19, అక్టోబర్ 2015, సోమవారం

మేలుకో మేధావి మేలుకో

‘‘రండన్నయ్య గారూ రండి. ఆయన లోపల సీరియస్‌గా రాసుకుంటున్నారు. ’’
‘‘ ఏరా అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్ . పాకిస్తాన్ ఏమైనా యుద్ధానికి సిద్ధమైందా? ఏంటి? ’’
‘‘ అంత కన్నా ప్రమాదకరమైన విషయం. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు.. ఎవడి వల్లా కాదు..’’
‘‘ విషయం చెప్పకుండా అచ్చం అలా టీవిలో మాట్లాడినట్టు మాట్లాడితే నాకేం అర్ధమవుతుంది? చిన్ననాటి మిత్రున్ని కలుద్దామని వస్తే నువ్వు అంత సీరియస్‌గా ఉండి, నన్ను అయోమయంలో పడేస్తే ఎలా? ’’
‘‘ ఈ దేశాన్ని పాలించే వాళ్లు ఏం చేస్తున్నట్టు నిద్ర పోతున్నారా? మిలట్రీ ఏం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ ఏం చేస్తున్నాడు పారిక్ ఎక్కడున్నాడు. సుష్మ నుంచి ఎంతో ఆశించాం. ఇలా చేస్తుందని అనుకోలేదు. ?’’
‘‘ వావ్ మన క్లాస్‌మెట్ సుష్మ నీకు టచ్‌లోనే ఉందా? కాలేజీ బ్యూటీ చదువుకునేప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడాలంటేనే భయం. సుష్మతో పాటు అన్నపూర్ణ, శోభ ఇంకా లత ఉండేవాళ్లు కదా? అబ్బ ఎంత చలాకీగా ఉండేవాళ్లో. అప్పుడేమో మాట్లాడేందుకు ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడేమో మాట్లాడదామంటే వాళ్ల ఫోన్ నంబర్ తెలియదు. జీవితం ఇంతేరా? కనీసం ఆ సుష్మ ఫోన్ నంబర్ ఉన్నా ఇవ్వరా? మాట్లాడతా? ’’
‘‘అందుకే చెప్పాను ఈ దేశాన్ని బాగు చేయడం ఎవడి వల్లా కాదని. నేను చెబుతున్నది దేశం గురించి. సుష్మ అంటే మన క్లాస్ మెట్ కాదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి. అయినా 50 ఏళ్ల వయసొచ్చినా ఇంకా నీకు అనాటి అమ్మాయిలతో మాట్లాడాలని ఉంది కానీ ఈ దేశానికి వస్తున్న ప్రమాదం గురించి కొంచం కూడా బాధలేదా? ’’
‘‘ సుష్మ అని అంత చనువుగా అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని ఎలా అనుకుంటానురా! క్లాస్‌మెట్ సుష్మను గుర్తు చేసుకున్నావేమో అనుకున్నా. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్‌రా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను చిన్నప్పటి ప్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా పిలుస్తావంటే నీ అదృష్టం చూస్తే కన్ను కుడుతోందిరా! ’’
‘‘ ఇదిగోండి అన్నగారు టీ తీసుకోండి. ఉదయం పాలవాడు వచ్చినప్పుడు చూడాల్సిం ది. మీ ప్రెండ్ అధికార దర్పం, సమాజంలో పలుకుబడి’’
‘‘ప్రెండ్స్ ఏదో దేశం గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్య నీ ఉపన్యాసం అవసరమా? వెళ్లు’’


‘‘ నువ్వు సీరియస్‌గా ఆలోచిస్తున్నా విషయం ఏంటో చెప్పనే లేదు? ’’
‘‘ అదేరా! అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో చైనా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. మన పాలకులు ఏం చేస్తున్నారు? ఒకవైళ చైనా ప్రాజెక్టు నుంచి నీటిని ఒకేసారి విడిచిపెడితే అరుణాచల్ ప్రదేశ్ ఏం కావాలి. దీనిపై మొన్న మా చానల్‌లో ఒక అద్భుతమైన స్టోరీ చేశాను చూడలేదా? ’’
‘‘స్టోరీ అంటే కథ కదరా? వీక్లీల్లో వేసేవారు. ఇప్పుడు 24 గంటల న్యూస్ చానల్స్‌లో కూడా కథలు వేస్తున్నారా? ’’
‘‘అబ్బా నీకన్నీ విడమర్చి చెప్పాలి. ఇక్కడ స్టోరీ అంటే నువ్వనుకునే చందమామ కథ, వీక్లీ కథ కాదు. అంటే నేను సొంతంగా తయారు చేసిన ప్రత్యేక కథనం. ’’
‘‘చైనా వెళ్లి వచ్చావా? ’’
‘‘అంత అదృష్టమా? ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం కూడాపోలేదు’’
‘‘మరి చైనా హఠాత్తుగా ప్రాజెక్టు కడుతోందని నీకెలా తెలిసింది? అంటే సైన్యమో ఎవరో ఒకరు బయటపెడితేనే నీకీ విషయం తెలిసింది కానీ నువ్వు చైనా వెళ్లి పరిశోధించి తెలుసుకున్నదేమీ కాదు కదా? ’’
‘‘నిజమే ననుకో కానీ మొద్ద నిద్ర పోతున్న ప్రభుత్వాలను నా స్టోరీస్‌తో నిద్ర లేపుతాను. ముందే మేల్కొని పాకిస్తాన్‌ను అదిలించి, చైనాను బెదిరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అమెరికాతో వ్యూహాత్మకంగా స్నేహం చేసి, రష్యాను దూరం పెట్టి ఉంటే వేరుగా ఉండేది. దేశాన్ని ఇంత కాలం పాలించిన వారికి ఈ వ్యూహం లేకపోవడం వల్లే సమస్య వచ్చిపడింది. దేశాన్ని పాలించే వాళ్లు ఈ సమస్యలను ఊహించడంలో విఫలమయ్యారు. అందుకే చెబుతున్నాను ఈ దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు.’’
‘‘నువ్విలా మేధావివి అవుతావని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాం. మేమంతా టెక్ట్స్ బుక్స్ చదువుతూ కెరీర్ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు గ్లోబ్‌లో కూడా సరిగా కనిపించని ఏవేవో దేశాల్లో జరిగే ఉద్యమాల గురించి, నాయకుల జీవితాల గురించి మాట్లాడేటోడివి. ’’
‘‘అదిగో అలాంటి మాటలకు పడిపోయే అన్నగారు బంగారం లాంటి సంబంధాలను వదులుకుని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. ఈయన గారు కాలేజీల్లో ఉపన్యాసాలల్లో ఏవేవో దేశాల పేర్లు అక్కడి విప్లవ వీరుల పేర్లు చెబుతుంటే పడిపోయాను. ఇగో ఇన్నాళ్ల కాపురం తరువాత ఈయనకు ఆ పేర్లు తప్ప జీవితానికి ఉపయోగపడేది ఏమీ తెలియదు అని నాకు తెలిసొచ్చింది. ఇప్పుడనుకొని ఏం లాభం ? పాల వాడు పొద్దునే్న వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. కిరణాషాపుకు వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా మమ్ముల నెందుకు ఇబ్బంది పెడతారని నానా మాటలు అనిపోయాడు. ’’
‘‘ ఏంట్రానిజమా? ఎప్పుటి నుంచి ఇలా? ఎందుకిలా? ’’
‘‘ఉన్నంతలో బాగానే జీతాలు ఇచ్చే సంస్థలోనే ఉద్యోగం చేశాడు. అదేదో మాయదారి చానల్ నువ్వు కోరుకున్న డిజిగ్నేషన్ ఇస్తాను అనగానే ఎగిరి వాలిపోయాడు’’


‘‘ఇచ్చాడా? ’’
‘‘కావలసిన డిజిగ్నేషన్ ఇచ్చాడు కానీ జీతాలే ఇవ్వడం లేదు. చైనాను ఇండియా సరిగా అంచనా వేయలేదని, పాకిస్తాన్ పరిణామాలు గమనించలేదని కథనాలు బాగానే చెబుతాడు. ఉద్యోగానికి వెళుతున్న సంస్థ జీతాలు ఇచ్చేదా? ఇవ్వనిదా? అనే అంచనా మాత్రం వేయలేదు ’’
‘‘ చాల్లే నేను ప్రపంచ గుట్టు విప్పుతుంటే నువ్వు ఫ్రెండ్ ముందు ఇంటి గుట్టు విప్పుతున్నావా? అసలు ఉక్రేనియాలో ఉగ్రవాదు.....’’


‘‘ ఇక చాల్లేరా! నా కళ్లు తెరిపించావు.. వస్తాను... పోతూ.. పోతూ నీకో మాట చెప్పాలనుంది రా ... అందరినీ మేలుకోలపాలని నిరంతరం ఆలోచిస్తున్న నువ్వే ముందు  మేలు మేలుకోవలసిన అవసరం ఉంది .. ముందా విషయం గుర్తించు   ’’
-  బుద్దా మురళి (జనాంతికం .. 18. 10.201 5)