుగడలు సైతం అర్థం కాని పజిల్. ఒకవైపు తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు , ఇటువైపు మంత్రిగా కొద్దికాలం, ఉద్యమ నాయకుడిగా దశాబ్దన్నర కాలం అనుభవం ఉన్న కెసిఆర్. ఏం పాలిస్తాడు చూద్దాం అని మనసులోనే అనుకున్నవారు ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు.
రాజకీయ నాయకుల్లో సరుకు ఉంటే తప్ప ఐఎఎస్ అధికారులు పట్టించుకోరు. పైకి సార్ సార్ అంటూ మంత్రులను గౌరవించినా, వారిలో విషయ పరిజ్ఞానం లేకపోతే అస్సలు పట్టించుకోరు. కెసిఆర్‌లో ఇలాంటి సరుకు ఐఎఎస్‌లు సైతం రాముడు మంచి బాలుడు టైపులో వినయంగా పని చేయక తప్పని స్థాయిలో ఉంది. ఏ అంశంపైనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధికారికంగా మాట్లాడడం కెసిఆర్ నైజం. ఉద్యమ కాలంలోనైనా ముఖ్యమంత్రిగా నైనా ఈ విధానంలో మార్పు లేదు.
14ఏళ్ల ఉద్యమం. ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లెఫ్టిస్ట్‌లు, రైటిస్ట్‌లు అనే తేడా లేకుండా తెలంగాణకు చెందిన వారంతా ఉద్యమ బాట పట్టారు. అయితే ఉద్యమానికి అనుకూలంగా కావచ్చు లేదంటే ఉద్యమానికి వ్యతిరేకంగా కావచ్చు, కానీ తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యారు. ఈ సమయంలో ఎంతో మంది కెసిఆర్‌తో సన్నిహితంగా మెదిలారు.
ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే పక్కన ఓ పీట వేసుకుని పాలనలో చేదోడు వాదోడుగా ఉందామని కలలు కన్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక్కసారిగా మారిన కెసిఆర్‌ను చూసిన వారు అతి సన్నిహితులు సైతం విస్తుపోయారు. ఆయన చేతిలో సంతకం చేసే పెన్నుగా మారిపోదామనుకుని కలలు కన్న వారికి ధర్మదర్శనం కూడా దక్కని పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి ఎవరు అధికారంలోకి వచ్చినా మమ్ములను ప్రసన్నం చేసుకోందే రోజు గడవలేదు. ఎక్కడికి వెళతాడు చూద్దాం అనుకున్న వారు సైతం రోజులు గడిచిన కొద్ది డీలా పడిపోయారు. పిలుపు రాకపోవడంతో తామే చొరవ తీసుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినా ఫలించలేదు.
ఇలాంటి ప్రయత్నాలను చూసినప్పుడు ముఖ్యమంత్రి అహంకారంతో అందరినీ దూరంగా పెట్టాడనుకుంటే పొరపాటు. ఎంతో సన్నిహితంగా మెదిలిన మహామహులను సైతం దూరంగా పెట్టిన అదే కెసిఆర్ ఎక్కడో మారుమూల పల్లెలో నివసించే సాధారణ రైతును పేరు పెట్టిపిలుస్తాడు. అప్పుడే మరిచిపోయావా? మనం గతంలో కలిశాం మీది పలానా ఊరు కదూ అంటూ సామాన్యుడిని పలకరిస్తాడు. మరో రైతును ఇంటికి పిలిచి కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి తీసుకు వచ్చి అధికారులను, మంత్రులను పరిచయం చేస్తారు.
కెసిఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో రైతులు సమస్యలు చెబుతుంటే ఒక రైతు లేచి ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య చెబుతుంటే ముఖ్యమంత్రి అతన్ని గుర్తు పట్టి మీద దొంగల రామారం గ్రామం కదూ అంటూ అతని గురించి చెప్పుకొచ్చారు. సాగునీటి కోసం తన పొలంలో 64 బోర్లు వేసి చివరకు ఆయన పేరే బోర్ల రామిరెడ్డిగా స్థిరపడింది. నల్లగొండ జిల్లాకు చెందిన బోర్ల రామిరెడ్డి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే కెసిఆర్ ఏకంగా రామిరెడ్డితో పాటు ఆ గ్రామస్తులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి, కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి వెళ్లారు. అధికారులు, మంత్రులను పిలిచి రామిరెడ్డి చెప్పిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవైపు ఉద్యమ కాలంలో పెద్దపీట వేసిన వారిని పెద్దగా పట్టించుకోని వైఖరి మరోవైపు సామాన్యులకు చేరువ కావడం.
తానో పజిల్‌లా ఎదుటి వారికి అర్థం కాకుండా ఉండడం కెసిఆర్‌కు అలవాటు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఎర్రగడ్డ ఆస్పత్రిని వదిలేది లేదని నినాదాలు చేశారు. ఇదో మహోద్యమంగా మారుతుందని విపక్షాలు ఎంతో ఆశలు పెట్టుకున్నాయి. ఆస్పత్రి ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. టిబి ఆస్పత్రి ఉండాల్సింది ఊరవతలనే.. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీడియా ముందుకు వచ్చి కితాబు ఇచ్చారు.
సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు అంటూ మీడియాకు సమాచారం లీకు ఇచ్చారు. మీడియా ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇంకేం కెసిఆర్ చేతికి చిక్కాడు అంటూ అవకాశం కోసం కాచుకుని కూర్చున్న టిడిపితో పాటు వ్యతిరేక శక్తులన్నీ మహోద్యమానికి సన్నద్ధం అయ్యాయి. కనీసం 24 గంటలు కూడా గడవకముందే అదే జర్నలిస్టులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకునేట్టు చేశారు. మీకేం కావాలో, నిబంధనలు ఎలా ఉండాలో మీరే చెప్పండి చేయడానికి నేను సిద్ధం అంటూ తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చినంతగా చెప్పేశారు. ఇళ్లు, హెల్త్ కార్డులు, కుటుంబ సంక్షేమం సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా కోరేదేముంటుంది. ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆదాయంలో వాటాలు కోరుకునే బడా జర్నలిస్టుల సంగతి పక్కన పెడితే వృత్తినే నమ్ముకున్న సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా ఏం కోరుకుంటారు. జర్నలిస్టులతో కలిసి ఉద్యమం నడపాలని సన్నాహాలు చేసుకున్న వర్గాలకు ముఖ్యమంత్రి కానుక తీవ్ర నిరాశను కలిగించింది.
ఏ వర్గానికి ప్రయోజనం కలిగించదలిచారో ముందు ఆ వర్గం నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకోవడం కెసిఆర్‌కు ఓ సరదా! అంతకు ముందు మెట్రో రైల్ యజమాన్యంతో కలిసి ఆందోళన చేద్దాం అనుకున్న వర్గాన్ని సైతం ఇదే విధంగా నిరాశ పరిచారు. హరిత హారం, చెరువుల పూడిక తీసివేత వంటి వినూత్న పథకాలే కాదు చివరకు పిఆర్‌సిని సైతం అనుభవజ్ఞులైన పాలకుడు కాపీ కొట్టేట్టు చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.
ప్రత్యర్థి ఒక వ్యూహంతో దాడికి సిద్ధంగా ఉంటే సరిగ్గా దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు ఆయుధమే లేకుండా చేయడంలో కెసిఆర్‌ది అందెవేసిన రాజకీయం. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లపై ఆధారపడి విపక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటే... హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అంటూ వారికి భరోసా ఇస్తారు. ఉద్యమ నేత వాళ్ళూ మా వాళ్లే అంటే, వాళ్ల ఓట్లను నమ్ముకున్న విపక్షాలు కాదు కానే కాదు వాళ్లు సెటిలర్సే అనాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ ఎత్తుగడ ఎంత వరకు ఫలిస్తుందో కానీ విపక్షాలకు ఈ రాజకీయం మింగుడు పడడం లేదు.
కెసిఆర్ మీడియాతో సన్నిహితంగా ఉన్నారా? ఉద్యమ నాయకులను గౌరవిస్తున్నారా? సామాజిక వర్గాల వారీగా ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మంత్రిని తొలగించడం సబమా? ఎన్‌డిఏలో చేరుతారా? ఎంఐఎంతో సన్నిహితంగా మెదులుతారా? బిజెపితో జత కడతారా? ఏం చేస్తే ఏమవుతుంది అనే లెక్కలు విమర్శకులకు అవసరమే. విపక్షాలకూ అవసరమే. కానీ సామాన్య ప్రజలు ఈ లెక్కలను పెద్దగా ఖాతరు చేయరు. తెలంగాణ ఏర్పడితే ఏ ప్రయోజనం కలుతుందని సామాన్యులు ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేరితేనే కెసిఆర్ విజయానికి అర్థం. సామాన్యులు ఆశించింది, వారికి కావలసింది తమ పరిస్థితి మెరుగు పడడం. ఇప్పటి వరకు ప్రణాళికలు రూపొందించారు. ఇక వాటి అమలు జరగాలి.
కాంగ్రెస్‌ను నడిపించేందుకు ఆ పార్టీ లో  బలమైన నాయకుడే లేడు. ఎవరి మాట ఎవరు వినరు.  టిడిపికి సీమాంధ్ర పార్టీ అనే ముద్ర చాలు. తెలంగాణా టిడిపికి  బాబు నాయకత్వం వహించడం టిడిపి కన్నా తెరాస కే  ఎక్కువ ప్రయోజనం .   ప్రత్యర్థుల బలహీనతల వల్ల కెసిఆర్  కు రాజకీయంగా ఎదురు లేదు. భవిష్యత్తులో సైతం ఆయన విజయానికి ఢోకా ఉండక పోవచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు సంతృప్తినిచ్చే విజయం కాబోదు. 

ఇంటింటికి తాగునీరు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసరా వంటి పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్శించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, చెప్పినట్టుగా ప్రతి చేనుకు నీరు అందించడం, విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడమే కెసిఆర్ పాలనకు నిజమైన విజయం. ఈ మాటలు నిజమైనప్పుడే సాధించిన తెలంగాణకు అర్థం. అంతే తప్ప ఎవరెవరికో పదవులు కట్టబెట్టడం, ఏదో కొంత మందిని సంతృప్తి పరచడం కాదు. ఈ విజయాల సాధనకు నడుం బిగించడం ముఖ్యం. ఉద్యమ సమయంలో తెలంగాణా ఏర్పాటును ;అడ్డుకోవాలని  లెక్కలేనన్ని చిల్లర ఆరోపణలు చేసినా తెలంగాణ కోరుకునే వారు మాత్రం కెసిఆర్ నాయకత్వాన్నే  విశ్వసించారు.
ఇప్పుడు  హుస్సేన్ సాగర్ మురికి ప్రక్షాళనను సైతం సహించ లేదని విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే పాలనా కాలంలోనైనా విమర్శలు సహజమే అంతిమంగా సామాన్య తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగాలి. 

ప్రత్యర్థులను మట్టికరిపించే ఎత్తుగడలు అవసరమే, కానీ ప్రజల హృదయాలను ఆకట్టుకోవడానికి ఎత్తుగడలు, షార్ట్‌కట్‌లను నమ్ముకోవద్దు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలి. అప్పుడే తెలంగాణ కోరుకున్న వారికి సంతృప్తి.
చెరువుల పూడిక తీసివేత కార్యక్రమానికి గద్దర్ తన పాటను జత చేస్తున్నారు .. ప్రాణాలకు తెగించి పాలకుల తప్పును నిలదీసే ఉద్యమ కారులు , మంచి జరుగుతుంటే తమ వంతు సహకారం అందిస్తారు .. ఇది తెలంగాణా కు దక్కిన  అదృష్టం .. తప్పు జర్తిగితే అదే గళం ప్రశ్నిస్తుంది 
  • - బుద్దా మురళి
  •  
  • 24/02/2015
.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం